ఆ జనంలో నుంచి వెళ్ళింది ఊరేగింపు. యువకులు జనాన్ని పక్కకు నెట్టి దారి చేస్తున్నారు. ఊరేగింపు యావత్తూ మహాకాళి గుడికి ప్రదక్షిణం చేసింది. గుడిముందు బిందెల్లోని నీరు ఆరబోశారు. వేప మండలు తీసుకొన్నారు. కొబ్బరికాయలు కొట్టారు. జనంలోంచి తోసుకొనిపోయి తల్లి దర్శనం చేసుకున్నారు. పూజారి ఇచ్చిన కుంకుమ తీసుకున్నారు. కొందరు పేలాలు కొన్నారు. కొందరు బొమ్మలు కొన్నారు. కొందరు గాజులు వేయించుకున్నారు. అంతా ఇండ్లకు చేరేవరకు రాత్రి తొమ్మిది గంటలైంది.
కల్లుకుండలు వచ్చాయి. సారాయి సీసాలు దిగాయి. కొన్ని బాలయ్య ఇంటిముందూ, కొన్ని పిచ్చయ్య ఇంటిముందూ దిగాయి. బాలయ్య ఇంటిముందు మగవాళ్ళు కూడారు. పిచ్చయ్య ఇంటిముందు ఆడవాళ్ళు కూడారు.
సురాపానం ప్రారంభం అయింది. రెండు చోట్లా దానితోపాటు వచ్చే ఆటలూ, పాటలూ ప్రారంభం అయినాయి. చప్పట్లు కొడ్తూ గౌరమ్మ పాటలు సాగించారు ఆడవారు.
"ఛమ్ ఛమ్ బాజే పాయ్ లయా"తో మొదలై, "శ్రీరామ నీనామ మెంత రుచిర! ఓ రామ నీ నామమెంత రుచిరా" వరకు సాగిస్తున్నారు మగవారు.
కొందరు వాగుతున్నారు. కొందరు తిట్టుకుంటున్నారు. కొందరు కేకలేస్తున్నారు. కొందరు మాట్లాడుకుంటున్నారు. ఆడుతున్నారు కొందరు. పాడుతున్నారు కొందరు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు గొణుగుతున్నారు. అంతా తాగుతున్నారు. అంతా మత్తులో ఉన్నారు.
"ఇంతకు గుడిసె చూపకపోతిని" అని లేచాడు బాలయ్య. అతనిని అనుసరించారు మరికొందరు.
గుడిసె తడక లోపల్నించి వేసివుంది. ఏవో గుసగుసలు వినిపించాయి.
"ఎవర్రా లోపల? తడక తీస్తవ? తన్నమంటవ?" అరిచాడు బాలయ్య.
జవాబు రాలేదు.
తన్నాడు బాలయ్య.
తడికి చిరిగిపోయింది.
లోన చీకటి.
"ఎల్లుండి బైటికి" - అరచాడు బాలయ్య.
శారద బయటికి వచ్చింది
అంతా నిర్విణ్ణులైనారు.
తలవంచుకొని, తప్పుకొని సాగిపోయింది.
వార్త అగ్గిలా పాకింది. మైసమ్మ మహాకాళి అయి ఉరికి వచ్చింది. తోవలోనే పట్టుకుంది. శారదను జుట్టుపట్టుకొని గుబ్కగుబ్క గుద్దింది. "మిండని కాడికి పోయినావే? గంటెకాల్చి వాతలు పెడ్త. వయసు ఇరగపడ్తాన్నాది, గా అడుక్కతినేటోడే దొరికినాడు" అని బాది జుట్టుపట్టుకొని లాక్కుపోయి గుడిసెల్లో పడేసింది.
రామారావును చూచి మండిపోయాడు బాలయ్య. 'ఓరి గాడ్దికొడక, ఇజ్జతుగ బతుక నిచ్చెటట్లు లేవేమిరా?" అని సింహంలా లంఘించాడు. బాదసాగాడు. కిక్కురుమనలేదు రామారావు. అతని మౌనం చూచి రోషం హెచ్చింది బాలయ్యకు. ఇంకా బాదసాగాడు. చర్మం చిట్లింది. రక్తం కారసాగింది. పిచ్చయ్యా, పుల్లయ్యా వచ్చి బాలయ్యను లాక్కుపోయారు, "పోరణ్ణి చంపుతావే" అంటూ "చావాలె లంజకొడుకు, చస్తే పోరల్లేరనుకుంట" అని విడిపించుకోవడానికి గింజుకోసాగాడు బాలయ్య.
మైసమ్మ పిడుగులా పడింది. "ఏడి ఆ భాడ్ఖావ్ గాడు?" అని రామారావు మీదపడి కొట్టింది, రక్కింది, గీరింది. "పెద్దోలైతే ఇండ్లల్ల ఉండాలె. మంది పోరిలెంబడి పడ్తావుర! నా బిడ్డే దొరికినాదిర నీకు? బువ్వకు గతిలేదు. ఆడది కావాలెర?" అని గుద్దసాగింది.
విడిపించుకొని ఉరికివచ్చాడు బాలయ్య. మైసమ్మను దూరం లాగాడు "మైసమ్మక్క! నీ కాల్మొక్తనే బాంచనైత పోరడే తప్పుచేసిండు చంపమంటావా చెప్పు. బొండిగ పిసుకుత ఇగ పోనియ్యనే పోరణ్ణి పోతే పూడ్చిబొందపెడ్త" అని బ్రతిమిలాడాడు.
మైసమ్మ శాంతించలేదు కాని, తిట్టుకుంటూ చేతులార్చుకుంటూ సాగిపోయింది.
నేలమీద చతికిలపడి మోకాలు మీద తలపెట్టుకొని మౌనంగా ఏడుస్తున్నాడు రామారావు.
అది చూచాడు బాలయ్య. అతని గుండె చెరువైంది. కొడుకు మీద పడి పెద్దగా ఏడ్చేశాడు.
అమ్మవారి పండుగ తుదకు ఇలా పరిణమించడంతో ఏదో ఆపద రానున్నదని శంకించారు గూడెపువారు. నానా రకాలుగా చెప్పుకున్నారు. తెల్లవారి తల్లి రంగం ఎక్కినప్పుడు అడగాలనుకున్నారు.
తెల్లవారి గూడెమంతా మహాకాళి మందిరానికి చేరింది. ఇసుక వేస్తే రాలకుండా ఉంది జనం. కుమ్మరివాడు అప్పుడే చేసిన పచ్చికుండ తెచ్చి బోర్లించాడు. గజ్జలు గల్లుమన్నాయి. ఎరుకులది పోతురాయమ్మ రంగంమీదికి వచ్చింది. ఆమె వయసులో ఉంది, జుట్టు విరియపోసుకుంది. పసుపుపచ్చని చీర రవిక వేసుకుంది. ముఖం నిండా కుంకుమ ఉండడాన అగ్గిలా ఉంది. మెడలో గువ్వల దండలూ, బంతిపూల దండలూ ఉన్నాయి. ఒకే కాలిగజ్జ గల్లుమనేట్లు నడుస్తూంది. ఆవిడను చూచి జనం అంతా మ్రొక్కారు, పూలదండలు వేశారు.
ఆమె నిర్దేశ స్థలానికి వచ్చింది. పూనకం పూనింది. తల గుండ్రంగా తిప్పింది. ఊఁ
ఊఁ ఊఁ అంటూ పూనకం పూనింది. పచ్చికుండ మీద కుడికాలు పెట్టి నుంచుంది అంటే - మహాకాళి ఆవేశించిందని అర్థం.
"ఆఁ ఆఁ ఆఁ" చేతుల్లోని వేపమండలు ఝాడించింది. కళ్ళు నిప్పులు కక్కాయి. "ఏం చెప్పమంటారు? వచ్చేకాలమెట్లుంటదో చెప్పమంటారు" అని తల గుండ్రంగా తిప్పుతూ "కలిగ్రంల పాపం పెరుగుతుంది. నేనంటే భక్తిలేకుండా పోతాంది" అన్నది.
"తల్లీ" అట్లనకు. మా అందరికీ భక్తి ఉన్నది రక్షించు తల్లీ!" అన్నాడు పూజారి.
తల తిప్పింది. వళ్ళు వణికించింది "ఏం రచ్చించమంటార్రా! ఎండలెక్కువైతై, వానలు తక్కువైతై, పంటలు పండవు, పండింది దోచుకుంటరు, గరీబోని నోట్ల మట్టికొడ్తరు. అమీర్లు బంగ్లలు కడ్తరు. బంగారం దోచ్కపోతరు. బూడిద మిగులుతది. పెద్దోడు చిన్నోని నెత్తికొడ్తడు, సిన్నోడు కూలికి చస్తడు. మడుసులను అమ్ముకునే కాలం వస్తది. మానం కాపాడుకోటం కష్టమైతది"
పూనకం పూర్తిగా వచ్చేసింది. ఉద్రేకం హెచ్చింది. "హ హ హ" వగరుస్తూంది. నిప్పుమీద గుగ్గిలం వేశారు. అది భగ్గున మండింది. ఆ మంట ముఖంమీద కనిపించింది. పళ్ళు పట పట కొరికింది. "లేదురా ధర్మం, లేదురా న్యాయం. ఇగో మింగుతా దోచుకుంటో ల్లెక్కువైన్రు మింగుతా అందరిని ఎందుకురా ఎగుర్తరు? ఎందుకురా మిడిసిపడ్తరు?"
"తల్లీ, కోపం రానీయకు. మేమంతా నీ బిడ్డలం ఆగ్రహం రానీయకు తల్లీ! ఏం కావాలో చెప్పు?" అన్నాడు పూజారి.
"ఏం కావాల్నో చెప్పమంటవుర? నీకెరుక లేదుర? కావలె పదివేల కొబ్బరికాయలు ఇరవైవేల గుమ్మడికాయలు రెండు లారీల పూలు నూరు బస్తాల అన్నం కావలెర ఇస్తరా, ఇయ్యండి లేకుంటే లస్కర్ను బూడిదచేస్త. దానిమీద గాలి లేపుత. బూడిద సుత మిగలదురో!"
"తల్లీ, శాంతించు. రేషను కాలం - బియ్యం లేవు వంద కొబ్బరికాయలు, అయిదు గుమ్మడికాయలు. ఇంతతో తృప్తిపడు తల్లీ మహాకాళీ!" అన్నాడు పూజారి.
గుగ్గిలం మండింది. తల్లికి కోపం వచ్చింది. తుష్ అన్నది జుట్టంతా ముఖంమీద పడింది. ఊగసాగింది. "తగ్గను, ఒప్పను, అంతా కావలె కాకుంటే మింగుత వస్తున్నరా వస్తున్న" పళ్ళూ, వేపమండలూ, కాళ్ళూ, తలా వడకాయి.
గుగ్గిలం మండింది. పరీల్ పరీల్ మని కొబ్బరికాయలు పగిలాయి. గుమ్మడికాయలు బద్దలైనాయి.
తల్లికి ఉగ్రం తగ్గింది.
"బియ్యం ధరెట్లుంటది తల్లీ?" అడిగాడు బొర్ర సాహుకారు.
"ధరలు తగ్గుతైరో తగ్గి తగ్గి ఎక్కుతైరో పెట్టరా నిల్వ- పడతవ్ రా బాగు"
"రేషనున్నదిగ తల్లీ?"
"అంత మనోళ్ళేరా, ఆడరా నాటకం"
ఇలా అనేకమంది అనేక ప్రశ్నలడిగారు. పరమయ్య అడిగాడు - కొబ్బరికాయ కొట్టి.
"తల్లీ! మా గుడిసెల గతి ఏమి?"
"గుడిసె లేడుంటైరా?"
"ఏమైతయి తల్లీ! బంగ్లలైతాయా?"
"అవ్ మల్ల. బంగ్లలే అవుతాయి"
గూడెపువారు చిన్నపోయారు.
నాటక రంగం నుంచి వేషం విరమించినట్లు పూనకం దిగింది. పచ్చికుండ మీదినుంచి కాలు తీసింది. గజ్జలు గల్లుమన్నాయి. రంగస్థలం నుంచి విరమించింది.
* * * *