గురువయ్య కుండలు తెప్పించాడు.
తుమ్మ చెట్ల కింద మళ్ళీ హడావుడి మొదలైంది. గందరగోళం - తిట్లు -- ఊసుకోవడాలు - తారాపధానికి అందుకున్నాయి. కుండలు ఖాళీ కావడంతో ఇంటి తోవ పట్టారు.
గురువయ్యకు బాగా తలకెక్కింది. గడపలో అడుగు పెద్తూనే ఏడుపు లంకించుకున్నాడు -- లచ్చమ్మ పోయినందుకు ఏడ్చాడు. పిచ్చమ్మ పోతుందేమోనని ఏడ్చాడు. పిచ్చమ్మ తన భుజం మీదగురువయ్య తల పెట్టుకొని, తల నిమురుతూ ఓదార్చింది.
"పిచ్చీ! నువ్వు పోవద్దె నేను చచ్చిపోత" అని బావురుమన్నాడు గురువయ్య.
"బావ౧ నేనేడికి పోత! చచ్చిపోతే నీతోనే వస్త - ఏడవకు " అని పిచ్చమ్మ కూడా కంట తడి పెట్టింది.
"పిచ్చి ! అట్లను. పిచ్చి అట్లను" అని గట్టిగా చుట్టేసుకున్నాడు గురువయ్య. పిచ్చమ్మ నింకేవరూ లాక్కోపోవడానికి వీల్లెదన్నట్లు.
తెల్లవారి ఊరి బయట మర్రి చెట్టు కింద జనం కూడారు. గద్దె మీద రామక్రిష్టయ్య కూర్చున్నాడు. అతని కుడి పిక్క దగ్గరలో చాపలు పరిపించి తన వాళ్ళను కుర్చోపెట్టింది బుచ్చమ్మ. ఎడం పక్క దూరంగా నేలమీద చతికిల బడి కూర్చున్నారు గురువయ్య కులం వాళ్ళు. చుట్టలు తాగుకుంటూ తుపుక్కున ఊసుకుంటూ కూర్చున్నారు. తగాదా చూడడానికి వచ్చిన జనం దూర దూరంగా నుంచున్నారు. మొత్తం మీద జనంతో కిటకిట లాడింది స్థలం.
ఈ మధ్య ఆ ఊళ్ళో వినోద లేమీ లేవు.
కిష్టయ్య బీడీ కాల్చుకొని పొగ వదులుతూ అన్నాడు -----
"ఒరే గుర్విగా ఇదేం ఊరనుకున్నావా? పాడనుకున్నవా? మంది పెండ్లాల నెట్కపొతే ఊరుకంటరనుకున్నవురా! పక్కలిరగతన్ని ఊళ్ళ నుంచి ఏళ్ళగొడతారు! ఊళ్ళ ఎవరికన్న పెండ్లాలుండాల్న వద్దురా! ఆ బుచ్చమ్మ కాబట్కే ఊరుకున్నది. ఇంకొకళ్ళయితే నెత్తురు పారేడిది- నెత్తురు . అయిందేమో అయింది. పిచ్చమ్మను తెచ్చి బుచ్చమ్మ కిస్తవా! చిత్కకోట్టి గుంజ పొమ్మంటవా?"
గురువయ్య మాట్లాడలేదు - తల వంచుకొని కూర్చున్నాడు.
"అట్లం టెట్ల కాల్మోక్తం" చుట్ట నేలకు రాచి తలగుడ్డలో దాచుకుంటూ అన్నాడు మైసయ్య. "ధర్మపీట ఎక్కిన్రు నాలం చెయ్యాలే నాలం - పాలకు పాలు నీలకు నీలు తియ్యాలే. పాలల్ల నీలు కలిసినా, నీలల్ల పాలు కలిసినా నాలం యాడుంటది! ఉండదు. మా గురవడు తీసుకొచ్చిండంటాన్రు పిచ్చమ్మను. మల్ల పిచ్చమ్మ పసిపోరా! చంకనేసుకొని ఎత్తుకొచ్చిండా! రొండు చేతులు కలువంది చప్పుడేట్లయితది. అవునంటర! కాదంటర! ఇసువంటి పన్లల్ల మొగోనిది తప్పంటర - మల్ల ఆడదేట్లోచ్చె . తప్పు చేసింది ఇద్దరాయే. మల్ల గుర్విగాణ్ణి పట్టుకొని గుంజుతనంటే బాగుంటాది బాంచెను."
"ఒర్ మైసిగా!' చేతులు అరచుకుంటూ చండికలా లేచింది బుచ్చమ్మ. "నీ దరమం నాకెరిక లేదనుకున్నావుర! గురువడు కల్నీల్లు పోయిస్తే గురువని దిక్కు మాట్లాడ్తావు- నేను పోయిస్తే నా దిక్కు మాట్లాడ్తవు. అయితే బాపనొండల పోరి వస్తనంటే ఎత్కపోతనంటవు! ఎత్కపోయేడిది ఏడ్చేదిది కులపొండ్లను. పెద్ద కులపోండ్లను ఎత్కపొతే ఊరుకుంటారు! ఊళ్ళ కెళ్ళి ఏళ్ళ గొడతారు- ఆ , ఏమనుకున్నావో ."
"ఇగో బుచ్చమ్మ! మాటలు చక్కగ రానియ్యి. నాలం చెప్పేటప్పుడు కల్లు సంగతి గిట్ట ఎత్తినవంటే బాగుండదు. పెద్ద కులం ఆడది మాలో నెంట ఎందుకు పడాలే అసలు! చెప్పవేమమ్మ- చెప్పెవేమమ్మ . నోరు దగ్గర పడ్డది - మాటేళ్ళదు!"
"ఒరే మైసిగా! మితిమీరి మాట్లాడ్తాన్నావు. యెంట ఎవరోస్తే వాండ్లను తీస్కపోవటమేనా? గురువయ్య తప్పు చెసిండుర! అంతే. తప్పు చేసిండు! ఏరే మాటలేదు. ఇప్పుడేమంటావు!" రామక్రిష్ణయ్య .
"అన్నాలం. అన్నాలం" మైసయ్యతో పది మంది లేచి ఇంతటితో ఖతం. నాలం అంటే ఎందుండి నిప్పు చేతుల పట్టుకొనే తట్లుండాలే. మాలోండ్లు గదాని మామీద బట్ట కాల్చేస్తే బాగుండదు. లేర గురువయ్య పోదం" అని బయల్దేరారు గురువయ్య కులంవాండ్లు.
జనంలో కలకలం బయల్దేరింది. బుచ్చమ్మ మనుషులు వీరంగం చేసి లేచారు అక్కడనుంచి కదుల్తే పుర్రెలు పగుల్తాయని! పట్టుదల అటూ హెచ్చింది.
"ఒరే! మైస! అలిగిపోతే పంచయతైతదిర? చిన్న పోరడు చేసినట్లు చేస్తవు" బీడీ చేతులో పట్టుకొని లేచి నుంచొని ముందడుగు వేయబోతున్నట్లు "నేఁ చెప్పింది కాదంటే నువ్వేం చెప్పుతావో చెప్పు" అన్నాడు రామక్రిష్టయ్య.
"అట్ల కాదుండి. వచ్చి ఇంట్ల చేరిందామో పిచ్చామ్మాయే! మల్ల గుర్విగాడు తప్పు చేసిందని వాని మీద తోస్తే నాలం అయితాదుండి" మైసయ్య అన్నాడు.
"నువ్వు కూచో ముంగల " అన్న రామక్రిష్టయ్య ముందు తాను కూర్చొని "ఇప్పుడు చెప్పు ఏమంటావో" అడిగాడు.
"ఏం లేదు కాల్మొక్త పిచ్చమ్మను పిలిపించాల్నుండి " అని కూర్చున్నాడు.
పిచ్చమ్మను పిలవాల్సిన అవసరం లేదని బుచ్చమ్మ వర్గం వాళ్ళ పట్టు. పిలవకుంటే తగాదా ముందుకు సాగడానికి వీల్లేదని మైసయ్య పట్టు పట్టాడు. అనేక తర్జన భర్జనల తరువాత పిచ్చమ్మను పిలిపించారు.
"ఏమే పిచ్చామ్మా! నీకేం తక్కువని ఎల్లోచ్చినవు! తిండి తక్కువా? గుడ్డ తక్కువా? అత్త ఆరడి పెట్టిందా? మొగుడు దెబ్బలు కొట్టిండా?" రామక్రిష్టయ్య అడిగాడు.
పిచ్చమ్మ తల వంచుకుని నుంచుంది.
ఆమెకు చెరలో ఉన్నట్లుంది.
చుట్టూ పులులు, మధ్యలో మేకలా ఉంది.
ఆమె గుండె దడదడ లాడుతున్నది.
ఆమె చూపు నేలను చీలుస్తున్నది పిచ్చమ్మ పలకలేదు.
"నంగనాచోలె నిలబడ్డావేమే! నా కొంపకు చిచ్చు పెట్టి లేచోస్తివి. చెప్పవేమే చెప్పు --- నాతోని ఆవాలు నమిలించిన్నా! ఆరడి పెట్టిన్నా! బండ లేత్తిన్నా! బయపెట్టిన్నా! చెప్పు నిలబడ్తవేమీ బొమ్మోలె ....చెప్పు లం...."
పిచ్చమ్మ పలకలేదు. కన్నీరు కొలకుల్లో చేరింది.
"చెప్పు పిచ్చమ్మా! చెప్పకుంటే ఎట్ల తెలుస్తది!" బుచ్చమ్మ తరుపు మనుషులన్నారు. పిచ్చమ్మ పలకలేదు.
"పిచ్చమ్మా! అట్ల ఊరుకుంటే ఎట్ల! ఏదన్నా చెప్పు" మైసయ్య అన్నాడు.
పిచ్చమ్మ పలకలేదు.
కన్నీటి బొట్టు కుడికాలి బొటన వేలు మీద రాలింది.
"అట్ల నిలపడ్తే ఎట్ల! చెప్పనన్న చెప్పు, అత్త ఎంబడి పోనన్న పో" రామక్రిష్టయ్య.
పిచ్చమ్మ గుండెలో రాయి పడ్డది.
తలెత్తి రామక్రిష్టయ్యను చూసింది.
కళ్ళు ఎర్రగా కన్నీటితో నిండి ఉన్నాయి. చూపుల వేడికి భస్మమయ్యేట్లున్నాడు రామక్రిష్టయ్య.
రామక్రిష్ణయ్య భరించలేకపోయాడు - తలవంచాడు.
పిచ్చమ్మ చూపు నేలకు అప్పగించింది.
ఆమె ఏదో చెప్పాలి --- చెప్పనున్నది .
జనం సాంతం నిశ్శబ్దంగా ఉన్నారు. చీమ చిటుక్కుమంటే వినిపించేట్లుంది. గాలి సైతం భారంగా ఉంది. లిప్తలు బరువుగా దొర్లుతున్నాయి. "నా మొగుడు మొగాడు కాడు" పిచ్చమ్మ పలికింది.
జనమంతా తలలెత్తి ఆమెను చూచారు.
ఆమె తల వంచుకొని చరచర నడిచి వెళ్ళిపోయింది.
జనం బుచ్చమ్మను చూచారు.
బుచ్చమ్మ కొడుకును ముందుకు నెట్టింది. "చెప్పవేమిరా సన్నాసి! అదే మన్నదో ఇన్నవా?" అని.
బుచ్చమ్మ కొడుకు - పిచ్చమ్మ మొగుడు మాట్లాడలేదు. -- తల వంచుకుని నుంచున్నాడు.
రామక్రిష్టయ్య నోట మాట పెగల్లేదు.