ఆ విగ్రహాన్ని చూసినా. శ్రీకృష్ణదేవరాయలు కుళ్ళాయే పెట్టుకునేవాడని మనకు అర్థం అవుతుంది."
అలర్టుగా వింటున్నాడు రాజా.
అతనికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఆనందరావు చెబుతోంది. అనుభవం వున్న కథకుడు మంచి ఇంటరెస్టింగ్ గా వున్న విషయం దగ్గర కథని మొదలెట్టినట్లు, ఏ పాఠం చెప్పినా, ముందు పిల్లలని ఆకట్టుకునే అంశంతో మొదలెడతాడు ఆనందరావు.
కృష్ణదేవరాయల కథ పూర్తికాకుండానే కృష్ణాజీ వచ్చాడు.
వస్తూనే అక్కడ జరుగుతున్న తతంగాన్నీ, రాజా శ్రద్ధగా వినడాన్నీ గమనించాడు. అతని మొహంలో తృప్తి కనబడింది.
తర్వాత అన్నాడు ఆనందరావుతో.
"మాస్టారూ! నిన్ననే కదా అన్నాను. ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉంటానో తెలీదని. అది ఇవాళే నిజమయిపోయింది. మళ్ళీ ట్రాన్స్ ఫర్ వచ్చేసింది నాకు" అన్నాడు.
"ఎక్కడికీ? ఎందుకూ?" అన్నాడు ఆనందరావు ఆశ్చర్యంగా.
"ఈ ఊళ్ళో నర్సింగ్ అనే గ్యాంగ్ స్టర్ ఉన్నాడు. వాడు నేను ఈ ఊరికి వచ్చిన మొదటిరోజునే ఛాలెంజ్ చేశాడు. నేను మారకపోతే మూడు నెలలు తిరక్కుండా ఇక్కడ నుంచి ట్రాన్స్ ఫర్ చేయించేస్తానని - నేను మారలేదు. వాడు మాట నిలుపుకున్నాడు" అన్నాడు. తనకి ఇలాంటివి నిత్యకృత్యాలే అన్నంత తేలిగ్గా.
ఏమీ మాట్లాడడానికి తోచక మౌనంగా వుండిపోయాడు ఆనందరావు.
మాస్టారి దగ్గర శెలవు తీసుకున్నాడు కృష్ణాజీ.
తర్వాత రాజాని పక్కకి పిలిచాడు.
అనుమానంగా వెళ్ళాడు రాజా.
అనునయంగా చెప్పాడు కృష్ణాజీ. "చూడు రాజా! ఎవరినీ ఏమీ అడగను. నాకు ఎప్పుడూ ఎవరితో ఏ అవసరమూ రాదు. కానీ ఇవాళ నిన్ను ఒకటి అడుగుతున్నాను. చేస్తావా?" అన్నాడు.
ఎటూ చెప్పకుండా చూశాడు రాజా.
"నువ్వు చిన్నపిల్లాడివి! అయినా నిన్ను అడుగుతున్నాను. నిన్న నువ్వు ఒక మాట అన్నావే - అది చాలా కరెక్టు! పిల్లలు పెద్దాళ్ళయ్యాక ఏమవుతారో చెప్పలేం! కానీ నువ్వు పెద్దయ్యాక మంచివాడివి కావాలి. మంచి మనిషివి కావాలి! పదిమందికి పనికి వచ్చే పని ఏమన్నా చెయ్యాలి. నీ జీవితం దేశానికి ఉపయోగపడాలి."
"చాదస్తపు గోల!" అన్నట్లు మొహం చిట్లించాడు రాజా.
ఒక్కక్షణం అతని మొహంలోకి చూశాడు కృష్ణాజీ.
"నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నీకోసం నేను ఉన్నాను. ఉత్తరం రాస్తే వచ్చి వాలతాను. ఓకే? మే గాడ్ బ్లెస్ యూ! గుడ్ లక్" అని భుజం తట్టి వెళ్ళిపోయాడు కృష్ణాజీ.
'మంచిగా బతకడం' అంటే సాయంత్రానికల్లా మొహం మొత్తేసింది రాజాకి.
మామూలుగా అయితే ఈపాటికి పది అడ్వెంచర్లు చేసి ఉండేవాడు తను. సేఠ్ బాబూలాల్ పని ఒకటి పెండింగ్ వుంది. అది చేస్తే కాస్త డబ్బొస్తుంది. కానీ ఏమీ చెయ్యడానికి లేకుండా తను ఇక్కడ ఇరుక్కుపోయాడు.
కానీ కొంతలో కొంత నయం!
ఈ టైగర్ కృష్ణాజీకి ట్రాన్స్ ఫర్ అయ్యింది.
అది కూడా తన ఉస్తాద్ నర్సింగ్ ఇన్ ఫ్లుయెన్స్ వల్ల!
బహుశా రేపు ఈయన ఊరొదిలి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే తను ఈ చప్పిడి మెతుకుల జైల్లో నుంచి బయటపడి పోతాడు! ష్యూర్!
రాత్రికి పథ్యం భోజనం లాంటిది తిని పడుకున్నాడు రాజా.
తన పద్ధతి ప్రకారమే పైన దిళ్ళూ, మంచం కింద తనూ!
అలవాటు ప్రకారం అర్థరాత్రి అవుతుండగా నిద్రపట్టింది.
మగత నిద్రలోనే తెలుస్తోంది మనిషి నడుస్తున్న చప్పుడు.
వస్తున్నాడు మంచి మాష్టారు.
చాదస్తపు పీనుగ! చంపుతాడు ఇప్పుడు.
అడుగుల చప్పుడు దగ్గరయ్యింది.
మరుక్షణంలో....
మంచం పైకి లేచిపోయింది.
ఇద్దరు మనుషులు తనని కాళ్ళూ చేతులూ కదలకుండా పట్టేసుకున్నారు.
పెనుగులాడుతూ వాళ్ళ మొహాల్లోకి చూశాడు తను.
వాళ్ళలో ఒకడు ఆనందరావు మాస్టారు.
ఆయన మొహంలో ఎగ్జయిట్ మెంటు కనబడుతోంది. మంచితనం కనబడటం లేదు.
ఆశ్చర్యంగా రెండో మనిషి వేపు చూశాడు రాజా.
అతను దాసు!
సారా దాసు!!
తన తండ్రి!!!
జేబులో నుంచి ప్లాస్టిక్ వైరు తీశాడు దాసు.
చాకచక్యంగా రాజా కాళ్ళూ, చేతులూ బిగించి కట్టేశాడు.
జేబులోనుంచి ప్లాస్టర్ తీసి, రాజా నోటికి అడ్డంగా అతికించాడు.
"మాస్టారూ! ఒక గోతం వుంటే తీస్కురా" అన్నాడు దాసు.
మాస్టారు పరిగెత్తుకెళ్ళి ఒక గోనె సంచి తెచ్చాడు.
గోనె సంచిలోకి రాజాని కుక్కాడు దాసు.