Previous Page Next Page 
జన్మభూమి పేజి 24

    రోడ్డుపని మంచిరోజు చూసి పురోహితుడు చెప్పిన టైముకి ఆరంభించారు. కొబ్బరికాయ కొట్టించి "బాబుగారు గునపం తీసుకుని ఒక పోటు వేయండి" అన్నాడు పురోహితుడు.
    కేశవరావుగారు గునపంతో ఆయన చూపించిన చోట తవ్వి పసుపు, కుంకం, పువ్వులు అక్కడ వేసారు. "అమ్మా మీరు ఆ తట్టతో కాస్త మన్ను తీసి పక్కన వేయండి" అన్నాడు పురోహితుడు రాజేశ్వరితో. రాజేశ్వరి పారతో కొంచెం మట్టి తీసి పక్కన పోసింది.
    "ఊ కానియ్యండయ్యా-" అన్నాడు పురోహితుడు కూలీల వంక చూసి. అంతే తలా గునపం, పారా మగవాళ్ళు తీసుకుంటే, ఆడవాళ్ళంతా తలో గంపా పట్టుకున్నారు. ప్రెసిడెంటు, మనసాబు, చౌదరిగారు అంతా తలోసారి గునపం పుచ్చుకుని తవ్వారు. ఊర్లో పెద్దింటి ఆడవాళ్ళు కూడా వచ్చి తలాకాస్త మట్టి ఎత్తుతున్నారు లాంఛనంగా.
    "నన్ను శ్రమధానం చేయమన్నారు గదా బాబూ. ఏదో "ధనదానం" చేసే శక్తి ఆ భగవంతుడు యిచ్చాడు కాని శ్రమదానం చేసే శక్తి నాకు లేదు. నన్ను మీరు క్షమించాలి ఈ విషయంలో-" అందరివంకా చూస్తూ నవ్వుతూ నమస్కారం చేశాడు కేశవరావుగారు.  
    "ఎంతమాట బాబూ- మీచేత చేయిస్తామా...అలా కూర్చోండి మా ఎదురుగా. మీరుంటేచాలు మాకు ఉత్సాహంగా వుంటుంది. ఊళ్ళో కుర్రాళ్ళు, కూలీలు అంతా వినయంగా అన్నారు. తలో గునపంతో నవ్వుతూ అంతా కల్సి నలభైమందిదాకా మగవారు, ముప్పైమందిదాకా ఆడవారు పనిలో జొరబడ్డారు. ఉదయం ఎనిమిదింటికల్లా రోడ్ల సూపర్ వైజర్ మార్కు చేసినంతవరకు ఎంత లోతు తవ్వాలో చూపాడు అతను. చకచక పని ఉత్సాహంగా జరుగుతుంది.
    అయినింటి ఆడవారంతా కల్సి ఆలయ ప్రాంగణంలో అందరికీ వంటలు ప్రారంభించారు. ఇద్దరు ముగ్గురు కూరలు తరగడం ఆరంభించారు. ఎసర్లు పెట్టారు పొయ్యి మీద. మూకుడులో పోపులు వేగాయి. పన్నెండు గంటలలోగా కూర, పప్పు, పులుసు, అన్నం, పచ్చడి తయారుచేసేశారు.
    చెట్లకింద వనభోజనాల్లా ఆడవాళ్ళంతా వడ్డిస్తుంటే మగవారు కూలి, రైతు అన్న తేడా లేకుండా అంతా సహ పంక్తిన భోంచేశారు. ఎప్పుడూ కింద కూర్చోటం అలవాటులేని కేశవరావు కూడా అందరితోపాటు తిన్నారు. రెండో పంక్తిలో ఆడవాళ్లంతా తిన్నారు. "ఈ పని జరిగినన్నాళ్ళు మనందరం యిలాగే ఒకేచోట మధ్యాహ్నం భోజనం చేద్దాం" కేశవరావు అన్నాడు.  
    భోంచేసి అరగంట విశ్రాంతి తీసుకుని అంతా మళ్ళీ పనిలో పడ్డారు. మధ్యాహ్నం నిద్ర త్యాగం చేసి తను వెడితే అందరిలో ఉత్సాహం తగ్గిపోతుందేమోనని బలవంతంగా కూర్చున్నారు కేశవరావు. ఆయన వెడితే తామూ వెళ్ళొచ్చు అనుకున్న ప్రెసిడెంటు వాళ్ళు కూడా కదలకుండా కూర్చున్నారు. ఒక రోజుకే రెండు ఫర్లాంగులు తవ్వడం పూర్తయింది.
    తవ్విన చోట కంకర పేర్పించడం, మట్టి జల్లించి రోలరు నడపడం రాయి నలిగాక తారు వేయడం... వరసక్రమంగా తవ్వేవారు. తవ్వుతుంటే రోడ్డురోలరు పని రోడ్డురోలరు చేస్తుంటే వూరి మొత్తం చుట్టూ రోడ్లు వేయడానికి పదిరోజులు పట్టింది.
    "మై గుడ్ నెస్. యింత త్వరగా ఈ పని పూర్తయిపోయిందంటే నమ్మలేకపోతున్నాను" సూపర్ వైజర్ సంభ్రమంగా న్నాడు. "డబ్బిచ్చినా ఆడుతూ పాడుతూ పనిచేస్తారు. అలాంటిది డబ్బు రాదని తెలిసి యింతమంది యిలా జమకూడి పనిచేశారు అంటే యిదంతా మీ క్రెడిట్ సార్."
    "నో, నో అలా అనకండి. అందరూ ఎంతో కష్టపడ్డారు. నేను కుర్చీలో కూర్చున్నాను. నేనేం చేశాను. తమ వూరికోసం అంతా పాటుపడ్డారు."
    వెనక ఇన్స్ పిరేషన్ మీరు సార్."
    "అదంటే వప్పుకుంటాను. వెనక నేనున్నానని. నిలబడి చేయించేవారుంటే ఏదన్నా చేయించొచ్చని అర్థం అవుతుంది."
    "కర్ర పట్టుకుని పెత్తనం చేయడంకాదు డాక్టర్ గారూ- మీరు నిజంగా, నిస్వార్ధంగా వూరి మంచి కోసం చేస్తున్నారన్న భావం అందరికీ కలగబట్టే అందరూ ముందుకొచ్చి చేయి అందించారు." మునసబు మనస్పూర్తిగా అన్నాడు.
    "నిజమే. గత నలభై ఐదేళ్ళుగా మనందరం వున్నాం- ఇలా ఒక పనన్నా చేయగలిగామా. అసలా ఆలోచనే రాందే" ప్రెసిడెంటూ అన్నాడు.
    ఊరంతా రోడ్డువేయగానే దుమ్ము, ధూళి, గతుకులు పోగానే చాలా శుభ్రంగా కనపడింది. చిన్నా పెద్దా అందరూ రోడ్డు పని పూర్తైన రోజు ఆనందంగా చిందులు వేసారు. రోడ్డు పని తోటే వాన నీరు నిలవకుండా పక్కన కాలువలోకి మళ్ళించారు. సిమెంటు కాలువల ద్వారా డ్రైనేజి సిస్టమ్ లేనందున ఓపెన్ కాలువలు తప్పనిసరి అయింది. కనీసం రోడ్డు మీద నీరు నిలిచిపోకుండా ఏదో ఏర్పాటు జరిగిందని సంతృప్తిపడాల్సి వచ్చింది.
    "మనం అనుకున్న మొదటి పని అయింది. రెండోది స్కూలు పని. పిల్లలు స్కూలు శలవులు మొదలుకాగానే అది మొత్తం కట్టించాలి. ముందే చెప్తున్నాను. ఇలాగే అంతా కల్సి చేద్దాం..."
    "డాక్టరు గారూ... మన ఈ రోడ్లు "జన్మభూమి పథకం" కింద అని రాయించండి. చూసిన అందరికీ అర్థం అవుతుంది. ప్రభుత్వమూ సంతోషిస్తుంది. యిది చూసి పక్క వూరివాళ్ళూ వేయచ్చు-" అని సలహా ఇచ్చాడు సూపర్ వైజర్. "గుడ్ ఐడియా- అలాగే రాయిద్దాం - వూరి మొదట ఆ చివర బోర్డు రాయించి పెడదాం. రోడ్డులో మధ్య మధ్య కూడా చిన్న బోర్డులు పెడదాం. మీరన్నట్టు ఇతరులకి స్ఫూర్తినివచ్చు." అంగీకరిస్తూ అన్నారు కేశవరావు.
                                                            *    *    *
    "మామయ్యా - మన ఆస్పత్రి గురించి రామచంద్రరావుగారి తాలూకు వారికి మద్రాసుకి రాసిన ఉత్తరంకి జవాబు వచ్చింది" ఉత్సాహంగా ఉత్తరం పట్టుకు వచ్చాడు రంగా. వస్తుంటే ప్రెసిడెంటు ఇచ్చాడు.
    రామచంద్రరావుగారి భార్య ఎనభైరెండేళ్ళ ఆవిడ యింకా మద్రాసులోనే వుందట- ఆవిడ పాపం అడగ్గానే తనకేం అభ్యంతరం లేదు. ఆ యిల్లు ఎలాగో పాడుబడిపోతూంది. వుండేవారు లేరు. పిల్లలంతా అమెరికాలో కొందరు, ఢిల్లీ, కలకత్తాలో వున్నారు. యిక్కడ కొనేవారు వారు. ఉన్నా ఏమంత ధర రాదు.
    అంచేత ఒక మంచిపని కోసం ఆ యిల్లు వాడుకోవడానికి తమకేం అభ్యంతరంలేదని, డాక్టర్ కేశవరావు నిరంభ్యంతరంగా ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళు వాడుకోమనండి. తాళాలు ఎక్కడ ఉన్నాయో తమకు గుర్తులేదు. తాళాలు బద్దలు కొట్టించి ఇవ్వండి.
    యింత మంచిపని తలపెట్టి వూరు బాగుచేయిస్తున్నందుకు డాక్టర్ కేశవరావుగారిని అభినందిస్తున్నాను" అంటూ వరలక్ష్మమ్మగారు రాశారుట. ఉత్తరం ప్రెసిడెంటు చదివి మీకు ఇమ్మన్నాడు అన్నాడు రంగా.
    "థాంక్ గాడ్ ఒక ప్రాబ్లమ్ తీరింది. వెంటనే హడావిడిగా ఆస్పత్రి బిల్డింగ్ కట్టించక్కరలేకుండా ఒక వీలు దొరికింది. రంగా నలుగురు కూలీలని పెట్టించి బిల్డింగు శుభ్రం చేయించి, సున్నాలు వేయించే పని చూడు మరి. ఇల్లు శుభ్రం అయ్యాక మనం రేపు వెళ్ళి విజయవాడగాని, హైదరాబాదుగాని వెళ్ళి ఆస్పత్రికి కావాల్సిన ఫర్నిచర్, బల్లలు వగైరా ఆర్డరు చేసి వద్దాం."
    నా మెడికల్ ఎక్విప్ మెంటు పేకేజీ అన్నీ అలాగే వున్నాయి. అవన్నీ విప్పించాలి. ముఖ్యంగా కావాల్సినవన్నీ అమెరికా నుంచి తెచ్చాను. కొన్ని మందులు, పరికరాలు ఏమేం కావాలో విజయవాడలో దొరికితే అక్కడ కాదంటే హైదరాబాదునుంచి తెద్దాం. రోజూ ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు అక్కడ కూర్చుంటాను. నాకూ కాస్త కాలక్షేపం అవుతుంది.

 Previous Page Next Page