సుందర సుకుమారి చేసిన పని ఫ్రెండ్స్ ముగ్గురికి నచ్చలేదు. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు తక్కువ...మగవాళ్ళు ఎక్కువ. అందరూ వీళ్ళనే చూస్తున్నారు.
"నీకు బుద్ధిలేదు." నెమ్మదిగా కోప్పడింది రాణి.
"నీకు కావాలంటే బుట్టెడు నేరేడుపళ్ళు కొనిస్తాను. నన్నడిగితే పోయేది కదా!" అంది ప్రమద.
"నువ్వు చేసిన పనేం బాగోలేదు సుందరీ! అది పోటీ. దాంట్లో నువ్వు పాల్గోటమేమిటి? వాళ్ళంతా మొహాన నవ్వుతారు. సరదాకి అన్నానని తప్పించుకో!" వందన చిన్నగా గద్దించింది.
వీళ్ళిలా చిన్నగా మాట్లాడుకుంటుంటే ఆ పోటీదారుడు...మిగతావాళ్ళు "పోటీలో పాల్గొనటానికి సిద్ధం కమ్మని" అరుస్తున్నారు.
అయితే స్త్రీలే ముందుకు వస్తారు." అనుకుంది సుందర సుకుమారి. అలా అని స్నేహితురాళ్ళని బాధపెట్టడం ఇష్టంలేక "సరదాగా తను ఈ మాట అన్నానని...పోటీలో పాల్గొంటానికి తనదగ్గర డబ్బులేదని... తన ఒంటిమీద ఉన్నవి గిల్ట్ నగలని... తన పర్స్ లో వున్న మొత్తం నూటపదిరూపాయలేనని...పళ్ళు తినగల సత్తువ ఉందిగాని డబ్బులేనందువల్ల పోటీలో పాల్గొనే ఉద్దేశ్యం లేదని..." చాలా తెలివిగాను, గట్టిగాను చెప్పింది.
"సరదాకి అన్నా సరేనమ్మాయ్! నిజంగా నాతో పందెం కాసి ఈ పళ్ళు తిని నామీద గెలవగలవా?" గెలవలేను." అని ఒక్కమాట అనేసి వెళ్ళిపో! క్షమించేస్తాను." అన్నాడు ఆ వ్యక్తి.
"నువ్వు నన్ను క్షమించేదేంటి" అనుకుంది సుందర సుకుమారి. పైకి మాత్రం "ఈ పండ్లు తినటం నాకోలెక్కా!" అంది గొప్పగా ఫోజు పెట్టి.
ఒక ఆడపిల్ల అలా అనేసరికి పోటీదారుడికి మహా అనుమానం వేసింది. "అందరూ చూస్తుండగా ఈపిల్ల తనని పరాభవిస్తున్నదేమోనని, ఒళ్ళుండగానే సరా! తినగల చాకచక్యం...తిన్న తరువాత హరించుకోగల శక్తి...ఇవన్నీ కావాలని తెలీదు. ఈ టుంటుంని వదలకూడదు" అనుకున్నాడు. "నేను గెలిస్తే నువ్వేమీ డబ్బులివ్వక్కరలేదు. నీవు గెలిస్తే మాత్రం పదివేలు ఇచ్చేస్తాను. మాటంటే మాటే. ఖలేజా ఉంటే ముందుకురా" అన్నాడా వ్యక్తి.
"ఈ పోటీ జరగాల్సిందే. ఈ పోటీ జరగాల్సిందే!" అంటూ కొందరు అరిచారు.
"నిజంగా నీకంతశక్తి ఉంటే పోటీలో పాల్గో అమ్మాయ్! ఇతనిలా పోటీలు పెట్టడం...ప్రతి పోటీలో తనే గెల్చి డబ్బు సంపాదించడం చేస్తున్నాడు. నిజంగా నీవా పళ్ళని తినగలిగితే వెళ్ళి పోటీలో పాల్గో. అప్పనంగా డబ్బుకూడా వస్తుంది. దెబ్బతో వాడి గర్వం అణుగుతుంది" దగ్గరకొచ్చి అంది ఒకామె.
గ్రీన్ సిగ్నల్ కోసం సుందర సుకుమారి వందనాదేవివైపు చూసింది.
"సుందర సుకుమారి ఈ పోటీలో పాల్గొని ఓడిపోతే తామందరూ చాలా అవమానం జరిగినట్టు బాధపడాలి. జర్నీ మొత్తం ఇదే గుర్తుకువస్తూ ఆనందం కూడా వుండదు. అలాకాక గెలుపొందితే కొంతలో కొంత నయం..." అనుకొన్న వందనాదేవి కాసేపు మనసులోనే తర్జన భర్జన పడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి "ఈ పోటీలో నీవు గెలుస్తావన్న నమ్మకం పూర్తిగా ఉంటే పాల్గొనవచ్చు. నీ యిష్టం" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
"తాను పోటీలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది సుందర సుకుమారి.
"ఆడ...మగ...పోటీ పైగా తిండిపోటీ." అక్కడున్న అందరికీ భలే సరదాగా వుంది. "తొందరగా మొదలుపెట్టండి" అంటూ ఉత్సాహంగా అరిచారు.
"వాడు గెలిస్తే సుందర సుకుమారి ఏమీ ఇవ్వక్కరలేదు. కాని ఈ పోటీలో సుందర సుకుమారి గెలిస్తే మాత్రం అతను పదివేలు వదులుకోవాల్సిందే" అలా అందరియెదుట ఒక నిర్ణయానికి వచ్చారు.
అయిదు నిమిషాల తర్వాత పోటీ ప్రారంభమైంది.
ఇలా రకరకాల పోటీలలో పాల్గొని డబ్బు సంపాదించటం వాడి పని. ముందుగానే ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసి చూసుకొంటాడు. పోటీల్లో పాల్గొనటం వాడికి కొట్టిన పిండి. సుందర సుకుమారి మాత్రం ఎప్పుడూ ఏ పోటీల్లోను పాల్గొని ఎరగదు.
అయినా...
పోటీ ప్రారంభం కాగానే చిన్న నిమ్మకాయంత సైజు వున్న నేరేడు పళ్ళని గబగబా నోట్లో వేసుకుని చప్పరించి...గింజతీసి పక్కన పెడుతున్నారు. మొదటంతా ఎవరి పళ్ళెంలో కాయలు తరుగుతున్నాయో ఆ పోటీ చూస్తున్న ఎవరికీ అర్థంకాలేదు. పదినిమిషాల తర్వాత చూస్తే ఆ వ్యక్తి ముందున్న పళ్ళెంలో సగం పళ్ళు అలానే వున్నాయ్. సుందర సుకుమారి ముందున్న పళ్ళెంలో పళ్ళు మాత్రం మూడొంతులు అయ్యాయ్.
అందరూ ప్రోత్సహిస్తూ...ఉత్సాహంగా అరుస్తుంటే పళ్ళెంలో పళ్ళు మొత్తం ఖాళీ చేసింది సుందర సుకుమారి. ఆ వ్యక్తి ముందున్న పళ్ళెంలో మాత్రం పావువంతు పళ్ళు ఇంకా అలానే వున్నాయ్.
అందరూ ఆనందంగా పెద్ద పెట్టున జయజయధ్వానాలు చేస్తూ అరిచారు. చాలామంది ముందుకు వచ్చి సుందర సుకుమారిని మనస్పూర్తిగా అభినందించారు.
"పరాభవం...ఆడపిల్ల చేతిలో పరాభవం. ఓటమి ఎరుగని తను ఒక ఆడపిల్ల చేతిలో ఓటమి" తన ఎదురుకుండ ఉన్న టుంటుంలా వున్న ఆ పిల్లని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది పోటీదారుడికి. కానీ అక్కడున్న వాళ్ళంతా తనేదన్నా అంటే చెప్పుతీసుకుని కొడతారు. ఆ విషయం గ్రహించిన ఆ వ్యక్తి పదివేల రూపాయలు సుందర సుకుమారికి ఇచ్చి మారు మాట్లాడకుండా చరచరా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. వాళ్ళ వాళ్ళు కూడా అతనితోపాటే వెళ్ళిపోయారు.