దొరికినా అది ఏ మాత్రం లభ్యమవుతుంది? త్రవ్వి తీయడం లాభసాటేనా?
బాబూజీలోని బిజినెస్ మాన్ మేలుకున్నాడు.
* * * *
"ఇవాల్టినుంచి నీకు ట్రయినింగ్ ప్రారంభం" అన్నాడు ప్రతాప్ వినీలతో. ట్రయినింగ్ లో కొంత థియరీ, కొంత ప్రాక్టీసు.
భక్తి ప్రపత్తులతో గురువుగారి మాటలు వినే శిష్యురాలిలా శ్రద్ధగా వింటోంది వినీల.
"నీకు కరాటే వచ్చుకదా?" అన్నాడు ప్రతాప్.
వచ్చునన్నట్లు తలూపింది వినీల.
"అయితే సగం ప్రాబ్లెమ్ తీరిపోయినట్లే: నువ్వు నేర్చుకోవలసిన మరో ముఖ్యమయిన విద్య షూటింగ్" అని సింగిల్ యాక్షన్ పిస్టల్ ఒకటి తీశాడు ప్రతాప్.
"దీనితో ప్రాక్టీసు మొదలుపెట్టు ముందు. వారం తిరిగే లోపల రివాల్వర్సూ రైఫిల్సూ, స్టెన్ గన్సూ, మోర్టారులూ, గ్రనేడ్స్, అన్నీ ప్రయోగించడం నేర్చుకోవాలి. తెలిసిందా? నిద్రపోయే సావకాశం కూడా ఉండకపోవచ్చు నీకు" అన్నాడు.
ఉత్సాహంగా తల ఊపింది వినీల.
"కమాన్: ఇది సేఫ్టీకాచ్: ఇది మేగజెయిన్..." అంటూ పిస్టల్ లోని భాగాలు వివరించి, అదెలా కాల్చాలో చూపించాడు ప్రతాప్.
పావుగంట తర్వాత వినీల మొదట షాట్ పేల్చేసరికి ఆ తోటలోని చెట్లమీద వున్న పక్షులన్నీ ఒక్కసారిగా అరుస్తూ గాల్లోకి లేచాయి.
అలా గంటసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత మామిడి చెట్టుకింద వేసి ఉన్న కుర్చీలలో కూర్చున్నారు ఇద్దరూ.
రెండు కొబ్బర బోండాలలో స్ట్రాలువేసి తెచ్చి వాళ్ళకందించాడు మాలి.
అవి తాగుతూ అన్నది వినీల.
"మీకు ఇస్తున్న ఈ ట్రయినింగ్ ఇదీ చూస్తుంటే ఏజెంట్లు వర్కు పైలట్లు పనికంటే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుందనుకుంటాను"
నవ్వాడు ప్రతాప్.
"అని చాలామంది దురభిప్రాయపడతారు. కొన్నిరకాల అసైన్ మెంట్స్ చేస్తున్నప్పుడు తప్ప మామూలుగా గూఢచారుల వృత్తి చాలా జోరుగా వుంటుంది. సమయం వచ్చింది కాబట్టి, నీకు గూఢచారుల గురించి వివరంగా చెబుతాను" అని మొదలుపెట్టాడు ప్రతాప్.
"గూఢచారి అనగానే మనం సినిమాల్లో చూసే, నవలల్లో చదివే జేమ్స్ బాండ్ 007 లాంటి మనిషి గుర్తు వస్తాడు చాలామందికి మడత నలగని సూట్లు. ఫ్యాన్సీ కార్లు అధునాతనమైన ఆయుధాలు, గడ్గెట్స్,అందమయిన అమ్మాయిలతో వ్యవహారాలు ఇవే జ్ఞాపకం వస్తాయి.
ఎప్పుడన్నా మనం పేపర్లలో గూఢచారులు దొరికిపోయారన్న న్యూస్ చదివినా సెన్సేషనల్ కేసులే పేపర్లలో వివరంగా రాస్తారు తప్ప, వాళ్ళ రొటీన్ బిజినెస్ గురించి ఎక్కువ వ్రాయరు.
ఈ మధ్యకాలంలో చాలామంది గూఢచారులు ఇండియాలో దొరికిపోయారు.
వీళ్ళలో ముఖ్యుడు బ్రిగేడియర్ 'జెడ్' అబ్బాసీ.
ఈయన న్యూఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో పనిచేసేవాడు.
అతను తన లోకల్ కాంటాక్ట్సు దగ్గర నుంచి రహస్య పత్రాలు కొన్ని తీసుకుంటున్నప్పుడు రెడ్ హాండెడ్ గా పట్టేసుకున్నారు.
కానీ, ఈ సంఘటనలవల్ల ఈ మధ్యనే మెరుగవుతున్న భారత్, పాకిస్థాన్ సంబంధాలు మరలా దెబ్బతిని పోతాయేమో అన్న భయంతో ఈ కేసుని త్వరితంగా మూసేసింది భారతప్రభుత్వం.
అంతకుముందు బ్రిగేడియర్ ఆర్.ఎస్ డియోల్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ అడ్వయిజరు ఎఫ్. డబ్ల్యు నెరూకరుతో కలిసి ఆయుధాలతో రహస్య వ్యాపారం చేసే జజోడియాలకోసం సమాచారాన్ని సేకరిస్తూ దొరికిపోయాడు.
అంతకుముందు మద్రాసులోని ఆర్.ఎ డబ్ల్యు స్టేషన్ డైరెక్టరైన 'రా' అంటే తెలుసుగా. రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ - ఉన్నికృష్ణన్ ని అరెస్ట్ చేశారు.
అప్పట్లో అతనికి శ్రీలంకలోని ఎల్.టి.టి.ఇ. మిగతా టెర్రరిస్ట్ గ్రూప్ లతో కాంటాక్టు మెయిన్ టెయిన్ చేసే బాధ్యత అప్పగించింది ప్రభుత్వం.
కానీ హఠత్ గా ఒకరోజున అతను అమెరికన్ గూఢచారి సంస్థ సి ఐ ఎ కి డబుల్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడని తెలిసింది అతనికప్పుడు ఢిల్లీని తీహార్ జెయిల్లో కాలం గడుపుతున్నాడు.
అంతకు ముందు ఇంకా చాలా స్పై కేసులు బయటపడ్డాయి. కేప్టెన్ ఆర్.ఎస్. రాథోడ్, ఇంకో కేసులో కుమార్ నారాయన్, లార్కిన్ బ్రదర్స్, రమాస్వరూప్ వీళ్ళందరూ పట్టుబడిపోయిన గూఢచారులే. వీళ్ళందరూ ఇండియాకి ద్రోహం తలపెట్టిన దేశద్రోహులు.
ముఖ్యంగా ఢిల్లీనగరంలో ఇలాంటి మనుషుల సంఖ్య ఎక్కువై పోయినట్లు అనిపిస్తుంది.
వీళ్ళలో కొందరు మాత్రమే మిలటరీ సమాచారాన్ని సేకరిస్తూ వుంటారు.