Previous Page Next Page 
దావాగ్ని పేజి 26


    మిగిలిన చాలామంది ఆయుధాల వ్యాపారస్తుల తరపున పనిచేస్తూ ఉంటారు.

 

    కొట్లలో వుండే ఆ బిజినెస్ కాంట్రాక్టులు సంపాదించడంలో, ఎంత చిన్న సమచారమయినాసరే వాళ్ళకి సహకరిస్తుంది. ఇప్పుడు చాలా దేశాలకి మిలటరీ సమాచారంకంటే కూడా కమర్షియల్ సమాచారం అవసరం ఎక్కువగా వుంది.

 

    గూఢచారి వృత్తి గురించి ఒక చిత్రమయిన సమాచారం తెలుసా నీకు? గూఢచారులు సంపాదించే సమాచారంలో తొంభై అయిదు శాతం అందరికీ తెలిసిన న్యాయమైన మార్గాల ద్వారానే వస్తుంది. ఒక గూఢచారి తన రోజులో చాలాభాగం పబ్లిక్ అయిన పేపర్స్ దస్తాలకొద్దీ సంపాదించి వాటిని చదవడంలోనే గడపవలసి వస్తుంది:

 

    ఉదాహరణకు నిజంగా జరిగిన ఒక సంఘటన చెబుతాను విను.

 

    నాకు తెలిసిన ఒక గూఢచారిని అతని ప్రభుత్వం మన 'ధృవ' రియాక్టరులో అణ్వస్త్రాలకు పనికి వచ్చే ఇంధనం తయారవుతుందేమో కనుక్కోమని ఆదేశించింది.

 

    మామూలుగా అయితే జనం ఏమనుకుంటారు? అతను సినిమాల్లో లాగా ఎత్తయిన గోడలు ఎక్కి, పెద్ద భవనంలోకి ప్రవేశించి రకరకాల గడ్గెట్స్ తో సీక్రెట్ చాంబర్స్ ఓపెన్ చేసి, మినియేచర్ కెమెరాతో ఫోటోలు తీసి వుంటాడని.

 

    కానీ నిజజీవితంలో ఏం జరిగిందో తెలుసా? అతను పైన చెప్పిన ఈ 'ఎగ్జయిటింగ్' పనులేవీ చేయలేదు. కనీసం ఎవరికి లంచంకూడా ఇవ్వలేదు. కూల్ గా కూర్చుని, 'ధృవ' రియాక్టర్ గురించి పబ్లిష్ అయిన ప్రతి పేపరూ, ప్రతి పుస్తకం, ప్రతి పాలప్లెటూ, ప్రతి న్యూస్ ఐటెమ్ చదివాడు. అలా కళ్ళు పేలిపోయేలా చదవగా చదవగా అతనికి ఒక విషయం తట్టింది.  

 

    అప్పట్లో ఇండియాలో వైద్యానికి పనికి వచ్చే ఒకరకం రేడియో ఐసోటోప్స్ కి కొరత ఏర్పడింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వారు అతి త్వరలో ఆ కొరత తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

 

    'ధృవా' రియాక్టరులో అలాంటి ఐసోటోపు తయారవుతూ ఉందని మన గూఢచారికి అంతకు ముందే తెలుసు.

 

    దానిని బట్టి అతను ఓ విషయం తేల్చుకున్నాడు. 'ధృవ' రియాక్టరులో అప్పటికే ఆ రేడియో ఐసోటోపు తయారవుతోంది. అది వైద్యావసరాలకు తగినంతగా తయారవడంలేదు.

 

    అందుకని డిపార్ట్ మెంటాఫ్ అనామిక్ ఎనర్జీ, దాని ఉత్పత్తిని బాగా ఎక్కువ చేసింది.

 

    దాని ఫలితంగా కనీసం ఆ సంవత్సరంలో 'ధృవ'లో అణ్వాయుధాలు తయారుచేయడానికి తగిన మెటీరియల్ ఉత్పత్తి జరిగి ఉండడానికి ఆస్కారం లేదు.

 

    ఇంత గొప్ప సమాచారం, అతను కడుపులో చల్ల కదలకుండా తన ఆఫీసులో కూర్చునే సంపాదించాడు.

 

    టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిందిప్పుడు. ప్రతిదానికీ గూఢచారి ఒక ఫెల్టుహాటు పెట్టుకొని, ఓవర్ కోటు వేసుకుని తుపాకితో స్వయంగా పరిగెత్తి వెళ్ళనక్కరలేదు.

 

    ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలంటే -

 

    1986-87 ప్రాంతంలో మన అరుణాచల్ బోర్డర్ దగ్గర చైనా తన సైన్యాలకు మొహరించింది ఆ సమయంలో అమెరికా ఇక్కడున్న ప్రతి ఇండియన్ బెటాలియన్ నీ, ప్రతి చైనీస్ రెజి మెంట్ ని కరెక్టుగా అంచనా వేయగలిగింది ఎలా?  

 

    సైన్యాలు సిగ్నల్స్ పంపుకుంటూ ఉంటాయి కదా: వాటిని "ఇంటర్ సెప్ట్" చేయడం ద్వారా:

 

    అమెరికా మన సిగ్నల్స్ నీ, చైనా సిగ్నల్స్ నీ అంత కరెక్టుగా ఇంటర్ సెప్టు చేయగలిగిందంటే, అమెరికా తన ఇంటర్ సెప్టు స్టేషన్ లని భూటాన్ లోనో, నేపాల్ లోనో పెట్టి వుండవచ్చునని ఊహించాను నేను.   

 

    ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే: త్వరలో దానిలోని నిజానిజాలు తెలుసుకుంటాను.

 

    మన దేశాన్ని గురించి స్పైయింగ్ చేసే దేశాల్లో అమెరికా ముఖ్యమైనది. అమెరికా అనగానే సి ఐ ఏ, అంటే సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మాత్రమే గుర్తొస్తుంది చాలామందికి. కానీ అది సరైన అభిప్రాయం కాదు. సి ఐ ఏ కంటే పాత ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ఉంది. అమెరికాలో దాన్ని ఐ అండ్ ఆర్. అంటారు. అంటే అది యునైటెడ్ స్టేట్స్ స్టేట్ డిపార్టుమెంట్ తాలూకు ఇంటలిజెన్స్ అండ్ రిసెర్చ్ వింగ్ అన్న మాట దీన్లో బెస్ట్ అమెరికన్ స్పైస్ వుంటారు. యికపోతే సి ఐ ఏ ఇండియాకి సంబంధించినంతవరకూ లేబర్ గురించిన వివరాలూ, ఆర్ధిక పరిస్థితి గురించిన వివరాలు సేకరిస్తూ వుంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే అది ప్రపంచంలోని అతిపెద్ద అకాడమి రిసెర్చ్ ఆర్గనైజేషన్ దానిలో ఉన్నంత మంది పి హెచ్ డీలూ ఇంకే ఆర్గనైజేషన్ లోనూ వుండరు. అప్పుడప్పుడు సి ఐ ఏ కూడా గూఢచారి చర్యలు చేబడుతూనే వుంటుంది. కానీ బయట పడిపోయిన గూఢచారి చర్యలు చాలా వాటిని సి ఐ ఏ కి అంటగట్టడం జరిగిపోతూ వుంటుంది. నిజానికి అలాంటి పనులు ఎక్కువగా చేయించేది ఐ అండ్ ఆర్.

 

    ఇండియా గురించి అమెరికాకి తెలిసినన్ని వివరాలు మరే దేశాలకీ తెలియకపోవచ్చు. ఇండియాలో ఏ సంవత్సరం ఎంత గోధుమ పండుతుందో, ఇండియాలోని 800 వందల బెటాలియన్లలో ఏ బెటాలియన్ ఏ సమయంలో ఎక్కడుందో, ఏ బెటాలియన్ కి ఎవరు కమాండింగ్ ఆఫీసరుగా వున్నారో చెప్పగలరు అమెరికన్లు.

 Previous Page Next Page