"వుత్తరం రాకపోతే కొంపలేం అంటుకోవని చెప్పలేకపోయావా? ఇంట్లో సుఖంగా వున్నవాడు ఎదుటి వాడినుండి పలకరింపు కోరుకోడు. చాలామంది నిరాశ నిస్పృహల్లో వుంటారు గనుక వుత్తరం అనగానే అదేదో లాటరీ వచ్చినంత సంబరపడిపోతారు. అయినా వాడికి ఉత్తరం రాసే వెధవెవడంట?" కోపంతో అన్నాడు వేలు.
అతను మళ్ళీ వుత్తరాలను చూసి, ఇళ్ళకు వెళ్ళి పంచుతున్నాడు.
'వుత్తరం' అంటూనే అందరూ ఎందుకంత ఆశ్చర్యపోతున్నారో అర్థం కావడం లేదతనికి. కళ్ళు తిరుగుతున్నా, ఒళ్ళు తూలిపోతున్నా వుత్తరాలను చకచకా పంచేస్తున్నాడు.
ఎప్పుడెప్పుడు ఉత్తరాల బట్వాడా అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాడతను. చేతిలోని ఉత్తరాల బొత్తి తగ్గడం లేదు.
కాళ్ళీడ్చుకుంటూనే నడుస్తున్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకు పోయినా యిళ్ళ ముందు నిలబడి గొంతెత్తి అరుస్తున్నాడు. కళ్ళు మసకబారి, అక్షరాలు కనిపించకపోయినా అడ్రస్ లు కూడి కూడి చదువుతున్నాడు. విసుగ్గా వున్నా ఎవరు ఏ ప్రశ్న అడిగినా ఓపికగా సమాధానం చెబుతున్నాడు.
ఉత్తరాలన్నీ పూర్తయ్యేసరికి మరో గంట పట్టింది.
చివరి ఉత్తరం యిచ్చి చేతులు దులుపుకుంటూ "అన్ని ఉత్తరాలూ పంచేశాను. నాకిక చెరనుంచి విముక్తి కల్గించండి. జీవితంలో ఇంకెప్పుడూ ఆడపిల్లలకు కాదుగదా, మరెవరికీ కూడా ఉత్తరం రాయను. ఇప్పుడు నేను కష్టపడ్డ కష్టం సాక్షిగా చెబుతున్నాను" అన్నాడు నరేష్. ఆ తరువాత క్షమించి వదిలేయమన్నట్టు చేతులు జోడించాడు.
"ఇప్పుడు అర్థమైందా పోస్టుమాన్ పడే బాధ. ఎప్పుడయినా అవసరమైతే తప్ప ఉత్తరం రాయకు. నువ్వు బట్వాడా చేయాల్సిన ఉత్తరం మరొక్కటుంది" చెప్పాడు వేలు. అప్పటికతడు శాంతించాడు గత పదిహేను రోజులుగా పడ్డ కష్టమంతా ఆ క్షణంలో మరిచిపోయాడు. కసి తీర్చుకోవడంలో అంత ఆనందం వుంది మరి.
"ఇంకా ఒక ఉత్తరమా?" షాక్ తిన్నట్టు అడిగాడు నరేష్.
"అవును అది నువ్వు రాసిందే! మా శర్మ దానిక్కూడా ముద్ర వేసుకొచ్చాడు. ఆఫీషియల్ గా అది కూడా బట్వాడా చేయాల్సిందే. ఆ పిల్లకి నీ స్వహస్తాలతోనే ఉత్తరం యివ్వు. ఆ ఉత్తరాన్ని నేనే యిచ్చినంత కోపంతో నా చేతులనుంచి ఆ అమ్మాయి ఉత్తరాన్ని లాక్కుంటుంది. నన్నో పురుగును చూసినట్టు చూస్తుంది. ఆ బాధ కూడా రుచి చూద్దువుగానీ రా" వేలు ముఖం మళ్ళీ సీరియస్ గా మారిపోయింది.
"సారీ సార్! ఆ ఉత్తరాన్ని నేనే కాదు ఎవరూ యివ్వద్దు. వెళదాం పదండి" ప్రాధేయపడ్డాడతను.
"నో" అన్నాడు థమ్.
"లేకపోతే ఆ అమ్మాయి తండ్రితో జరిగిందంతా చెప్పేస్తాం" శర్మ బెదిరించాడు.
ఆ అస్త్రానికి ఎదురులేదు.
నరేష్ తలవంచుకున్నాడు.
వేలూ జేబులోంచి ఉత్తరం తీసి అతని చేతిలో కుక్కాడు.
వాళ్ళు బయలుదేరడంతో అయిష్టంగానే వాళ్ళ వెనకే బయలుదేరాడతను.
ఎంత అందమయిన అనుభవం ఎంత దరిద్రంగా తయారైంది. కొన్నిరోజులపాటు తనెవరో తెలియకుండా తన ప్రేమనంతా కవిత్వంలో చెప్పి, చివరకు తనే ఆ ప్రేమికుడని చెబుదామనుకున్న ప్లాన్ యింత దారుణంగా బెడిసికొట్టిందేమిటి? ఇదంతా అయ్యప్పస్వామి శాపమా? అతను తనలో తానే వగస్తూ నడుస్తున్నాడు.
"ఇదే యిల్లు" అని వేలు గేట్ తీశాడు.
తల పైకెత్తి చూసిన నరేష్ షాక్ తిన్నాడు. ఎకరా పొలంలో దేవతలు కట్టుకున్న భవంతిలా కళ్ళను మిరుమిట్లు గొలుపుతున్న ఆ ఇంటిని చూసి అదిరిపోయాడతను. రజని డబ్బులున్న అమ్మాయి అని తెలుసుగానీ ఆమె ఇల్లే అంత వుంటుందని అతను వూహించలేదు.
ద్వారం దగ్గర ఆగారందరూ.
డోర్ కర్టెన్ ఖరీదుతో పది కుటుంబాలు సంవత్సరం రోజులు హాయిగా బ్రతికేయచ్చు అనుకున్నాడు నరేష్.
"పోస్ట్ అని పిలువ్" శర్మ గద్దించాడు.
"పోస్ట్" కేక పెట్టాడు.
అప్పుడతని పరిస్థితి వర్ణనాతీతం. రకరకాల ఫీలింగ్స్ అతని ముఖాన్ని కొరుక్కు తింటున్నాయి.
"ఎస్" అంటూ వచ్చి డోర్ కర్టెన్ తొలగించిన రజని అలానే నిలబడిపోయింది. నలుగురు పోస్టుమ్యాన్ ల మధ్య అలసిపోయిన ముఖంతో, దుమ్ము కొట్టుకుపోయిన బట్టల్తో వున్న నరేష్ ను చూస్తూనే ఆమెకి ఏదో జరిగిందని తెలిసిపోయింది.
"మీరు నరేష్ కదూ?" అడిగింది ఆశ్చర్యపోతూ.
"అవునండి! మరీ... మరీ" అంతకుమించి అతను ఏం మాట్లాడలేకపోతున్నాడు.
"నేను చెబుతాను" చిట్టిబాబు ముందుకొచ్చి జరిగిందంతా చెప్పాడు.
"ఊఁ ఉత్తరం యివ్వు" శర్మ అనడంతో మౌనంగా ఆమెకు ఉత్తరం అందించాడతను.
అతని ముఖం తెల్లగా పాలిపోయింది.
చిట్టిబాబు చెప్పిందంతా విన్నదామె.
"నన్ను యిన్నిరోజులూ యింతగా కష్టపెట్టించినందుకు ఆ శిక్ష వేశాం మేడమ్. ఏమీ అనుకోకండి. మీకు రోజూ ఉత్తరాలు రాసింది ఇతనే" ఆమెతో చెప్పి "మరి ఈ రోజు నువ్వే యివ్వు ఉత్తరాన్ని" అని కసిరాడు వేలు నరేష్ ని.
ఉత్తరం తీసుకోమన్నట్టుగా చేయి చాచాడు అతను.
ఆమె అనాలోచితంగా ఉత్తరాన్ని అందుకుంది.
ఉత్తరాన్ని అందుకుంటున్నప్పుడు ఆమె చేతులు వణకటం అతను గమనించాడు. తను సక్సెస్ కి అట్టే దూరం లేడన్న సంగతి అతనికి తెలిసిపోయింది.
తన కోసం రోజంతా ఉత్తరాలు బట్వాడా చేసిన అతన్ని చూస్తుంటే పొంగుకొస్తూన్న దుఃఖాన్ని రజని అతి బలవంతంమీద కంట్రోల్ చేసుకుంటోంది.
నరేష్ ఆమెను చూసి చిర్నవ్వు నవ్వాడు.
ఆ నవ్వు పరిమళపు మేఘంలా ఆమెను కప్పేసింది.
అతను వెనక్కు తిరిగి అడుగు ముందుకు వేశాడు.
* * * * *