Previous Page Next Page 
నా జీవితం నీ కౌగిలిలో పేజి 24


    దారిలో అన్నాడు ఆంజనేయులు.

 

    "ఇంటికెళ్ళేసరికి ఆవిడ వుంటుందేమో? ఎలాగరా?"

 

    "ముందుగా నేను వెళ్తాను... నైట్ భోజనం కానిచ్చేసి, ఏదో కహాని చెప్పేసి నీకు కేరేజీ తెచ్చేస్తాను" అన్నాడు ఆనందం.

 

    "అంతవరకూ నేనేం చెయ్యాల్రా?"

 

    "అవుట్ హౌస్ వెనక గోడుందికదా... దాన్ని కూకి బాత్రూం దగ్గర నిలబడు... అంతకంటే గత్యంతరం లేదు."

 

    "తప్పదా?" అన్నట్టు చూశాడు ఆంజనేయులు.

 

    మరో అరగంట తర్వాత-

 

    ఆనందం భుజంగరావు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గరున్నాడు.

 

    "ఏం బాబూ! ఉదయం నుంచీ నువ్వసలు కనిపించలేదేమిటి?" అడిగింది భువనేశ్వరీదేవి.

 

    "ఏంలేదు పిన్నిగారూ... సిస్టర్ కొత్తగా వచ్చిందిగదా? పాపం వాళ్ళకి ప్రైవసీ కావాలి గదా? అందుకని..."

 

    "అవునవును... పిల్లక్కూడా ఒంట్లో బాగులేదట... అయినా పిల్ల కోరికమేరకు షికారుకి తీసుకెళ్ళాడు ఆంజనేయులు. వచ్చాడేమో... వుండు... వస్తే వాళ్ళిద్దర్నీ భోజనానికి పిలుస్తాను..." బయటకు రాబోయింది ఆవిడ.

 

    అదే సమయంలో అవుట్ హౌస్ గోడ దూకుతున్నాడు ఆంజనేయులు.

 

    "పిన్నిగారూ..." పెద్దగా అరుచుకుంటూ వెళ్ళి ఆవిడకు అడ్డంగా నిలబడి-

 

    "వాళ్ళు... టాంక్ బండ్ మీదికి షికారెళ్ళి అక్కడనుంచి ఫస్టు, సెకండ్ షోలకి సిన్మాలకెళ్ళి అలాగే అక్కడే ఏదో హోటల్లో భోజనాలు కూడా కానిచ్చేసి వచ్చేస్తామని మీతో చెప్పమన్నారండి" అన్నాడు ఆయాసపడుతూ.

 

    ఆవిడ మళ్ళీ వెనక్కొచ్చేసింది.

 

    "పిల్లకు సినిమాల పిచ్చా ఏమిటి?" అనుకుంటూ ఆవిడ గొడవలో ఆవిడ పడింది.

 

    అదే అదునుగా బయటికొచ్చేశాడు ఆనందం.


                                                   *    *    *    *


    జిగురుమూర్తి కుడివేపు గంట వినిపిస్తే, కుడివేపు గదిలోకి వెళ్ళి గంటకి తిరిగొచ్చాడు నీరసంగా.

 

    అలా వచ్చాడో, లేదో ఎడంవేపు గంట వినిపించింది. భయపడుతూ లేచి ఎడంవేపు గదిలోకి నడిచాడు.

 

    సుబ్రమణ్యం తన గురువు పరిస్థితికి తెగ జాలిపడిపోయాడు. ఆపైన కుడి ఎడమలు వున్న ఇద్దరు భార్యల్నీ తలుచుకొని అసూయ కూడా పడ్డాడు.

 

    మరో గంటకి మరింత నీరసంగా వచ్చి మధ్యలో వున్న తన మంచం మీద కూర్చున్నాడు.

 

    సుబ్రమణ్యం ఓదార్చే ప్రయత్నంలో వుండగా, తిరిగి గంట వినిపించింది.

 

    జిగురుమూర్తి పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడి "ఇక నా వల్ల కాదు బాబో" అన్నాడు ఏడుపు మొహంతో.

 

    "గంట మోగింది మీ భార్యలకి సంబంధించి కాదు. ఎవరో ముష్టిది. బిచ్చంకోసం వచ్చి, ఇంటి ముందు నిలబడి వాయించింది" అన్నాడు సుబ్రమణ్యం చిరాగ్గా.

 

    "ఏ గంటకైనా సమాధానం చెప్పే ఓపిక నాకిప్పుడు లేదు సుబ్రమణ్యం. నువ్వు చూసుకో" అన్నాడు జిగురుమూర్తి మంచం మీద అడ్డంగా పడిపోతూ.

 

    సుబ్రమణ్యం "తారాశశాంకమా...!!" అంటూ నోరెళ్ళబెట్టేశాడు.


                                                    *    *    *    *


    ఉదయమే లేచి ఊడ్వటం, కళ్ళాపి జల్లటం, తెలిసీ తెలియని ముగ్గులేయటం, టేప్ రికార్డర్ ఆన్ చేసి ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ క్యాసెట్ పెట్టటం, చీరెలు, జాకెట్లు, బ్రాసరీలు, లంగాలు నీళ్ళలో తడిపి బయట కనిపించేలా ఆరేయటం, ఇదే దినచర్య అయిపోయింది ఇద్దరికీ.

 

    మరుసటిరోజు అలా చేస్తుండగానే భువనేశ్వరీదేవి అవుట్ హౌస్ కొస్తూ కనిపించింది.

 

    అంతే... ఆనందం పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళిపోయాడు.

 

    ఆంజనేయులు కాలుగాలిన పిల్లిలా హాల్లో అటూ ఇటూ తిరగ సాగాడు.

 

    "అమ్మాయేం చేస్తోంది?" అంటూ ఆవిడ ప్రవేశించింది.

 

    లోపలున్న ఆనందం చేతులకి డజన్లు డజన్లు గాజులేసుకొని వంట పాత్రల్ని అటూ ఇటూ కదిలిస్తూ వంట శబ్దాల్ని సృష్టించసాగాడు.

 

    దాన్ని క్షణాల్లో అర్థం చేసుకున్న ఆంజనేయులు "వంట చేస్తోందండి" అని అనేశాడు అనాలోచితంగా.

 

    ఆవిడ అక్కడే వున్న సోఫాలో కూర్చుని...

 

    "మంచి కాఫీ చేసివ్వమని చెప్పు మీ ఆవిడకి" అంది తాపీగా.

 

    ఆంజనేయులు పళ్ళు నూరుకుని, "తరణి ఒక కాఫీ చేయ్... సిగ్గయితే బయటకు రానఖ్ఖర్లేదులే... లోపల నుంచే ఇవ్వు" అని ఆనందాన్ని ఉద్దేశించి అన్నాడు.

 

    అర్థం చేసుకున్న ఆనందం క్షణాల్లో కాఫీ చేసి ట్రేలో పెట్టి గడపచాటు నుంచే బయటకు అందించింది.

 

    "మా ఆవిడకు పుట్టెడు సిగ్గు..." అంటూ ఆంజనేయులు కాఫీ అందుకొని ఆవిడకి అందించాడు.

 

    ఆనందం గాజుల చేతిని చూసి ఆమె సంతృప్తి పడింది. అదంతా నిజమే అనుకొని.

 

    కాఫీ తాగి కప్పును పక్కన పెడుతూ...

 

    "మీ ఆవిడ చేతి కాఫీ చాలా బావుందోయ్... వంట ఇంకెంత బావుంటుందో...? ఈరోజు మా ఇద్దరికీ మీ ఆవిడతోటే వంట చేయించి పంపు. వస్తా" అంటూ ఆవిడ మెయిన్ బంగ్లా కేసి వెళ్ళిపోయింది.

 

    "డ్రామా బాగానే ఆడావు.. లోన స్త్రీ ఉన్నట్లు, వంట చేస్తున్నట్లు బాగానే ఎష్టాబ్లిష్ చేశావ్... కానీ కాఫీ బాగా తయారు చేసివ్వటమే బాగా లేదు. ఇప్పుడామె వంట చేసి క్యారేజీ పంపించమంది. ఏం చేద్దాం...?" అన్నాడు ఆంజనేయులు తల పట్టుకుంటూ.

 

    "అనుమానం వచ్చి లోపల కొస్తుందేమో అనే భయంతో కాఫీ చేశాను. కాఫీ బాగా చేయకపోతే అది ఆడాళ్ళు చేసే కాఫీయేనా అని అనుమానించి లోపలకొస్తుందేమోనని బాగా చేశాను. ఇంకెలా చావనురా బాబు... ఈ దిక్కుమాలిన స్త్రీ పాత్ర చేయలేక ఛస్తున్నాను. అసలు కొన్నాళ్ళకు నేను మగాడ్ననే విషయం మర్చిపోతానో ఏమో..." అన్నాడు ఆనందం పైటను సవరించుకుంటూ.

 

    "అది సరే... మరిప్పుడు వంటెలా...?"

 

    "నెల్లూరు రెడ్డి హోటల్ కెళ్ళి క్యారేజ్ పట్టుకొచ్చి మా ఆవిడ చేసిందేనని చెప్పి ఇవ్వటమే" అన్నాడు ఆనందం అసహనంగా.

 

    "నాకు చాలా అప్పులున్నాయిరా... ఇలా ఖర్చు చేసుకుంటూ వెళితే... ఎలా?" అన్నాడు ఆంజనేయులు బాధగా.

 Previous Page Next Page