అతని రివాల్వర్ లోనుంచి రిలీజ్ అయిన బుల్లెట్ అక్కడే వున్న చెట్టుకి తగిలి దాని మీద పాకుతూ వున్న తొండని తుత్తునియలు చేసింది.
ఈ కాల్పులు వినగానే ప్రాణభయంతో చెట్టుచాటునుంచి తొంగి చూశాడు ఎలెక్షన్ రెడ్డి.
ఆలోగానే వరసగా నాలుగు బుల్లెట్లు ఆ చెట్టు మానుని తాకాయి.
అప్రయత్నంగానే తనుకూడా రెండుసార్లు కాల్చాడు ఎలెక్షన్ రెడ్డి.
వాటిలో ఒక బుల్లెట్ మరిడేశ్వరరావు మెడని తాకుతున్నంత దగ్గరగా వెళ్ళింది. కానీ అతనికి తగలలేదు. మళ్ళీ గుళ్ళ వర్షం కురిపించాడు మరిడేశ్వరరావు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెట్టడం మొదలెట్టాడు ఎలెక్షన్ రెడ్డి.
కాల్పులు సాగిస్తూనే అతని వెంటబడ్డారు యాదీ, మరిడేశ్వరరావు.
హిందూరావు ఇదంతా యధాలాపంగా చూస్తూ నిర్వికారంగా వుండిపోయాడు. అతను ఏమీ కలగజేసుకోలేదు.
పరిగెడుతూ రెండుసార్లు వెనక్కి తిరిగి గురిలేకుండానే కాల్చాడు ఎలెక్షన్ రెడ్డి. మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టాడు. అతని చూపంతా అక్కడికి వందగజాల దూరంలో ఉన్న చిన్న రీరోలింగ్ మిల్లు మీద వుంది. స్టీలు టోపీలు పెట్టుకుని వున్న కొంతమంది వర్కర్స్ ఆ ఫ్యాక్టరీ కప్పుమీద నిలబడి ఏదో పని చేస్తున్నారు. అక్కడికి తను చేరుకోగలిగితే....
పరిగెడుతూ దాదాపు ఫ్యాక్టరీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేశాడు ఎలెక్షన్ రెడ్డి.
మరిడేశ్వరరావు కాల్చిన బుల్లెట్స్ లో ఒకటి అక్కడే వున్న గ్రానైట్ రాయికి తగిలింది. అది ముక్కలుగా పగిలింది. ఒక ముక్క అతివేగంగా వచ్చి ఎలెక్షన్ రెడ్డి కుడికాలిని తాకింది. రక్తం కారడం మొదలెట్టింది. గాయపడిన కాలు ఈడ్చుకుంటూనే ఫ్యాక్టరీలోకి పరిగెత్తాడు ఎలెక్షన్ రెడ్డి.
అక్కడున్న పాతికమంది వర్కర్స్ కీ అప్పటికే అర్ధం అయ్యింది. అక్కడ ఏదో పెద్ద గొడవ జరగబోతోందని!
ఆ బుల్లెట్స్ తమకి తగలకపోతే అదే చాలన్నట్లుగా అందరూ కకావికలై ఎవరి దారిన వాళ్ళు పారిపోయారు.
ఫ్యాక్టరీలో మెషన్లన్నీ నడుస్తూనే వున్నాయి.
వాటిని నడిపే మనుషులే అయిపులేకుండా అక్కడ లేకుండా పారిపోయారు.
పరిగెత్తి ఒక మెషీన్ వెనక చేరాడు ఎలెక్షన్ రెడ్డి. ఆయాసంలో అతనికి ఊపిరి అందడం లేదు.
అదే క్షణంలో ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టాడు మరిడేశ్వరరావు, అతని బాడీగార్డు యాదీ. అన్ని వేపులా పరీక్షగా చూశారు.
పెద్ద మెషీన్ వెనుక దాక్కున్న ఎలెక్షన్ రెడ్డి రివాల్వర్ పేల్చాడు.
ఆ గుండు యింకో మెషిన్ కి తగిలింది. వెంటనే దాన్లో నుంచి వికృతమైన శబ్దంతో పొగరావడం మొదలెట్టింది. మెషిన్ లో నుంచి ఏదో ద్రవం ఫౌంటెన్ లా చిమ్మడం మొదలెట్టింది.
మళ్ళీ ఇంకోసారి పేల్చాడు ఎలెక్షన్ రెడ్డి.
ఈసారి బుల్లెట్ ఇక ఇనప దూలానికి తగిలి, దారి మార్చుకుని అక్కడ బిగించి వున్న ఒక అద్దానికి తగిలింది.
భళ్ళుమని పగిలింది అద్దం.
రొప్పుతూ, జేబులోనుంచి స్పేర్ బుల్లెట్స్ తీశాడు ఎలెక్షన్ రెడ్డి. రివాల్వర్ రీలోడ్ చేశాడు.
మళ్ళీ పేల్చాడు.
సేఫ్ గా ఉన్నాడు ఎలెక్షన్ రెడ్డి. అతను దాక్కున్న మెషీన్ అతనికి చాలా రక్షణ ఇస్తుంది. రెండోవైపున గోడ వుంది. అక్కడ వున్నంతసేపు అతన్ని శత్రువుల బుల్లెట్స్ తాకవు. శత్రువులే గనక అక్కడికి వస్తే అతనే వాళ్ళని కాల్చేస్తాడు.
గ్యాంగ్ లీడర్ మరిడేశ్వరరావు, బాడీగార్డు యాదీ సాభిప్రాయంగా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు, ఒకళ్ళ భావం ఒకళ్ళకి అర్ధం అయ్యింది. ఎలెక్షన్ రెడ్డి దొరికాడు. అతన్ని చంపెయ్యడం చాలా ఇంపార్టెంట్ తమ గ్యాంగ్ కి.
చంపే ముందు, ఎలెక్షన్ రెడ్డితో కక్కించబోయే రహస్యాలు కూడా తమ గ్యాంగ్ కి చాలా చాలా ఇంపార్టెంటే.
ఎగ్జయిటెడ్ గా వున్నారు వాళ్ళిద్దరూ.
పరిసరాల్ని జాగ్రత్తగా గమనించాడు మరిడేశ్వరరావు.
ఎలెక్షన్ రెడ్డి సేఫ్ గా దాక్కున్న ప్లేస్ లోనే, గోడకి ఒక ఫైర్ ఎక్టింగ్విషన్ ఫిక్స్ చేసి వుంది. ఐస్ క్రీమ్ కోన్ షేపులో వుండే ఆ ఎర్రటి మెటల్ బాక్స్ లో మంటలని ఆర్పే కెమికల్ వుంటుంది. అగ్నిప్రమాదం జరిగితే, ఆ ఫైర్ ఎక్టింగ్విషన్ ని తీసి నేలమీద కొట్టాలి. వెంటనే ఉధృతమైన నురుగు అతివేగంగా వెలువడి మంటలని ఆర్పేస్తుంది.
యాదికి సైగచేసి, వంగి గబగబా ముందుకి నడిచాడు మరిడేశ్వరరావు అతన్ని కవర్ చేస్తూ వెనుకనుంచి యాది ఆరడుగుల ఎత్తున దూసుకుపోయేటట్లు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఆ బుల్లెట్ల కిందనుంచి వెళ్తున్నాడు మరిడేశ్వరరావు.
ఎలెక్షన్ రెడ్డి దాక్కున్న మెషీన్ దగ్గరికి వచ్చేశాడు అతను.
బుల్లెట్ల వర్షం ఆపాడు యాది.
ఒక్క క్షణం నిశ్శబ్దం!
తర్వాత తల పరికించి సైగ చేశాడు మరిడేశ్వరరావు.
ఈసారి ఫైర్ ఎక్టింగ్విషన్ ని గురిచూసి కాల్చాడు యాది. ఠపఠప.... మళ్ళీ బుల్లెట్ల వర్షం.
తక్షణం ఫైర్ ఎక్టింగ్విషన్ బరస్ట్ అయిపోయింది. కెమికల్స్ తో కూడిన నురుగు వరదలాగా వెలువడింది దాన్లో నుంచి.
క్షణాల్లో ఆ నురుగుతో తడిసిపోయాడు. దానికిందే వున్న ఎలెక్షన్ రెడ్డి. అతనికి ఊపిరి ఆడలేదు. ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
అదే అదనుగా తను కూడా మెషీన్ వెనక్కి వెళ్ళిపోయాడు మరిడేశ్వరరావు. ఎలెక్షన్ రెడ్డి మీదికి లంఘించాడు.
ఒక చేత్తో మొహం మీద నురుగును తుడుచుకుంటూనే, రెండో చేత్తో రివాల్వర్ ని మరిడేశ్వరరావు మీదికి గురిపెట్టబోయాడు ఎలెక్షన్ రెడ్డి.
ఎలెక్షన్ రెడ్డి రివాల్వర్ వున్న చేతిని తన చేత్తో పట్టుకున్నాడు మరిడేశ్వరరావు. కుడిచేత్తో ఎలెక్షన్ రెడ్డి కాలర్ బోన్ ని (మెడకింద అటూ ఇటూ వుండే ఎముకలు) గట్టిగా నొక్కాడు.
"ఠక్' మని విరిగింది ఎముక.
విలవిల్లాడాడు ఎలెక్షన్ రెడ్డి.
రెండోవైపున ఉన్న ఎముకని కూడా విరక్కొట్టాడు మరిడేశ్వరరావు.
ప్రాణాలు కడబట్టాయి ఎలెక్షన్ రెడ్డికి. అతనికి ఊపిరి అందడం లేదు.
అది గమనించిన యాది చటుక్కున ముందుకు వంగాడు. ఎలెక్షన్ రెడ్డి దవడలను నొక్కి పట్టుకుని, అతని నాలుకని బయటికి లాగాడు.
అలా చెయ్యడంవల్ల ఎలెక్షన్ రెడ్డికి తిరిగి ఊపిరి ఆడడం మొదలెట్టింది.
ఎలెక్షన్ రెడ్డి గనక రహస్యాలు చెప్పేముందు ఊపిరాడక చచ్చిపోతే, మరిడేశ్వరరావుకి ,గ్యాంగుకి నష్టం.
ఎలెక్షన్ రెడ్డిని అలా రెండు నిమిషాలు శ్వాస తీసుకోనిచ్చాడు మరిడేశ్వరరావు.
తర్వాత అన్నాడు_
"చెప్పు! చెప్పు ఎలెక్షన్!"
శక్తి అంతా కూడదీసుకుని, మరిడేశ్వరరావు మొహం మీద ఉమ్మేశాడు ఎలెక్షన్ రెడ్డి. కానీ ఆ ఉమ్మి మళ్ళీ అతని మొహం మీదే పడింది. ఉమ్మి తుంపరలు అతని షర్టు మీద స్ప్రేలాగా పడ్డాయి.
తల పంకించాడు మరిడేశ్వరరావు.
చెయ్యి ముందుకి జాచి, విరిగిన ఎలెక్షన్ రెడ్డి కాలర్ బోన్ ని నొక్కాడు.
విరిగిన ఎముకల తాలూకు చప్పుళ్ళు వినబడ్డాయి. చర్మం కింద నుంచి.
"చెప్పు ఎలెక్షన్! రాత కోతల్లేకుండానే నీ నోటి మాటమీద పది కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని నాకు తెలుసు. చెప్పెయ్! మేమెళ్ళి వసూలు చేసుకుంటాం. చెప్పు. ఎక్కడ ఏ బాకీ వసూలు చెయ్యాలంటే ఏ కోడ్ లో చెప్పాలి? చెప్పు ఎలెక్షన్?" అన్నాడు రష్ చేస్తూ.
"నన్ను చంపినా చెప్పను" అన్నాడు ఎలెక్షన్ రెడ్డి హీనస్వరంతో.
అటూ ఇటూ చూశాడు మరిడేశ్వరరావు.
అక్కడ అతని చేతికి అందుబాటులోనే వున్నాయి కొన్ని పనిముట్లు.
ఒక రెంచి, స్క్రూడ్రయివర్లూ, ఒక సుత్తీ, ఒక దబ్బనం.
దబ్బనం తీసుకున్నాడు మరిడేశ్వరరావు. సుత్తి అందుకున్నాడు.
ఎలెక్షన్ రెడ్డి తలని కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు యాది.
ఆ మెషీన్ కి కింద ఒక కొయ్య ప్లాట్ ఫారం వుంది.
ఎలెక్షన్ రెడ్డి తలని పక్కకి వంచాడు యాది. ఇప్పుడు కింద వున్న చెక్కని తాకుతోంది ఎలెక్షన్ రెడ్డి చెవి.
అతని చెవి మీద దబ్బనం పెట్టి, సుత్తితో బలంగా కొట్టాడు మరిడేశ్వరరావు.
చెవిలో నుంచి చెక్కలోకి దిగింది దబ్బనం.
దుర్భరమైన బాధతో కేకపెట్టాడు ఎలెక్షన్ రెడ్డి.
భరించలేని ఆ బాధకి అతని శరీరం మీద అతనికి కంట్రోల్ తప్పింది. బిగుసుకు ఉండవలసిన కండరాలు వదులుగా అయిపోయాయి. వదులుగా ఉండవలసిన కండరాలు బిగుసుకుపోయాయి. అతని కడుపులోని గ్యాసెస్ రిలీజ్ అయిపోయాయి. వెగటుగా వాసన వ్యాపించింది అక్కడ.
"చెప్పు ఎలెక్షన్ రెడ్డి!" అన్నాడు మరిడేశ్వరరావు.
చెప్పకపోతే తనని యింకా చిత్రహింసలు చెయ్యడానికి మరిడేశ్వరరావు సంకోచించడని తెలుసు ఎలెక్షన్ రెడ్డికి.
అందుకని చెప్పడం మొదలెట్టాడు-