మేకని కోశాక, దాని తలకాయని కాల్చే స్టవ్ లాంటిది వుంటుంది. దాన్ని తెప్పించాడు రాజ్ కుమార్. మెటల్ వెల్డింగ్ కి ఉపయోగించే దానిలాగా వుంది అది. పామునాలిక లాగా సన్నటి, ఎర్రటి, తీక్షణమైన మంట వస్తోంది దాన్లోనుంచి.
మంచుదిమ్మల మీదనుంచి దింపనేలేదు తనని. పైన ఆ ఇన్ స్ట్రుమెంట్ తో తన జుట్టుని కాల్చడం మొదలెట్టాడు రాజ్ కుమార్.
జుట్టు, కనుబొమ్మలు, కనురెప్పల మీది వెంట్రుకలు, చెంపలు, గెడ్డం....
పైన భరించలేనంత వేడి, కింద భరించలేనంత చలి. దారుణమైన బాధ!
జుట్టు పూర్తిగా కాలే లోపలే, స్పృహ తప్పిపోయింది తనకి.
తెలివి వచ్చేసరికి ఈ హాస్పిటల్లో వున్నాడు తను!
అక్కడిదాకా చెప్పి ముక్తాయింపుగా అన్నాడు పాండు.
"డాక్టరమ్మా! మరిడేశ్వరరావు కొడుకుని వెదకడంలోనే నా సంసారం పాడైపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడితే మాత్రం ఆ అఖిల్ నా చేతిలో చచ్చాడే అనుకో!"
అతని మాటలు మనసులోనే జాగ్రత్తగా నోట్ చేసుకుంది డాక్టర్ సుధ. పైకి ఏమీ మాట్లాడలేదు.
* * * *
స్మశానంలో ముందు నడుస్తున్నాడు హిందూరావు. అతని వెనకే వస్తున్నారు గ్యాంగు లీడరు మరిడేశ్వరరావు, అతని బాడీగార్డు యాదీ.
హిందూరావు మనసులో మళ్ళీ అదే ప్రశ్న మెదిలింది. ఈ అఘోరీ సాధువుకి నిజంగానే అద్భుత శక్తులు వున్నాయా? ఎలాంటి వ్యక్తి అతను?
అఘోరీ సాధువుకి అద్భుతశక్తులు వున్నాయో లేదో అన్న విషయం తనకు తెలీదుగానీ అసలంటూ అద్భుత శక్తులనేవి ఉన్నాయని మాత్రం తనకి రూఢి అయ్యింది. తను హిమాలయాల్లో తిరుగుతున్నప్పుడు చాలా నమ్మకమైన మనుష్యులద్వారా కొన్ని అద్భుతాల గురించి తెలుసుకున్నాడు.
అనేకమంది సాధువులకు గురువయిన శ్రీ మహావతార బాబా కొన్నివేల సంవత్సరాల నుంచి ఇప్పటి దాకా హిమాలయాల్లో సజీవంగా సంచరిస్తూ ఉన్న సంగతి తను విన్నాడు.
ఆయనలాంటి వాళ్ళకి అద్భుత శక్తులు అనేకం ఉంటాయి.
కానీ వాటిని వారు అకారణంగా ప్రదర్శించరు.
చీఫ్ "ఎగ్జిబిషనిజమ్" వారికి బొత్తిగా ఇష్టం ఉండదు.
వారికి నిరంతర ఆధ్యాత్మిక చింతనే తప్ప మిగతావి ఏవీ పట్టవు.
ఇంకొక రకం సాధువులు ఉన్నారు.
ఉదాహరణకి ఆఫ్జల్ ఫకీర్ లాంటివాళ్ళు ఆఫ్జల్ ఫకీర్ ఒకప్పుడు బెంగాల్ లో బతికిన మనిషి. ఆ ఆఫ్జల్ ఫకీర్ కి ఒకానొక యోగిద్వారా ఒక యోగ ప్రక్రియ పట్టుబడింది .దానిద్వారా ఆఫ్జల్ కి అగోచర మండలాలలో ఒకదాని మీద అధికారం దొరికింది.
ఫలితంగా అతని వెంట ఎప్పుడూ ఒక అశరీర ఆత్మ ఉంటూ ఉండేది. ఆ ఆత్మని అతను "హజరత్" అని పిలిచేవాడు. ఆ అశరీరాత్మ ఆఫ్జల్ కోరిన ఏ చిన్న కోరికనైనా సరే వెంటనే తీరుస్తూ ఉండేది.
తనకి ఉపదేశం చేసిన గురువు హెచ్చరికను పెడచెవిన బెట్టిన ఆఫ్జల్ ఫకీరు తన శక్తులని దుర్వినియోగం చెయ్యడం మొదలెట్టాడు. అతను ఏ వస్తువునైనా ఒకసారి చేతిలో తాకితేచాలు, అది అక్కడ అదృశ్యం అయిపోయి మళ్ళీ తర్వాత ఆఫ్జల్ దగ్గర చేరేది! చూసేవాళ్ళకి మాత్రం ఆఫ్జల్ గాల్లోనుంచి వస్తువులు తెప్పిస్తున్నట్లే తోచేది.
నిజానికి ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి సాధించలేదు. ఒక యోగ ప్రక్రియవల్ల అతనికి ఒక సూక్ష్మ మండలంలోకి ప్రవేశించే అవకాశం కలిగింది. అందులో ఏ కోరిక అయినా తక్షణం తీరుతుంది. 'హజరత్' అనే సూక్ష్మ మండలం జీవి సహాయంతోనూ, తన బలీయమైన సంకల్పసిద్ధితోనూ, ఆకాశశక్తి (ఈథరిక్ ఎనర్జీ) నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువులనైనా సరే ఆకర్షించగలిగేవాడు ఆఫ్జల్. అయితే ఆ విధంగా సూక్ష్మశక్తితో తయారయిన వస్తువులని అదే రూపంలో అట్టే కాలం నిలిపి ఉంచడం సాధ్యం కాదు. ఆ ఆఫ్జల్ ఫకీరు దైవ సాక్షాత్కారం పొందినవాడు కాదు. చిరస్థాయిగానూ, జనానికి శ్రేయస్కరంగానూ ఉండే అలౌకిక అద్బుత చర్యలు నిజమైన సాధువులే చెయ్యగలరు. ఆ ఆఫ్జల్ లాంటివాళ్ళు కాదు.
ఆఫ్జల్ కి ఉపదేశం చేసిన గురువు అతను వక్రమార్గాన పోవడం గమనించి నొచ్చుకుని, అతన్ని మందలించాడు. దానితో ఆఫ్జల్ పశ్చాత్తాప పడి, తన తప్పుని అందరికీ తెలియబరుస్తూ ఒక పత్రికా ప్రకటన కూడా చేశాడు.
ఆ ప్రకటన తాలూకు సారాంశం ఏమిటంటే....
"అలౌకికమైన అద్భుత చర్యలు చేసే శక్తులు సంపాదించే వాళ్ళకి హెచ్చరికగా ఈ ప్రకటన చేస్తున్నాను. మా గురుదేవుల దయవల్ల నాకు సంక్రమించిన అద్భుత శక్తులని నేను చాలాకాలం దుర్వినియోగం చేశాను. నాకెవ్వరూ సరిలేరని అహంకారంతో మదించాను. కానీ మా గురుదేవుల మందలింపుతో నా తప్పు గ్రహించాను. మహిమల ప్రదర్శించడం మానేసి ఇకనుంచి దివ్యజ్ఞానం పొందడానికే నిండు మనసుతో సాధన చెయ్యడానికి నిశ్చయించుకున్నాను" అని.
అది తలుచుకుని, హిందూరావు మనసులోనే నవ్వుకున్నాడు.
పరిపూర్ణమైన యోగులు ఎక్కడో దుర్గమమైన కొండల్లో, కోనల్లో వుంటూ ఆధ్యాత్మిక అన్వేషణలో ఆనందంలో మునిగిపోయి వుంటారు. కొద్దో గొప్పో మహిమలు సంపాదించిన వాళ్ళు మాత్రం ఇంక సాధన మానేసి, తమకి ఉన్న కొద్దిపాటి శక్తులన్నీ ప్రదర్శిస్తూ ఆడంబరాలలో పడిపోతారు.
ఆ అంచుకీ, ఈ అంచుకీ మధ్య వుండి తమ నైతిక బలంతో ప్రజలకు మంచీ చెడూ చెప్పగల సాధువు కావాలి తనకి.
తప్పుదారిలో పోతున్న వాళ్ళని తెలిసికూడా చేరదీసి ఆదరిస్తూ, వాళ్ళ వాళ్ళవల్ల పబ్బం గడుపుకునే స్వాములూ, బాబాలవల్ల తను అనుకున్న పని జరగదు.
ఈ అఘోరీ మీద తనకు అంతగా నమ్మకం లేదు. కానీ అతని ద్వారా తనకు కావలసిన సమాచారం రాబట్టవచ్చేమో! అదొక ఆశ. తన కోసం కాదు. ప్రజలకోసం.
"ఏడీ! అఘోరీ కనబడడేం?" అన్నాడు మరిడేశ్వరరావు ఆత్రంగా.
అఘోరీ సాధువుతో ఈ మరిడేశ్వరరావుకి ఏం పనో అర్ధం కాలేదు హిందూరావుకి.
కాసేపు వెదికారు.
అఘోరీ సాధువు కనబడలేదు.
కానీ అఘోరీ సాధువు తాలూకు విజిటింగ్ కార్డులాగా మాత్రం ఒకటి కనబడింది.
ఒక శవం!
సగం తినెయ్యబడ్డ శవం!
ఆ శవానికి తలలేదు!!
శవం తల కోసివెయ్యబడి వుంది!!!
ఎంతో మందిని నిర్ధాక్షిణ్యంగా చంపిన మరిడేశ్వరరావుకి కూడా సగం తినెయ్యబడి వున్న ఆ శవాన్ని చూడగానే ఒక్కసారిగా గుండె జల్లుమంది.
ఇంతలో బాడీగార్డు యాది గుసగుసగా అన్నాడు__
"అదిగో! వస్తున్నాడు....వస్తున్నాడు."
"అఘోరీ సాధువేనా?" అన్నాడు మరిడేశ్వరరావు అలెర్టుగా అయిపోతూ.
"కాదు బాస్! ఎలెక్షన్ రెడ్డి వస్తున్నాడు" అన్నాడు యాది గొంతు తగ్గించి.
చటుక్కున తిరిగి చూశాడు మరిడేశ్వరరావు. ఎలెక్షన్ రెడ్డి అంటే తన శత్రువు దుర్గేష్ కి కుడిభుజం.
మరుక్షణంలో మరిడేశ్వరరావు అఘోరీ సాధువు గురించి మర్చిపోయాడు. అతని మనసులో ఇప్పుడున్నది ఒక్కటే ఆలోచన. దుర్గేష్ కి రైట్ హ్యాండ్ అయిన ఎలెక్షన్ రెడ్డిని వదలకూడదు. చంపెయ్యాలి.
ఎలెక్షన్ రెడ్డి చస్తే దుర్గేష్ కి చావుదెబ్బ తగులుతుంది. దుర్గేష్ కి వ్యాపారాలు చాలా వున్నాయి.
గాంబ్లింగ్, స్మగ్లింగ్, కిడ్నాపులూ, నైట్ క్లబ్బులూ, బ్రోతల్స్.... ఈ వ్యాపారాలన్నీ ఎలెక్షన్ రెడ్డే చూస్తూ ఉంటాడు.
అతని నోటి మాటమీదే దాదాపు పదికోట్ల రూపాయల వ్యవహారాలూ నడిచిపోతూ ఉంటాయి.
ఆ వ్యాపారాల వివరాలు చివరికి దుర్గేష్ కి కూడా తెలియవు. అతను తెలుసుకోవాలని ప్రయత్నించడు కూడా. దుర్గేష్ కి ఎలెక్షన్ రెడ్డి మీద అంత నమ్మకం.
ఎలెక్షన్ రెడ్డి చస్తే, దుర్గేష్ సగం చచ్చినట్లే. వాడి వెన్నెముక విరిగినట్లే.
అక్కడికి కొద్ది దూరంలోనే ఆగి వుంది ఎలెక్షన్ రెడ్డి కారు.
కార్లో నుంచి దిగుతున్నాడు ఎలెక్షన్ రెడ్డి అంగరక్షకుడు. అతని భుజానికి ఉన్న బెల్టులో రివాల్వర్ వుంది. కానీ అంగరక్షకుడు అంత అలెర్టుగా లేడు. అది ఊరుబయట ప్రాంతం. అక్కడ ఎక్కువ జనసంచారం లేదు. ఆ స్పాట్ లో తమకి పెద్ద ప్రమాదం ఎదురవుతుందని అతను ఊహించలేదు.
తనకి వెనుక వేపున నిలబడి వున్న మరిడేశ్వరరావునీ, అతని బాడీగార్డు యాదినీ ఎలెక్షన్ రెడ్డి అంగరక్షకుడు చూడలేదు.
చూస్తే తనే ముందర వాళ్ళమీద కాల్పులు జరిపి వుండేవాడు.
ఎండుటాకులు పాదాలకింద నలుగుతున్న శబ్దం వినబడింది.
చటుక్కున రివాల్వర్ మీదికి చెయ్యిపోనిచ్చి వెనక్కి తిరిగాడు ఆ అంగరక్షకుడు.
అతని చూపు మరిడేశ్వరరావు మీద పడేలోపలే అతని కళ్ళముందు పెద్ద మెరుపు మెరిసింది! అతి వేడిగా ఉన్న బుల్లెట్స్ అతని గుండెలో, మొహంలో చొచ్చుకుపోయాయి.
అంగరక్షకుడు భూమి మీదికి ఒరిగిపోతూనే, అసంకల్పిత ప్రతీకార చర్యలాగా తన చేతిలోని రివాల్వర్ ని పేల్చాడు. ప్రాణాలు వుండగా అతను చేసిన చివరి పని అదే.