సంభ్రమంగా చూస్తున్నాడు సాగర్.
అక్కడ_
అసంఖ్యాకంగా ఏనుగుల అస్థిపంజరాలు!
చాలామంది మిస్టరీగా భావించే ఒక విషయానికి హఠాత్తుగా జవాబు దొరికినట్లయింది.
తక్కిన జంతువులు చనిపోతే, వాటి అవశేషాలు కనబడవని చెబుతారు.
మరి అవి ఏమవుతాయి?
"ఏనుగులలో ఉమ్మడి కుటుంబ లక్షణాలు చాలా ఉంటాయి వాటికి మనుషులకి ఉన్నట్లే "శ్మశానాలు" ఉండవచ్చుననీ, చనిపోయిన తమ తోటి ఏనుగులని అవి ఆ శ్మశావాలకు చేరుస్తాయనీ నమ్ముతారు కొంతమంది.
అలాంటి ఏనుగుల శ్మశానాన్నే చూస్తున్నాడు అతను?
దీనికీ, ఆ రాగి రేకుమీద రాయబడిన వాక్యానికి ఏమన్నా సంబంధం వుందా?
"ఐరావతం, కుంభస్థలం మీద పెన్నిధి."
ఆ ఏనుగులన్నీ వెళ్ళిపోయేదాకా అక్కడే వెయిట్ చెయ్యదలుచుకున్నాడు సాగర్.
వాటి దారికి అడ్డం రాకుండా ఒక పక్కగా పొంచి నిలబడ్డాడు.
అతని ప్రతీ కదలికనీ, ఒక జత కళ్ళు తీక్షణంగా పరిశీలిస్తున్నాయని తెలియదు అతనికి.
మందలోని ఏనుగులన్నీ, తమ సాటి ఏనుగు ఒకటి శాశ్వతంగా తమని వీడి వెళ్ళిపోయినందుకు సంతానం ప్రకటిస్తున్నట్లు చాలసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయాయి తర్వాత ఒక ఏనుగు నెమ్మదిగా వెనుదిరిగింది మిగతావన్నీ దాన్ని అనుసరించాయి భూమికి నాలుగడుగుల ఎత్తే ఉన్న రెండు గున్న ఏనుగులు వెనుకగా పరిగెత్తాయి.
వాటి హడావిడి తగ్గాక, అక్కడంతా నిశ్శబ్దం ఆలుముకుంది.
తన మీద ఏదో నీడ పడినట్లు అనిపించింది సాగర్ కి. చటుక్కున తల ఎత్తి చూశాడు.
రాబందులు, ఒకటికాదు, రెండుకాదు, దాదాపు ఇరవై, అసహనంగా పైన చక్కర్లు కొడుతున్నాయి.
ఒక రాబందు నెమ్మదిగా జారుతున్నట్లు వచ్చి ఆ ఏనుగు కళేబరం మీద వాలి, కన్నుని పొడువసాగింది. తకిన్న రాబందులు కూడా విందు భోజనానికి కూర్చున్నట్లు ఆ కళేబరం చుట్టూ వాలాయి.
అక్కడనుంచీ ముందుకు కదిలాడు సాగర్. ఎక్కడ చూసినా ఎటు చూసినా అసంఖ్యాకంగా ఆస్తిపంజరాలు. చరిత్రకి అందని కాలంనుంచీ ఆ స్థలం అక్కడి ఏనుగులకి స్మశాన వాటికగా ఉపయోగపడుతూ ఉండి ఉండాలి. కొన్ని అస్థిపంజరాలు ఎంత పురాతనమైనవంటే, వాటి మీద పోరపాటున అతని అడుగుపడగానే వాటి ఎముకలు నుసినుసి అయిపోతున్నాయి.
ముందుకు సాగుతున్నాడు.
ఎంత దూరం నడిచినా దృశ్యంలో మార్పులేదు. అటూ ఇటూ కొండలు. మధ్యలో కోకొల్లలుగా ఎముకలు.
"ఐరావతం కుంభస్థలం మీద పెన్నిధి."
ఐరావతం అంటే ఇంద్రుడి వాహనం, తెల్లటి ఏనుగు.
అసలు తెల్లటి ఏనుగులు ఉండటం సంభవమా? పులుల్లో తెల్ల పులులు ఉండటం తనకి తెలుసు.
కానీ తెల్లటి ఏనుగు? ఒకవేళ తెల్లటి ఏనుగు ఉందనుకున్నా, రంగరాజు కాలంనాటి ఇనుగా ఇప్పుడు ఇంకా సజీవంగా ఉంటుందా? దాని కుంభస్థలం మీద పెన్నిధి ఏమిటి?
ఇది నిశ్చయంగా ఏదో కోడ్ అయి ఉంటుంది.
క్లూ ఏమన్నా దొరుకుతుందేమోనని వెయ్యికళ్ళతో చూస్తున్నారు సాగర్.
ఏమీ కనబడలేదు.
లోయ రెండోవైపుకి వచ్చేశాడు. ఎలాగూ ఇంత దూరం వచ్చాడు గనక అటువైపు ఏముందో చూడాలనిపించింది.
బండలనే మెట్లలాగా చేసుకుని ఎక్కుతూ పైకి ఎక్కాడు.
చివరిదాకా ఎక్కాకడో వినబడింది. చెవులు చిల్లులు పడేలా ఒక స్త్రీ ఆర్తనాదం!
* * *
గుహలో ఒక మూలగా కూర్చుని గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఇబూకా, ఫకర్.
గోళ్ళు గిల్లుకుంటూ, మధ్య మధ్యలో వాళ్ళవైపు అనుమానంగా చూస్తున్నాడు ప్రొఫెసర్ ఆనందరావు.
పెద్దగా సింహగర్జన వినబడింది అతి దగ్గరనుంచే.
"బాబోయ్ సింహం" అన్నాడు ఇబూకా.
ఉలిక్కిపడ్డారు అందరూ.
ప్రొఫెసరె అందరికంటే ముందు తేరుకున్నాడు. అతని కను బొమ్మలు ముడిపడ్డాయి.
"సింహాలు ఇక్కడ ఉండవే. గుజరాత్ దగ్గర గిర్ ఫారెస్టులో తప్ప సింహాలు ఇండియాలో మరెక్కడా లేవు. అక్కడ కూడా మహా అయితే ఓ రెండొందలు యాభై సింహాలు ఉంటాయేమో అంతే" అన్నాడు సాలోచనగా.
"అయితే అది సింహం కాదంటారు?" అన్నాడు ఫకర్.
"ఊహూ!"
"పోన్లెండి! బతికించారు!"
కాసేపు నిశ్శబ్దం.
మళ్ళీ పుంజుకున్నాడు ప్రొపెసర్. కాలరు సరిచేసుకుని, ఓరగా అనూహ్యవైపు చూస్తూ, చెప్పడం మొదలెట్టాడు.
"సింహలంటే ఒక మాంచి జోకు గుర్తోస్తోందయ్యా చెప్పమంటారా?"
వాళ్ళు వద్దనే లోగానే అతను చెలరేగిపోయాడు.
ఒకబ్బాయీ, ఒకమ్మాయీ ఉద్యోగాల వేటలో ఒక సర్కసు మేనేజరు దగ్గరి కెళ్ళారుట.
సర్కస్ మేనేజరు వాళ్ళని ఇంటర్వ్యూ చ్య్డం మొదలెట్టాడు.
"నువ్వు ఆ మొగ సింహాన్ని మచ్చిక చేసుకోగాలవా?" అన్నాడు ఆ అమ్మాయితో.
"అదెంత పని" అవి ఆ అమ్మాయి ఆ మొగ సింహందగ్గరికి వెళ్ళింది. బట్టలు వదిలేసి నిలబడింది...."
"ఇదిగో ప్రొఫెసర్ గారూ" అన్నాడు ఫకర్ కోపంగా.
ప్రొఫెసర్ అతన్ని పట్టించుకోకుండా ఓరకంటితో అనూహ్య వైపు చూస్తూ చెబుతూనే ఉన్నాడు.
ఆ మొగ సింహం ఆ అమ్మాయి అందానికి దాసోహం అని దగ్గర కొచ్చి పాదాలు నాకడం మొదలెట్టింది.
"నువ్వు అంతకంటే బాగా చెయ్యగలవా?"
"తప్పకుండా! ఆ సింహాన్ని పక్కకి రమ్మనండి" అన్నాడట ఆ అబ్బాయి" అని చెప్పి తనొక్కడే పగలబడి నవ్వాడు ప్రొఫెసరు.
పళ్ళు పటా పటా కొరికాడు ఇబూకా తన తండ్రి వయస్సు ఉన్న ఆ ప్రొఫెసరు అలా మాట్లాడుతూ ఉంటే, వికారమూ, దిగులూ రెండూ కలిగాయి అనూహ్యకి. తక్షణం సాగర్ ని చూడాలనిపించింది. అతను త్వరగా తిరిగి వచ్చేస్తే బాగుండుననిపించింది.
మళ్ళీ వినబడింది సింహగర్జన.
"సింహమే! అనుమానం లేదు" అన్నాడు ఇబూకా, దిక్కులు చూస్తూ.
"సింహాలు ఈ అండమాన్ అడవుల్లో ఉండవు" అన్నాడు ప్రొఫెసర్, అన్నాడు గానీ అతని గొంతులో ఇందాకటి స్థిరత్వం లేదు.
"మీరెళ్ళి ఓసారి చూసోస్తే డౌటు తీరిపోతుందిగా!" అన్నాడు ఫకర్ అమాయకంగా మొహం పెట్టి.
"నేను నేనెందుకులే నువ్వెళ్ళి రారాదూ!" అన్నాడు ప్రొఫెసరు, భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ.
వద్దనుకున్నా నవ్వొచ్చింది అనూహ్యకి. అది కనబడకుండా మొహం పక్కకి తిప్పుకుంది.
ప్రొఫెసరు ఆమెవైపు రోషంగా చూసి లేచి నిలబడ్డాడు. "సరే పద! నువ్వు కూడా తగలడు! వెళ్ళి చూసివద్దాం!" అన్నాడు ఫకర్ తో మంటగా.
"నేను రెడీ" అంటూ బయల్దేరాడు ఫకర్. వాళ్ళ వెనకే ఉరాంగ్ ఉతాన్ పడుతూ లేస్తూ పరిగెత్తింది.
సింహం గాండ్రింపులు వినబడుతూనే ఉన్నాయి, వాళ్ళకి అతి సమీపంలోనే.
కానీ, సింహంలా అరుస్తున్నది, తన పక్కనే నడుస్తున్న ఫకరే అని ప్రొఫెసర్ కనిపెట్టలేకపోయాడు.
ఫకర్ కి వెంట్రిక్విజమ్ వచ్చు. అంటే, పెదిమలు కదల్చుకుండా, గొంతులోని కండరాలతోనే శబ్దాలు చేస్తూ , మాట్లాడే టెక్నిక్కు.
అది బాగా ప్రాక్టీసు చేసినవాళ్ళు , ఆ శబ్దాలు దూరంనుంచి వస్తునట్లుగా కూడా భ్రమ కలిగించగలరు.
అయితే తను ప్రొఫెసర్ మీద ప్రయోగించిన ఆ చిన్న ప్రాక్టికల్ జోకు అనూహ్య ప్రాణాల మీదకు తెస్తుందని గ్రహించలేకపోయాడు ఫకర్.
* * *
తోడేళ్ళలా ప్రవర్తిస్తున్న ఆ అమ్మాయీ, అబ్బాయీ తన వళ్ళంతా ఆప్యాయంగా నాకేస్తుంటే, మహదానందం అనుభవిస్తూ ఉండి పోయింది స్వరూపరాణి. ఆమెకి ఇంకా మిగతా ప్రపంచమేమీ గుర్తురాలేదు అప్పుడు.
పెద్ద తోడేళ్ళు రెండూ ఆహారాన్ని వేటాడి తేవడానికి వెళ్ళాయి. సాధారణంగా అయితే మందలోని అన్ని తోడేళ్ళూ వేటకి వెళ్ళవు. కొన్ని తోడేళ్ళు పిల్లలని కనిపెట్టి చూడడానికి మందని రక్షించుకావడానికీ వెనక ఉండిపోతే కొన్ని తోడేళ్ళు ఆహారాన్ని వెతుక్కుంటూ పోతాయి.
తమ పిల్లల్లాగే పెరిగిన అమ్మాయీ అబ్బాయీ అక్కడ ఉన్నారు గనక, పెద్ద తోడేళ్ళు రెండూ పిల్లలని వదిలేసి నిర్భయంగా వేటకి వెళ్ళాయి.
త్వరలోనే ఒక చిన్న సైజు దుప్పి దొరికింది వాటికి. దాని వెనక ఉరుకుతూ దాని వెనక కాళ్ళ పైభాగాన్ని పదే పదే కొరికి చీల్చాయి. దుప్పి నెల కొరిగింది. అది ఇంకా కోన ప్రాణాలతో ఉండగానే పెద్ద పెద్ద మాంసఖండాలు పీకి గబ గబ తినడం మొదలెట్టాయి తోడేళ్ళు.
సింహం, పులీ లాంటి పెద్ద జంతువులు ఆహారాన్ని వేటాడి చంపిన తర్వాత, దాన్ని నోటితో పట్టుకుని ఈడ్చుకుంటూ తమకు అనుకూలమైన ప్రదేశానికి తీసుకెళ్ళి, వీలును బట్టి ఒకటి రెండు రోజుల పాటు నింపాదిగా తింటాయి.
తోడేళ్ళు అలా కాదు.
అవి తమ ఆహారాన్ని అక్కడికక్కడే సాధ్యమైనంత ఎక్కువగా తినేసి, తమ మంద దగ్గరికి తిరిగి వచ్చేస్తాయి. కడుపులో అప్పటికే సగం జీర్ణమై ఉన్న ఆహారాన్ని మంద ముందు కక్కేస్తాయి. దాన్ని తింటాయి తక్కిన తోడేళ్ళు వాటి అలవాటు అది.
పెద్ద తోడేళ్ళు తిరిగి రావడం చూసిన తోడేలు పిల్లలు సంతోషంగా అరుస్తూ. దగ్గరకు పరుగెత్తు కెళ్ళాయి.
ఆ అమ్మాయీ అబ్బాయీ కూడా తలలు ఎత్తి చూశారు.
తోడేళ్ళు ఆహారాన్ని కక్కేశాయి. పిల్లలు తినడం మొదలెట్టాయి.
అది చూస్తుంటే, కడుపులో దేవినట్లయింది స్వరూపకి.
ఆ అమ్మాయీ, అబ్బాయీ ఆ ఆహారాన్ని తినడానికి పోతూ, స్వరూపని కూడా రామ్మన్నట్లు నోటితో ఆమె చేతులని మెల్లగా కిందికి పట్టి లాగుతూ సూచించారు.