Previous Page Next Page 
వేగు చుక్క పేజి 24


    "హుర్రే హౌ ఆర్ యూ మైడియర్ కేప్టెన్! హలో యంగ్ మిస్! ఓరి ఓరి ఫకర్, ఇబూకా కూడా ఇక్కడే వున్నారే. ఆ మూల ముసలమ్మలా ముడుచుకు కూర్చున్నదెవరు?"

    మూల కూర్చుని వున్న ఉరాంగ్ ఉటాన్ ఒక్క ఉదుటున లేచి నిల్చుంది.

    హడలిపోయి సాగర్ పక్కన చేరాడు ప్రొఫెసర్ మెడ తడుముకుంటూ. తర్వాత అతని దృష్టి చాంగ్ మీద పడింది.

    ఏమయింది ఈ చాంగ్ కి?"

    వివరంగా అంతా చెప్పాడు సాగర్.

     మెల్లిగా మసక చీకటి ఆవరించుకుంటోంది.

    విజయమో, వీర స్వర్గమో అన్నట్లు తల పడుతున్నాము ఏనుగుల రెండూ.

    చంద్రుడు పైకి వచ్చాడు.

    చెట్ల ఆకులన్నీ వెండిపూత పూసినట్టు మెరుస్తున్నాయి.

    గుహ బయటికి వచ్చి ఆ ఏనుగులను చూస్తూ నిలబడ్డాడు సాగర్. వాటి పోరాటం ఇప్పుడప్పుడే పూర్తికాదనీ, ఒక్కోసారి వారం రోజుల తరబడి కూడా అని అలా తలపడుతూనే ఉంటాయని తెలుసుసాగర్ కి.

    నెమ్మదిగా వచ్చి, అతని పక్కన నిలబడింది అనూహ్య.

    "మీకు అసలు భయమనేది లేదా?"

    నవ్వి  ఊరుకున్నాడు సాగర్.

    "మీకు కోపమంతే తెలియదా?"

    మళ్ళీ నవ్వాడు.

    "ఇలా యోగిలా ఎలా వుండగలరు మీరు? మామూలు మనుషుల్లో వుండే మనో వికారాల ఏవీ మీలో వుండవా?"

    "నేనూ మామూలు మనిషినే"

    "అంటే మీలో గర్వం కూడా లేదన్నమాట. సాగర్ ఒక ఆడపిల్ల. ఇలాంటి పరిస్థితుల్లో . ఈ మాత్రం చనువు ఇచ్చిందంటే మరో మొగాడైతే ఎలా ప్రవర్తించి వుండేవాడో తెలుసునా?"

    "ఎలా ప్రవర్తించి వుండేవాడు?"

    "అచ్చం సగటు మొగాడిలా!"

    "అయితే నేను మొగాడిని కానా?"

    "కాదు మీరు మొనగాడు."

    "నవ్వాడు సాగర్.

    అతనికి మరింత దగ్గరగా జరిగింది అనూహ్య. తల ఎత్తి ఆమె మొహంలోకి చూశాడు. నును సిగ్గుతో, అస్పష్టంగా కనబడుతోంది. ఆమె మొహంలో ఆహ్వానం, తనకి మరింత చేరువకమ్మంటూ తనతో సాన్నిహిత్యనికి స్వాగతం పలుకుతూ ద్వారాలు  ద్వారాలు తెరిచినట్లు కొద్దిగా తెరచుకొని వున్నాయి ఆమె లేత పెదవులు. వాటికి  కట్టిన మల్లెపూల  తోరణంలా  ఉంది  తెల్లటి ఆమె పలువరస.

     సందేహిస్తూ  తలని అతికొద్దిగా వంచాడు సాగర్. ఆమె మునికాళ్ళు ఎత్తి నిలబడింది.

    అదేకంగా  ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకొంటూన్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మొహాలు  నెమ్మదిగా దగ్గరవుతున్నాయి.

    మృదువుగా ఆమె పెదవులను స్పర్శించి మళ్ళీ వెనక్కి వెళ్ళి పోయాయి సాగర్ పెదిమలు.

    మరుక్షణంలో మళ్ళీ నాలుగు పెదవులూ కలుసుకున్నాయి. ఊపిరందనంత గాఢంగా ఉంది చుంబనం.

    కిచకిచమని శబ్దం వినబడింది. చప్పట్లు కొడుతూ ఎగురుతోంది ఉరాంగ్ ఉటాన్.

    ఇంకెవరో కూడా చప్పట్లు  కొట్టారు. ఉలిక్కిపడి తిరిగి చూశారు అనూహ్య సాగర్.

    ప్రొఫెసర్ ఆనందరావు కులాసాగా నిలబడి ఉన్నాడు. "వెల్ వెల్ వెల్ వెల్! మీ ఇద్దరికీమధ్య రొమాంటిక్  యాంగిల్ కూడా ఉందని నాకింత వరకూ తెలీదే, ఐ గెస్ దట్ దిసీజ్  యువర్ ఫస్టు కీస్! అవునా ముద్దులో మొదటి ముద్దు, సిగరెట్ పీల్చేటప్పుడు చివరి పీల్పూ బహు రుచుకరమని చెబుతారు వెల్ వెల్."

    అనూహ్య మొహం ఎర్రబడి పోయింది. "ఇతనికి బొత్తిగా సమయం, సందర్భం తెలియనట్లుంది" అంది చిరాగ్గా సాగర్ చెవి దగ్గర.

    సాగర్ కొంచెం దూరంగా జరిగాడు. "హలో ప్రొఫెసర్ ఏమిటి మీరు కూడా బయటికి వచ్చారు? వాకింగా?"

    కానీ ప్రొఫెసర్ తన పాత పాట ఇంకా మానలేదు.

    "ముద్దు అనగానే వద్దనుకున్నా ఒక జోక్ గుర్తొస్తోంది చెప్పనా?" అని, వాళ్ళు వద్దు అనే లోగానే చెప్పడం మొదలెట్టాడు.

    "ఒకసారేమయిందో తెలుసా? జవహర్ లాల్ నెహ్రూ ఒక  పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. "నేను నా జీవితంలో నా భార్యని కాక మరో స్త్రీని కూడా ముద్దు పెట్టుకున్నాను."

    అందరూ బిత్తరపోయి చూశారు, పండిట్ జీ ఇలాంటి పని చేస్తాడా అని.

    అందరూ విరగబడి నవ్వారు.

    "మీటింగులో ఉన్న ఒకానొక రామలింగం ఇది విని, "అద్భుతంగా ఉంది ఈ జోకు " అని నోట్ చేసుకుని, తర్వాత తన ఫ్రెండ్స్ కి చెప్పడం మొదలెట్టాడు.

    "నేను నా జీవితంలో నా భార్యని కాక మరో స్త్రీని కూడా ముద్దు పెట్టుకున్నాను.

    "నువ్వా ? ఎవర్ని?" అన్నారు ఫ్రెండ్సు ఆశ్చర్యంగా.

    "నెహ్రూ వాళ్ళ అమ్మని" అన్నాడు రామలింగం. అని పెద్దగా నవ్వాడు ప్రొఫెసర్ ఆనందరావు, "నేను చాలా విట్టీగా మాట్లాడతాను కదూ?"

    "పదండి లోపలికి పోదాం!" అంది కోపంగా.

    ఆయన ఒకసారి మాట్లాడే మూడ్ లోకి వచ్చాడంటే ఇంక నోరు మూతబడదు.

    "అవునయ్యా! నిజమే! నేను చాలా విట్టీగా మాట్లాడతాను. నా మాటలు వినడానికి కాలేజీలో ఆడపిల్లలు వెంటపడేవాళ్ళు. నా మాటలకు మురిసిపోయే ఒకమ్మాయి తన మెళ్ళో తాళి కట్టేదాకా తాళలేక పోయింది."

    ఇంక సహించలేక పోయాడు ఇబూకా ప్రొఫెసర్ గారూ మరి మీ భార్య మిమ్మల్ని వదిలేసిందని విన్నాను. ఎందుకు...."

    "ఈయన మాటలు చూసి మురిసిపోయి చేసుకుని వుంటుంది. పెళ్లయ్యక ఉత్త మాటలే తప్ప ఇంకేమీ లేదని గ్రహించి, వదిలేసి వుంటుంది" అన్నాడు ఫకర్ జనాంతికంగా.

    గాలి తీసిన బెలూన్లా అయిపోయి, చప్పున నోరు మూసేసుకుని కొరకొరా చూడటం మొదలెట్టాడు ప్రొఫెసర్.

    తర్వాత ఉన్నది తలా కాస్తా తిని, తలో మూలా కూర్చుని జోగడం మొదలెట్టారు.

   
                                                                      *    *    *


    తెల్లవారింది.

    మెలకువ వచ్చింది సాగర్ కి. శ్రద్దగా విన్నాడు గల ఏనుగుల ఘీంకారాలు వినబడటం లేదు.

    లేచి గుహ బయటికి వెళ్ళి చూశాడు. అతని ఊహ కరెక్టే అయింది. ఎర్రటి పువ్వులా విచ్చుకున్న కుంభస్థలంతో, రక్తసిక్తమైన శరీరంతో చనిపోయి వుంది మదపు టేనుగు. కుర్ర ఏనుగు దాన్ని చంపి, తన అడంగులతో కలిసి వెళ్ళిపోయిందన్నమాట.

    అతను గుహకి తిరిగి వచ్చేసరికి చాంగ్ కి  మెలకువ వచ్చింది.

    ఫకర్ ఉపయోగించిన  మూలికలు అమోఘంగా పని చేశాయి. దానికి తోడు, అతి దృఢమైన శరీరం చాంగ్ ది. అందుకనే గాయాలు సెప్టిక్ అయి చావకుండా బతికి బయటపడ్డాడు.

    "హలో చాంగ్" అన్నాడు సాగర్ సంతోషంగా.

    బదులు చెప్పే ఓపికకూడా లేక ఊరికే తల ఆడించాడు చాంగ్.

    అతన్ని పరీక్షగా చూశాడు సాగర్.

    అతనికి గాయాలు సెప్టిక్ కాకపోయినా, అవి తగ్గేసరికి కొద్ది రోజులు పట్టవచ్చు.

    ఆ సంగతి చాంగ్ కూడా గ్రహించాడు. తాను తాత్కాలికంగా సాగర్ తో రాజీపడక తప్పదని అర్ధమైంది అతనికి.

    రంగరాజు దాచిన నిధి రహస్యం తెలిసిన మనిషి తనొక్కడే. కానీ దాన్ని తవ్వి తియ్యాలంటే తన ఒక్కడివలన అయ్యే పని కాదు. పైగా తన అనుచరులందరూ ఏమయిపోయారో అసలు మళ్ళీ తనకు కానబడతారో, కనబడరో కూడా త్లియాడు. అదీకాక, తనకు దొరికిన రాగి రేకుమీద తెలుగులో రాసి ఉంది తను చదవలేడు. అందుకని తాత్కాలికంగానే వీడితో రాజీ పడతాడు తను.

     నిధిని తవ్వి  తీశాక, వీడినీ వీడి ఫ్రెండ్స్ అందరినీ సజీవంగా దానిలో పూడ్చి పెట్టేస్తాడు.

    అది తప్పదు.

    "నీతో మాట్లాడాలి" అన్నాడు సాగర్ తో అతి కష్టం మీద.

    అతని పక్కనే కూర్చున్నాడు సాగర్.

    "నా బెల్టు విప్పు" అన్నాడు చాంగ్.

    చాంగ్  నడుముచుట్టూ బ్రహ్మాండమైన పటకాలా ఉన్న బెల్టు లాగాడు సాగర్.

    అందులో పర్సులాగా ఉంది ఒకచోట.

    "దానిలో ఉంది రాగిరేకు తియ్యి" అన్నాడు చాంగ్.

    తీశాడు సాగర్. అక్షరాలూ అస్పష్టంగా కనబడుతున్నాయి.

    "చదువు."

    అతి కష్టంమీద, కూడాబలుక్కుంటూ చదివాడు సాగర్.

    అందరూ చెవులప్పగించి వింటున్నారు.

    "ఐరావతం కుంభస్థలం మీద పెన్నిధి" అని ఉంది.

    అంతే మరే వివరాలు లేవు.

    అందరినీ ఒక్కసారిగా నిరాశ ఆవహించింది.

    ఇన్ని ద్వీపాలలో ఏ ద్వీపంలో అని వెదుకుతారు?

    "కేప్టెన్! నిధిని కనుక్కొ. నీది తెలివైన బుర్ర అని నాకు తెలుసు! నిధిని కనుక్కొ గలిగితే అందరూ సమానంగా పంచుకుందాం" అన్నాడు చాంగ్.

    పెదవి కొరుకుతూ ఆలోచనలో పెడ్డాడు సాగర్"

    "ఐరావతం కుంభస్థలంమీద పెన్నిధి."

    సందేహంలేదు ఇది ఏదో కోడ్ అయి ఉంటుంది.

    కానీ, ఆ కోడ్ ని విడగొట్టడం ఎలా?

    ఐరావతం......అంటే తెల్లటి ఏనుగు.....దాని కుంభస్థలం మీద పెన్నిధి!

    ఉన్నట్లుండి ఒక వంద ఏనుగులు ఒక్కసారి ఘీంకరించిన శబ్దం వినబడింది.

    తర్వాత భారంగా పడుతున్న అడుగుల శబ్దం.

    ఏనుగుల మంద ఒకటి వచ్చి తొండాలు ఎత్తి చెవులు చిల్లులుపడేలా ఘీంకరిస్తూ చనిపోయిన మదపుటేనుగుని సమీపించాయి.

    అందరూ లేచి నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నారు.

    అప్పుడొక విచిత్రం జరిగింది.

    ఆ ఏనుగులన్నీ కలిసి చనిపోయిన ఏనుగుని నెట్టుకుంటూ, తోసుకుంటూ ఎక్కడికో తీసుకెళుతున్నాయి.

    ఎక్కడికి?

    అప్రయత్నంగా వాటి వెంట నడవడం మొదలెట్టాడు సాగర్.

    అతన్ని వారించబోయింది అనూహ్య. కానీ అతను ఆగలేదు.

    చాలాసేపటి తర్వాత ఒక లోయలోకి దిగడం మొదలెట్టాయి ఏనుగులన్నీ.

 Previous Page Next Page