దాంతో....
అసలు ఇదెందుకు వచ్చిందో తెలియకపోయిన ఇహపై పురుష పున్గావులకి ఇది తప్పని సరి తద్దినం అని తెలిసిపోయింది.
భూలోకంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కో కథ మొదలైంది.
ఆ కథలు ఏమనగా....!
* * * *
ఆ ఇంట్లో...
భోజనాలు కాంగానే అందరూ టి.వి. ముందు చేరారు.
టి వి లో మరికొద్ది సేపటిలో "మారు, తారు" తెలుగు నాటకం హైదరాబాద్ దూరదర్సిన్ వారు. తెలుగు కార్యక్రమాలలో చూపించబోతున్నారు.
తారుమారు అనే పేరుని "మారు, తారు" పేరుతో ప్రఖ్యాత రచయిత శిఖండిరావు రాసిన నాటకం మరికొద్ది సేపటిలో ప్రసారం కాబోతుంది అనగా....ముందుగానే అందరు వ్యాపారాస్తులు కూడబలుక్కున్నట్లు టివి మీద పడ్డారు.
టివి తెరమీద ఎత్తుపళ్ళు కాస్త మెల్ల వున్న సుందర సుకుమారి ప్రత్యక్షం అయింది. ఎత్తు పళ్ళువల్ల నవ్వకపోయినా నవ్వినట్లే వుంటుంది సుందరి సుకుమారి ముఖం. అయినా చేసే ఉద్యోగానికి న్యాయం చేయాలి కాబట్టి ముందుగ ముప్పై రెండు పళ్ళు బయట పెట్టినవ్వుతూ నమస్కారం చేసింది.
"ఆ అమ్మాయి ఎందుకు నాన్నా అలా పళ్ళన్నీ కనపడేలా నవ్వుతుంది?" తండ్రి రంగబాబుని అడిగింది చిన్నారి.
"ఎన్ని పళ్ళు వున్నాయో లెక్కబెట్టమని సరేనా!" విసుక్కుంటూ జవాబు యిచ్చాడు రంగబాబు.
"ఎందుకలా వినుక్కుంటారు? మొగబుద్ది పోనిచ్చుకున్నారుకాదు. నా పిల్లని విసుక్కోకండి కావాలంటే మీ పుత్రరత్నాన్ని విసుక్కోండి కసురుకోండి." అంది మాణిక్యాంబ.
"అమ్మా! టి.వి. లో ఆ అమ్మాయి నావేపు చూసి మాట్లాడుతున్న దేవ్!" రాజ్ బాబు ఆనందంగ అన్నాడు.
"కాదు నావేపు చూసి మాట్లాడింది." చిన్నారి అంది.
"మీ ఇద్దరి వేపు చూసి కాదు నావేపు చూసి మాట్లాడింది. సరేనా ఇంకా నోరు మూసుకుంటారా?" పిల్లలని కసిరాడు రంగబాబు.
"మీ వేపు చూసి మాట్లాడినట్లు నాకూ అనుమానం వచ్చింది. మీకు ఆపిల్ల తెలుసా! ఆ పిల్లకి మీరు తెలుసా?" అనుమానంతో భర్తని గుచ్చి చూస్తూ అడిగింది మాణిక్యాంబ.
"నీ అనుమానం తగలడ. అది టి.వి. అసుందరికి మెల్లకన్ను. అస్తమానం నన్ను అనుమానించటం తప్ప నీకు మరొ పనిలేదు. నా శీలాన్ని మరోసారి శంకించావంటే చీమలమందు తాగిచస్తాను." అన్నాడు రంగబాబు.
తన పొరపాటుకి నాలుక కొరుక్కుంది మాణిక్యాంబ కిందపడ్డా పై చెయ్యి తనదే అనే రకం కాబట్టి "చాల్లేండి సరసం (ఇది సరసమా!) నేనేదో తమాషాగా జోకేశాను. అది టి.వి అని నాకు తెలుసులెండి అది సరే ఈమధ్య మీరేంటి మాటకు ముందు చీమల మందుతాగి చస్తానని బెదిరిస్తున్నారు. ఆఖరికి ఈ దేశంలో చీమల మందుకూడా కల్తీయే చీమలు మునిగేలా చీమల మందు జల్లినా వక్కచీమ చావటంలేదు." అంది చేతులుగాలిలో తిప్పుతు.
ఎనౌన్సర్ నోరు తెరవటంతో అందరూ నోరు మూసుకున్నారు.
"కొద్దిక్షణాలలో శ్రీశిఖండిరావు గారి "తారుమారు "క్షమించాలి" మారు తారు. "సీరియల్ నాటకం ప్రసారం కాబోతున్నది. అని చెప్పి "ఈ నాటకం చూడండి మీరోగం కుదురుతుంది పరమ వీరచెత్త నాటకం ప్రసారం చేస్తున్నాముగ..." అన్నట్లు ఎటో చూసి నవ్వుకుంటు టి.వి తెరమీంచి మాయం అయింది.
టి.వి వాళ్ళు కొద్ది క్షణాలు అంటే కొద్ది నిమిషాలు అనగ పదిహేను, ఇరవై నిమిషాలు అని అర్ధం. ఇది తెలిసికూడా కళ్ళప్పగించి టి.వి. తెరవేపు కల్లార్పకుండ చూస్తుంటారు చాలామంది.
మనుషుల్లోని ఈ బలహీనత తెలిసిన వ్యాపార ప్రకటన దారులు టి.వి.లో ఈగల్లా వచ్చి వాలి దోమల్లా సంగీతం వినిపించి వెళ్ళిపోతుంటారు.
టి.వి.లో ప్రకటనలు మొదలైనాయి.
ఓ పిల్ల సుబ్బుని పిసికి మట్టితో బొమ్మలని చేసినట్లు మెత్తపడ్డ ఆ సబ్బుతో బొమ్మలుచేసి ఆడుకుంటున్నది. అక్కచెల్లి ప్రత్యక్షం అయ్యారు.
"అక్కా! ఎన్ని రకాల స్నానపు సబ్బులోకొని చూశాను. అన్నీ నీళ్ళు తాకగానే మట్టి ముద్దల్లా కావడమే అమ్మాయి ఆడుకోటానికి తప్ప వళ్ళు రుద్దుకోటానికి సరి అయిన సబ్బు వకటిలేదు. అబ్బబ్బా ఎలా చావను?" చెల్లెలు నుదుటిమీద చేతితో కొట్టుకుని వాపోయింది.
"కంగారు పడకే చెల్లీ! ఇదిగో ఇప్పుడు వచ్చిందిగా కొత్త సబ్బు. పేరేమో గుండ్రాయ్. ఎంత వాడినా తరగదు. నీళ్ళల్లో నానబెట్టినా తరగదు." అంటూ గుండ్రాయిలాగా వున్న సబ్బుని అక్క చూపిస్తుంటే అది చూసి అవాక్కయిన చెల్లెలు "నిజంగా!" అంటుంది. అక్కడికేదో అక్క అబద్దాల కోరు అయినట్లు.
"చూస్తావుగా?" అంటుంది అక్క తమాషాగ భుజాలు ఎగరవేసి ఓ వెర్రినవ్వు నవ్వి_
ఆ తర్వాత ఆ చెల్లి గుండ్రాయ్ సబ్బుని చేతిలోకి తీసుకుని నీళ్ళలో నానబెట్టి చూసింది. గోడకేసి కొట్టి చూసింది. గోడ పగిలింది గాని సబ్బుకేమీ కాలేదు. అంతే చెల్లెలు చింకిచాటంత ముఖంచేసుకుని "నేనెప్పుడూ గుండ్రాయ్ నే వాడుతాను. మా అక్క చెప్పింది" అంది. అక్క వెంటనే వంతపాడగ "నాకు తెలుసు నీవలా అంటావని..." అంది పెద్ద జోస్యం చెప్పేదానిలా వెంటనే ఆ పిల్ల ఆకారంలో మొద్దురాచ్చిప్పలావున్నా ముద్దు ముద్దుగ "నేను గుండ్రాయ్ తో ఇంక బొమ్మలు చెయ్యను వల్లురుద్దుకుంటాను. మలే" అంటుంది. అక్కచెల్లి నవ్వుకుంటారు.
గుండ్రాయ్ సబ్బు ప్రకటన వాళ్ళు తెరమీద మాయం కావటం చూసి వెంటనే తెర ఎక్కారు చుక్ చుక్ చాక్లెట్ల వాళ్ళు.
మొదటి ప్రకటన అద్దాన్నంగ ఉంటే రెండో ప్రకటన అంతకన్నా పరమ అద్దాన్నంగ ఉంది. ఇంట్లో నలుగురు ఫామిలీ మెంబర్స్ ఉంటారు. రివాల్వర్ పట్టుకుని ఓ దొంగ ఇంట్లో దూరతాడు. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ముగ్గురు ఆ దొంగని చూసి భయపడి నగలు డబ్బు వాడి కాళ్ళ ముందు గుమ్మరిస్తారు. కాని వాళ్ళ ఆరేళ్ళ అబ్బాయి గుప్పెడు తెరచి ఒక చాక్లెట్ ని దొంగచేతిలో పెడతాడు 'చుక్చుక్' అంటాడు. ఆ చాక్లెట్ ని చూడంగానే దొంగగారి మొహంవికశిస్తుంది.
చాక్లెట్ నోట్లో వేసుకుని చప్పరించి చేతిలో ఉన్న రివాల్వర్ తో అందర్ని దడదడ కాల్చి టక్కున అక్కడ్నించి మాయమౌతాడు. ఇంకా రివాల్వర్ లోంచి వచ్చింది "చుక్ చుక్ చాక్లెట్లు ఎక్కడఉంటాయో అక్కడే మీకు రక్షణ ఉంటుంది." అంటు ఒక కీచుకంఠం వెనకనించి పాట అందుకుంది...