"అది సరే..."
"కథలు చెపుతారని, మోసగాళ్ళు వుంటారని, కొత్తవాళ్ళతో జాగ్రత్తగా వుండాలని మీరెప్పుడూ చెపుతుంటారు. అది వేదపాఠంలా నా మనసుకి హత్తుకుని వుంది! ఈ అమ్మాయి విషయం అలా కాదు. ఈ ఒక్కసారికి నా మాట వినండి, మీకు నచ్చకపోతే ఆ తర్వాత చూద్దాం_పాపం ఒళ్ళు తెలియని జ్వరంతో ..."
"చాలు పార్వతీ!" అన్నాడు శంకరరావు.
"చాలండీ చాలు. ఇన్నాళ్లు మీతో కాపురం చేసినదాన్ని, మీ సహధర్మచారిణ్ని, మీ శరీరంలో అర్ధభాగాన్ని! చాలు పార్వతీ అన్న ఒక్కమాటలో మీ ఆమోదం... నన్ను అర్ధంచేసుకోవటం...అన్నీ తెలిశాయండి" తేలికపడ్డ మనసుతో అంది పార్వతమ్మ.
శంకర్రావు మాట్లాడలేదు! సామాను ఒక పక్కగపెడుతూ వుండిపోయాడు. మనసులో మాత్రం "నువ్వుత్త పిచ్చితల్లివి పార్వతీ! ఈ కష్టం నీలాంటిదానికి కాదు రావాల్సింది. పూర్వజన్మలో నేను చేసిన పాపం నిన్ను చుట్టుకొని వుంటుంది" అనుకున్నాడు.
ట్రైను ఆగంగానే లైసెన్స్ కూలీని కేకేశాడు శంకర్రావు!
"అమ్మాయీ! అమ్మాయీ!" అంటూ పద్మిని ప్రియదర్శినిని తట్టిలేపింది పార్వతమ్మ.
ఒళ్లెరగని జ్వరంతో వున్న పద్మిని మూలిగింది గాని పలకలేదు.
పద్మిని వంటిమీద చేయివేసి గట్టిగా కుదుపుతూ ఈ తఫా లేపింది పార్వతమ్మ. "ఒళ్ళు పెనంలా కాలిపోతున్నది. నూటనాలుగో నూట అయిదో జ్వరం వుండి వుంటుంది" అనుకుంది.
బలవంతాన కళ్ళు విప్పి చూసింది పద్మిని. నిప్పుకణికల్లా ఎర్రగా వున్నాయి కళ్ళు. "ఏమిటి?" అన్నట్లు చూసింది.
"విజయవాడ వచ్చింది" పార్వతమ్మ చెప్పింది.
అర్ధంకాలేదు పద్మినికి "ఆ..." అంది.
"విజయవాడ వచ్చింది నువ్వు దిగాల్సింది యిక్కడే కదా!"
పద్మిని ప్రియదర్శినికి అర్ధమయింది. ఇక్కడ దిగి ఏం చెయ్యాలి? అదేమీ అర్ధం కాలేదు. డీప్ గ ఆలోచించే శక్తి లేకపోయింది ట్రయిన్ ఆగింది విజయవాడ వచ్చింది కాబట్టి దిగాలి. బండి దిగి వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటే సరి...
పద్మిని పట్టు బలవంతాన పైకి లేచింది. నిలదొక్కుకోలేక పడిపోబోయింది. టక్కున రెక్క పట్టేసుకుంది పార్వతమ్మ. "నేను పట్టుకుంటాను దిగుదువుగాని" అంది.
కనురెప్పలు నెమ్మదిగ పైకెత్తి కృతజ్ఞతాపూర్వకముగా చూసింది పద్మిని. "మీకు అనవసరంగా శ్రమ కలిగిస్తున్నాను... మీ రుణం తీర్చుకోలేను..." లాంటి మాటలు అనే ఓపిక ఆ సమయంలో పద్మినికి లేకపోయింది. జ్వరం శరీరాన్ని నీరస పరిస్తే చలి మంచులో కప్పెట్టినంత ఘోరముగా వుంది. మొన్నటినుంచి కడుపులోకి ఏ ఆహారము వెళ్ళలేదు. కాసిని కాసిని కాఫీ నీళ్ళు తప్ప.
పార్వతమ్మ రెక్క పుచ్చుకుంటే పద్మిని ట్రయిన్ దిగింది.
పద్మినీని అలాగే పట్టుకుని పార్వతమ్మ స్టేషను బయటదాకా వచ్చింది.
శంకర్రావు లైసెన్స్ కూలీ సామానులు తెస్తూంటే పక్కనే వచ్చాడు.
శంకర్రావు ఆటో మాట్లాడుతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది పద్మినీకి.
"తను స్టేషన్ లోనే వుండిపోదామనుకుంది. కానీ తెలీకుండానే బయటికొచ్చేసింది. వెళ్ళి ఏదయినా హోటల్ లో దిగి రూమ్ తీసుకుంటే రెస్ట్ గాను వుంటుంది. కాని తన దగ్గర హోటల్ రూమ్ తీసుకునేంతగా డబ్బు లేదు. నడిరోడ్డుమీద నిలబడలేదు. కనీసం నడవలేదు. ఈ పరిస్థితిలో..." పద్మిని కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయ్.
శంకర్రావు ఆటో మాట్లాడమూ అయింది, ఆటోలో సామానులు పెట్టడమూ అయింది. శంకర్రావు ఆటోలో కూర్చుని "ఎక్కండి" అన్నాడు.
పద్మిని ప్రియదర్శిని శక్తినంతా కూడదీసుకొని "ఇంక నేనుంటానండి సెలవ్ నమస్కారం" నోటికొచ్చింది అనేసింది.
"నువ్వు మాతో వస్తున్నావమ్మాయ్!" పార్వతమ్మ చెప్పింది.
"నేను! మీతో ..." పద్మినీకి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
"వస్తున్నావ్ అంతే. నా మాటకి తిరుగులేదు నాపేరు ఉత్తపార్వతమ్మ కాదని అప్పుడప్పుడు పరాశక్తి అవతారం ఎత్తుతుంటానని అప్పుడప్పుడు మా వారు అంటుంటారు. ఇప్పుడు నాచేత ఏ అవతారమూ ఎత్తించకు. ఊ...పద" అంటూ మారుమాట్లాడటానికి ఆస్కారం యివ్వకుండా పద్మిని రెక్కపుచ్చుకొని ఆటో దగ్గరికి నడిచింది పార్వతమ్మ.
పద్మిని ప్రియదర్శినికి మాటలాడే ఓపికలేదు. నిరోధించే శక్తి అసలే లేదు. తన ప్రయత్నం లేకుండానే వెళ్ళి పార్వతమ్మ ప్రక్కనే ఆటోలో కూర్చుండిపోయింది.
"ఇంక పోనియ్ నాయనా!" అంది పార్వతమ్మ.
ఆటో బయల్దేరింది.
13
ఆ ఇంట్లో
నాలుగుగదులు, పెద్ద వరండా వున్నాయి. రెండు గదులు శంకర్రావు, పార్వతమ్మ వుంచుకొని తోడు కోసం రెండు గదులు అద్దెకిచ్చారు.
అది శంకర్రావు సొంత ఇల్లు!
శంకర్రావింటికి చుట్టూతా పొట్టిగ చిన్న కాంపౌండ్ వాల్ వుంది. ఆ యింటికి నలువేపులా వీళ్ళింటికి అనుకోని యిళ్ళున్నాయ్. పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ లేనందువల్ల ఒకళ్ళకొకళ్ళు అందరూ కనబడుతూనే వుంటారు.
పద్మిని ప్రియదర్శిని ఆ ఇంటికొచ్చి వారంరోజులయింది. ఈ వారంలో వరసపెట్టి నాలుగురోజులు జ్వరముతో సరిపోయింది.
శంకర్రావు డాక్టరుని తీసుకొచ్చి చూపించాడు.
ఇది "ఫ్లూ జ్వర"మని నిర్ణయించి డాక్టరుగారు మందులు, ఇంజెక్షనులూ ఇవ్వటంవల్ల నాలుగురోజులలోనే జ్వరం తగ్గింది పద్మినికి. కాని నీరసం మాత్రం వదల్లేదు. క్రితంరోజే పార్వతమ్మ పత్యం పెట్టింది. "పత్యం తిన్న తరువాత జ్వరం రాలేదు కాబట్టి ఇంక జ్వరం రానట్టే" అంది పార్వతమ్మ.
పద్మిని ప్రియదర్శిని అంత జ్వరంలో కూడా ఆ వృద్ధదంపతులు తనకు చేస్తున్న సేవ, తనపట్ల చూపిస్తున్న ఆప్యాయత, అనురాగం, శ్రద్ధ అన్నీ తెలివి వచ్చినప్పుడల్లా గమనిస్తూనే వుంది.
పద్మిని జ్వరంలో వున్నప్పుడు ఇంటికి వచ్చిన ఆ రాత్రే పార్వతమ్మ తన భర్తతో పద్మిని చెప్పిన కథంతా చెప్పింది. చెప్పి "ఆ అమ్మాయి చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారా?" భర్తని అడిగింది.
శంకర్రావు పార్వతమ్మలాగ భోళామనిషి కాదు. అలాఅని చెడ్డవాడూ కాదు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలని చవిచూసిన అనుభవజ్ఞుడు. మంచితనంతో కూడిన తెలివిగలవాడు. భార్య చెప్పింది విని "నీ నమ్మకానికి నేను విలువ ఇస్తాను పార్వతీ!" అన్నాడు.