Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 24

    శ్యామ్ సుందర్ అందమైనవాడు. ఈ సుందరాంగులందరూ ఇప్పుడు శ్రీమంతులే కాబట్టి సీతాశ్రీనివాస్ అని, రాధామనోహర్ అని రాసుకున్నారు. శ్యామ్ కి పాత ప్రియురాళ్ళు. అందుకే అతి రహస్యంగా శ్యామ్ కి తమ ఫోటోలు పంపివుంటారు. ఇవి పారేయటం యిష్టంలేక ఎక్కడ తన కంటబడతాయో అని భద్రంగా బీరువాలో దాచాడు. కాబట్టే తన ఎదుట బీరువా తెరువలేదు. పొరపాటున తెరిచినా తన రాకతో కంగారుపడి మూసేవాడు. ఉదయం ఫోటో ఆల్బం విషయంలో అంత కంగారుపడవలసిన విషయం దేనికి! తప్పు వుండబట్టి. ఇంతమంది రౌడీ ఆడాళ్ళ ఫోటోలు భద్రపర్చుకున్న శ్యాం శ్రీరామచంద్రుడంటే నమ్మదగ్గమాటేనా!
    అత్తగారు, శ్యాం ఎంతో మంచివాళ్ళనుకుంది. ఇదీ వీళ్ళ మంచితనం. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిన శ్యాం తన అందానికి మురిసి పెళ్ళాడాడు. కొడుకు ఒకనాడు అల్లరిచిల్లరిగా తిరిగి వుంటాడు. అదెక్కడ బయటపడుతుందో అని ఈ అత్తాదేవి మహా ఆపేక్షగా తన్ని చూస్తున్నది. ఓహ్! ఎంత నాటకం ఆడుతున్నారు?
    ఈ బీరువా అంతా తిరగేయాలి. గట్టిగా సాక్ష్యాలు సంపాదించాలి. అప్పుడు వీళ్ళపని పట్టాలి. ఇంత మోసం చేసిన వీళ్ళు తనకు నిజం తెలిసిందని ఎదురుతిరిగితే ఆ రామలక్ష్మిని తగలబెట్టినట్లు కిరసనాయిలుపోసి తగలబెట్టరానేముంది! తనేం అమాయకురాలా. ప్లాన్ ప్రకారం చేస్తుందిగాని...ఈ లెటర్స్ కట్టకేమిటో కొత్తరిబ్బను చుట్టి అందంగా పెట్టారు. ప్రియురాళ్ళు రాసిన ప్రేమలేఖలా యివి?
    వాసంతి ఆల్బం లోపలపెట్టి ఉత్తరాల కట్ట తీసింది. రిబ్బను విప్పబోతున్నది. వాకిలి తలుపు చప్పుడయింది.
    శ్రీదేవమ్మ వచ్చింది. వాకిలి తలుపు తడుతూ వాసంతిని పిలుస్తున్నది.
    వాసంతి తీరుబడిగా, రహస్యంగా బీరువాలో వున్నవి పరిశీలించదలుచుకున్నది. అందుకే గబగబా అన్నీ సర్ది బీరువా మూసి తాళం వేసింది.
    ఏమీ ఎరగనిదానిలా వెళ్ళి తలుపు తీసింది వాసంతి.
    శ్రీదేవమ్మ యింట్లోకి వచ్చింది.
                                         19
    రాత్రి నాటకం చూడటానికి భానుమూర్తి, శ్రీదేవమ్మ, వాసంతి కాలేజీకి వెళ్ళారు.
    కాలేజీలో చాలామంది పలకరించారు. శ్రీదేవమ్మ కలుగుగోలు మనిషి కావటంవల్ల ఆవిడని తెలియనివారంటూ లేరేమో.
    స్టేజీకి దగ్గరగా కుర్చీలలో రెండో వరసలో కూర్చున్నారు ముగ్గురూ.
    ముందుగా కొందరి స్పీచి వగైరాలయింతర్వాత నాటకం మొదలయింది. వాసవదత్త నాటకం అది. శ్యాంసుందర్ నాటకంలో ఏం పాత్ర వేశాడో వాసంతికి తెలియదు. "నీవు కాపురాని కొచ్చింతర్వాత నేవేస్తున్న నాటకం యిది. నా పాత్ర ఏదో నీవే కనుక్కో" అని శ్యాంసుందర్ చెప్పటం, శ్రీదేవమ్మని చెప్పొద్దని అనటంతో వాసంతికి బొత్తిగా తెలియదు. ఆ ఉదయంవరకు శ్యాంసుందర్ నాటకంలో వేస్తున్నందుకు స్టేజీమీద అతన్ని చూడబోతున్నందుకు ఆనందించిన వాసంతి మధ్యాహ్నం ఫోటో ఆల్బం చూడటంతో మారిపోయింది. ఏదో తెలియని కోపం, ఏదో తెలియని ఆవేశం అణువణువునా ఆక్రమించగా ఎవరిమీద ఎగిరిపడాలో, ఏం చేయాలో తెలియలేదు. ఆ పగలంతా ముభావంగా వుంది.
    శ్రీదేవమ్మకి అనుమానం వచ్చింది. వాసంతి మామూలుగా లేదని, మామూలుగా వుండటానికి ప్రయత్నిస్తున్నదని. "వంట్లో బాగుండలేదా?" అని అక్కడికి అడిగింది.
    "అబ్బే, ఏంలేదే, మామూలుగానే వున్నాను"  అంది వాసంతి.
    పావువంతు నాటకం అయింది. శ్యాంసుందర్ ఏ పాత్ర వేశాడో వాసంతి కనుక్కోలేకపోయింది. వాసవదత్త నాటకం గేయనాటకం. అంతా చదువుకున్నవారు కాబట్టి కొత్తరకంగా ప్రదర్శిస్తున్నారు. వాసవదత్త అందము, అభినయము చాలా అద్భుతంగా వున్నాయి. పాత్రలు, హావభావములు ప్రదర్శిస్తుంటే, పాటలు వేరేవారు పాడుతున్నారు. "చివరి సీనులో ఓసారి స్టేజిమీద ముఖం చూపించి పోతాడేమో శ్యాం" నిర్లిప్తంగా అనుకుంది వాసంతి. మనసు చిరాకుగా వుండటంవల్ల నాటకం సరిగా చూడలేకపోతున్నది.
    వాసంతికి వెనుక వరస కుర్చీల్లో ఇద్దరు కాలేజీ గరల్స్ కూర్చుని వున్నారు. వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడుకోటంతో ఆమాటలు వాసంతి చెవులపడ్డాయి.
    "వాసవదత్తని చూస్తుంటే నీ కేమనిపిస్తున్నది పార్వతీ!"
    "నేనే మగాణ్ని అయితే అమాంతం స్టేజీఎక్కి బుగ్గలు కొరికేసేదాన్ని. పాత్రలో జీవించటమంటే నటనలో లీనం కావటం అంటే యిదే." అంది పార్వతి అనబడే ఆపిల్ల మైమరచిపోతు.
    "ఇప్పుడయినా మించిపోయింది ఏముంది, వెళ్ళిరా దీవించి పంపుతాను." అంది వేదవతి పేరుగల అమ్మాయి.
    వాసవదత్త బుగ్గలు కొరికితే శ్యాంసుందర్ గారు బాధపడిపోరూ?" అంది పార్వతి.
    వాళ్ళమాటలు వింటున్న వాసంతి కళ్ళల్లో ఎర్రజీరలు ఏర్పడ్డాయి. వాసవదత్త పాత్రవేసిన అమ్మాయికి శ్యాంసుందర్ కి ఏదో సంబంధం వుంది. లేకపోతే వాళ్ళెందుకలా మాట్లాడుకుంటారు. తనవాడనుకున్న శ్యామ్. తన ప్రియతముడు శ్యామ్, భర్తగా అన్నివిధాలా తగినవాడనుకున్న శ్యామ్, ఎందరో సుందరీమణులకు హీరో హూఁ... ఈ దేశంలో మగాడిని నమ్మకూడదు. అసలు పెళ్ళేచేసుకోకూడదు." ఇలా ఆలోచిస్తున్న వాసంతికి మళ్ళీమాటలు వినపడి చెవివగ్గింది.
    "శ్యాంసుందర్ గారికి పెళ్ళయింది. వారి వైఫ్ ఎలా వుంటుందో?" అంది పార్వతి.
    "తమకెందుకో!" అంది వేదవతి.
    "ఎందుకేమిటి ఆవిడగారు అతగాడి బూరెల్లాంటి బుగ్గలు కొరుకుతుందో లేదో తెలుసుకోటానికి. కాకపోతే మరో కారణం ఆమె బాగుండకపోతే పార్వతి శ్యామ్ గారి అర్ధనారీశ్వరి అవుదామనే ఆశకావచ్చు" కీచు కంఠంగల మరో అమ్మాయి కీచుగ అంది.
    "శ్యాంసుందర్ గారు బాగుంటారని అన్నాగాని ఆయన అర్ధనారీశ్వరి నవుతాను. నెత్తినెక్కుతాను అనలేదు. అందని ద్రాక్షపళ్ళకి ఆశించే రకాన్ని కాదు" అంది పార్వతి.
    "మరి వాసవదత్త బుగ్గలు కొరుకుతానన్న కోరిక బైట పెట్టావ్?"
    "వాసవదత్త బుగ్గలు కొరుకుతానన్నాగాని శ్యాంసుందర్ గారి బుగ్గలు కొరుకుతానని అనలేదు. వాసవదత్త పాత్రలో శ్యాంసుందర్ గారు శ్యాంసుందర్ గారులా అనిపించటంలేదు. అందాల అపురూప లావణ్య సుందరి వాసవదత్త మాత్రమే కనిపిస్తున్నది. మాంచి పర్సనాల్టీవున్న శ్యాంసుందర్ గారు ఆడవేషం వేయంగానే ఎంతలామారిపోయారో. చేతులనిండా వత్తుగా జుట్టువుండేది. సైడ్ లాక్స్ చెప్పనే అక్కరలేదు! వాటినేం చేశారో! అసలా నటన చూడవే ఎక్కడన్నా కనీసం ఏమూలన్నా మగవాడి తీరు కనబడుతున్నదా! ఆ నటన ఆరూపం చూస్తుంటే ఓహ్ వాసవదత్త ఇలాగే వుండేది సుమా అనిపిస్తున్నదికదూ?" పార్వతి తన్మయత్వంతో స్టేజీవైపు కళ్ళప్పజెప్పి చూస్తూ అంది. 

 Previous Page Next Page