Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 24

    జ్యోతి! వన్నెల విసనకర్ర! ఆమె అందం అగ్నిపుష్పంలాంటిది. ఆస్వాదించాలని, అందుకోవాలని చేతులు చాచి, చేతుల్నే కాక బ్రతుకును కూడా మాడ్చుకున్నాడు.
    తరువాత జీవితం ఏమిటి? ఇలాగే బ్రతికినంతకాలం జ్యోతి స్మృతులతో వేగిపోవాలా? మనసారా హాయిగా నవ్వుల పండుగ జరుపుకునే శుభగడియలు యిక లేవా?
    తెలీదు అది తెలిస్తే తన జీవిత మెందుకిలా అధ్వాన్నంగా తయారవుతుంది? అయినా తన పిచ్చిగానీ, జ్యోతికి కనువిప్పుకలగదు. ఆ తండ్రీ కూతుళ్ళకు డబ్బేలోకం. మనుషుల్ని గౌరవించటం, మానవతా విలువల్ని గుర్తించటం లేదు.
    వాళ్ళకు కావల్సింది డబ్బు! వాళ్ళు డబ్బు మనుషులు...
    ఆ డబ్బు లేదనే తననింత నీచంగా, చులకనగా చూసింది.
    ఆలోచనలతో అతని మెదడు వేడెక్కింది.
                                       25
    శ్రీకర్ అత్తారింటినుంచి వచ్చి అప్పటికి వారం రోజులైంది. వచ్చిన మరుసటిరోజే అతని అదృష్టంకొద్దీ మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. దాంతో అతనికి యింట్లో తేలిగ్గా కూచుని మాటాడే అవకాశంగానీ, కబుర్లు చెబుతూ కాలక్షేపంచేసే అవసరంగానీ లేదు. ఎప్పుడూ త్రుళ్ళుతూ ప్రేలుతూ హాయిగా వుండే అబ్బాయి యీ పర్యాయం ముభావంగా యుద్ధంలో ఓడిపోయిన సైనికుడిలాగా వుండటంతో విశ్వనాథంగారికి కొంత చిత్రంగా అనిపించింది.
    ఆ రోజు ఆదివారం.
    శ్రీకర్ యింకా నిద్రలేవలేదు. గతరాత్రి సెకండ్ షోకి వెళ్ళి వచ్చాడు అతను. అందుకే మునగదీసుకొని పడుకున్నాడు.
    ప్రొద్దున్న కాఫీ తెచ్చిన భార్యతో అన్నాడు విశ్వనాధం.
    "అబ్బాయేమిటి ఏకంగా వారం రోజులు తిష్ట వేశాడు."
    కోపంగా చూసింది అన్నపూర్ణ. "అత్తారింటికి కాపురానికి వెళ్ళిన కూతురెంతో, యిల్లరికం వెళ్ళిన కొడుకూ అంతే! వాడు పెళ్ళయి వెళ్ళింది మొదలు యిప్పుడేరావటం ఇక యిపుడు వెళితే మళ్ళీ యెప్పుడొస్తాడో ఏమో!" అంది. 
    నవ్వేశాడు విశ్వనాథం. "అదికాదే పిచ్చి మొద్దూ! అబ్బాయిలో వెనుకటి చలాకీతనం లేదు. ఎప్పుడూ ముభావంగా వుంటున్నాడు చూశావా? అయినా ఒక్కడే వచ్చాడేం? జ్యోతిని వెంటబెట్టుకుని రాలేదేమిటో?"
    నవ్వేశాడు విశ్వనాథం. "అదికాదే పిచ్చి మొద్దూ! అబ్బాయిలో వెనుకటి చలాకీతనం కనిపించటంలేదు. ఎప్పుడూ ముభావంగా వుంటున్నాడు చూశావా? అయినా ఒక్కడే వచ్చాడేం? జ్యోతిని వెంటబెట్టుకుని రాలేదేమిటో?"
    "మీదంతా చాదస్తం! ఆ మహారాణి మొగుడిని రప్పించుకుంటుందిగానీ తను అత్తింటికి రాదుగా! ఆ మేడ, ఆ దర్జా ఎక్కడ, ఈ పెంకుటిల్లు ఎక్కడ? అయినా అబ్బాయిలో హుందాతనం వచ్చింది, పెద్దవాడయ్యాడు, పరాయిచోటుకి వెళ్ళాడు, బాధ్యతలు పైబడ్డాయి, మరి యింకా చిన్న పిల్లాడిగా వుంటాడా?"
    కాఫీకప్పు క్రిందపెట్టేసి "పోనీ నీతోనయినా నేను ఆఫీసుకు వెళ్ళాక బాగా వుంటున్నాడా?" అని అడిగాడాయన.
    పెదవి విరిచింది అన్నపూర్ణ. "రోజూ మీతోపాటే భోజనం చేస్తున్నాడుగా! మీరటు వెళ్ళగానే తనూ ఠంచనుగా ఆఫీసు కెళ్ళినట్టు వెళుతున్నాడు. మళ్ళీ బాగా చీకటిపడ్డాకే తిరిగొస్తున్నాడు."
    ఆశ్చర్యపోయాడు విశ్వనాథం. "రోజూ వెళుతున్నాడా?" అని అడిగాడు.
    "ఆ ప్రతిరోజూ వెళుతున్నాడు!" కప్పు తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణ.
    ఏదో ఆలోచనల్లో పడిపోయాడు విశ్వనాధం. అంతలో పేపరు వస్తే చూస్తూ కూర్చున్నాడు. పేపరు చూట్టం ముగించి, చుట్ట ముట్టించి కుర్చీలో వాలాడు. అంతలో నిద్రలేచిన శ్రీకర్ ముఖం తుడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కనే వున్న బల్లమీద కూర్చున్నాడు. శైలజ కాఫీ తీసుకునివచ్చింది. అతను కాఫీ తాగేవరకూ వూరుకుని వున్నాడు విశ్వనాధం.
    "జ్యోతి ఉత్తరం రాసిందా?"
    హఠాత్తుగా వచ్చిన ఆ ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు శ్రీకర్. "ఉత్తరమా? లేదే?? అన్నాడు తడబడుతూ. 
    "ఏం పిల్లలో! ఏం కాలమో! నాకు పెళ్ళయిన కొత్తలో మీ అమ్మ ఆషాడంలో పుట్టింట్లో వుంటే రోజుకో ఉత్తరం రాశాను. నువ్వు రావటమే ఒక విచిత్రంగా వుంది. పెళ్ళయిన కొత్తలో బాత్ రూంకి వెళ్ళినా, భార్యని తీసికెళ్ళాలనిపిస్తుంది. అలాంటిది నువ్వొక్కడివే వచ్చావు. వచ్చి వారంరోజులయింది - అమ్మాయి ఉత్తరమైనా రాయలేదు. కానీ నువ్వేమైనా రాశావా?"
    తలొంచుకున్నాడు శ్రీకర్. అతనికి విషయం చెప్పే అవకాశం వచ్చిందనిపించింది.
    "ప్చ్! ఎందుకు పనికి వస్తారోయ్ మీరు! ఊ పోనీలే. తిరుగు ప్రయాణం యెప్పుడూ? ఏం లేదులే. ఆ ఊళ్లోనే శైలజకి ఏదో సంబంధం వుందంటే చూసి రాస్తారేమోనని!"
    "నాన్నగారూ!"
    "............."
    "నన్ను క్షమించండి. నేను వచ్చినప్పటినుంచి ఈ విషయం మీకెలా చెప్పాలా అని సతమత మౌతున్నాను. నాలో నేనే గుడుసుళ్ళు పడుతున్నాను. అయినా ఏ రోజు ఓ రోజు యీ విషయం చెప్పక తప్పదని తెలుసు!"
    "ఏమిటది?"
    "నేను ఆ ఇంటి నుంచి వచ్చేశాను?"
    "అంటే?" బొమలు ముడివేసి అడిగారాయన.
    "నాకూ జ్యోతికి సరిపోలేదు. అందుకని నేను ఇల్లరికం వద్దని వచ్చేశాను."
    "మరి జ్యోతి..."
    "జ్యోతి అక్కడే వుంటుంది రాదు!"
    నిర్ఘాంతపోయాడు విశ్వనాథం. "ఏమిటోయ్! నువ్వనేది! నాకేమీ అర్ధం కాలేదు? మీరిద్దరూ పోటాడుతున్నారా ఏమిటి? భార్యాభర్తలు పోటాడుకోకపోతే ఇంకెవరు పోటాడుకుంటారు!"
    "అదికాదు నాన్నగారూ! జ్యోతిదదోతరహా వ్యక్తిత్వం! తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచి పాడు చేశారు. ఆమె నన్ను అవమానపరిచింది చెప్పాలంటే కొత్త కోడళ్ళని గయ్యాళి అత్తగారు కోడరికం పెట్టినట్టుగా బాధపెట్టింది. మన బీదరికాన్ని, నా లేమిని ఎప్పుడూ ఎత్తి పొడిచేది. కట్టుకున్న బట్ట మొదలుకొని తినే తిండివరకూ, పడుకునే పరువూ, మంచం అన్నిట్లో నన్ను వాళ్ళ ఇంటి వాటితో పోల్చి హీనపరిచేది."
    విశ్వనాథంగారు జవాబివ్వలేదు. ఒక్క క్షణం ఆగి "శ్రీకర్! నేను తొలుతే చెప్పాను! ధనవంతుల మనస్తత్వాలు ఎలా వుంటాయో నువ్వు వినలేదు. ప్రేమనీ, అదనీ వాదించావు. నిజంగా నిన్ను ఆ అమ్మాయి ప్రేమించి వుండినా, నువ్వు ఆమెని ప్రేమించి వుండినా ఆమెని యిలా వదిలేసి వచ్చేవాడివి కాదు. ఒకవేళ నువ్వు వచ్చినా ఈ సరికే తిరిగి వెళ్ళి వుండేవాడివి. లేదా ఆ అమ్మాయి వచ్చేది. ప్చ్! అదంతా వ్యామోహం, ఆకర్షణ ప్రేమకాదు!" అన్నాడు. 

 Previous Page Next Page