'అహల్యా! గాయత్రీని మించిన మంత్రం లేదన్నారు మన వాళ్లు. నగాయత్ర్యాః పరం మంత్రం అనేది అక్షర సత్యం. గాయత్రిని ఉపాసించు. గాయత్రీని ఉపాసిస్తే లభించనిది లేదు. ఏది కావాలన్నా అది అరచేతి స్వర్గంలాగ లభిస్తుంది. గాయత్రీని మరిస్తే ఏదీ లభించదు. గాయత్రీని స్మరిస్తే సర్వం లభిస్తాయి. గాయత్రీ లేనిదే సృష్టి లేదు. సృష్టిలో చైతన్యం లేదు.'
విశ్వామిత్రుడి మాటలకు గౌతముడు ఎంతో సంతోషించాడు.
'మహర్షీ! మంత్ర ప్రభావాన్ని మంత్ర ద్రష్టలైన తమరు ఎంతో చక్కగా వివరించారు. మీ మాటలు వింటే లోకం బాగుపడుతుంది. వినలేదా చెడిపోతుంది.'
'గౌతమా! గాయత్రీ మంత్ర ప్రభావం ఇంకా ఉంది. లోకంలో ఎవరూ తెలుసుకోలేని పరమ రహస్యం చెపుతాను విను. గాయత్రి తనను జపించిన వాడినే కాదు, ఆ కుటుంబాన్నే రక్షిస్తుంది. అంతేకాదు గాయత్రిని జపించే అర్హత లేని జనాలను నీ మంత్రం కాచి రక్షిస్తుంది. ఒక గ్రామ వాటికలో వంద కుటుంబాలు ఉంటే అందులో ద్విజత్వం పొంది గాయత్రీ ఉపదేశం పొందగలిగినవారు ఏ ఐదారుగురో ఉన్నా చాలు. వారు నియతిగా నిష్టగా నిర్మల చిత్తంతో ధ్యానిస్తే ఆ మంత్ర ప్రభావం ఆ గ్రామాన్ని రక్షిస్తుంది.'
గౌతముడు అమితానందంతో అన్నాడు 'బ్రహ్మర్షీ! శివజటాజూటం నుంచి గంగను దించి భూ లోకంలో పారించి ఆ నదీ పరీవాహక ప్రదేశంలో పంటలు పండిస్తే ఎంత పుణ్యమో అంతకు కోటి రెట్లు పుణ్యం తమకు దక్కుతుంది. గాయత్రీ మాతను దర్శించి లోకానికి ప్రసాదించి తమరు మహోపకారం చేశారు. అందుకు ప్రతిగా సంధ్యావందనంలో తమ పేరు 'గాయత్ర్యా గాయత్రీ ఛందో గాధీ పుత్రో విశ్వామిత్ర ఋషిః' అని చేర్చి సంకల్పించాలి. ఇది నా అభిలాష!'
'తథాస్తు! అలాగే సవరిస్తాం!' అన్నాడు విశ్వామిత్రుడు.
గౌతముడు మహర్షిని తమ ఆశ్రమానికి ఆహ్వానించి కదిలాడు. అహల్య అనుసరించింది.
15
విశ్వామిత్రుడి వల్ల తిరిగి బ్రహ్మోపదేశం పొందిన అహల్య ఆ మంత్ర పునశ్చరణలో నిమగ్నమైంది. విశ్వామిత్రుడు ఆనాడు గౌతముల ఆతిధ్యం పొంది తిరిగి వెళ్లగానే, అహల్యను పిలిచి గౌతముడు అన్నాడు.
'అహల్యా! మంత్రశక్తి అపారమయినది. దానికి పరిమితి లేదు. జపించే కొద్దీ, తపించే కొద్దీ అది విశేష ఫలితాలనిస్తుంది. ఏ మంత్రానికయినా అందులో ఎన్ని అక్షరాలున్నాయో అంత సంఖ్యలో జపం చేయడం ముని నిర్దేశం. పదుల్లో చేసే నిత్య జపం రక్షా కవచంలా పనిచేస్తుంది. వందల్లో చేసే జపం సురసురభిలా కోరినవన్నీ తీరుస్తుంది. అక్షర సంఖ్యకు తగినన్ని వేల జపం చేయగానే ఇష్టకామ్యార్ధ సిద్దీ, అక్షర లక్ష జపం పూర్తి చేయగానే మంత్ర సిద్ధీ వర్తిస్తాయి. మంత్రం కామధేనువు వంటిది. కోరడమే తరువాయి కోరికల వర్షం కురిపిస్తుంది.
అహల్య భర్త మాటలు విని మననం చేసుకుని అంది.
'స్వామీ! నేను ముందుగా అక్షర సహస్రం పూర్తి చేస్తాను. ప్రతినిత్యమూ అక్షర శతం జపిస్తాను'
చిరునవ్వులు చిందించాడు గౌతముడు 'ఏమి కోరి జపం ప్రారంభిస్తున్నావో?'
సిగ్గుతో తల దించుకుంది అహల్య.
గౌతముడికి ఆమె మనస్సు తెలిసిపోయింది. 'ఇల్లాలా! మన దాంపత్య యాగానికి ఫలం త్వరలోనే సిద్ధిస్తుంది. నీ కడుపున విశేష ప్రజ్ఞావంతుడు జన్మిస్తాడు. అతడి జ్ఞానం అపారం! విదేహరాజు జనకరాజర్షి వంటి వారి ప్రశంసకు పాత్రుడవుతాడు. అయోధ్యాధీశులు దశరధ మహారాజు ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టా హేతువు. ఆయనకిప్పుడు సంతానం లేదు. అయితే త్వరలో లోకోత్తర పురుషుడు జన్మించనున్నాడు. ఆ ఇక్ష్వాకు కుల తిలకుడి మర్యాద మన్ననగా పొందగలుగుతాడు. మన వంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాడు' అన్నాడు.
అహల్య భర్త పాదాలు సున్నితంగా స్పృశించింది.
'ధన్యురాలిని. నా పుట్టుకే విశేషమనుకున్నాను. కానీ నా కడుపున జన్మించబోయేవాడూ అదృష్టవంతుడవుతాడనీ, అశేష ఖ్యాతి ఆర్జిస్తాడనీ వినడం నాకు ఎంతో సంతోషంగా ఉంది' అంది వినయంగా.
'బ్రహ్మ మానస పుత్రీ!' ప్రేమగా పిలిచాడు గౌతముడు. 'ఈ చరాచర సృష్టిలో విలువ లేనిదీ, వ్యర్థమైనదేదీ లేదు. మా మామగారు సృష్టికర్త బ్రహ్మదేవుడు దేన్నీ వృధాగా సృష్టించడు కదా! ఏదో ప్రయోజనమే ఉంటుంది. గరిక పోచను కూడ గణపతి పూజలో వినియోగిస్తాం కదా దేవీ!
అలా ప్రతిదీ ప్రయోజనకరంగా, ప్రతిదాన్నీ ఏదో ఒక ఉపయోగకరంగా సృష్టించే బ్రహ్మ పనిగట్టుకుని సృష్టిలోని అందాలన్నీ ఒక చోట రాసి పోసి నిన్ను నిర్మించాడంటే నీ పుట్టుకకు ఎంత పరమార్థం ఉండాలి? ఎంత ప్రయోజనం ఉండాలి? ఏ స్త్రీ జన్మ అయినా ఫలించేది మాతృత్వం వల్లనే! కన్న సంతానం తనకన్న అధికులు కావాలని ప్రతి తల్లీ దండ్రీ ఆశిస్తారు. మనమూ అంతే!'
అహల్య ఆమోదకరంగా తలూపింది.
నాటినుంచి ఆమె గాయత్రీ మంత్రాన్ని పరమ నిష్ఠతో, ఏకాగ్రతతో జపించసాగింది. జప సంఖ్యా ఇరవై నాలుగు వేలకు చేరుకుంది. అహల్య ముఖంలో దివ్య తేజస్సు తొణికిసలాడుతున్నది.
* * * *
ఒకనాడు ప్రదోష పూజకు పూలు తాజాగా సేకరించాలని సాయంకాలం పూట పూలు తుంచుకుంటున్నది అహల్య. వెదురు వేళ్ళతో అల్లిన బుట్టలో పూలను తుంచి వేస్తున్నది. తమ ఆశ్రమానికి చుట్టూ పెరిగిన వెదురు నరికినప్పుడు వ్యర్ధంగా పడి ఉన్న వేళ్ళతో ఆ బుట్టను అల్లింది. ఆ బుట్టను చూసిన ఆశ్రమ వాసినులు ఆమెనెంతో గొప్పగా మెచ్చుకున్నారు.
వెదురు చీల్చి చిన్న చిన్న వేళ్ళుగా తీర్చి వాటితో అందంగా బుట్టలు అల్లడం ఆశ్రమ వాసినులకు క్రీడగా పరిణమించింది.