Previous Page Next Page 
మధుపం పేజి 24


                                                                     *    *    *    *
    ఏడాది గడిచింది. సంవత్సరీకాలు పూర్తి అయ్యాయి. ఏదో లోకం కోసం అయిందనిపించినట్టు పూర్తి చేశాడు కొడుకు. మిత్రులు నలుగురు భోంచేసి శారదమ్మను చూసి పలకరించి వచ్చారు. కళా విహీనంగా ఉన్న ఆమె మొహం, చిక్కిన ఆమె శరీరం, ఆకళ్లలో దైన్యం అందరిని కలచి వేసింది. మాట్లాడుకోడానికి ఏం లేనట్టు ఆరోజు బెంచి మీద కూర్చుని మౌనం దాల్చాడు.
    
                                                                      *    *    *    *
    గేటు తీసుకుని వచ్చిన వాసు వరండాలో వాలుకుర్చీలో పేపరు చదువుతున్న క్రిష్ణమూర్తి ని చూసి కఠినంగా , విసురుగా , "మా అమ్మ ఎక్కడ? పిలవండి. దురుసుగా అన్నాడు ' క్రిష్ణమూర్తి పేపరులోంచి తలెత్తి 'లోపలున్నారు వెళ్ళి మాట్లాడవచ్చు' - ప్రశాంతంగా అన్నారు.
    'అక్కరలేదు - పిలవండి ఇక్కడికి. ఇక్కడే తెల్చేస్తాను. ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు. పిలవండి ....' అరిచాడు ఆవేశంగా.
    "ఏం మాట్లాడదలచావో చెప్పు వింటాను" శారదమ్మ లోపల్నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని కొడుకు వంక చూస్తూ అంది. తల్లి వంక తిరస్కారంగా చూసి 'నా తల్లి ఇంత బరితెగిస్తుందని, పరువు మర్యాద, మానాభిమానాలు అన్నీ వదిలి ఇలా పరాయి మగాడి ఇంట పడి వుండడానికి తయారయిందని విని నాతల ఎక్కడ పెట్టుకొవాలో తెలియలేదు. నీవెలాగు పరువు, సిగ్గు వదిలావు. నీపిల్లల సంగతన్న గుర్తు రాలేదా. మేము తలెత్తుకు తిరుగాలనుకున్నావా వద్దా. ఐదు రోజులుగా ఇంట్లో నీవు కనపడక ఎమయిపోయావు, ఎక్కడికి పోయావో అర్ధం కాక ప్రతి వాళ్ళని అడిగి అరా తీసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చాను. బాబిగాడు నిన్న సాయంత్రం  రోడ్డు మీద సైకిలు తొక్కుతుంటే నీవు కనబడ్డావుట. మామ్మా అని పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయావుట. నేను ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయి వాడు నిద్రపోయేముందు వాళ్ళ అమ్మక్లి చెప్పాడుట. రాత్రి నేవచ్చాక సంధ్య చెబితే నమ్మలేక పోయాను. ఉదయమే వచ్చి చూస్తె నిజమన్నది అర్ధం అయింది. ఛా..... ఇలా చెప్పకుండా చెయ్యకుండా ఇల్లొదిలి పరాయి మాగాడింట్లో అదీ ఆడవాళ్ళు లేని ఇంట్లో ఉండడానికి సిగ్గు లేదా' అరిచాడు.
    "పరాయి మగాడేవరు బాబూ , నా భర్త ఇంట్లో ఉన్నాను. నేనేం పరువు తక్కువ పని, తప్పుడు పని చేయలేదు నాయనా. అది అర్ధం చేసుకుని మాట్లాడితే మంచిది" కఠినంగా అంది శారదమ్మ. నిర్ఘాంతపోయాడు వాసు. నోటమాట రాక ఒక్కక్షణం అలా వుండిపోయాడు. మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేనివాడిలా 'ఏమిటి .... భర్తా ... ఎవరు ... ఈయనా, నీ భర్తా, ఓ గాడ్ - ఎంతకు తెగించావు. ఈ వయసులో నాన్నపోయిన ఏడాదికి పెళ్ళి చేసుకున్నావా ..... ఎంత బరితెగింపు - గొప్పగా చెప్తున్నావు సిగ్గు లేకుండా ' అరిచాడు.
    "గొంతు తగ్గించు వాసూ.... ఇంకోరింటికి వచ్చి ఇంటిముందు నిలబడి అరవడం మర్యాద కాదు" హెచ్చరికగా అంది శారదమ్మ. జరుగుతున్నా దానితో సంబంధం లేనివాడిలా, తల్లి కొడుకులు చూసుకుంటారాన్నట్టు నిర్లిప్తంగా పేపరు చదువుకుంటున్న క్రిష్ణమూర్తిని చూసేసరికి తిక్క తిరిగింది. "ఏం పెద్ద మనుషులండీ మీరు . ఛీ ...ఛీ.... స్నేహితుడి భార్యని, అదీ భర్తపోయి, ఏడాది దాటగానే పెళ్ళి చేసుకున్న మీరు.... మర్యాదస్తులనుకున్నాను ఇన్నాళ్ళు. ఇంతకీ దిగజారి .... ఈ వయసులో .... ఛీ .... ఆవిడ బుద్దా ఇది. మీకు పుట్టిన బుద్దా."
    "వాసూ.... నీవేం అనడలచినా నాతో మాట్లాడు. ఆయన్ని ఒక్క మాటంటే ఊరుకోను ...." స్థిరంగా అంది శారదమ్మ.
    "ఓహో కొత్తమొగుడి మీద అంత ప్రేమా! అవును కొత్త మోజుగా, ఈ వయసులో మరో మొగుడు, మగాడు కావాల్సి వచ్చి ఇంతకు తెగించావన్నమాట. తల్లి అన్నది మర్చి అసహ్యంగా మాట్లాడాడు. క్రిష్ణమూర్తి సావకాశంగా పేపరు మడిచి పక్కనపెట్టి - "చూడు వాసూ, .... మీ అమ్మ ... ' ఏదో చెప్పబోయాడు.
    "ఛ.... మీరు నాతో మాట్లాడకండి ... పెళ్ళాం పోయి వంటరిగా వుండి, మొగుడు పోంగానే మా అమ్మకి గాలం వేసారంటే.....' ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు. 'వాసూ నోర్మూయ్ . ఈ మహానుభావుడ్ని ఒక్కమాటంటే సహించను. వెళ్ళు మోదిక్కడ నించి వెళ్ళు. నేనెవరికి జవాబుదారి కాను. అవును, నావళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సి వచ్చి పెళ్ళి చేసుకున్నాను . సరేనా ... ఇంక వెళ్ళు . ఈ పాపిష్టి దాని మొఖం చూడకు.... నే చచ్చినా నా మొహం చూడక్కరలేదు..... నాకెవరూ లేరు. లేరనుకునే ఇక్కడికి వచ్చాను....' కఠినంగా అంది.
    'నా కన్నతల్లి వుంది అనుకుని వచ్చాను. నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడో నీళ్ళు వదిలేసే వాడిని. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. చచ్చిన దానితో సమానం. "ఆవును బాబూ, నీలాంటి కొడుకులు తల్లి బతుకుండగానే నీళ్ళు వదిలేస్తూ చచ్చినదానితో సమానం అనుకోబట్టే కొందరు నిర్భాగ్య తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకుని ఏ అనాధ ఆశ్రమాల్లోనో చేరుతున్నారు. కన్నతల్లులు కొడుకు, కోడలు, మనవలు తన కుటుంబం అనుకుంటారు. కొడుకులు  భార్య బిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితి వచ్చాక ఇంక ఆ తల్లి ఏం చేస్తుంది. గొడ్డు చాకిరి చేసినా ఊరికే తిని పోతుందని ఏడిచే పరిస్థితి వచ్చాక ఆది భరించలేని తల్లి తనదారి తను చూసుకుంటుంది.
    "అంటే, ఇంట్లో పనిపాట చేయడం గొడ్డు చాకిరా.... కొడుకింట్లో వుంటూ కాస్త పనిచేయడం , మనవలని చూసుకోవడం కూడ గొడ్డు చాకిరి చేయించినట్టా- ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. తల్లిని ఆ మాత్రం ఇల్లు, పిల్లలని కనిపెట్టుకొని ఉండడం బాధలు పెట్టడమా - " ఆవేశంగా అరిచాడు.
    "తల్లికి పిల్లల బాధ్యత బరువు కాదు. పిల్లల బాధ్యతలు తీరిన ముది వయసులో తలకి మించిన భారాన్ని తల్లి తలకేత్తితే మోయలేదన్నది మీకర్ధం కాదు. ఇంట్లో పడి ఊరికే తింటుంది ఆమాత్రం చెయ్యదా అని మీకనిపిస్తుంది. శక్తిని మించిన బరువు మోయడానికి కాస్తంత ప్రేమ, ఆదరణ, గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు లాగ్గలరు. అదీ లేనినాడు జీవచ్చవాలవుతారు.... నాలా గతిలేని వాళ్ళు ఏ అనాధాశ్రమాలో వెతుక్కుంటారు. ఆస్థితి నాకు పట్టకుండా ఏ దేముడో కరుణించి ఈయన రూపంలో నన్నాదుకున్నారు. బాబూ ఈ శేషజీవితం ఈనీడని ప్రశాంతంగా బతకనీ, ఇంక వెళ్ళు నీకు నమస్కారం...." చేతులు జోడించి అంది శారదమ్మ. "కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు - డబ్బు దస్కం ఉన్న ఆయన్ని పట్టావు తెలివిగా, అక్కసుగా అన్నాడు . శారదమ్మ నవ్వింది.
    "పోనీ అలాగే అనుకో ...." అంది ప్రశాంతంగా.... "నీబాధ నాకర్ధం అయింది. బాబూ జీతం బత్తెం లేని నమ్మకమయిన పనిమనిషి చేజారి'పొతే కష్టమే మరి" అంది గుంభనంగా. తల్లివంక కొరకొర చూసి క్రిష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసవిస వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page