Previous Page Next Page 
మధుపం పేజి 25

  
                                      *    *    *    *
    "మిమ్మల్నిద్దరిని అర్జంటుగా ఎందుకు పిలిపించానో ఈపాటికి అర్ధమై వుంటుంది. మీకు ఇక్కడ జరిగిన విషయం ఎవరినోటో వినడం కంటే నేనే చెపితే మంచిదని పిలిచాను" క్రిష్ణమూర్తి కొడుకు విశాల్, కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడడానికి.
    "ఇదంతా ఏమిటి డాడీ. ఈ వయసులో ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు. నలుగురి నోళ్ళలో పడి పరువు పోగొట్టుకోవడం, ఆవిడ కొడుకు మీ గురించి ఊరు వాడ చెడు చెప్పడం . ఛా.... నాకు చాలా ఎంబ్రాసింగ్ గా అనిపించింది" విశాల్ నిష్టూరంగా అడిగాడు.
    "డాడి - మాఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతుంటే తలదించుకున్నాను. డాడీ మీకు తెలుసు అమ్మపోయాక మీరు వంటరి తనం ఫీలవుతున్నారు. కాని, యీ డెబ్బై ఏళ్ళ వయసులో, ఓ ముసలావిడని , అదీ ఓ స్నేహితుడి భార్యని పెళ్ళాడడం.... ఎంత చీప్ గా - ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా , మీకు తోడు అవసరం అనుకోవచ్చు. మీ పిల్లలు, మీ మనవలు సమాజం ముందు మీరు ఎంత చుల్కన అవుతారన్నది ఆలోచించవద్దా డాడీ. మీపట్ల ఉన్న గౌరవం, అభిమానం ఈ ఒక్క చర్యతో తుడిచి పెట్టుకు పోయింది' నిష్టూరంగా అంది సుమ మొహం చిట్లించి.
    క్రిష్ణమూర్తి గారు వారిద్దరిని వారిస్తూ - 'తెల్సమ్మా .... మీరంతా నాగురించి ఏం అనుకుంటారో ఊహించలేనంత వెర్రి వాడిని కాను, చిన్నవాడిని కాను. ఇది నాకో అడతోడు కావాలనీ, ఈ వయసులో ముచ్చట్లు కావాలనీ చేసుకున్న పెళ్ళి కాదు. మీ అమ్మ పోయిన ఈ పదేళ్ళలో యీ వంటరితనానికి అలవాటు పడి, నాకంటూ ఓ వ్యాపకాలు, నచ్చిన కాలక్షేపాలు ఏర్పరచుకున్నాను - కాంతమ్మ గారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు."
    "మరెందుకు ఇలాంటి పనిచేసి నలుగురి చేత అనిపెంచుకొడం - "కొడుకు నిలేశాడు."
    ఎందుకంటే, ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి, ఆదుకుని , ఆదరించి ఆవిడ శేష జీవితం మనశ్శాంతిగా బతకడానికి ఒతోవ చూపాలని....
    "లోకంలో మొగుడు పోయి, ఇంతకంటే దుర్బరస్థితిలో, దారిద్రంలో మగ్గుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. దానికోసం మీరు ఇలాగ నలుగురు నోళ్ళలో పడి .... మధ్యలోనే అర్చాడు కొడుకు.
    "లోకందేం వుంది. నాల్గురోజులు అంటుంది .  అలవాటయితే వాళ్ళే నోరు మూసుకుంటారు . నిజమే లోకంలో శారదమ్మ లాంటివాళ్ళు చాలామంది వుండవచ్చు. కాని నాకళ్ళ ముందు నాకు తెల్సిన నా స్నేహితుడి భార్య , కన్నకొడుకు ఇంట్లో హీనంగా బతుకుతూ, అనాదరణ కి , అవమానాలకి గురి అవుతుంటే చూసాక, ఆ దయనీయ స్థితి నించి తప్పించాలని, ఆవిడకి ఓ కొత్త జీవితం , కొత్త ఆశ బతుకు మీద అనురక్తి , శేష జీవితాన్ని ప్రశాంతత, భద్రత కల్పించాలని, ఇంకా ఆమెకి అరవై మూడేళ్ళు, ఇంక ఈ అనారోగ్య జీవితంలో, బండెడు చాకిరితో ఇంటి బాధ్యత మోస్తూ, చాకిరి చేసినా ఆదరణ, గౌరవం, అభిమానం లేనిచోట వుండి బతుకీడ్చలేదని ఆమెకి అండగా నిలవాలని ఈపని చేశాను. మిత్రుడి ఆత్మసంతోషించాలని.....
    "ఆవిడ పరిస్థితి బాగులేకపోతే డబ్బు సాయం చేసి ఆడుకోవచ్చు. దానికోసం పెళ్ళి చేసుకోవాలా..... నలుగురి నోళ్ళలో పడాలా"- కూతురు నిలేసింది.
    "అవును , ఆవిడకి ఆర్ధికసాయం చేయచ్చు. మందులని కొని ఇవ్వచ్చు..... కొడుకన్నాడు.
    "విశాల్, నీకు లోకం సంగతి తెలియదు. ఒక అయినింటి ఆవిడ పరాయి వాళ్ళ నించి డబ్బు తీసుకుంటుందా..... అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తలవంచినా - ఆ కొడుకు, కోడలు ఇది తెలిస్తే ఆమెని బతకనిస్తారా! ఒకటి రెండు సార్లు మోయలేని బరువులతో, నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచులు ఇంటివరకు తెచ్చి పెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాటపడిపోయింది. అది చూసి కోడలు మూతి తిప్పింది. రెండు మూడు సార్లు 'అమ్మా మందులు వేసుకోడం లేదా ఇలా అయిపోయారు ' అంటూ ఇంటికి వెళ్ళినపుడు పలకరిస్తే 'ఎవరి కోసం బతకడానికి మందులు వేసుకోవాలి బాబూ' అంది విరక్తిగా. 'ఈ వయసులో బ్లడ్ షుగర్ అందరికి మామూలై పోయాయి' అన్నాడు కొడుకు తేలిగ్గా. ఓసారి దుకాణంలో కనిపిస్తే 'అమ్మా, విశ్వనాధం నా స్నేహితుడు ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు. మీరిలా వుంటే అతని ఆత్మ క్షోభిస్తుంది. బతికినన్నాళ్ళు ఆరోగ్యం వుండాలి గదమ్మా, మంచాన పడి అతనెంత నరకం అనుభావిచాడో చూసారుగా. కాదనకండి ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా చేతిలో పెడ్తే ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడిందో . ఇంటికెళ్ళాక మందులు చూసి కోడలు నిలేసిందట. ఇలాంటి పరిస్థితిలో ఆవిడని రోడ్డు మీద పలకరించినా, ఇంటికెళ్ళి సానుభూతి చూపాలన్నా , ఆర్ధికంగా ఆదుకోవడంసాధ్యపడుతుందా . "బాగుంది, ఎవరికోసమో, జాలి, సానుభూతితోఇలాంటి పనిచేసి మా అందరికి తలవంపులు కలిగించారు. మేం అందరికి ఏం సమాధానం చెప్పుకోవాలి" కూతురు తిరస్కారంగా అంది.
    "ఆవిడ ఆర్ధికసాయం అందుకోడానికే ఇబ్బంది పడిందేమో. మరి ఏకంగా ఈ వయసులో పెళ్ళి చేసుకోడానికి ఎలా ముందుకు వచ్చిందో, మీ ఆస్తి, అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని వప్పుకుందేమో' విశాల్ హేళనగా అన్నాడు.
    "హ - నాన్నగారి ఇల్లు వాకిలి, డబ్బు , స్వంతం అవుతుంది గదా - పెళ్ళాడితే , ఊరికే ఏ వెయ్యో రెండువేలో పుచ్చుకుంటే ఏం లాభం - అసలుకే వేసింది పన్నాగం ..." వ్యంగ్యంగా అంది. క్రిష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు. "దయచేసి అలా అసహ్యంగా ఆ యిల్లాలిని అవమానపరచకండి. ఇందులో ఆమె ప్రమేయం లేదు. ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను. ఈ ఆస్తి , ఈ ఇల్లు , నా డబ్బు దస్కం మీకు చెందాల్సినవి. నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి. ఆ విషయంలో మీకేం భయం వద్దు. నేను లేని మరుక్షణం ఆమె ఈ యింట్లో ఉండదు. నేనేన్నాళ్ళు వుంటానో నాకు తెలియదు. నా తదనంతరం ఆవిడకి దక్కేది నా పెన్షను మాత్రమే. నా తరువాత పెన్షను కేవలం భార్య కిస్తారు. తప్ప పిల్లలకివ్వరు గదా. అది ఆవిడకి చెందుతుంది. ఈరోజున నాకు పాతిక వేలపైన పెన్షనుంది. తరువాత అందులో సగం ఆవిడకి వెళ్తుంది. నా తరువాత ఓ ఒల్దేజ్ హోముకి ఆమె వెళ్ళి ఆడబ్బుతో ఆవిడ సుఖంగా బతికే ఏర్పాటు చేశాను. భర్తకి పెన్షను లేని ఉద్యోగం అవడం వల్ల తెలివితక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కి, ఇచ్చుకుని పూర్తిగా వాళ్ళ దయా ధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకి ఓ బతుకు చోటు చూపడానికే ఈ పెళ్ళి.... కేవలం ఆమెకి నా పెన్షను ఇప్పించడానికే ఈ పెళ్ళి  ఆవిడ ముందు అసలు వప్పుకోలేదు. నేను నా మిత్రులు ఈ ఆలోచన చెప్పి వప్పించడానికి చాలా అవస్థ పడ్డాం. ఆ నరకం నుంచి బయట పడడానికి మాకు తోచిన మార్గం అది. లోకం గురించి ఆలోచన వద్దు. బతికిన నాలుగు రోజులు మీరు ప్రశాంతంగా బతకండి అని బలవంతంగా వప్పించాం. ఆవిడ నాకు తోబుట్టువులాంటిది. అందుకే శాస్త్రోక్తంగా ఏగుళ్ళో పెళ్ళి కాకుండా రిజిష్టరు పెళ్ళి చేసుకున్నాం. అధికారికంగా ఈ ఇంట్లో ఆమె వుండేందుకే ఈ ఏర్పాటు. కాస్తంత ఆశ్రయం కల్పించడానికే ...."ఇదేదో ముందే మాకు, వాళ్ళ పిల్లలకి చెపితే ఇంత గోల, అపార్ధాలు వుండేవి కావు కదా కొడుకు కాస్త చల్లబడి అన్నాడు.
    "ముందు చెపితే కొడుకు అడ్డుపుల్లలు వేసేవాడు. అంతేకాక పెన్షను కోసం ఈ పెళ్ళి జరిగిందన్నది ఈనోట ఆనోట అందరికి తెలిస్తే , మరికొందరు ఇలా చెయ్యచ్చు - దీంతో ప్రభుత్వం ఇది అరికట్టడానికి ఏమన్నా కొత్త రూల్సు పెట్టచ్చు. కేవలం పెన్షను కోసం పెళ్ళి అంటే పెన్షను నిరాకరించవచ్చు. అందుకని నేను నా స్నేహితులు చాలా రహస్యంగా ఈ ఏర్పాటు చేశాం. ఎవరికి తెలియనివ్వకుండా , మీరు దయచేసి ఈ విషయం గురించి నోరిప్పద్దు. ఆవిడ నోటి ముందు కూడు పడగోట్టద్దు. అందుకే మిమ్మిల్నిలా వేరే పిలిచి విషయం చెప్తున్నాను. ఆవిడ మీద కరుణ చూపండి. నేను కోరేది ఇంతే" చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు.
    అక్షనంలో తమ ఊహకందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలలు దించుకుని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయారు ఇద్దరూ .

                                                    ***

 Previous Page Next Page