Previous Page Next Page 
మధుపం పేజి 23


                                                  "పురుషులందు ...."
    
    "పురుషులందు ......
    "బాబూ మన విశ్వనాధం గారు పోయారంటండీ . మీరలా వెళ్ళగానే ఫోనొచ్చింది. 'ఉదయం వాకింగ్ నించి రాగానే వంటావిడ కాంతమ్మ చెప్పిన కబురు విని, ఎదురుచూసిందే అయినా ఒక్క క్షణం అలా వుండి పోయారు క్రిష్టమూర్తిగారు. 'ఎప్పుడు.... ఎప్పుడు పోయారుట ? నాకు ప[ఫోను చేసి చెప్పకపోయారా, అట్నించి అలాగే వెళ్ళి వచ్చేవాడిని గదా, "బూట్లు విప్పుకుంటూ అన్నారాయన.
    "మీ సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలివెళ్లారు బాబూ...." "సరే, కాఫీ ఇవ్వండి.... అలా వెళ్ళి వస్తాను. దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి...." అంటూ లోపలికి వెళ్ళి వాకింగ్ డ్రస్ మార్చుకుని కాఫీ తాగి బయలుదేరాయాన.
    విశ్వనాధం గారిల్లు చేరేసరికి , ఇంటిముందు , ఇంట్లో మెట్ల మీద, వరండాల్లో చుట్టాలు, స్నేహితులు, అపార్ట్ మెంట్ ఇరుగుపొరుగు అంటా నిల్చొని కొందరు, గుమ్మం ముందు వేసిన కుర్చీల్లో కొందరు మగాళ్ళు, ఆడవాళ్ళంతా లోపల గదుల్లో నిండి వున్నారు. క్రిష్ణమూర్తి రాంగానే వెంకటేశ్వరరావు, రామారావు, చలపతి రోజూ వాక్ చేసే గ్రూపు ముందుకు వచ్చి కబురు తెలిసి మేమూ ఇప్పుడే వచ్చాం. దాటిపోయారు. సుఖపడ్డారు అన్నాడు లోగొంతుకతో. "గత మూడు నెలలుగా నరకం అనుభవించారు పాపం. ఇంట్లో వాళ్ళు సరే, ఏదో విముక్తి లభించింది అన్నారు. రామారావు గారు. కృష్ణమూర్తి గారు తలాడించి, పాపం శారదమ్మ గారిదే బాధ, ఆవిడని తలచుకుంటే ఇక ముందు.... అంటూ లోపల్నించి వాసు రావడం చూసి ఆపేసి కాస్త ముందు కెళ్ళి అతని భుజం మీద చెయ్యి ఆన్చి ఓదార్పుగా "సారీ వాసూ, ఇప్పుడే తెలిసింది కబురు. ఎన్ని గంటలకి పోయారు నాన్నాగారు ' అన్నారు.
    "తెలియదు అంకుల్. నిద్రలోనే ప్రాణం పోయింది. తెల్లారి అమ్మలేచి చూస్తె ఏదో తేడా కనిపించి పిలిచింది. వెళ్ళేసరికి అర్ధం అయింది. 'కాస్త విచారంగా' అన్నాడు. "ఏదో ఆప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి. మంచాన కోమాలో వుండి ఎన్నాళ్ళు ఉండి ఏం లాభం..." "భుజం తడ్తూ ' ఇక ముందు జరగాల్సినవి చూడు బాబూ? మీ అక్కలిద్దరూ వచ్చారా?"
    "పెద్దక్క ముందే వచ్చి వుంది. చిన్నక్క టాక్సీలో బయలుదేరింది. రెండు గంటల్లో వచ్చేస్తుంది. పదకొండు గంటలకి కార్యక్రమం పూర్తి చేస్తాం. 'వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు."
    లోపలికి వెళ్ళి ఆవిడని చూసిచ్చేశారా మీరు క్రిష్ణమూర్తి అడిగారు.
    "ఏదీ మేమూ ఇప్పుడే వచ్చాం. లోపలంతా ఆడవాళ్ళూ ఉన్నారు. మనం వెడితే బాగుంటుందాయిప్పుడు ' వెంకటేశ్వరరావు అన్నారు.
    బాగుండానికేముంది సానుభూతి చూపాల్సింది ఆవిడకే కదా, గత పదేళ్ళుగా పరిచయం. పదండి ఆవిడని పలకరించి వద్దాం. నల్గురూ లేచి లోపలికి నడిచారు. ఆడవాళ్ళు కాస్త తప్పుకొని దారి ఇచ్చారు. ముందు గదిలో నేలమీద శవాన్ని పడుకోబెట్టారు. తల దగ్గిర ప్రమిద. పక్కన తులసి చెట్టు. సన్నగా టేప్ రికార్డర్ లోంచి భగవద్గీత వినిపిస్తుంది. అగదికి అనుకుని ఉన్న పక్కగదిలో గోడకానుకుని శారదమ్మ శోకదేవతలా కూర్చుంది. అసలే బక్క పలచని మనిషి, గత  మూడు నెలలుగా భర్త సేవలో , మానసిక దిగులుతో మరింత చిక్కి శల్యంగా బుగ్గలు, కళ్ళు లోతుకు పోయి - ఏడ్చి వాచిన కళ్ళతో వున్న ఆవిడని చూసి నలుగురూ నమస్కరించారు. వాళ్ళని చూచినా ఆవిడ కళ్ళు మరీ నిండాయి. "మీరింక బాధపడకూడదు. నరకం నించి ఆయనకి విముక్తి కల్గిందని సంతోషించాలి" కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు. ఆవిడ రెండు చేతులు జోడించి కనపడని దేముడికో, దేముడు దగ్గరికి పోయిన మనిషికో పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి "ఆయనకి విముక్తి దొరికింది. నా సంగతేం చేసి పోయారు' అంటూ చీర కొంగుతో మొహం కప్పుకుంది ఆవిడ. "ఊరుకోమ్మా - ఎంత ఏడిస్తే ఏం లాభం' తల్లి భుజం పట్టుకు ఓదార్చింది కవిత.
    పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్ళిపోవడం కృష్ణమూర్తిగారి దృష్టిని దాటిపోలేదు.
    "ఇంకో కూతురు రావాలి. పదకొండు కి మళ్ళీ వద్దాం. ఇక్కడ కూర్చుని చేసేదేం వుంది. వచ్చేవాళ్ళకి బంధువులకి కాస్త చోటుంటుంది కూర్చోడానికి" నలుగురు మిత్రులు కూడబలుక్కుని బయటికి వెళ్ళారు. ఈ అపార్ట్ మెంటు జీవితాల్లో శుభానికి, అశుభానికి నలుగురు వస్తే నిలబడే చోటుండదు.

                                                                *    *    *    *
    
    పదేళ్ళుగా ఐదుగురు కూర్చునే అపార్కులో బెంచిపై నలుగురే కూర్చోవడం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది. "పంచ పాండవులనేవారు మనల్ని అందరిలోకి చిన్నవాడు ముందెళ్ళి పోయాడు" చలపతి విచారంగా అన్నారు. "ఇంక ఒక్కొక్కరం మూటముల్లె సర్దుకోవడం మొదలెట్టే సమయం వచ్చినట్లనిపిస్తుంది." రామారావు నవ్వి అన్నాడు.
    "ఒక్కొక్కరం ఈ బెంచి మీద కూర్చుని మాటలు కలిపి , పరిచయాలు పెంచుకుని ఆత్మీయతలు పెనవేసుకున్నాయి. తెలియకుండానే. 'ఎన్ని కబుర్లు , రాజకీయాలు, ఉద్యోగాలు, రిటైర్మంట్ లు, పిల్లల చదువులు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మనవలు... అమెరికా ప్రయాణాలు - పాత సినిమాలు పాత పాటలు, పాత నవలలు, రోజుకొకరం కంపల్సరీగా ఒక జోకు చెప్పాలనే నిబంధన .... వాకింగ్ అరగంట. బాతాఖానీ గంట. ఎంత దగ్గిరయిపోయాం అందరం . "క్రిష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా.
    "మన ఊర్లు వేరు. ఉద్యోగాలు వేరు. ఎక్కడెక్కడనించో వచ్చి ఈ నేలను అపార్ట్ మెంటు కొనుక్కోడం - ఈ పార్కు బెంచి మనల్ని యిలా స్నేహితులని చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. ఆలోచిస్తే ' సాలోచనగా అన్నాడు జస్టిస్ చలపతిరావు.
    "మన సమస్యలు, బాధలు, సంతోషాలు అన్నీ అందరం మనసువిప్పి చెప్పుకునేంత దగ్గరయ్యాం ఆశ్చర్యంగా - నిజం చెప్పాలంటే మన నల్గురికి పెద్ద సమస్యలే లేవు. పిల్లల దగ్గరలేరన్న బాధ తప్ప "డిఐజి రామారావు అన్నారు. 'పాపం అదే అనేవాడు విశ్వనాధం - పిల్లలు దగ్గరలేరని మీరు బాధపడ్తుంటే పిల్లాడి దగ్గర వున్నానే అని నే బాధపడ్తున్నా. విచిత్రంగాదూ అనేవాడు. "లాయరు వెంకటేశ్వరరావు అన్నారు.
    "ఏమిటో పాపం , మీరంతా అదృష్టవంతులు నెలతిరిగే సరికి పదిహేను ఇరవై , పాతిక వేలు పెన్షన్ వచ్చి పడ్తున్నాయి. నిజంగా గవర్నమెంటు ఉద్గోగంలో ఉన్న సుఖం దేన్లో లేదయ్యా. భవిష్యత్తుకి చీకు చింత వుండదు. ప్రైవేటు ఉద్యోగాలే ముంది డబ్బు దులిపి చేతిలో పెట్టి పోమ్మంటాయి అనేవాడు. చీఫ్ ఇంజనీరు క్రిష్ణమూర్తి అన్నారు. "నిజమే మరి. ఉద్యోగంలో ఉండగా ప్రైవేటు ఉద్యోగాలంత జీతాలుండక పోయినా రిటైరయ్యాక దిగులుండదు గదా. అయినా పాపం వెర్రివాడు. ప్రావిడెంటు ఫండంతా కొడుకు చేతిలో పెడతారా ఎవరన్నా ..... ఈరోజుల్లోనూ ఇంత తెలివి తక్కువ తనం." "ఏం చేస్తాడు పాపం పరిస్థితులలా వచ్చాయి. ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్ళికి అప్పు తీసుకున్నాడు. తండ్రి పోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చి పడ్డాయి. చేతికి వచ్చిన పన్నెండు లక్షలన్నా దాచుకోలేకపోయాడు. మూడు బెడ్ రూముల ఇల్లు కొనుక్కుందాం నాన్నా మీకూ ఖర్చు కలిసి వస్తుంది, బ్యాంకిలోను ఇస్తుంది. ఒకవంతు మనం కట్టాలి - అంటే నమ్మాడు. ఏదో ఖర్చుల కాని మూడు లక్షలుం చుకుని మిగతాది అపార్ట్ మెంటు కట్టడానికి ఇచ్చేశాడు" క్రిష్ణమూర్తి విచారంగా అన్నాడు.
    "ఈరోజుల్లో ఇంత అమాయకత ఏమిటో, ఏం ఇచ్చినా మన తదనంతరం అని రాసుకోవాలి ముందే ఇస్తే రోగం రొష్టు వస్తే మనకెవరిస్తారు."
    "విశ్వనాధాన్ని చూసన్న మనం ఇంక కాస్త తెలివి తెచ్చుకోవాలి. డబ్బంతా లాక్కుని వూరికే ఇంట్లో టిని కూర్చున్నట్టు కొడుకు కోడలు సాధిస్తుంటే పాపం భరించలేక పోయాడు. తన కంటెను భార్య ఇంట్లో పనిమనిషి, పనిమనిషి  అయిపొయిందని దిగులు పడేవాడు. అభిమానం ప్రేమ, గౌరవం చూపితే చాకిరి కష్టం అనిపించదు అనేవాడు. ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా వుండలేకపోయేవాడు మాటల మధ్య.
    "డానికి దగ్గట్టు అతనికి ఆవిడకి బ్లడ్ ప్రెషర్ , షుగరు - మందులు మాకులకు అవడ్డీ సరిపోయేది కాడు . ఊరికే తిండి పెడ్తున్నట్టు కోడలి మాటలు...."
    "పాపం ఆ యిల్లాలిని చూస్తె జాలేసేది. ఎప్పుడన్నా పక్క ఆపార్ట్ మెంట్ అని ఏ ఆదివారమో వెడితే ..... ఆ ఇల్లాలి చాకిరి . ఆపీక్కు పోయిన మొహం.జాలేసేది క్రిష్ణమూర్తి ఆవేదనగా అన్నారు.
    "రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది . మహామహా వాళ్ళే తట్టుకోలేరు ఆస్పత్రి ఖర్చులు. ఒకసారి స్ట్రోకు. ఓసారి హర్ట్ అటాక్ - ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న కాస్త డబ్బు హరిన్చిపోయింది ప్చ్..... పాపం పాపం ఇంక ఆ యిల్లాలు పర్మనెంట్ పనిమనిషే ఆ ఇంట్లో..... మిత్రులంతా కొన్నాళ్ళు పోయిన విశ్వనాధాన్ని , బతికుండి బాధలనుభావిస్తున్న శరదమ్మని చూసి జాలిపదేవారు. అంతకంటే చేసేదేం లేక.

 Previous Page Next Page