తెల్లారి వాడిపోయిన నా మొహం, ఏడుపుతో ఎర్రబడ్డ కళ్ళుచూసి అమ్మ "రాత్రంతా నిద్రలేనట్టుంది. హాయిగా వేడినీళ్ళు స్నానం చేసి, టిఫిను తిని పడుకో" అంది నవ్వి.
అలాంటి అమ్మకి ఏం చెప్పను? ఎంత తల్లి అయినా నా భర్త ప్రవర్తన ఇది అని మొదటి రాత్రి జరిగింది ఎలా చెప్పను? నోటి చివరివరకు వచ్చిన మాటల్ని బలవంతాన నిగ్రహించుకున్నాను.
జరగవలసింది జరిగాక యిప్పుడు చెప్పి ప్రయోజనమేమిటి? అసలు విషయ మేమిటో తెలుసుకోకుండా ముందే చెప్పి వాళ్ళనీ బాధ పెట్టడం ఎందుకు? నిన్న రాత్రికి ముందు ఈయన సంగతి తెలిస్తే యెంత బాగుండేది? ఆలోచించి ఆయన సంగతి ఏమిటో తేలాకే చెప్పవచ్చని ఊరుకున్నాను.
రెండో రాత్రి గదిలోకి వెళ్ళకుండా ఏ కారణంతో తప్పించుకోవాలా అని ఎన్ని విధాలో ఆలోచించాను. కాని అది ఇంట్లో పెద్ద అలజడి లేవదీస్తుంది. బంధువుల గుసగుస లకి దారి తీస్తుందని ఆ ఉద్దేశ్యం విరమించుకున్నాను.
ఆ సమస్య రాకుండానే ఆ మధ్యాహ్నం ప్రకాష్ రాత్రి ఫ్లయిట్ లో హనీమూన్ కి వెళ్ళిపోతాం అని నాన్నకి చెప్పేడట. నాన్న అమ్మ అయ్యో మూడు నిద్రలు అంటూ గోలపెట్టారు. కాని ఆయన వినిపించుకోలేదు. వాళ్ళమ్మ గృహప్రవేశం అంది. ఏం లేవని కొట్టిపారేశారు అతను. అంతా ఏమనలేక వూరుకున్నారు.
హనీమూన్ నించి ఇటువచ్చి సామానులు అవి తీసికెళ్ళాలి అంటే అన్నీ అక్కడికి పంపండి అన్నారు. అంత మూర్ఖంగా ఏం చెప్పినా కాదనే అల్లుడిని చూసి అమ్మ నాన్నా అతని స్వభావాన్ని అర్ధం చేసికోలేక బాధపడ్డారు. అమ్మ నన్ను చాటుగా పిలిచి హనీమూన్ నించి ఎలాగైనా ఇక్కడికి రావడానికి వప్పించమని చెప్పింది. అంతగా రాకపోతే ఉద్యోగం వూరు చేరగానే రాస్తే తాను సామానులు పట్టుకుని వస్తానంది.
ఒకరాత్రి అనుభవంతో ప్రకాష్ తత్వం అర్ధం అయ్యాక అలాంటి మనిషి వెంట వెళ్ళాలంటే ఏదో భయంతో గుండెలు దడ దడ లాడాయి...కాని తప్పదు? ఈ మనిషికి "హనీమూన్" ఏమిటి అని నవ్వు వచ్చింది అంత బాధలోనూ-
"పోనీ ముందురోజు అలా అయినా తరువాత సక్రమంగా ప్రవర్తించలేదా?" ఆరాటంగా అడిగింది శారద.
"ఆ మనిషికి సక్రమంగా ప్రవర్తించడం తెలిస్తే ముందురోజే అలా ఎందుకు గడుస్తుంది -" హనీమూన్ అంటూ తీసికెళ్ళి బెంగుళూరులో ఓ హోటల్లో పడేశారు. ఆ గదే మామూలు దంపతులకైతే స్వర్గంలా కనిపించేదేమో! నా పాలిట నరకం అది! ఎటు పోవడానికిలేని బంధిఖానా తయారు చేశారు నాకోసం!
ఎవరితో చెప్పుకోడానికి కూడా వీలు లేకుండా నా వాళ్ళనించి దూరం చెయ్యడానికి ఈ హనీమూన్ ఏర్పాటు చేశారని రెండు రోజుల్లోనే తెలుసుకున్నాను.
ఆ రాత్రి-భోజనానికి ముందు సీసాలు పెట్టుకు కూర్చున్నారు. "రుచి చూస్తావా డియర్." అన్నారు గ్లాసులోకి వంచి. తిరస్కారంగా మొహం తిప్పుకున్నాను.
ఆయనలా నా కళ్ళముందే నేను లేనట్టే తాగడం సహించలేక ఆయన వంక సూటిగా చూస్తూ "నేను కొన్ని విషయాలు అడుగుతాను. జవాబు యిస్తారా?" అన్నాను కరకుగా.
అప్పటికే మందు తల కెక్కింది గాబోలు ఉషారుగా సిగరెట్టు పొగ నామీదికి ఊది- "ఓ యస్" అన్నారు.
"ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు?"
"వాట్ - పెళ్ళి ఎందుకు చేసుకొంటారు. ఆడదాని అవసరం కోసం."
"హు....ఆడది మీకు పెళ్ళిచేసుకోకపోయినా దొరుకుతుందిగా." కసిగా అన్నాను.
"కరక్ట్. ఆడదాని అవసరం అంటే యిల్లు వాకిలి, వంట గింట - పిల్లలు. ఎన్నాళ్ళు బాచలర్ లైఫ్ అని విసిగెత్తి చేసుకున్నాను."
"ఓహో! భార్య అంటే మీరిచ్చే నిర్వచనం ఇదన్న మాట..."
"అబ్బబ్బ, అంత పెద్ద మాటలు వాడితే అర్ధాలు నాకు తెలియవు." చిద్విలాసంగా అన్నారు. మాటలకోసం ఒక్కక్షణం తడుము కున్నాను.
"మీ కిన్ని వ్యసనాలు వున్నాయని దాచి ఒక స్త్రీని మోసంచేసి పెళ్ళాడటం అమానుషం అన్పించలేదా. ఏ స్త్రీ అయినా తెలిసి తెలిసి మీలాంటి వారిని పెళ్ళాడుతుందనుకున్నారా." ఆవేశంగా అడిగాను.
"అందుకేగా దాచింది." వేళాకోళంగా అన్నారు.
అలా మాట్లాడే మనిషిని ఏం చేయగలరు ఎవరయినా.
"ఆడదంటే మీ కింత చులకనభావం ఎందుకు?"
ఆయన ఒక్కక్షణం మాట్లాడలేదు. తరువాత కసిగా చేతిలో సిగరెట్ ఏష్ ట్రేలో నొక్కుతూ- "మీ ఆడ వాళ్ళని ఇలా అణచి వుంచాలి. అలా అయితేనే మీరు లొంగుతారు. చనువిస్తే నెత్తికెక్కుతారు..." కటువుగా అన్నారు.