Previous Page Next Page 
మాయ జలతారు పేజి 23


    రామారావు మాట్లాడలేదు. తల వంచుకొని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాడు.
    "నువ్వు సుత పెద్దోనివైనావు. పోరనివి కాదు. జర్రంత సదవు సుత నేర్చినవు జర సోచాయించు. నీ తిరుగుల్లేం మంచిగుంటల్లేవు గాపోరే దొరికినాది నీకు?"
    రామారావు అప్పటికీ మాట్లాడలేదు.
    "నేను చెప్పెడ్ది చెప్పిన, అటెన్క మీ మర్జీ" అని లేచి బయటికి వచ్చాడు బాలయ్య.
    రామారావు మనసు మనసులో లేదు. రాత్రంతా ఏవేవో ఆలోచించాడు.
    తెల్లవారింది. అది పండుగరోజు, శలవురోజు, సంబరాలరోజు. మహాకాళి  జంటనగరాలకు అధిష్టాన దేవత సికింద్రాబాదులోని మహాకాళి పూర్వం రక్తబలినే కోరేది. ఆ రోజు రక్తం నదులుగా ప్రవహించేది కాని, ఆర్యసమాజ ప్రభావంగల మానవసేవా సమితి వలన ఆ దేవత రక్తం కోరడం మానేసింది. ఇప్పుడు రక్తపు చుక్క సైతం చిమ్మదు. కొబ్బరికాయలు గుట్టలుగా పగులుతాయి. ఆ తల్లి పండుగ అందరూ చేసుకుంటారు. అసలు అదే ప్రధాన పర్వదినం జంట నగరాలకు.
    గూడెంలో పండుగ శోభ వ్యాపించింది. ప్రతి ఇల్లూ శుభ్రంగా ఉంది. అలికి ముగ్గులు పెట్టారు. గడపలను పసుపు కుంకుమలతో అలంకరించారు. వేపమండల తోరణాలు కట్టారు. ఆబాల గోపాలం తలంటి పోసుకున్నారు. అందరి ఇండ్లలోనూ మాంసం ఉడికింది. అందరూ మంచి భోజనాలు చేశారు. వేపచెట్లక్రింద చేరారు. జముకుల కథ చెప్పించారు.
    జుముకు జుముకు జు జుం జుం
    జుముకు జుముకు జు జుం జుం
    అంతా పాండవులోరు ఆఁ ఆఁ ఆఁ
        అంతా పాండవులోరు
    ఏశాల్మార్చినారూ ఆఁ ఆఁ ఆఁ
        ఆఁ ఏశాల్మార్చినారూ
    కొలువున చేరినారూ ఆఁ ఆఁ ఆఁ
        ఆఁ కొలువున చేరినారు
        ఆఁ ఆఁ ఆఁ అప్పుడు
        ఆఁ అప్పుడు
    అప్పుడు విరాటరాజుగారు చూచిండు కుర్చీలమీద కూకుండపెట్టిండు. వారి చహరలు చమ్కాయిస్తున్నాయి. వారికి కొలువులిచ్చుండు ఏం కొలువు లిచ్చిండయా అంటే _
    ఆఁ ఏమ్ కొలువులిచ్చండయా అంటే
    ధరమరాజుకు బాపనాయన కొల్వు
        ఆఁ బాపనాయన కొల్వు
    భీములోరికి వంటలయ్య కొలువు
        ఆఁ వంటలయ్య కొలువు
    అరుజునులోరికి బుహనల కొలువు
        బుహనల కొలువు
    అరే! బుహన అంటే ఏందిర?
        అంటే ఆడది కాదు    
        మరి మొగోడా?
        అంటే మొగోడు కాదు    
        మరి పోరడార!
        అంటే పోరడు కాదు
    ఆడది కాదు, మొగోడు కాదు, పోరడు కాదు, మరి నీబొందా! నీ మొగమా? ఏందిర నీ కత, నేను ఇననుపో
    అట్లకాదుర, ఆడది కాదు, మొగోడు కాదు, పోరడు కాదు నువ్వేర బుహనల
    జనమంతా గొల్లుమని నవ్వారు.
    పాండవుల అజ్ఞాతవాస కథ, విరాట పర్వం యావత్తూ చెప్పారు కథకులు. వారికి విరాటపర్వం తెలుగున రాసినవాడు తిక్కన అనే విషయం తెలియదు. వారు చెప్పిన కథకు శాస్త్రం లేదు. రాగ తాళాలు లేవు. వారు జానపదులు వారు చెప్పినది జానపద గాథ. అందు తన్మయులైపోయారు జనులు. కథలో లీనం అయిపోయారు. కీచకుడు ద్రౌపది వెంటపడినాడని విన్నారు ఉద్రిక్తులయినారు. ఆడవారు నేలమీద ఊశారు. కీచకుణ్ణి బూతులు తిట్టారు. భీముడు కీచకుణ్ణి చంపాడని తెలుసుకున్నారు. నిట్టూర్పులు విడిచారు. భీముణ్ణి మెచ్చుకున్నారు. ద్రౌపదిని కీచకుని శవంమీద వేసి కట్టారని విన్నారు. "అయ్యో, ఎంతగతి పట్టెనే తల్లీ నీకు? గీ ఉపకీచకులాడి నుంచి వచ్చిరే?" అని ఏడ్చారు. భీముడు ఉపకీచకుల నందరినీ హతమార్చాడు. "భీమన్నా! యాళకొచ్చినవు మా తల్లిని కాపాడినవు" అనుకున్నారు. ఉత్తరుని ప్రజ్ఞలు విన్నారు. నవ్వుకున్నారు. జమ్మిచెట్టుమీద ఆయుధాలను చూచి శవం అనుకొని జంకుతాడు ఉత్తరుడు. "ఈడు యుద్ధం చేస్తడట. కిరీటాల కుచ్చులు కూడా తెస్తనని చెప్పిండు చెల్లెకు" అని చెప్పుకున్నారు. యుద్ధం జరుగుతున్నంతసేపూ శ్వాస బిగబట్టి విన్నారు. అర్జునుడు అందరినీ మూర్చిల్లచేశాడు. అప్పుడు శ్వాస పీల్చుకున్నారు. విరాటుడు కంకుబొట్టు మొఖాన పాచికతో కొట్టడం విని భగ్గుమన్నారు. ధర్మజుని రక్తం నేలమీద పడకుండా దోసిలితో పట్టుకొని "ఈ మహాత్ముని రక్తం నేలమీద పడితే నీ రాజ్యం నాశనం అవుతుంది" అన్న ద్రౌపది మాటలు విని ఆమెకు మ్రొక్కారు.
    ఉత్తర పెళ్ళి జరిగింది.
    అందరూ ఆనందించారు.
    సాయంకాలం కావస్తూంది. అందరూ అలంకరించుకున్నారు. ఆడవారు పెద్ద కుంకుమబొట్టు పెట్టుకున్నారు. శుభ్రంగా తోమి తళతళ మెరిసే బిందెలకు పసుపు కుంకుమ పెట్టి అలంకరించారు. వేపాకు మండలు కట్టారు. వాటిలో నీరు నింపి అలంకరించబడిన మరొక బిందె దానిమీద పెట్టారు. దానిమీద చెంబు, చెంబుమీద మరొక చెంబు పెట్టారు. అది బోనం. ఆడవారంతా తలలకు బోనాలు ఎత్తుకొని తయారుకాగా మగవారు డప్పులు తీసుకొని బయలుదేరారు.
    డవ్కు డవ్కు డవ్కూ డవ్కూ
    డవ్కు డవ్కు డవ్కూ డవ్కూ
    పందెం వేసుకొని దప్పులు మోగించసాగారు. పోతురాజు కొరడాతో గుంపులో దూకాడు. చబుకు గిర్రున తిప్పాడు. జనం అంతా దూరం జరిగారు. పోతురాజు వార్నీషు రంగు పూసుకొని, పులిచారలు తీర్చి, వేపాకు మొలకు కట్టుకొని ఆడుతున్నాడు. శివం వచ్చింది ఆట సాగింది. డప్పుల జోరు హెచ్చింది. ఈలలమీద ఈలలు. గిర్రుమని తిరుగుతున్నాడు. కొరడా ఝుళిపిస్తున్నాడు. జనం పరుగెత్తుతున్నారు. మళ్ళీ గుమిగూడుతున్నారు.
    "పొద్దుమింకుతాంది నడువురి నడువురి" అన్నాడు బాలయ్య. ముందు డప్పులవాళ్ళు, తరువాత పోతురాజు, జనం, వారి వెనుక బోనాలు ఎత్తుకున్న ఆడవారు సాగిపోయారు.
    ఊరేగింపు సాగింది. పిచ్చయ్య కర్ర అందుకొని జనంలోకి దూకాడు. పరమయ్య మరో కర్రతో దూకాడు. జనం దూరం జరిగి వర్తులాకారమైన చోటు దొరికింది. డప్పులు మోగుతున్నాయ్. కర్రసాము సాగించారు. పరమయ్యా, పిచ్చయ్యలు ఎప్పటికప్పుడు ఒకరి కర్ర ఒకరి నెత్తినో, నడుం మీదనో పడేట్టు కనిపిస్తూంది కాని, తీరా దెబ్బ కర్రమీదనే పడుతుంది. నడిరోడ్డుమీద జరుగుతూంది సాము. ఆ సాము చూచి డప్పులవాళ్ళకు కూడా ఉత్సాహం హెచ్చింది. బస్సులు, కార్లూ రెండువైపులా నిలిచాయి కాని, ఒక్క హారన్ వినిపించలేదు. బస్సులో ఉన్న జనమంతా చూస్తున్నారు. కార్ల టాపులెక్కి చూస్తున్నారు కొందరు.
    వారి హస్తనైపుణ్యం వింతగానూ విచిత్రంగానూ ఉంది. కర్రలు మెరుపులా తిరుగుతున్నాయి. చూస్తూ చూస్తూనే గిర్రున తిరిగేస్తున్నారు. ఈలలు, చప్పట్లు వారిని మరింత ప్రోత్సాహపరుస్తున్నాయి. గుంపును చెదరగొట్టడానికి వచ్చిన పోలీసు సైతం చూస్తూ నుంచుండిపోయాడు.
    కొంతసేపటికి ఊరేగింపు కదిలింది. పోతురాయని ఆట సాగింది. మళ్ళీ కొంతదూరం సాగింతర్వాత పుల్లయ్య, బాలయ్య మధ్యన దూకారు. వారికి వర్తులాకారపు స్థలము వదిలి జరిగారు జనం. వీరు ఆట సాగించారు. అది నృత్యం.
        "తద్దినక్క తిక్క
        తద్దినక్క తిక్క" - డప్పులు సాగాయి.
    "హేయ్ హేయ్" ఎగిరారిద్దరూ ఇద్దరూ యువకులైపోయారు. యువకులు సైతం సిగ్గుపడిపోయేట్టు గంతులేస్తున్నారు. తలకూ మొండానికి సంబంధం లేనట్లు తలలు తిప్పారిద్దరూ. చేతులు వెనక్కు ముందుకూ ఆడాయి. ఒకసారి పైకి లేస్తున్నాయి. ఒకసారి కిందకు పడుతున్నాయి. ఈలల మోత డప్పుల చప్పుళ్ళు ఆట మాంచి జోరుగా సాగుతూంది.
    "నడవండి నడవండి" అన్నారు కొందరు.
    ఇద్దరికీ చమటలు కారిపోయినై. ఇద్దరూ తుడుచుకున్నారు. ఊరేగింపు సాగిపోయింది. ఊరేగింపు మహాకాళి గుడిదగ్గరి బొమ్మల గుడి దగ్గరికి వచ్చేసింది. రెండువైపులా ఉన్న కాలు బాటల మీద మట్టి బొమ్మలు అమ్ముకొంటున్నవారూ, బొంగుపేలాలూ, బత్తీసాలూ, చిలకలూ అమ్ముకునేవారూ, ఒక పిల్లను చేటలో కోసిపెట్టి ఆ రక్తాన్ని చూసి పైసలడుక్కునే దొమ్మరివారూ, శక్తిబొమ్మ నెత్తిన పెట్టుకొని ఆటలాడే బైండ్లవాండ్లూ ఉన్నారు. జనం ఇసుకవేస్తే రాలకుండా ఉంది.

 Previous Page Next Page