Previous Page Next Page 
శరతల్పం పేజి 23

 

    ఇల్లంతా గలీజుగా ఉంది.
    లచ్చమ్మ మంచంలో పడి వుంది - దుప్పటి కప్పుకొని.
    పిచ్చమ్మ ఇదివరకు లచ్చమ్మను చూడలేదు - ఇదే మొదటిసారి చూడ్డం.
    లచ్చమ్మ ముఖంలో సౌమ్యత కనిపించింది.
    పిచ్చమ్మ కెందుకో నమ్మకం కుదిరింది. లచ్చమ్మ కాళ్ళ మీద పడి హోరుమంది.
    లచ్చమ్మకు జ్వరం - పురిట్లో సంధి తగిలింది. పుట్టినబిడ్డ పోయాడు. లేవలేకుండా వుంది. నీరసంగా ఉంది. వళ్ళు మసిలిపోతుంది. కాళ్ళ మీద ఎవరో పడ్డారనుకున్నది - ఏడుపు విన్నది.
    "ఎవరు - ఎవర్నువ్వు - ఎందు కేడుస్తవు?" లచ్చమ్మ మాటలు నీరసంగా ఉన్నాయి.
    "అక్కా! " పిచ్చమ్మ ఏడుపులోనే అన్నది.
    ఆ పలుకే ఏదో ఉత్సాహం తెచ్చింది లచ్చమ్మకు. ఎందుకో బాగనిపించింది.
    "చెప్పు ఏంది చెల్లీ!"
    "అక్కా! బావ లేకుంటే బతకలేను.......నీ కాళ్ళ కాడ పడుంట .......జరంత జాగియ్యి.....అక్కా.....కాదనకు ......బాయిలనన్న చెర్లనన్న పడ్త......ఇక బతకను ...."
    లచ్చమ్మ కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆమె మనసు నీరు నీరయింది.
    "చెల్లె! ఇట్లరా!" అన్నది లచ్చమ్మ.
    పిచ్చమ్మ ఆమె తల దగ్గరికి వచ్చి నేలమీద కూలబడ్డది.
    పిచ్చమ్మవా!" పిచ్చమ్మ చేయి చేతులోకి తేసుకొని అడిగింది లచ్చమ్మ.
    అవునన్నట్లు తల ఊపింది పిచ్చమ్మ.
    "చెల్లె......అయన అన్ని చెప్పిండు నాకు౧ ఉండు .....ఈడనే ఉండు.....నువ్వు లేకుంటే అయన బతికేటట్లు లేడు.......ఉండు......నువ్వుండు.....బతికుంటే నేనుంట.....ఏమంటావు? .....ఉండనా ......ఉంటవా?"
    "అక్కా! ఎంత మంచిదానివి నువ్వు! నువ్వు ,మనిషివి కావు.....దేవతవు! అక్కా! నే నిక్కడ్నే ఉంట!" అని లచ్చమ్మ మీద పడి ఏడ్చేసింది పిచ్చమ్మ.
    అంతా విన్న గురువయ్య లోనికి వచ్చాడు.
    "లచ్చీ నిజంగ నువ్వు లచ్చిందేవివే! ఎంత పెద్ద బుద్ది నీది! పిచ్చి నుండ మన్నావు కాదు! " కళ్ళు చెప్పగిల్లగా , గొంతు బొంగురుపోగా అన్నాడు గురువయ్య.
    "అంత అమ్మగారి దయ! అయ్యగారి దయ! మనం మందికోసం బతకాల్నట! ప్రేమ ఎంత ఇస్తే అంత వస్తదట!"
    "లచ్చీ! అక్కా!" ఇద్దరూ ఒకేసారి అన్నారు. "ఎంత గోప్పదానివి" అని.
    తరువాత ఎవరూ మాట్లాడలేదు.
    ముగ్గురూ ఒకర్నొకరు చూసుకున్నారు.
    ముగ్గురి కళ్ళల్లోనూ కన్నీరుంది.
    కన్నీటిలో కలిసిపోయారు ముగ్గురూ!
    తెల్లవారి బుచ్చమ్మ వచ్చి పిచ్చమ్మను రమ్మంది. - పిచ్చమ్మ రానంది. గురువయ్య ను తిట్టింది. - సాపించింది. నడిబజారులో నిలబడి గురువయ్య ఇంటి మీద దోసెడు మన్ను పోసింది. పంచాయితీ పెట్టిస్తానని చెప్పి, బెదిరించి , కొడుకుని పట్టుకొని వెళ్ళిపోయింది బుచ్చమ్మ.
    తరువాత తాటివనం తొక్కలేదు గురువయ్య - సారా దుకాణంలో కాతా సాగించాడు ! ఇన్నాళ్ళ తర్వాత ఇవ్వాళ గురువయ్య పదం వినిపించింది నారాయణస్వామికి. నాంచారమ్మ శ్రద్దగా వింటుంది.
    "ఏటి కేతంపెట్టి
    ఎయివుట్లు పండిస్తే
    మింగ మెతుకే ఎరగనక్కా
    గంజిలో
    ఒక్క మెతుకూ ఎరగనన్నా!"    "ఏమండీ, గురువయ్య పోతున్నాడండీ" నాంచారమ్మ చెప్పింది.
    "నాంచారూ! ఎవరి ఖర్మ వారిది. మనకు వారితో బంధం తీరిపోయింది. బాగుచేతమనుకున్న. వాడితో పాటు నేను బొందలపడ్డ. ఇగ వాణ్ని ఎవడు ఎత్త లేడు. నన్ను ఎత్తలేడు. బతికినన్నాళ్ళూ తల నేలకేసుకొని బతకాలె. మరిచిపో నాంచారూ! మరచిపో." మాటలయితే అన్నారు కాని అందులో ఏదో బంధం కనిపిస్తూనే ఉంది.
    "లచ్చమ్మ ఎట్లున్నదో! పాపం బిడ్డ పుట్టిపాయె! ఏమండీ పామును చంపినా పాపమే నంటరా!"
    "పిచ్చిదాన! భగవంతునికి పసిపాపల మీద కసి ఉంటాదే! చూసినవు గద - రోజు తన్నులేనాయే- డొక్క నిండ తిండి లేదాయే. మనసుకు రంపపు కొతాయే - బిడ్డ ఎట్ల బతుకుతది చెప్పు!"
    "పాపం లచ్చమ్మ కేట్లున్నదో!"
    "మనిషి వరుగైంది. పైనుంచి కాన్పు. ఇప్పుడు రోగాన పడ్డది. ఇప్పుడే పిచ్చోచ్చింది. దాని మనసు కెట్లుంటదాంటవు! కోత కోసినట్లుండదు! అది బతికి మాత్రం ఏం చేస్తదంటవు."
    "అట్లనకండి. పిచ్చమ్మక్కడుంటే లచ్చమ్మ మనింట్లో ఉంటుంది."
    "సరేలే! భగవంతుడు మంచిగా చూడనీ!"
    భగవంతుడు మంచిగా చూడలేదు. లచ్చమ్మ మూడోనాడు కన్ను మూసింది. పిచ్చమ్మ గురువయ్య గోడు గోడున ఏడ్చారు. నాంచారమ్మ గురువయ్య ఇంటికి వచ్చి చచ్చిన లచ్చమ్మకు పసుపు కుంకుమ పెట్టింది. గురువయ్య దగ్గర పైస లేదు. నారాయణస్వామి సహాయంతో ఉత్తర క్రియలు జరిపాడు గురువయ్య.


                                     12

    పిచ్చమ్మను వదులుకున్నా పిచ్చమ్మ నగలు వదులుకో దలచలేదు బుచ్చమ్మ. రామక్రిష్టయ్య బుచ్చమ్మను పూరికొల్పాడు - గురువయ్య ధర్మాన్ని నాశనం చేస్తున్నా డన్నాడు. "బాపనాయన్ను పాడు చేసిండు. ఇగ మీ యెంట పడ్డాడు. వానికి బాగా బుద్ది చెప్పకుంటే అసలు భూమ్మీద నిలిచేటట్లు లేడు." అన్నాడు రామక్రిష్టయ్య బుచ్చమ్మ ఇంటికి వెళ్ళి - అతనికి గురువయ్య పొలం మీద కన్నుంది.
    బుచ్చమ్మ పంచాయితీ పెట్టింది. రామక్రిష్టయ్యను పెద్ద మనిషిగా ఎన్నుకుంది. గురువయ్య నారాయణస్వామిని కోరుకున్నాడు. కాని నారాయణస్వామి ఈ తగాదాలో తల దూర్చన్నన్నారు. గురువయ్య కులం పెద్దలనే పట్టుకున్నాడు.
    "ఓరి గురువా! పంచాయితీ చెప్పమంటే ఊరికేనే ఉన్నాదిర! నువ్వు చేసింది తప్పు. పెద్ద కులపు పిచ్చమ్మను తెచ్చినవు. ఇగ కాదు కూడ దంటవా నాలుగు కల్లు కుండలోస్తే గాని కదలం - ఏమంటవా - మల్ల కులపోనికి కులమోడు సాయం చెయ్యకుంటే ఎవడు చేస్తడు?" అన్నారు పెద్దలు.
    గురువయ్యకు గత్యంతరం లేదు. అతను రామక్రిష్టయ్య దగ్గర అప్పు తెచ్చాడు. బుచ్చమ్మ దగ్గర కల్లు తెప్పించాడు. గూడెంలో పెద్దలు కూడి తాగి తందనాలాడి చిందులు తొక్కారు. కులం పెద్ద మైసయ్య "ఓరి గురువా! నువ్వేమన్న అనుర నువ్వు చేసింది తప్పే. పెద్ద కులపోల్లను తెచ్చి గూడెంల పెడ్తే గూడానికి మచ్చయితాదిర! గూడానికి నిప్పంటుకుంటది- కాలబడిపోతది - తగలబడి బూడిదాయితది. పిచ్చమ్మను తీస్కపోయి బుచ్చమ్మ కాడ తోలిరార! అరె గురువా అదే మంచిదిరా! అంతేర , అట్లనే చెయ్యల్ర!" అన్నాడు.
    మైసయ్యకు తాగిన మైకం ఉన్నమాట నిజమే కాని అతడు అలా అన్నది బుచ్చమ్మ పోయిస్తానన్న కల్లుని గుర్తుంచుకొని. మైసయ్యకు తాళం వేశారు మిగతావాళ్ళు. "ఆవు! గట్లనే చెయ్యాలే. పిచ్చమ్మన్తోల్కపొయ్యి బుచ్చమ్మ కిచ్చి రావాలే" అనేశారు -- వాళ్ళకూ కొంత ఆశ ఉంది - బుచ్చమ్మ నుంచి.
    ఆ మాటలు విని నిలువునా కుంగిపోయాడు గురువయ్య. కంటతడి పెట్టి మైసయ్య కాళ్ళ మీద పడ్డాడు ---
    "అన్న౧ మైసన్న! అట్లనకే ఆ మాటనకే. పిచ్చిని వదలమనకే - నీ కొల్మోక్తనె - నీ కడుపున పుడ్తనే - నీకు బంచోడ్నే ఆయిత. ఆ మాటనకు. పిచ్చంటే ఏందే! నా రకతంలా రకతమైంది. పానంల పానమైంది. అదెట్ల పాతదే. అది మాలల్ల కలిసే. - మల్ల అడికేట్ల పాతదే- కాల్మొక్త - ఆ మాటనకు" భళ్ళున ఏడ్చేశాడు గురువయ్య.
    "ఓరి గురువయ్య! లేర లే . మల్ల పిచ్చి పోకుండ ఇశారిచ్చమంటావు. గట్లనే గని మల్ల రొండు కుండలు తెప్పించు - ఎమో గట్ల చూస్తడు - పిచ్చి కావాలె పైకం కావల్నంటెట్లరో?"

 Previous Page Next Page