Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 23


    అప్పుడు ఆయనకి కనబడ్డాడు మంచం కింద ఉన్న రాజా.


    "ఏమిటిది?" అన్నాడాయన కోపంగా.


    బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చాడు రాజా.


    "మీరా మేస్టారూ? ఎవడో నన్ను ఫినిష్ చెయ్యడానికి వచ్చాడనుకుని కాళ్ళు పట్టుకు గుంజా! ఇంకెప్పుడూ నన్ను ఇట్లా సర్ ప్రయిజ్ చెయ్యకండి. మీకే డేంజరు" అన్నాడు.


    ఆనందరావుగారికి హఠాత్తుగా కోపం తగ్గిపోయి, దాని స్థానంలో ఉధృతమైన నవ్వు చోటుచేసుకుంది.


    "ఓరి భడవా!" అన్నాడు మురిపెంగా.


    వెంటనే అంటించాడు రాజా - "సార్...! నేను గ్యాంగ్ లీడర్ ని కావచ్చు, రౌడీలకు రౌడీని కావచ్చు, కేటుగాడ్ని కావచ్చు, జగత్ కిలాడీనీ, గ్రేట్ గాంబ్లర్ నీ, కిల్లర్ నీ కావచ్చు...కానీ డాఫర్ నీ, బ్రోకర్ నీ మాత్రం కాదు. మీరే చెప్పారుగా - 'భడవా' అంటే తార్పుడుగాడని అర్థమనీ..." అన్నాడు.

    
    అవాక్కయిపోయాడు ఆనందరావుగారు.


    వీడు పిల్లాడు కాడు! పిడుగు! నిజం!


    "సరే! పడుకో. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు" అన్నాడు.


    మళ్ళీ మంచం కింద దూరబోయాడు.


    "పైన పడుకో" అన్నాడు ఆనందరావు.


    "సార్...! నా ప్రాణాలు ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు... ఈ విషయంలో నేనెవ్వరి మాటా వినను... పాపం నా ప్రాణాలంటే నాకు పంచప్రాణాలు" అన్నాడు రాజా.


    "సరే! నీ ఇష్టం" అని వెళ్ళిపోయాడు ఆనందరావు.


    మంచం కింద దూరాడు రాజా.


    అర్థరాత్రి తర్వాత అతనికి నిద్రపట్టింది.


    అది అతను మామూలుగా పడుకునే టైము.


    పడుకున్న పావుగంటకే మళ్ళీ ఎవరో లేపేసినట్లు అనిపించింది.


    బద్ధకంగా కళ్ళు తెరిచి చూశాడు.


    ఇంకా తెల్లారినట్లు లేదు.


    అయితే దీపాలు వెలుగుతున్నాయి.


    మనుషులు మెదులుతున్న చప్పుడు.


    కొద్ది నిమిషాల తర్వాత గణగణ గంట వాయిస్తున్న చప్పుడు వినబడింది. శ్లోకాలో, మంత్రాలో గాని చదువుతున్నారు ఆనందరావుగారు.


    మంచం కింద నుంచి బయటికి వచ్చి, ఒళ్ళు విరుచుకున్నాడు రాజా.


    హాల్లో అప్పటికే అరడజను మంది పిల్లలు వున్నారు.


    వాళ్ళలో ఒకడు మహా మంచి బాలుడిలా కనబడుతున్నాడు.


    వాణ్ణి పిలిచాడు రాజా.


    "రేయ్ సత్రకాయ్!"


    "ఎవరు? నేనా?" అన్నాడు 'సత్రకాయ్' అదిరిపడి.


    "నువ్వే! సార్ అడిగితే నేను బయటికెళ్ళానని చెప్పు."


    "అమ్మో! ఎక్కడికెళ్తున్నావ్?"


    "టాయిలెట్ కి!"


    "లోపలుందిగా!"


    "టాయిలెట్ కెళ్ళేటప్పుడు సిగరెట్ కాల్చాలి నేను. ఇక్కడ కాలిస్తే ఆయన గుండాగి పోతుంది"


    నిలువు గుడ్లు పడ్డాయి 'సత్రకాయ్' కి. పిశాచపు పిల్లని చూసినట్లు చూశాడు రాజాని.


    రాజా వెళ్ళిపోయాడు.


    చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.


    వచ్చేటప్పుడు తాజ్ మహల్ హోటల్లో సుష్టుగా తినేసి వచ్చాడు అతను.


    ఎక్కడికి వెళ్ళావనీ, ఏం చేశావనీ రాజాని అడగలేదు ఆనందరావు. పిల్లలని కూర్చోబెట్టుకుని పాఠం చెప్పడం మొదలెట్టాడు.


    "ఇవాళ చరిత్ర పాఠం చెప్పుకుందాం! ప్రతి దేశానికీ, ప్రతి ప్రాంతానికీ ఒక చరిత్ర వుంటుంది.అలాగే, ప్రతి మనిషికీ కూడా ఒక చరిత్ర వుంటుంది.


    అది మంచి చరిత్రా, దుష్ట చరిత్రా అన్నది వేరే సంగతి.


    గొప్ప పనులు చేసినవాళ్ళు చరిత్రలో మిగిలిపోయి, చారిత్రక పురుషులు అవుతారు.


    శ్రీకృష్ణదేవరాయలు అలాంటి యుగపురుషుల్లో ఒకడు.


    శ్రీకృష్ణదేవరాయలు అనగానే సినిమాలో యన్.టి.ఆర్. పోషించిన పాత్రా, పైన వంపు తిరిగిన మీసం, ముత్యాల కిరీటం, ఇవి గుర్తొస్తాయి.


    కానీ చరిత్రని పరిశోధిస్తే, శ్రీకృష్ణదేవరాయలు అంత అందగాడు కాదనీ, కాస్త పొట్టిగా, పీలగా ఉండేవాడనీ, మొహాన స్ఫోటకపు మచ్చలుండేవనీ తెలుస్తుంది. ఆయన ముత్యాల కిరీటం పెట్టుకునేవాడో లేదో గాని, అప్పట్లో దర్బారు డ్రస్సులో "కుళ్ళాయి"కి చాలా ప్రాముఖ్యం ఉండేది. అంటే, మూరెడు ఎత్తున టోపీలాంటిది అందరూ తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళు. ఈ టోపీ ఎలా వుంటుందీ, న్యూస్ పేపరుని పొట్లంలా మడిస్తే ఎట్లా ఉంటుందో, అట్లా ఉంటుందన్న మాట! తిరుపతి వెళ్ళారా మీరెప్పుడన్నా?"


    అక్కడున్న పిల్లలందరూ "వెళ్ళాం వెళ్ళాం" అన్నారు ఉత్సాహంగా.


    అక్కడున్న వాళ్ళలో రాజా ఒక్కడే తిరుపతి వెళ్ళనిది.


    ఆనందరావు చెప్పాడు -   


    "తిరుపతి గుళ్ళోకి వెళ్ళగానే ద్వారం పక్కనే కృష్ణదేవరాయల విగ్రహం వుంటుంది. శ్రీకృష్ణదేవరాయలూ, ఆయనకి చెరోపక్కా ఆయన భార్యలు ఇద్దరూ -

 Previous Page Next Page