Previous Page Next Page 
జన్మభూమి పేజి 23

    "ఏ.సి. రూములు పెట్టిద్దాం. మీ అత్తయ్య చదువు చెపుతుందని" కేశవరావు హాస్యం చేశారు.
    "ఫ్యాన్లు డబ్బుంటే కొనుక్కోవచ్చు అత్తయ్యా. యిక ముందుచూడు పవర్ కట్ మొదలవుతుంది. అప్పుడేం చేస్తావు" హాస్యంగా అన్నాడు.
    రాజేశ్వరి బెంగగా చూసి అంతలోనే ఏదో గుర్తువచ్చి "ఆ ఎండాకాలం శలవులిచ్చేస్తారుగా అప్పుడు" అంది.
    "ఏం సుగుణా, నీ క్లాసెలా వుంది? కేశవరావు సుగుణని పలకరించారు. సుగుణ సిగ్గుపడింది."
    "ఏదో తెలుగుపాఠం చెప్పింది. డిక్టేషన్ ఇచ్చింది. నాతో వచ్చిందని సుగుణ దగ్గర కూడా బుద్దిగానే వున్నారు పిల్లలు. నలుగురం ఉన్నాం గనుక నాలుగు క్లాసులు తీసుకున్నాం కనుక ఈరోజు బుద్దిగానే అంతా చదివారు" రాజేశ్వరి బదులు చెప్పింది.
    "పద పద అన్నం పెట్టు. ఆకలేస్తుంది. రంగా మీరూ తినండి ఇక్కడ."
    "ఇంట్లో వంట చేశానండి. వెళ్ళి తింటాం..." అంటూ సుగుణ బయలుదేరింది.
    "మామయ్యా! సాయంత్రం అలా వెళ్ళి రేపు అందరినీ పంచాయితీ ఆఫీసుకి మీటింగు వుందని చెప్పి, ఆ అడ్రసు దొరుకుతుందేమో చూసి వస్తా" అంటూ లేచాడు రంగా.
                                                               *    *    *
    "మనందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యాం అంటే, మన వూరు బాగుచేసుకునే కార్యక్రమంలో రోడ్లు వేసుకోవాలి మున్ముందుగా. ఈ మట్టి రోడ్లు, ఈ గతుకులు గుంటలు చాలా ఛండాలంగా వుంది స్థితి. ఊరు మొత్తం తారు రోడ్లు వేయించుకోవాలి. దీనికి మీ అందరి సహాయం కావాలి. మొన్న శివాలయంకి రంగులు అవి కుర్రాళ్ళంతా ఎంతో ఉత్సాహంగా చేశారు. అలాగే ఈ ఊరంతా మొత్తం కల్సి 'శ్రమదానం' చేసుకుని మన రోడ్లు మనమే వేసుకోవాలి. దానికి కావాల్సిన సామాగ్రి వస్తుంది.
    పని ఎలా చెయ్యాలో చెప్పేందుకు ప్రభుత్వం ఓ సూపర్ వైజర్ ని యిస్తుంది. రోడ్డు రోలరు అవి ఫ్రీగా యిస్తారు. కేవలం సామాగ్రి సమకూర్చుకోడానికి డబ్బు కావాలి. దీనికయ్యే ఖర్చు సగం 'జన్మభూమి' పథకం కింద ప్రభుత్వం యిస్తుంది. మిగతా సగంలో సగం అంటే పావు ఖర్చు నేను పెడతాను. మిగతాది ఊరంతా కలిసి చందాలు వేసుకోవాలి. ఎవరి శక్తికి తగినట్టు వారు ఎంత ఇవ్వగలిగితే అంత సంతోషంగా ఇస్తే మన ఊరికి శుభ్రమైన రోడ్లు వస్తాయి. మీరంతా ఎంత యిచ్చారని అడగం- ఎవరికి తోచింది వాళ్ళు యివ్వాలి.
    పని మొదలుపెట్టినప్పుడు వూరిలో అందరూ తలో చెయ్యి వెయ్యాలి. మీకు కూలి వుండదు. కాని పనిచేసినన్నాళ్ళు మీకు టీ, టిఫిను, భోజనం మేం యిస్తాం. అందుకు అందరూ సరేనంటే పని ఆరంభిద్దాం" కేశవరావు వూరందరి ముందు చెప్పారు.
    "తప్పకుండా బాబయ్యా- కూలి మేం అంతా వూరికేం చేస్తాం. కాని డబ్బు మా దగ్గిరేం వుంది బాబూ" ఒక కూలి అన్నాడు.
    "ఎంతుంటే అంత ఐదు, పది, ఏభయ్, వంద, వెయ్యి ఎవరు తాహతనుబట్టి వారు... ఏం అంటారు ప్రెసిడెంటుగారూ... మీరేమంటారు మునసబుగారూ..."
    "అలాగే దాందేముంది. అంతా తలా చెయ్యి వేద్దాం... ఇదిగో నా వంతు పదివేలు ఇస్తాను..." ప్రెసిడెంట్ అందరి ఎదుట గొప్పగా అన్నాడు.
    "నేనేం తక్కువ తిన్నాను అన్నట్టు మునసబు వెంటనే" నాది ఐదు..." చౌదరి దర్పంగా అటు యిటు చూసి 'నాది పదిహేను...' కోమటి నరసింహం 'నేనూ ఓ ఐదు...' అందరూ ఉత్సాహంగా ఉత్సాహంగా వెయ్యి, ఐదు వందలూ, వందా అంటూ అరిచారు."
    వచ్చిన రెస్పాన్సుకి సంతోషిస్తూ కేశవరావు "రంగా ఓ కాగితం తీసుకుని రాయి అందరి పేర్లు" అని పురమాయించాడు. రోజూ కూలీలు, చేపల చెరువులు లీజ్ కు తీసుకున్నవాళ్ళు అంతా ముందుకువచ్చి తోచిన అంకెర రాయించారు.
    చాలు! ఈమాత్రం సహకారం మీరందిస్తే చాలు... ఈ రోడ్లు పని అవగానే, పిల్లలకి శలవులు ఆరంభమయ్యాక స్కూలు బాగుచేయించాలి. ఒక్కొక్క పని చేసుకుని ఏడాది తిరిగేసరికి మన గ్రామం 'మోడల్ విలేజ్' అవ్వాలి.
    అంతా సంబరంగా చప్పట్లు కొట్టారు.
                                    *    *    *
    మధ్యాహ్నంపూట వూరిలో ఆడవాళ్ళంతా ఇంగ్లీషు నేర్చుకోవడానికి రావడం ఆరంభించారు. మొదటిరోజు ఎనిమిది,రెండోరోజు పన్నెండు, మూడోరోజు పదిహేనుమంది వచ్చారు. ఆ వూరిలో కాస్త వున్నవారు, కాస్త చదువుకున్నవారు రావడం ఆరంభించారు. పుస్తకాల జోలికి పోకుండా కేవలం రోజూ దైనందిన కార్యక్రమంలో ఇంగ్లీషులో ఎలా మాట్లాడాలో చెప్పడం ఆరంభించింది.
    ఓ ప్రశ్నవేస్తే దానికి ఏం జవాబు చెప్పాలి. ఇతరులతో మామూలు విషయాలు, ఇంట్లో రోజూ జరిగే పనులు గురించి చెప్పి వాటికి అర్ధం చెపుతూ, సాధారణంగా జరిగే గ్లామర్ మిస్టేక్స్ అన్నీ ఓ గంట చెప్పి, "వాట్ ఈజ్ యువర్ నేమ్" లాంటి చిన్న ప్రశ్నలు, జవాబులు చెప్పింది.      
    మధ్యాహ్నం వచ్చే ఆడవారికంటే సాయంత్రం రైతుల భార్యలు, కూలీల భార్యలు, హరిజనవాడనుంచి మొత్తం నలభైమంది ఆడవాళ్ళు, చదువుమానేసి ఇంట్లో కూర్చున్న పెద్దపెద్ద పిల్లలు ఓ పదిహేనుమంది వచ్చారు. ఇంటిముందు జాగాలో లైటు పెట్టించారు కేశవరావు.
    "మనం ఏదన్నా ఓ కార్యం తలపెట్టినప్పుడు విఘ్నేశ్వరుడిని తలుచుకుని ఆరంభిస్తాం. మీ చదువుకి కూడా శుభం కలగాలని, ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని గణేశుడ్ని ప్రార్థించుదాం - మీలో ఎవరికన్నా 'శుక్లాం బరధరం' వచ్చా?" అంది రాజేశ్వరి. అంతా మొహాలు చూసుకున్నారు.   
    "సరే. నేనే చెపుతాను పద్యం. మీరంతా నాతో అనండి..." అని రాజేశ్వరి, సుగుణ కల్సి పద్యం చెపితే అంతా వంత పాడారు.
    "నేను మీకు చదువంటే అక్షరజ్ఞానం మాత్రమే కాదు, లోకజ్ఞానం కూడా. అక్షరాలతో పాటు మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మీ అంతట మీరు చదువు నేర్చుకుని, పుస్తకం, పేపరు చదవడం వచ్చేవరకు రోజుకి ఓ సంగతి చెపుతాను. ఓ రోజు చరిత్ర, సైన్సు, జాగ్రఫీ, లెక్కలు యివన్నీ రావాలి. ఈ రోజు మన మొదటిరోజు. అసలు మనిషి పుట్టుక ఎలా జరిగింది తెల్సుకుందాం" అంటూ మొదలుపెట్టి పంచభూతాలు అంటే ఏమిటి, నీటి జీవకోటి ఎలా మొదలైంది.
    జలచరాలు, భూచరాలు, కోతుల నుంచి కాలక్రమాన మనిషి ఎలా రూపుదిద్దుకున్నది, ఆ తర్వాత ఆటవిక యుగం, రాతియుగంలో మనిషి కాలక్రమాన ఎలా వ్యవసాయం, పనిముట్లు, పడవ తయారీ వగైరాలు అన్నీ చెప్పింది. అంతా నిశ్శబ్దంగా కథ విన్నంత శ్రద్ధగా విన్నారు. ఈలోగా సుగుణ అందరి పలకల మీద అ,ఆ,ఇ,ఈ అన్న నాలుగక్షరాలు రాసి వెనుకవేపు నాలుగంకెలు వేసి వుంచింది. రాజేశ్వరి మనిషి కథ చెప్పాక ఈ నాలుగు అక్షరాలు, నాలుగు అంకెలు ఎలా రాయాలో చూసి ఇంటిదగ్గర రాసుకుని మర్నాటికి రావాలి" చూడండి ముందు తెలుగు చదవను, రాయను వస్తే ఇంగ్లీషు కూడా నేర్పుతాను. రోజుకొక పాఠం చెపుతాను.
    "అమ్మగారూ మాకు అక్షరాలు, అంకెలు అన్నీ వచ్చును. మాకు ఇంగ్లీషు అక్షరాలు నేర్పండి" అన్నారు కొన్నాళ్ళు స్కూల్ కి వెళ్ళి మానేసిన పెద్ద పిల్లలు.
    "అలాగే. ముందు మీరు పలకమీద ఒకవేపు తెలుగు పాఠం ఒక పేజి, రెండోవేపు నూరు అంకెలు రాసి చూపండి. మీకెంతవచ్చో చూసి మిగతాది నేర్పుతాం. పిల్లలంతా చకచకా రాసి చూపారు. వాళ్లకి ఇగ్లీషు అక్షరాలు రాసిచ్చింది సుగుణ. ఆడవాళ్లంతా నాలుగైదుసార్లు అక్షరాలు, అంకెలు దిద్దేసరికి గంటంపావు అయిపోయింది. రోజంతా అలసిపోయినవారికి అంతకంటే బుర్రకెక్కదని ఆరోజుకి చాలించింది రాజేశ్వరి. ప్రతిరోజూ తప్పక రావాలని అందరిచేత ఊ అనిపించింది. ఆ కాస్తకే ఏదో సాధించినంత సంబరం కల్గింది రాజేశ్వరికి. "సుగుణా వీళ్ళు రోజూ వస్తారంటావా" అంది రాజేశ్వరి.
    వస్తారనుకుంటాను ఆంటీ. మీరు కథల్లా చెప్పింది వాళ్లకి బాగా నచ్చింది. కథలు వినడానికన్నా వస్తారులెండి కొన్నాళ్ళు.
                                   *    *    *

 Previous Page Next Page