అతను కూడా ఊళ్ళు చూడ్డానికి ప్రయాణమై ఉంటాడు. కాకపోతే ఏ తోడులేకుండ ఒంటరిగ జర్నీ చేస్తున్నాడేమో! ఆడపిల్లల్ని చూసేసరికి వేరే రూట్ లో వెళ్ళేవాడు కూడా ఈ రూట్ లో ప్రయాణమై వస్తున్నాడేమో! పురుష పుంగవులెప్పుడూ పుణ్యం... పురుషార్థం... రెండు కలిసొచ్చేలా చూసుకుంటారు. అలాంటి కేసూ కావచ్చు.
వీధిలోకొచ్చిన కొద్దిసేపట్లోనే అతన్ని మర్చిపోయారు నలుగురు. కనబడ్డ బజార్లన్నీ తిరిగారు. మధ్యలో రెండు గుళ్ళు కనబడితే అక్కడికి వెళ్ళి దైవదర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఒక వీధిలోకి వచ్చారు. అక్కడ ఆడ...మగ జనం మూగి...ఏముందో అక్కడ అందరు తొంగి తొంగి చూస్తున్నారు.
"అదేమిటో మనం కూడ వెళ్ళి చూద్దాం!" అంది ప్రమద.
"ఏదయినా మనం ఇంతవరకు చూడనిది కావచ్చు. వెళ్ళిచూద్దాం పదండి." వెంటనే రాణి అంది.
"చూడ్డానికే కదా మనం వచ్చింది!" అంటూ ముందుకు దారితీసింది వందన.
అప్పటికే దాదాపు రెండు గంటలు నడిచారు. థ్రిల్లింగ్ గా కనిపించేవేవీ కనిపించలేదు. ఏవేవో చూస్తున్నారు...ముందుకు సాగుతున్నారు అంతే. నలుగురు కలిసి సందు చేసుకుని గుంపులో జొరబడ్డారు.
అందమయిన ఆడపిల్లలంటే అందరికీ ముద్దే. పక్కకి తొలిగి దారి ఇచ్చారు కొందరు ప్రబుద్ధులు.
అక్కడ
చిన్న షామియానా లాంటిది వేసి వుంది. బల్లమీద రెండు పళ్ళాల నిండుగ లావుపాటి నేరేడుపళ్ళు పోసివున్నాయి. ఒక్కొక్క పళ్ళెంలో పళ్ళు రెండుమూడు కిలోలపైనే ఉండొచ్చు.
అక్కడికి వెళ్ళింతర్వాత వీళ్ళకి తెలిసింది అది "పండ్లు తినే పోటీ" అని.
పోటీలో ఇరువురు మనుషులు ఒకేసారి పాల్గొనాలి. బెల్ కొట్టగానే పళ్ళు తినడం ప్రారంభించాలి. నేరేడు గింజని మింగకూడదు... గింజకి కండ ఉండకుండా పూర్తిగా చప్పరించి తినేసెయ్యాలి. వేగంగా తినకపోతే పోటీలో గెలిచే అవకాశం లేదు. వేగంగా తినటానికి అవేమీ అరటిపళ్ళు కాదు... అవి నేరేడుపళ్ళు. గింజ ఎక్కువ కండ తక్కువ ఉంటాయి. చప్పరిస్తూ తినాలి. అలా చప్పరిస్తూ తినేటప్పుడు గింజ మింగకూడదు. పొరపాటున గింజని మింగినా కూడా పోటీలో ఫెయిలయినట్లే. విజేతకి పదివేల రూపాయల బహుమానం కూడా ప్రకటించడం జరిగింది.
"ఈ పోటీ కూడా మోసపూరితం కావొచ్చు. ఎందుకంటే... అప్పటికే ఒకలావుపాటి వ్యక్తి బానంత పొట్టవేసుకుని అక్కడ కూర్చొని ఉన్నాడు. పదివేల రూపాయలు బల్లమీద పెట్టబడి ఉన్నాయి. ఇది అతని డబ్బు. అక్కడున్న వాళ్ళు కూడా (పోటీ నిర్వహించేవాళ్ళు) అతని తాలూకా మనుషులే.
"ఎవరైనాసరే ఈ పోటీలో పాల్గొనదలిస్తే పదివేల రూపాయలు ఇక్కడ పెట్టాలి. వాళ్ళు ఓడిపోతే ఆ పదివేలరూపాయల్ని నేను తీసుకుంటాను. పండ్లు తినే విషయంలో నేను ఓడిపోతే... ఈ బల్లమీద పెట్టిన పదివేల రూపాయలు గెలిచిన వాళ్ళకి ఇస్తాను. ఇందులో దగాలేదు... మోసం లేదు... కుట్రలేదు... వంచనలేదు" అంటూ అరిచి మరీ చెబుతున్నాడు.
వాడి తాలూకా మిగతా వాళ్ళు కూడా "త్వరపడండి... పోటీలో పాల్గొనండి... పదివేలు గెల్చుకోండి... ఏమిటి ఎవరూ మాట్లాడరేమిటి. ఎవరూ ఈ పోటీలో పాల్గొనరా! నేరేడు పళ్ళని తినే దమ్మేలేదా! పదివేలు మీకు అక్కర్లేదా..." అంటూ యధాశక్తిగా అరుస్తున్నారు.
సుందర సుకుమారికి తిండి విషయంలో ఎటువంటి ఎలర్జీలేదు. ఏదయినా తినగలదు... ఎటువంటిదైనా హరించుకోగలదు. పండ్లయ్యేది...పానియాలయ్యేది...వంటలయ్యేది... పిండివంటలయ్యేది... అన్నీ ఇష్టంగానే తింటుంది. కాకపోతే కొన్ని మరీ ఇష్టమైనవి ఉన్నాయి.
పండ్లలో పనస...అరటి...నేరేడులాంటి కొన్ని పండ్లు తినాలంటే మరీమరీ ఇష్టపడుతుంది.
సుందర సుకుమారి నేరేడుపళ్ళు తిని చాలాకాలమైంది. పైగా అటువైపు దొరికేవి చిన్నచిన్న పళ్ళు...ఇక్కడున్న ఈ నేరేడుపళ్ళు మాత్రం చిన్నసైజు నిమ్మకాయల్లా ఇంతంతేసి లావు ఉన్నాయి. ముందాపళ్ళను చూడంగానే నోరూరింది సుందర సుకుమారికి. ఆ పండ్లని తినాలనిపించడంతో ఆ ధ్యాస తప్ప మిగతా విషయంలో బుర్ర పనిచేయడం మానేసింది. అలాంటి విషమపరిస్థితిలో గబుక్కున నోరుతెరచి "ఈ పోటీలో నేను పాల్గొంటాను" గట్టిగా అరిచి చెప్పింది.
ఇట్లాంటిపోటీలు అప్పుడప్పుడు...అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. మగవాళ్ళు మాత్రమే పాల్గొంటుంటారు. ముక్కు మొహం తెలీని ఒక ఆడపిల్ల ఇలా పోటీలో పాల్గొంటానని ముందుకు రావడం ఇదే మొదటిసారి.
సగంమంది తెల్లబోయారు... మరో సగం మంది బిత్తరపోయారు. కొంతమంది కుర్రకారు పెద్దపెట్టున ఈలలు వేసి ఆనందంగా తమ ఉత్సాహాన్ని తెలియజేశారు.
సుందర సుకుమారికి నిజంగా ధైర్యం ఉందో! లేక బుర్ర పనిచెయ్యదో! తెలియదుగాని చాలా విషయాల్లో ఏమాత్రం సిగ్గుపడకుండా డేరింగ్ గా ముందుకు దూకుతుంది.
ఆ విషయం స్నేహితురాళ్ళకి తెలిసింది. కాని ఇలా...కొత్తవూళ్ళో...బొత్తిగా తెలీని మనుషుల మధ్య తొడకొట్టి బరిలోకి దిగుతుందని మాత్రం ఏమాత్రం ఊహించలేదు.