Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 24


                          ఎ ఏ ఐ ఒ ఓ ఔ


    

    ఎక్కడ ఎప్పుడు
    ఎవరైనా చెప్పుడు ఈ చిక్కు విప్పుడు
    ఆరంభం ఎక్కడ
    అంతం ఎప్పుడు
    ఎందుకీ నొప్పులు ఏమిటీ చప్పుడు

 

    లక్షలు లక్షలు
    యక్ష ప్రశ్నలు అన్నీ తప్పులు
    ఏ చోట జననం
    ఏపూట మరణం
    ఈ లోపున ఎన్నెన్ని పడరాని తిప్పలు

 

    కంట్లోకారం
    ఒంట్లో భారం గుండెల్లో దాహం
    ఉచ్చ్వాసం నిశ్వాసం
    ఒకే అనుప్రాసం
    సందేహం పన్నుతుంది సరోరుహ వ్యూహం

 

    ఆగమనం నిష్క్రమణం
    అంతా ఒక చంక్రమణం ఆలోచించు బాగా
    ఏదైతే సవాలు
    అదేలే జవాబు
    ఒమీగా ఆల్ఫా, ఆల్ఫా ఒమీగా
    శాస్త్రం నీ అస్త్రం
    మౌనం శ్మశానం అదికాదు జ్ఞానం
    పరీక్షించు సహేతుకంగా
    ప్రసంగించు సాధికారంగా
    సమిష్ఠి సూత్రం మాత్రం సరైన విధానం
    ఏమిటో చప్పుడో
    ఎందుకీ నొప్పులో అంతం ఎక్కడో
    ఆనందం ఎప్పుడో
    ఆ చిక్కు విప్పడు
    ఎక్కడా ఎప్పుడూ ఎవ్వడూ చెప్పడు

 

    

    ఏదై నా గీతం
    చేదై నా మైమరపిం
    చేదై నా కదిలిం
    చేదై నా రగిలిం
    చేదై నా ఏదైనా
    నేడై నా
    రేపై నా  

 

    ఏమైనా గానం
    జడి జడిగా వర్షం నా
    మెడమీదా
    తొడమీదా
    తడితడిగా రక్తం నా
    గదిలోనూ
    హృదిలోనూ
    దడదడగా కంపం నా
    నడినెత్తిని రంపం

 

    నాకోసం ఆకాశం
    చేకూర్చే ఆవేశం
    రేగించే ఉద్రేకం
    ఊగించే ఉద్వేగం
    ఊగించే ఉద్వేగం
    దావానల హాలాహల
    కీలోజ్జ్వల కోటీరం
    నీలోత్పల కాసారం
    నీ లోపల కేయూరం

 

    కనిపించక జడిపించే
    కికురించే సకిలించే
    కిటికీలో రూపం వా
    కిటి ముంగిటి ధూపం

 

    గాలంవలె శూలంవలె
    వేలాడే కాలం
    వేటాడే వ్యాఘ్రం అది
    వెంటాడును శీఘ్రం

 

    కాలానికి భయపడితే
    కలిగేదే శోకం
    కదిలేనా లోకం
    దొరికేనా నాకం

 

    కనుపాపలు తెరచాపలు
    ప్రళయంలో పయనం
    నిరయంలో శయనం
    విలయంలో విజయం

 

    

    ఐక్యం అదీ మనకి ముఖ్యం
    అందులోనే ఉంది సౌఖ్యం
    లేనిపోని చీలికలు
    రెండురెండు నాలికలు
    ఛీ యిదా బతుక్కి
    ఫాయిదా
    ఐక్యం అదీ అవస్థ
    కాదు ఔను అవును
    కాదు కాదు అవదు
    అనేకం అయితే ఏకం
    అదే వివేకం

 

    ఐక్యం అన్నింటికీ మూలం
    అటే కదుల్తోంది కాలం
    పురోగతి ప్రపంచనీతి
    మనదొకే మానవజాతి
    వ్యక్తికి బహువచనం
    శక్తి

 

    ఐక్యం అదే మనకి గమ్యం
    అప్పుడే సిద్ధిస్తుంది సామ్యం
    వ్యర్ధం స్పర్థంటా
    యుద్ధం వద్దంటా
    కామ్యం ఐక్యం అయిన బతుకే
    రమ్యం

 

    ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే
    ఎక్కడో కాదు అదిక్కడే
    మాట చేతగామారి
    మనిషి మనిషితో చేరి
    స్వప్నం సత్యం ఐతేనే
    స్వర్గం  

 Previous Page Next Page