Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 23


                           కొంటెకోణాలు


    ఛందో బందోబస్తు లన్నీ
    ఛట్! ఫట్ ఫట్ మని త్రెంచి
    damm it! ఏమిట్రా ఇ? దంటే
    pray! it's poetry అందాం.

 

    అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదలి
    గద్యాన్ని పద్యానికి పెళ్ళిచేదాం.
    కాదన్న మాదన్న యెవడన్నా ఉంటే
    వేమన్న యేమన్నాడో చూడ మందాం.

 

    హాష్ హూష్, హూష్ హాష్ అని కేకలు వేసి
    కావ్ కావ్ మ్యావ్ మ్యావ్ అందాం గమ్మత్తుగా.
    న...న...న...న...నత్తిమాటలు కూడా
    మ..మ..మ....మ... మన వ్రాతల్లో ఉండొచ్చు

 

    అచ్ఛా! స్వేచ్చాజీవీ!
    ఐతే, కైతే నీ వ్రాతని
    argument కోసం ఒప్పుకున్నా
    పానుగంటివారు ఒప్పుకోరు.

 

    పానుగంటివారు ఒప్పుకోకపోతే
    పామువంటి దానికి విరుగుడుంది.
    ఇంద్రకంటివారి నడిగితే
    ఏమిటంటారో తెలుసునా

 

    "పులికి పిలక లేదనడం
    చలికి తెలుగు రాదనడం:,
    శ్రీనివాసరావు వ్రాస్తున్నది
    మానిషాద గీతంలో ఉన్నది."

 

    కటాకటా! లొటిపిటా చస్తే
    కృ.శా. విషాదకావ్యం వ్రాయాలా?
    sex లో x కర్థం తీస్తూ
    చలం కలం పట్టుకోవాలా?

 

    జీబ్రాకి బిజివీలిలీజీబి చిహ్నాల
    లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి
    సాహిత్యం పౌరోహిత్యం ఇస్తే
    వెర్రికాదు surrealism రా సోదరా.

                                                     - ప్రతిభ త్రైమాసిక సంపుటి, 4 - 1940

 Previous Page Next Page