Previous Page Next Page 
మగబుద్ధి పేజి 23


    అలనాడు శ్రీకృష్ణుడు తనను కొనుక్కున్న నారదుడు వెంట నడిచినట్టు అతను వాళ్ళ వెనకాల నడిచాడు.

 

    అన్ని పోస్టాఫీసులు కెళ్ళి తను ఉత్తరాల సంచులను తెచ్చి నరేష్ కి తగలేశారు.

 

    ఆ భుజానికి రెండు, ఈ భుజానికి రెండు సంచులతో అతను ఇబ్బందిగా నడుస్తున్నాడు.

 

    భుజాలు రెండు భారంతో కిందకు వాలిపోతున్నాయి.

 

    "భగవంతుడా పగవాడిక్కూడా వద్దు ఈ శిక్ష" అనుకుంటున్న నరేష్ కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

 

    "అలా స్టెయిల్ గా నడిస్తే కుదరదు నాయనా, ఉత్తరాలను చూసి అడ్రస్ చదివి ఏ ఉత్తరం ఎవరికివ్వాలో వారికివ్వు నాయనా." శర్మ మంత్రోపదేశం చేసినట్టు చెప్పాడు.

 

    నరేష్ ఒక బ్యాగ్ లోంచి ఉత్తరాలు తీసుకోబోతూ ఉంటే వేలూ చెప్పాడు "ఆ బ్యాగ్ నాది. ఆ కాలనీలు ఇప్పుడు రావు. మనమున్నది పార్క్ ఏరియా కాబట్టి ఆ సంచిలోని ఉత్తరాలు తీసుకో."

 

    అతను వేలూ చూపించిన బ్యాగ్ లోంచి ఉత్తరాలు తీసుకుని అడ్రస్ లు చదవడం మొదలెట్టాడు.

 

    "పైనున్న ఉత్తరం అడ్రస్ ఏమిటి?" అడిగాడు శర్మ నరేష్ ని.

 

    "తంగవేలు.. డోర్ నెంబర్ తొమ్మిదీ బై ఇరవై ఒకటి. పార్కు స్ట్రీట్..." చెప్పుకుపోతున్నాడతను.

 

    "ఆగు. ఆ ఉత్తరం అదిగో కనిపిస్తున్న ఆ ఎల్లో బిల్డింగ్ లో కాపురముంటున్న వాళ్ళది వెళ్ళి ఇచ్చిరా" శర్మ ఇలా చెప్పడంతో వాళ్ళు నలుగురూ మెయిన్ రోడ్డులో ఆగారు.

 

    నరేష్ సందులోకి నడిచి పసుపు బిల్డింగ్ దగ్గరాగి "పోస్ట్" అని అరిచాడు.

 

    నల్లగా వుత్తరాలు కట్టే గోనెసంచిలా వుండే మధ్య వయసున్న స్త్రీ బయటికొచ్చి అతనివైపు విసుగ్గా చూసింది.

 

    వుత్తరం అందించాడు.  

 

    అంతలో పక్కింటి ఆమె వచ్చి "ఏమోయ్! వుత్తరాలబ్బాయ్? మాకేమైనా వచ్చాయా?" అని అడిగింది.

 

    "ఏం రాలేదమ్మా" అన్నాడు చిన్నగా.

 

    ఎందుకు రాలేదు?"

 

    పోస్టుమ్యాన్ బాధేమిటో అప్పుడు తెలిసొచ్చింది అతనికి.

 

    "మధ్యలో వరదలొచ్చి మీ ఉత్తరాలు కొట్టుకుపోయాయి" విసురుగా అని వచ్చేశాడు.

 

    అక్కడ్నుంచి మొదలయ్యాయి అతని కష్టాలు.

 

    పోస్టుమ్యాన్లు నలుగురూ అతని వెనకాల ఒకరి భుజంపై మరొకరు చెయ్యేసుకుని, సిగరెట్లు తాగుతూ, కూనిరాగాలు తీస్తూ నడుస్తున్నారు.

 

    నరేష్ అడ్రస్ లు చూసుకుంటూ, ఇంటినెంబర్లు వెతుక్కుంటూ, జనం అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ ఉత్తరాలు బట్వాడా చేస్తున్నాడు.

 

    టైమ్ గడిచేకొద్దీ అలసటా, విసుగూ ఎక్కువైపోతున్నాయి అతనికి. ఉత్తరాల సంచులను విసిరికొట్టి వచ్చెయ్యాలని చాలాసార్లనుకున్నాడు. కానీ వాళ్ళ బెదిరింపు గుర్తొచ్చి మానుకున్నాడు.

 

    తెల్లటి బట్టలు బాగా ఖరాబయ్యాయి. ఆటోక్లినిక్ లో పనిచేస్తున్న మెకానిక్ లా తయారయ్యాడు. చెమటకారి బట్టలో ఇంకి అట్టలుగా తేలుతోంది. దుమ్ము శరీరం మీద అరచేతి మందాన పేరుకుపోయింది.

 

    అప్పటికి టైమ్ ఒంటిగంటైంది.

 

    మూడు ఏరియాల బట్వాడా అయిపోయింది. ఇక మిగిలింది వేలూ ప్రాంతమే.

 

    నరేష్ ఇక తనవల్ల కాదన్నట్టు ఓ చెట్టునీడ క్రింద కూర్చుండి పోయాడు. కళ్ళు మూసుకుపోతున్నాయి. కాళ్ళు పీకుతున్నాయి శరీరం సోలిపోతోంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో నిస్సత్తువ ఒంటిని కిందకు గుంజేస్తోంది. కడుపు ఆకలితో మండిపోతోంది.

 

    "రెస్ట్ టైమ్ పదినిముషాలు అయిపోయింది. ఇక లెయ్" శర్మ వేలు భుజంమీద వేసిన చెయ్యి తీయకుండానే అన్నాడు.  

 

    నరేష్ వంచిన తలెత్తలేదు.

 

    "ఇప్పటికి టైమ్ చాలా అయిపోయింది. ఎప్పుడో పన్నెండు గంటలకివ్వాల్సిన పోస్టు" వేలూ తొందర చేశాడు.

 

    "ఈ ఏరియా అయిపోతే మధ్యాహ్నం పోస్టుకెళ్ళాలి" అన్నాడు శర్మ. ఆ మాటలకు నవనాడులూ కుంగిపోయాయి అతనికి "మధ్యాహ్నం పోస్టు కూడా నేనే బట్వాడా చెయ్యాలా?" ఏడుపు ఒకటే తక్కువ అతనికి.

 

    "అదేం లేదులే. ఈ పనిష్ మెంట్ చాలులే. జీవితంలో కవర్ ను గానీ, కార్డునుగానీ చూస్తే చలిజ్వరం వచ్చేస్తుంది నీకు" నవ్వుతూ అన్నాడు చిట్టిబాబు.

 

    ఈ సంచిలోని ఉత్తరాలిచ్చేస్తే తనకు విముక్తి లభిస్తుందని తెలియడంతో అతను ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని లేచాడు.

 

    మళ్ళీ ఉత్తరాల బట్వాడా ప్రారంభమైంది. ఈ లైన్ లో ఇవ్వాల్సిన ఉత్తరాలన్నిటినీ వరుస క్రమంలో పేర్చి నరేష్ చేతికిచ్చాడు వేలు.

 

    పైనున్న ఉత్తరం అడ్రస్ చూసి అందులో వున్న నెంబరు ఇంటికి వెళ్లాడు.

 

    పిలవడానికి శక్తిలేక తలుపుమీద చేత్తో కొట్టాడు.

 

    మధ్య వయసులో ఉన్న ఒకతను వచ్చాడు.

 

    "వుత్తరం" అందివ్వబోయాడు అతను.

 

    "నాకేనా?" ఆశ్చర్యపోయాడతను.

 

    "అవును"

 

    ఆ వచ్చినతను ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అన్నాడు. "ఈరోజు ఎంత శుభదినం నాయనా, సంవత్సరం నుంచి ఈ ఇంట్లోనే కాదు ఈ వీధిలోనే 'పోస్ట్' అన్నకేక వినపడలేదు. పోస్టల్ డిపార్ట్ మెంట్ ను ఎత్తేశారు కాబోలు అనుకున్నాను. మా విశ్వనాధం మామయ్య వూరెళ్ళినప్పుడంతా ఉత్తరాలు రాశాను అందాయా అని అడగడం, నేను లేదని తల తిప్పడంతోనే సరిపోయింది. రాసిన ఉత్తరాలు ఎలా అందకుండా పోతున్నాయో నాకు అర్థం కావడంలేదు. మనుషులకు మల్లే ఈ మధ్య ఉత్తరాలకూ ఫ్లూ జ్వరాలేమైనా వస్తున్నాయా?"   

 

    ఆయన ఏం మాట్లాడాడో నరేష్ కి అర్థమైంది.

 

    బయటికొచ్చి వేలుతో అదేమాట అన్నాడు "సంవత్సరం నుంచి ఆయనకో ఉత్తరం ముక్క రాలేదట."

 Previous Page Next Page