"బాత్ రూంలో వున్నట్టుంది... కూర్చోండి... ఆంటీ... పిలుస్తాను" అని...
"తరణీ... తరణీ... త్వరగా రా... ఆంటీ వచ్చారు" నాజూకుగా పిలిచాడు ఆంజనేయులు.
పిలిచి, ఆ పిలుపుకి నిజంగా వాడు వచ్చేస్తాడేమోనని పరుగు పరుగున బాత్ రూం దగ్గరకెళ్ళి-
"బాత్ రూమ్ లోనే సెటిలైపో... ఆంటీ వెళ్ళిపోగానే పిలుస్తాను..." అని చెప్పి మళ్ళీ గదిలోకొచ్చాడు.
"వేగరం రమ్మని చెప్పాను"
"పోనీలే... బాబూ... నెమ్మదిగా స్నానం చెయ్యమను... నేను మళ్ళొస్తాలే" అని చుట్టూ ఒకసారి చూసి "సామాన్లతో వచ్చినట్లు లేదే... అమ్మాయితో పాటు ఎవరూ రాలేదా...?" ప్రశ్నలు కురిపించిదావిడ.
ఒక్క క్షణం ఆలోచించి...
"తరణీకి చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ ఆంటీ... చీకట్లో నడవడం అన్నా, పరిగెత్తడం అన్నా, ప్రయాణాలు చేయడమన్నా చెడ్డ యిష్టం... ఉండలేక ముందుగా తనొచ్చేసిందట- వాళ్ళ నాన్న ఈ ఏడాదో, వచ్చే ఏడాదో వస్తాట్ట" చిరాగ్గా అన్నాడు.
"ఈ ఏడాదో.. వచ్చే ఏడాదో ఏవిటి బాబూ" అమాయకంగా అడిగిందావిడ.
"ఈ వారమో... వచ్చే వారమో అనబోయి... కంగారుపడి..." అన్నాడు.
"నేను మళ్ళొస్తాన్లే... అమ్మాయిని స్వయంగా దగ్గరుండి టిఫిన్ కి తీసికెళతాను" చెప్పి బయటికి వెళ్ళిపోయిందావిడ.
ధడేల్మని తలుపు లోపల గెడ పెట్టేసి, బాత్ రూమ్ వేపు పరుగెత్తాడు.
"ఒరే రారా... బైటకు రా..."
గబుక్కున బాత్ రూమ్ లోంచి బయటికొచ్చాడు ఆనందం.
"మా ఆవిడ్ని టిఫిన్ కి తీసుకెళ్ళడానికి పిన్నిగారు మళ్ళీ వస్తారు... ఎలారా?" ఏడుపు ముఖం పెట్టాడు ఆంజనేయులు.
"ఆవిడ టిఫిన్ కి పిలవడానికి ముందే నువ్వెళ్ళిపో... వెళ్ళిపోయి ఒక కహాని చెప్పెయ్" అన్నాడు ఆనందం కాళ్ళకడ్డు పడుతున్న చీరను సర్దుకుంటూ.
వెంటనే తయారయిపోయాడు ఆంజనేయులు. ఒక అరగంటలో అవుట్ హౌస్ లోంచి బయటికెళుతూ...
"నేను పిలిస్తేనే తలుపు తియ్యి..." అని చెప్పి భవనంలోకి వెళ్ళాడు.
"మీ ఇద్దర్నీ నేనే టిఫిన్ కి తీసుకొద్దామంటే నువ్వొక్కడివే వచ్చేవేంటి బాబూ..."
"లేదండీ..తనకేదో కడుపులో తిరుగుతున్నట్టుగా వుందట..." నసిగాడు ఆంజనేయులు.
"రాత్రంతా... రాత్రంతా ప్రయాణం... అలాగే వుంటుందిలే... నువ్వు టిఫిన్ చేసి, ఆఫీసుకెళ్ళు... తర్వాత నేవెళ్ళి మంచిచెడ్డలు విచారిస్తాలే..."
"మీరెళ్ళి మంచిచెడ్డలు విచారిస్తారా?" టిఫిన్ చేస్తున్నా, ఆవిడ 'విచారించే మంచి చెడ్డలమీదే ఆలోచన వుంది' ఆవిడ్ని ఇంట్లోకి వెళ్ళకుండా నిరోధించాలంటే ఈవేళ తను ఆఫీసుకు 'డుమ్మా' కొట్టాల్సిందే.
ఎన్ని కష్టాలొచ్చాయిరా అనుకుంటూ గబగబా టిఫిన్ పూర్తి చేసేసి అవుట్ హౌస్ లొ పడ్డాడు.
"నువ్వు ఆఫీసుకెళ్ళవా మరి..." హాల్లో మఠం వేసుకుని కూర్చుని పేపర్ తిరగేస్తూ అన్నాడు ఆనందం.
"ఇక్కడ తగలడ్డావేంరా? ఆంటీ చూస్తే కొంపలారిపోతాయ్... నువ్వు ఇక నుంచి బెడ్ రూం దాటి బయటికి రాగూడదంతే."
"అంతేనా?" అన్నాడు ఆనందం తన స్థితికి కుళ్ళిపోతూ.
"వేషం వేస్తే ప్రమాదంలోంచి బయటపడతాం... అనుకున్నాం గానీ మరింత ప్రమాదంలొ ఇరుక్కుంటావనుకోలేదురా."
"ఏమిటిరా?"
"ఇప్పుడు... ఆవిడ బారినుంచి నిన్ను రక్షించుకోడానికి నేను ఆఫీసెగొట్టాలి"
తల పట్టుకుని కూర్చున్నాడు ఆంజనేయులు.
ఒక గంట తర్వాత....
"తరణీ... అమ్మాయ్ తరణీ" భువనేశ్వరి పిలుపు వినబడడంతో ఆంజనేయులు తలుపు తీసి "ఇహి... హి... హి..." అని పళ్ళికిలించాడు.
"ఏం బాబూ... నువ్వాఫీసు కెళ్ళలేదా?" ఆశ్చర్యపోతూ అడిగింది భువనేశ్వరీదేవి.
"లేదండి... తనకి వంట్లో బాగులేదు.. కదం...డీ..."
"అమ్మాయేం చేస్తోందీ..." బెడ్ రూంవేపు అడుగువేస్తూ అడిగిందావిడ.
గబుక్కున పరిగెత్తి బెడ్ రూంకి అడ్డంగా నిలబడ్డాడు.
ఆవిడలోనికి వస్తోందని గ్రహించిన ఆనందం ముసుగు తన్నేసి పడుకున్నాడు.
"నిద్ర... నిద్రపోతోందండీ..."
"నిద్రపోతోందా? పోనీ... మధ్యాహ్నం వస్తాలే... నువ్వు ఆఫీసుకెళ్ళు పర్వాలేదు... నేను చూసుకుంటాను... లే..."
"ఏం చూసుకుంటారు... నా బొంద చూసుకుంటారు..." అని మనసులో అనుకుని...
"మధ్యాహ్నం ఎన్ని గంటలకు వస్తారాంటీ..." అడిగాడు వినయంగా మొహం పెట్టి.
"ఏం?" అన్నట్టుగా చూసిందావిడ.
"ఒంటిగంటకు షికారు తీసుకెళ్ళమంటోంది.. అందుకని..." చటుక్కున అబద్ధం ఆడేశాడు.
"మిట్ట మధ్యాహ్నం ఎండలో షికారేమిటి బాబూ? అందులోనూ, వంట్లో బాగులేని మనిషి?!"
"తప్పదండి. అది జగమొండండి... అది గయ్యాళిగంపండి... మంచి ఎండలో షికారంటుందండి... అర్దరాత్రి లేచి జాగింగ్ చేస్తుందండి... వేసవి కాలంలో వేన్నీళ్ళు స్నానం చేస్తుందండి... నేను కాబట్టి దాంతో వేగుతున్నాను కానీ ఆంటీ... ఇంకెవడైనా అయితే..."
ఆ మాటలంటున్న ఆంజనేయులివేపు చిలిపిగా చూసి-
"పెళ్ళయి ఎన్నాళ్ళయిందని, పెద్దగా పిల్ల మనసు అర్థం చేసుకున్నట్టు... అయితే షికారో, ఎక్కడకో వెళ్ళండి... నేను సాయంత్రం వస్తాలెండి..." ఆవిడ అవుట్ హౌస్ లోంచి బయటికెళ్ళిపోయింది.
చీరా, వగైరాలు విప్పి పది నిమిషాల్లో ఫాంటూ, షర్టుల్తో తయారైపోయాడు ఆనందం.
"మనం వెళ్ళేటప్పుడు ఆవిడ చూస్తుందేమో...?" అనుమానం వ్యక్తం చేశాడు ఆంజనేయులు.
"ముందు నేను బైటికెళ్ళిపోయి ఆవిడెక్కడుందో గమనించి, విజిల్ వేస్తాను... వచ్చేయ్" అని ఆనందం బయటికెళ్ళిపోయాడు. మరో అయిదు నిమిషాల తర్వాత విజిల్ వినబడింది.