Previous Page Next Page 
గాడ్స్ గిఫ్ట్ పేజి 23

    విమోచనానికి మార్గం అందరికి అర్ధం అయింది. శాప విమోచనానికి మార్గం దొరకంగానే ఒక్కసారి అక్కడున్న అందరు పెద్ద పెట్టున హర్షధ్వనులు చేశారు.
   
    ఎక్కువ సమయం పట్టకుండానే సభ ముగిసింది. ఎవరిదోవనే వాళ్ళు వెళ్ళిపోయారు.
   
    "కొన్నాళ్ళపాటు నాకు కాలక్షేపం. అక్కడ భూలోకంలో ఏమేం వింతలు జరుగుతున్నాయో కళ్ళారా చూసి చెవులారా విని ఆనందించాలి. ఇంతకాలానికి కదా! నాకో కొత్త పని దొరికింది" అనుకొన్నాడు నారదుడు.
   
    అలవాటు ప్రకారం తుంబర మీటుతు "నారాయణ....నారాయణ" అనుకొని "నారాయణ! నువ్వు సామాన్యుడివి కాదయ్యా! నీ దగ్గరికి ఆడాళ్ళంతా వస్తే వాళ్ళకి చక్కగా నమ్మేట్టుగా చల్లగా కబుర్లు చెప్పి పని గట్టుకుని శంకరుడి దగ్గిరకి పంపించావ్. ఆయన దేముంది? భోళాశంకరుడు. అడిగిందే తడవుగా వరాలిచ్చేశాడు. ఆయనచేత వరాలిప్పించేటట్టు చేసిందీ నీవే. మళ్ళీ వాటికి విరుగుడు చెప్పిందీ నీవే. నారాయణా నీలీలలు నవరసభరితం" అంటూ పాటందుకున్నాడు నారదుడు.
   
    ఉన్నట్టుండి నారదుడికి ఒక అనుమానం వచ్చింది. "నారాయణుడేం చెప్పాడు? ఈ కొత్త చర్యవల్ల మగవాళ్ళందారిలో పశ్చాత్తాపం రావాలి. ఆడవాళ్ళందరికీ కూడా మరి విధంగా కనువిప్పు కలిగి 'మాతృత్వం మాకే ఉండాలి. మ్గ్జాతికి ఉండరాద'ని మనసారా కోరుకోవాలి. అలా జరిగిన నాదే కదా వీళ్ళు కోరిన కోరికలు అంత మయ్యేది. మగాళ్ళలో పశ్చాత్తాపం వస్తుందో రాదో! ఆడవాళ్ళు తిరిగి తమ మాతృత్వపు హక్కులు తమకే ఉండాలని కోరతారో లేదో!"
   
    అలా ఆలోచిస్తు ఉండేసరికి నారదులవారికి అనుమానంతో మళ్ళీ ఉదరంలో గడబిడ మొదలై పొట్ట ఉబ్బసాగింది.
   
    "ఇక్కడే కూర్చుంటే నాపని ఇట్లాగే ఉంటుంది. ఒక్కసారి భూలోకానికి వెళ్ళి అంతటా తిరిగొస్తేకాని న ఉదరవ్యాధి తగ్గదు" అనుకొన్న నారదుడు తుంబురని ఒకసారి టింగ్ టింగ్ మనిపించి చిడతలని టిక్ టిక్ లాడించి "నారాయణ....నారాయణ" అనుకుంటూ భూలోకం వైపు ప్రయాణమయ్యాడు.
   
                                                                 *    *    *    *
   
    అక్కడ భూలోకంలో...
   
    వక్కసారిగా భూమి బద్దలు కాలేదుగానీ వక్కోకొంపలో వక్కో విచిత్రం మొదలయింది.
   
    ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కాంతారావు కాలేజీలో అడుగు పెట్టిన అరగంటకి పెద్ద మనిషై కూర్చున్నాడు.
   
    ఉన్నట్టుండి పుల్లారావుకి వికారం పట్టుకుంది.
   
    పుల్ల పుల్లగా చింతకాయలు, మామిడికాయలు తినాలనిపించింది.
   
    అప్పల నర్సయ్యను వక్క ముద్ద వాంతి చేసుకొని ఆ పూటకి అన్నం తినటం మానేశాడు.
   
    భార్యతో సినిమాకని బయలుదేరిన గంగాధరం మెన్సస్ అయి కూర్చున్నాడు.
   
    "కేన్సర్ లేక మరో రోగమో యిదేంటో అర్జంటుగా డాక్టరుకి చూపించుకోవాలి" అని గంగాధరం గాభరా చెందుతుంటే....
   
    "మీ ముఖానికి తోడు కేన్సర్ రావడం కూడానా! ఏ ఏబ్రాసి దాని దగ్గరకో కక్కుర్తిగా వెళ్ళి వుంటారు. సుఖానికి తగ్గట్లు సుఖరోగం తగిలివుంటుంది" అంటూ గంగాధరం గయ్యాళి భార్య గంగశ్రీ తాటిచెట్టు ప్రమాణ చర్రుమంటు లేచింది.
   
    "నిన్ను దగ్గరకు తీసుకోటానికే నాకు ధైర్యం లేదు. ఇంకో ఆడదాని దగ్గరికి వెళ్ళటం కూడానా! కృష్ణ కృష్ణా." అన్నాడు గంగాధరం.
   
    "చాలు యీ సాక్ష్యం చాలు" అంది గంగశ్రీ.
   
    "అసలేం జరిగిందో తెలియకచస్తుంటే మధ్యలో నీ సాక్ష్యాలేమిటే గంగా!" అంటూ వాపోయాడు గంగాధరం.
   
"మీ ఆరాధ్య దైవం ఎవరు?" గంగశ్రీ అడిగింది.
   
    "గోపికాలోలుడు చిలిపిచిన్నారి అల్లరి కృష్ణునే నా దేముడు. ఐతే ఏంటి? దీనికి దేముడికి సంబంధం ఏమిటి?"
   
    "ఉంది బోలెడువుంది ఎవరైనా సరే "రామారామా' అనుకుంటారు, మీరలా కాదే. మాటకు ముందు 'క్రిష్ణా క్రిష్ణా" అంటారు. శ్రీ కృష్ణుడిని కొలిచే వాళ్ళు గోపికా లోలుడే మీరూ అంతే! ఏ గోపిక దగ్గరకు వెళ్ళారు? చెప్పండి. ఆ గోపిక ఎవరు? ఎక్కడ వుంటుంది? దానికెన్నేళ్ళు చెప్పండి?" అంటూ భర్త పీక (కాలర్) పుచ్చుకుంది గంగశ్రీ.
   
    ఒక్కో ఇంట్లో ఒక్కో రకం పాట్లు మగవాళ్ళకి ఏర్పడింది. ఇలా ఎందుకు జరుగుతున్నదో ఎవరికీ అర్ధం కాలేదు.
   
    కారణం...
   
    గతంలో చాలామంది ఆడవాళ్ళు ఓ సంఘంగా మారి ఇంట్లో మగాళ్ళకి చెప్పకుండా చాటుగా బయలుదేరి వెళ్ళి అందరి దేముళ్ళనీ కల్సుకుని పనిగాక చివరికి పరమేశ్వరుడి ద్వారా వరాలు పొంది భూలోకానికి తిరిగి వచ్చారు. కాని ఈ విషయం బయటపెట్టకుండా గుంభనంగా వూరుకుండిపోయారు.
   
    ఆ కారణాన భూలోకంలో వింతలు మొదలయినాయి.
   
    ఆడవాళ్ళు (ఈ రహస్యం తెలియనివారు) నోళ్ళు నొక్కుకున్నారు మరి కొందరు ముసిముసిగా నవ్వుకున్నారు.
   
    మగవాళ్ళు గాభరా చెందారు. సిగ్గుపడ్డారు. వాళ్ళ మాన మర్యాదలన్నీ మంటగలిసినట్టువాపోయారు.
   
    అసలు రహస్యం తెలియనందువల్ల లోకం ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది.
   
    చాలా మంది పరిశోధన చేశారు గాని అసలు రహస్యం ఏమాత్రం పట్టలేదు.
   
    ఇదంతా చూస్తుంటే ఆకాశవాణికి (ఆకాశవాణి అంటే రేడియో కాదని గమనించ పార్ధన) మగాళ్ళ మీద జాలివేసింది.
   
    ఒకానొక శుభదినాన ఆకాశం నుంచి కనపడని వాణి మాటలు అందరికీ వినిపించాయి.
   
    "ఓ భూలోక వాసులారా! స్త్రీ పురుషులారా! పురుష పుంగవుల్లో జరుగుతున్న ఈ మార్పుకి మీరెవరూ కలత చెందకండి. బ్రహ్మ సృష్టి లోనే మార్పు మొదలయింది. ఇప్పుడు స్త్రీపురుషులిరువురూ సమానులే. మగపిల్లలు కావాలంటే మగవాళ్ళే కనాలి. ఆడపిల్లలు కావాలంటే ఆడవాళ్ళే కనాలి. మెన్సస్ లు, ప్రెగ్నెన్సీలు, డెలివరీలు, రేప్ లు అన్నింటిలో స్త్రీ పురుష లిరువురు సమభాగస్తులే సృష్టి కార్యం గురించి చింతించ వలసిన పనిలేదు. ఈ మార్పుని మీ రంతా ఆనందంగా అనుభవించండి. చింతించి లాభం లేనప్పుడు ఇంకా ఆనందించటమే కదా చేయాల్సింది. అదే చేయండి...." అని చెప్పి ఆకాశవాణి స్విచ్ ఆఫ్ చేసినట్లు నోరు మూసుకుంది.

 Previous Page Next Page