గది తలుపులు తాళం వేయకపోవటం అందరూ గాఢనిద్రలో వుండటం రాత్రిపూట కావటం కలసివచ్చింది. అందుబాటులో వందరూపాయలనోటు, పదిరూపాయలనోటు దొరికాయి అవి తీసుకున్నాను. జ్వరంవలన చలివేస్తుంటే దుప్పటిమాత్రం కప్పుకున్నాను. కట్టుగుడ్డలతో ఇల్లు వదిలాను. రిక్షాలోపడి స్టేషనుకి వచ్చి రైలు యెక్కేశాను.
విజయవాడలో దిక్కూ మొక్కూ లేని ఆడపిల్లలని ఆదుకునే హేతువాదుల మహిళా ఆశ్రమం వుందని విన్నాను. వాళ్ళదగ్గరకి వెళ్ళి యేదోవక పని నేర్చుకుంటూ నాకాళ్ళ మీద నేను నిలబడి బతుకుతాను. ఉన్న విషయం చెపుతాను. పెద్దవాళ్ళ అనుమతి కావాలి నీకు అందరూ వున్నారు. మా ఆశ్రమంలో వుండటానికి కుదరదు అన్నారే అనుకోండి అప్పుడు ఆలోచిస్తాను. ధైర్యంగా నిలబడి జీవించటమా? పిరికితనంతో చావడమా? అన్నది!
మీరు నమ్మినా నమ్మకపోయినా నా కథంతా వివరంగా చెప్పాను. దయచేసి మావాళ్ళ అదే మా మామయ్య వాళ్ళ అడ్రస్ గాని వివరాలుగాని అడిగి నన్ను బాధించవద్దు. అడిగినా నేను చెప్పను ఇదీ నా కథ" అంటూ ముగించింది పద్మిని.
ఇంత పెద్ద అబద్ధం యింతపెద్ద సీరియల్ లాంటి కథ ఇంత గొప్పగ చెప్పగలిగింది అంటే అది పద్మిని ప్రియదర్శిని తెలివితేటలు కావు, ఆమె కనీసం పిల్లల రచయిత్రి కాదు.
"కాలం కన్నీరు కార్చింది" నవలలో హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి ఒక లక్షాధికారి యింట్లో వంటమనిషిగాచేరి వాళ్ళు అడిగితే ఈ కధ చెపుతుంది.
నవలా పరిజ్ఞానం పద్మిని ప్రియదర్శినికి బాగా వుంది. ఆ నవలలో కథానాయిక వాళ్ళకి చెప్పిన కథని యిప్పుడు ఇక్కడ పార్వతమ్మకి చెప్పింది పద్మిని.
పార్వతమ్మది మంచి హృదయం. పరుల కష్టాలు తనవిగా భావించటంకాదు. ఎవరేం చెప్పినా నమ్ముతుంది.
పద్మిని ప్రియదర్శినిని చూసే యెవరూ మోసగత్తె అనుకోరు. ముఖం అందంగా, అమాయకంగా వుంటుంది. ముక్కు నిజాయితీకి నిదర్శనంగా ముక్కుసూటిగా పోయేదానిలా కానవస్తుంది. కళ్ళు కనుబొమలతీరు పట్టుదలను సూచిస్తూ వుంటాయి. ఎర్రని బుల్లిబుల్లి పెదవులని చూడంగానే ముచ్చటగా ముద్దాడాలనిపిస్తుంది. ఏ ఆభరణాలు ధరించకపోయినా తనువెల్లా సిరి ఓలలాడుతున్నట్లు సిరిగల దానిలా కానవస్తుంది. సుందర సుకుమారంగా పెరిగినట్లు నైస్ గా ఉంటుంది.
పద్మిని ప్రియదర్శినిని చూసి యెవరూ మోసగత్తె అనుకోరు. అదే ప్లస్ పాయింట్!
పద్మిని ప్రియదర్శిని చెప్పింది అక్షరాలా నమ్మింది పార్వతమ్మ. అందుకు నిదర్శనంగా "ఏ కష్టాలు వచ్చినా మంచివాళ్ళకేనమ్మాయీ" అంది పార్వతమ్మ!
"దేవుడు యిలా యెందుకు చేస్తాడంటారు?" పద్మిని అడిగింది.
"అదే నాకూ అర్ధంకాని విషయం. ఒకసారి ఆ దేవుడు కనపడితే యిదేమాట అడిగి తెలుసుకుందామనుకుంటాను. కనపడితే నా ప్రశ్నకి జవాబు యివ్వాల్సి వస్తుందని పాపం భయపడి కనపడకుండా ఎక్కడో దాక్కున్నాడు" పార్వతమ్మ నవ్వుతూ చెప్పింది.
"మీరు భలే మాట్లాడుతారు" పద్మిని అంది.
పార్వతమ్మ ఆమాట వినిపించుకోనట్లు ఆలోచనలో పడింది.
పద్మినికూడా మౌనంగా వుండిపోయింది.
"కాలం కన్నీరు కార్చింది" నవల కొంపదీసి ఈమె చదవలేదు కదా! ఆ నవల చదివి వుంటే తను చెప్పింది అబద్ధమని చక్కగ గ్రహిస్తుంది. అంతేకాదు తనను మోసగత్తెగా తలచి నాలుగు చీవాట్లువేస్తుంది. లేదంటే పోలీసులని పిలిచి పట్టిస్తుంది. కాని శ్రీమహాలక్ష్మిలావున్న ఈమె అలాంటి ఆమెలా కనిపించటం లేదు!
పద్మిని ప్రియదర్శిని అలా ఆలోచిస్తుండగా పార్వతమ్మ పిలిచింది. "నీవు చెప్పిన ఆశ్రమం విజయవాడలో వున్నట్లు నేను ఎప్పుడూ వినలేదమ్మా! ఎందుకంటే గత ముప్పై యేళ్ళబట్టి మా నివాసం విజయవాడలోనే" అంది.
"అయ్యో! ఆశ్రమమే లేదా? నేను వున్నదని విన్నానే!" అంది పద్మిని.
"నామాట వింటానంటే నేనొక ఉపాయం చెపుతాను" పార్వతమ్మ అంది.
"చెప్పండి వింటాను" వెనుకాముందు ఆలోచించకుండా అంది.
"ఇప్పుడుకాదు, ఈ రైలు విజయవాడ స్టేషనులో ఆగిన తర్వాత చెపుతాను" అంది పార్వతమ్మ!
పార్వతమ్మ చెప్పబోయేది ఏమిటో పద్మినికి అర్ధంకాలేదు. తల తాటించి వూరుకొంది.
తగ్గినట్లే తగ్గి మళ్ళీ జ్వరం వచ్చేసింది పద్మినికి. "కాసేపు పడుకుంటాను" అని చెప్పి దుప్పటికప్పుకొని పడుకుంది.
పార్వతమ్మ దీర్ఘాలోచనలో పడింది.
12
విజయవాడ స్టేషన్!
ఎక్స్ ప్రెస్ దడదడలాడుతూ పెద్దశబ్దంచేస్తూ వచ్చి ఆగింది.
శంకర్రావు గాఢంగా నిద్రపోయాడు. విజయవాడ రాబోతున్నదని తెలిసి భర్తని లేపింది పార్వతమ్మ!
"అప్పుడే ఊరొచ్చేసిందా?" ఆవులిస్తూ అని పై బెర్త్ మీంచి కిందకి దిగాడు. దిగుతూనే దుప్పటి ముసుగుతన్ని పడుకున్న ప్రియదర్శినిని చూసి "మళ్ళీ జ్వరం వచ్చిందా?" స్వరం తగ్గించి అడిగాడు శంకర్రావు.
ఊకొట్టి వూరుకొంది పార్వతమ్మ!
"పాపం ఎక్కడికి వెళ్ళాలిట?"
"మన వూరే"
"మందులబాక్స్ లో ఇందాకనే చూశాను మెటాసిన్ ఒకేమాత్ర వుంది. పోనీ డిస్ప్రిన్ గాని ఆస్ప్రోగాని యివ్వు పైపైన తగ్గుతుంది" శంకర్రావు జాలిపడుతూ ఉచితసలహా ఒకటి యిచ్చాడు!
"ఇంటికి వెళ్ళిన తరువాత డాక్టరుకి చూపిద్దాము" ఒకే ఒక్కమాట అంది పార్వతమ్మ.
దగ్గర బాంబుపడితే ఎగిరిపడ్డట్టు యెగిరిపడ్డాడు శంకర్రావు. "ఏమిటి పార్వతీ నీ వంటున్నది?" అయోమయంగా చూస్తూ అడిగాడు.
"అర్ధంకాలేదా?"
"అంటే..."
"అంటే లేదు కొంటేలేదు! ఈ అమ్మాయి మనతో మనింటికొస్తుంది అంతే"
"అదికాదు పార్వతీ!"
"వద్దండి మీరేం చెప్పవద్దు. మీ ముందుచూపు నాకు తెలిసిందే! ఈ అమ్మాయి కొంచెం మన సునీతలాగుందని మనతో తీసుకెళదామని చెప్పటంలేదు! ఇందాక మీరు పడుకున్నప్పుడు లేచి కూర్చుంది. ఎక్కడికెళ్ళాలి యేమిటి అనడిగి తెలుసుకున్నాను. అమ్మాయిది హృదయం ద్రవించే కథ...