"మీరు చాలా మంచివారు శ్యాం!"
"మనం రిక్షాలో ఉన్నాము. ఇంటికెళ్ళినతర్వాత స్వీట్ కిస్ తో ఈ మాట అను" వాసంతి చెవిలో గుసగుసలాడాడు శ్యాంసుందర్.
18
ఆరోజు రాత్రి కాలేజీలో చాలా ప్రోగ్రాములున్నాయి. గేయరూపంతో కూడిన వాసవదత్త నాటకం, మిమిక్రీలు, విచిత్ర వేషధారణ, ఓ నాట్యము. శ్యాంసుందర్ లెక్చరర్ గా వున్న కాలేజీలో ఇవన్నీ జరగటం, శ్యామ్ సుందర్ కి నాటకంలో ఓ పాత్ర. విచిత్ర వేషధారణలో ఓ వేషం వున్నాయి. పదిగంటలకి బోంచేసి వెళ్ళిపోయాడు. ఇహ అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత రాత్రికే యింటికి రావటం.
నాటకం చూడటానికి భానుమూర్తి, శ్రీదేవమ్మ, వాసంతి రాత్రికి వెళుతున్నారు.
నాటకంలో తనపాత్ర ఏమిటో శ్యామ్ సుందర్ వాసంతికి చెప్పలేదు. తల్లి తండ్రిని కూడా చెప్పవద్దన్నాడు. తను వేషం వేస్తే ఎవరూ గుర్తించలేరు. తెలివిగలదానివి అయితే చూసి గుర్తించు అని శ్యాంసుందర్ అన్నాడు.
"మిమ్మల్ని స్టేజిమీద యిలా చూసి అలా గుర్తించకపోతే నా తెలివి దేనికి? మా గొప్పగా శలవిస్తున్నారు. నావద్ద నాటకం ఆడకండి" అంది వాసంతి.
ఆ మధ్యాహ్నం శ్రీదేవమ్మ తెలిసినవాళ్ళింటికెళ్ళింది. వాళ్ళెందుకో కబురుచేస్తేను. భానుమూర్తి యింట్లో లేడు. శ్యాంసుందర్ పదింటికి వెళ్ళిపోయాడు. తలుపులు గడియలు బిగించుకుని వుంది వాసంతి. ఒక్కతి ఇంటి మొత్తంమీద. చదవటానికి ఏమీ పుస్తకాలు లేవు. చేయటానికి పనిలేదు. తీరుబడిగా సోఫాలో కూర్చుంది. ఎదురుగా వున్న వంకెకు తాళంచెవులు కనపడ్డాయి.
వాసంతో ఆలోచనలు పరిపరివిధాల పోతున్నది. దానికి కారణం లేకపోలేదు. ఆ తాళంచెవులు చిన్న గాడ్రేజ్ బీరువావి. ఆ గాడ్రేజ్ బీరువాలో పాత డైరీలు, కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఫ్రెండ్స్ యొక్క లెటర్స్ ఏవో కొన్ని ఫైల్స్ వున్నాయని అవి పోకుండా వుండటానికి తరచు తీసే అవసరం లేదుకాబట్టి బీరువాలో భద్రపరచానని శ్యామ్ సుందర్ వాసంతితో చెప్పాడు. అందుకే వాసంతి బీరువా జోలికి పోలేదు. కాని ఈమధ్య శ్యాంసుందర్ వకటికి రెండుసార్లు ఆ బీరువా తియ్యటం, వాసంతి గదిలోకి రావటంచూసి కంగారుగా చేతిలో వున్నవి బీరువాలో పెట్టి తాళం వేయటం జరిగింది.
శ్యాంసుందర్ తన్నిచూసి కంగారుపడ్డాడనుకోవటం తన భ్రమ అని సరిపెట్టుకుంది వాసంతి. బీరువా తాళంచెవులు భద్రపరిచే విషయం మొదట్లో గమనించలేదు. మొన్నటిరోజు అనుమానం వచ్చింది. తనది అనవసరపు అనుమానం కావచ్చునని సర్దుకుంది. కాని ఈరోజు...
శ్యాంసుందర్ ని బోజనానికి పిలవటానికి ఈ ఉదయం బెడ్ రూములోకి వెళ్ళింది వాసంతి. అప్పుడు శ్యాంసుందర్ తెరిచిన బీరువాముందు నుంచుని ఆల్బం తిరగేస్తున్నాడు. "శ్యాం" అన్న వాసంతి పిలుపు విని తనచేతిలో వున్న ఆల్బంని ఎక్కడ చూస్తుందో అని తత్తరబిత్తరపడి తెరిచివున్న ఆల్బంని ఠకీమని మూసి బీరువాలో ఓ పక్కకి తోశాడు. అప్పుడే ఆల్బంలోంచి ఓ ఫోటో కిందపడింది. కంగారుగా వంగొని ఆ ఫోటో తీసి బీరువాలోకి విసిరేసి చాలా తొందరగా బీరువా తలుపులు మూసి తాళం వేశాడు. తాళంచెవులు యివతలవుంటే కొంప మునుగుతుందేమో అన్నట్లు పాంటుజేబులో పెట్టుకున్నాడు.
ఆపై "ఏంటి వాసంతీ! పనేమయినా వుందా? అదేంటి అలావున్నావ్! అదె అదె, ఈరోజు చాలా చాలా అందంగా వున్నావు. అందుకే కొత్తగా భలే బాగున్నావు. అసలు నువ్వెప్పుడూ నాకళ్ళకి బాగుంటావు" అంటూ ఏదో వకటి మాట్లాడాలన్నట్లు మాట్లాడాడు.
ఇదంతా చూస్తుంటే కృత్రిమంగాను, శ్యాంసుందర్ చేస్తున్నది నటనలాను వున్నది వాసంతికి. అయినా వాసంతి అప్పటికప్పుడు బయటపడలేదు. మామూలుగానే మాట్లాడి భోజనానికి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది.
ఈరోజు జరిగిన సంఘటన శ్యాంసుందర్ తీరు, ఎప్పుడూ కంటపడని బీరువా తాళంచెవులు చూసి వాసంతి ఓ నిర్ణయానికొచ్చి తల పంకించి సోఫాలోంచి లేచింది.
భార్యా భర్తల మధ్య రహస్యం వున్నా వాళ్ళల్లో వాళ్ళకి వకరిపై వకిరికి అనుమానమున్నా ఆ యిరువురిలో వకరికి భయం రెండోవారికి క్రోధం సర్వసామాన్యమే. శ్యాంసుందర్ ప్రవర్తన చూడబోతే భయం భయంగాను, వాసంతి ప్రవర్తన చూడబోతే భర్త మీద పూర్తి అనుమానం చెందిన దానిలాగానువుంది. ఎదురుగా తాళంచెవులు కనపడుతున్నాయి. ఇంట్లో ఎవరూలేరు. వాసంతి సమయాన్ని సద్వినియోగం చేయదలచుకుంది. దీంట్లో తప్పు కనపడలేదు.
వాసంతి తాళంచెవులు అందుకుంది. దానిలో తప్పు కనపడలేదు కాబట్టి జంకు గొంకు ఏర్పడలేదు. ఆ బీరువాలో ఏదో పెద్ద రహస్యమున్నట్లు కుతూహలంమాత్రం ఎక్కువయింది.
వాసంతి బీరువా తెరిచింది.
బీరువాలో కాగితాల కట్టలు, కొన్ని పుస్తకాలు, పాత డైరీలు వున్నాయి. వాటిని పైపైన తిరగేసింది. కాగితాల కట్టలుమాత్రం వ్రాతప్రతిలో వున్న కథలతాలూకావి. కొన్ని బైండింగ్ పుస్తకాలలో కవితలు, నాటికలు, నాటకాలు రాసివున్నాయి. వాటిని చూస్తుంటే విసుగుపుట్టింది వాసంతికి. ఓ పుస్తకం పక్కగా పడున్న ఫోటోని, ఓ మూలగా వున్న ఫోటో ఆల్బమ్ ని ఆతృతగా అందుకుంది.
ఆల్బంలో కొన్ని ఫోటోలు మగవాళ్ళవి, కొన్ని ఆడవాళ్ళవి వున్నాయి. ఫోటోలు పూర్తిగా అతికించిలేవు. ఊరికే అలా పేజీలలో పెట్టి వున్నాయి. వాసంతి వక్కొక్క ఫోటో పరీక్షగా చూస్తూ వెనక్కు తిప్పి వెనకవేపు రాసున్నది చదివి కోపం ఆపుకోలేకపోతున్నది.
రకరకాల ఫోజుల్లో అందమైన అమ్మాయిల ఫోటోలు పదిదాకా వున్నాయి. ఫోజులంటే సైడుఫోజుల్లాంటివి కావు. చిలిపిగా చూస్తూ, కళ్ళు చిలకరించి, రౌడీలాగా ఓ కన్ను మూసి కన్నుకొడుతున్నట్లు, పళ్ళసందున నాలుకపెట్టి వెక్కిరిస్తున్నట్లు, విరగబడి నవ్వుతున్నట్లు రకానికో ఫోజులో వున్నాయా ఫోటోలు.
ప్రతి ఫోటో వెనకాతల ప్రియమైన శ్యామ్ కి ప్రేమతో సీతా శ్రీనివాస్, శ్రీమతి రాధామనోహరి, విమలా భాస్కర్ అలా అందరిపేర్లు వున్నాయి. ఒక ఫోటోకి మాత్రం వెనక ఏమీ రాసిలేదు. ఫోటోలో అమ్మాయి ఆంగ్లోయిండియన్ కావచ్చు. ఫేస్ అలాగేవుంది. చేతిలో సిగరెట్ తాలూకా పొగవుంది. గాలిలో ముద్దు విసురుతున్నట్లు ముఖంపెట్టింది. ఫోటోమీద కిందగా చిన్న అక్షరాలతో నీకు నేను అని రాసి వుంది.
తీరుబడిగ ఫోటోలన్నీ చూసింది వాసంతి. నీకు నేను రాసిన వగలాడిని ఎప్పుడో ఎక్కడో చూసినట్లుంది గాని గుర్తురావటంలేదు వాసంతికి. తల తిరిగిపోతున్నది. వళ్ళు మండిపోతున్నది.