చిత్రహింసపడుతున్న మనసుతో యింటికి వచ్చాడు శ్రీకర్.
మేడమెట్లు దిగబోతున్న అతనికి "స్వాగతం" కార్మిక లోకనాయకునికి జిందాబాద్! దీనజనభాంధవుడికి జై అన్న జ్యోతి మాటలు వెగటుగా వినిపించాయి.
మెట్లెక్కబోతున్న వాడల్లా ఆగేడు.
"అయిందా ప్రజాసేవ?"
"జ్యోతి!"
"ఏం ఎలా తెలిసిందనా? రోజురోజుకీ మీరు మారిపోతూ నాకు నా యింటికి తలపెడుతున్న అన్యాయాలు క్షణక్షణం తెలుస్తూనే ఉన్నాయ్ శ్రీకర్! మాకు విషయాలు చెప్పేవాళ్ళున్నారు!"
"నాకయితే నిఘావేశావా?"
"తప్పేం! ఇన్నిలక్షల ఆస్తిని కాపాడుకోవాలంటే మాటలా? అందునా నీలాంటివాడిని చేరదీశాక పాముని యింటిలో పెట్టుకున్నట్టేగా?"
"జ్యోతీ! జాగ్రత్తగా మాట్లాడు!"
"నేను జాగ్రత్తగా మాట్లాడుతూనేవున్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను. కనకపు సింహాసనాన్ని నిన్ను ఎక్కించాక అజాగ్రత్తగా వుంటే యెలా?"
ఆమె వ్యంగ్యం నషాళానికంటింది. అతన్లో కోపం తాచుపాములా లేచింది. "ఏం కూశావ్? నన్ను కుక్కతో పోలుస్తావా? నిన్ను... నిన్ను..." అంటూ ఆవేశంగా దిగాడు మెట్లు.
పకపకా నవ్వింది జ్యోతి.
"మిస్టర్ శ్రీకర్! కుక్కతో పోల్చానని ఎందుకండి కోపం, తిండిపడేసి గొలుసుతో పట్టుకుంటే అది విశ్వాసంగా నేవిస్తుంది, నీలో ఆ విశ్వాసమైనా వుందా?
"జ్యోతీ!"
"ష్! ఎందుకలా అరుస్తావ్? అలగాజనంతో తిరిగి తిరిగి ఆ బుద్ధులేవచ్చాయి! అయినా పుట్టుకతో బుద్దులు పెంపకంతో సంస్కారం వస్తూంది. అది నీలో ఎక్కడుంది? నక్కకు నాగలోకానికి ఏం సంబంధం?
పుండుచేసి కారం రాసినట్టుగా అయిందతనికి "రాక్షసీ నిన్ను..." అంటూ ముందుకి వచ్చాడు.
అయినా జ్యోతి తొణకక బెణకక అలానే నించున్నది. నన్ను కొడతావా? చంపుతావా? కమాన్! కొడితే మొన్నటిలా సహించేందుకు సిద్ధంగాలేను... చంపుతావా? చావటానికి నేను రెడీగాలేను. అవసరమైతేనీ ప్రాణమే తీస్తాను?"
నిర్ఘాంతపోయాడు శ్రీకర్ ...జ్యోతీ...తీ...అన్నాడు.
వికటంగా నవ్వింది జ్యోతి.
భర్తని అయినా గౌరవం లేకుండా..."
స్టాపిట్ నీవు...భార్యని గౌరవిస్తున్నావా? నేను నిన్ను గౌరవించటానికి. అయినా మనమధ్య ఆ సున్నితమైన పొర తెగిపోయింది. ఇద్దరం పార్టనర్స్ మి, అంతే! ప్రేమ, ఆత్మీయత అభిమానం పదాలు వల్లించకు!"
"అయితే ఇంకా యీ యింటిలో ఎందుకుండాలి నేను? పద! నా వెంటరా!"
హు, ఇక్కడుంటేనే నా స్థితి యిలావుంది నేను రాను నువెళ్ళిపో! జీవితంలో చేసిన పొరపాటుకి జీవితాంతం విచారిస్తూ బతుకుతాను! ఒక అయోగ్యుడికి మనసిచ్చి అందలం ఎక్కిస్తే రౌడీగా ఖూనీకోరుగా మారిపోయాడని బాధపడతాను. ఏంచేయను? జరిగింది తిరిగిరాదు కదా?
"నన్ను...నాతో ...తెగతెంపులు చేసుకుంటావా?"
"అవును! అంతే! పాముని పక్కలో పెట్టుకున్నట్లుగా నీతో కాపురం చేయలేను ..."
"జ్యోతీ...బాగా ఆలోచించు...ఆరోజు ఎలా కలిశాము? ఎలా బ్రతికాము? ఈ స్థితి ఎందుకొచ్చింది? దీనికి కారణం ఎవరు?"
"నువ్వే! ఖచ్చితంగా నువ్వే పాలల్లో ఉప్పురాయి వేసినట్టుగా ఇంకా ఎందుకు మనకీబంధం. ఇదిగో నీవు కట్టినతాళి...తీసుకో" చప్పున మెడలోంచి తాళిబొట్ల గొలుసు తనచేత్తో పట్టుకుంది అది గాల్లో దీపంలా వూగసాగింది.
అప్రతిభడయ్యాడు శ్రీకర్.
"జ్యోతీ! ఎంతకు తెగించావు? ఇంత జరిగాక మనము కలిసివున్నా కష్టమే. అయినా బాగా ఆలోచించుకో మరోసారి! ఈ ధనం నీలో అహంకారం పెంచింది. నాతో వచ్చేయ్ యిదంతా వదిలేసి కష్టపడి బ్రతుకుదాం. నీకు మంచీ చెడూ చెప్పే నానమ్మా, అమ్మా లేరు. ఆడాళ్ళ అదుపులేని నీలాంటి అమ్మాయిలు యిలాగే ప్రవర్తిస్తారు."
"హు నానమ్మ! ఆమె తమ మహత్యమైన పాద ప్రవేశం అయిన నెలకే చనిపోయింది. అమ్మకూడా అల్లుడు గారి యినుపపాద మహిమతో మీ రాక జరిగిన రెండు నెలలకే చనిపోయింది. ఇక నాలుగు నెలలకే మన సంసారం తెగిపోయింది. ఇంకా కలిసివుంటే నేను చస్తానేమో! వద్దు వెళ్ళు తక్షణం ఈ యింట్లోంచి వెళ్ళు. ఇదిగో నీవు కట్టిన తాళి నాలుగు తులాలుంది. కనీసం ఆరువేలు చేస్తుంది. ఏ కార్మికుడి భార్య మెడలోనో వెయ్!"
"జ్యోతీ! పవిత్రమైన మాంగల్యానికి యిచ్చే విలువ అదేనా?"
"విలువ...పవిత్రత...మాంగల్యం..." వెక్కసంగా నవ్వింది జ్యోతి. "శ్రీకర్! ఖరీదైన అల్సేషియన్ కుక్కని కొన్నప్పుడు గొలుసుతోకట్టి పట్టుకొస్తాం. అది మనల్నేకరుస్తుందన్నప్పుడు కాల్చేస్తాం లేదా గొలుసుతో సహా వదిలేస్తాం. ఇదీ అంతే- భర్తగా నిన్ను తెచ్చుకున్నప్పుడు నువ్వు నా మెడలో కట్టిన లైసెన్స్ బిళ్ళయిది! నేనే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెందుకు తీసుకో!"
రివ్వున జారుతూ వచ్చింది మాంగల్యం.
శ్రీకర్ మనసు పాడైపోయింది. వంగి దాన్ని అతి పవిత్రభావంతో అందుకున్నాడు. ముందుకు వెళ్ళాలని నాలుగడుగులేసాడు. జ్యోతితో ఓ మాట చెప్పాలనిపించింది.
"జ్యోతీ! నీవు పూర్తిగా మదించి వున్నావు. ఇప్పుడు నీకు ఏమీకనిపించటంలేదు, నన్ను క్రూరంగా అవమానించి పంపుతున్నావు. అయినా ఎందుకో నీమీద జాలి కల్గుతుంది. ఎప్పటికైనా నీలో పరివర్తన కలిగి తిరిగి నావద్దకు రావాలని అనిపిస్తే సిగ్గుపడద్దు...అవమానంగా భావించవద్దు. నిరభ్యంతరంగా వచ్చెయ్. నేను నా కాళ్ళమీద నిలబడి నిన్ను పోషిస్తా! ఆనందంగా ఆహ్వానిస్తా గుడ్ బై!"
చకచక మరో మారు చూడనయినా చూడకుండా వెళ్ళిపోయాడు. ఆఖరుగా అతను చెప్పిన మాటలకి నిర్ఘాంతపోయి నిలుచుంది జ్యోతి.
24
గతమంతా గుర్తుకువచ్చి మనసంతా చేదుతిన్నట్టుగా అయిపోయింది శ్రీకర్ కి. బరువైన నిట్టూర్పు విడిచాడు.