"ఓర్నీ! ఊరంతా నాకు మామలే! నీకు మామనట్రా" నవ్వుతూ అన్నాడు శ్రీనివాసులు.
"మామా! మామా! నన్ను ఎక్కించుకోవూ?"
"ఎందుకురా బుజ్జీ! మాచేను దమ్ముచేయించటానికి వెళుతున్నాను నీవు ఎక్కడికి వస్తావు"
"మా నాన్నా అమ్మా వెళ్ళారుగా! నేనూ పొలం వస్తాను."
"ఎవర్రా మీ నాన్న!" వాడిని ట్రాక్టరు పైకి ఎక్కించుకుంటూ అడిగాడు శ్రీనివాసులు. అతడికి ఆ కుర్రవాడి రూపురేఖలూ, మాటలు చాలా ముద్దొస్తున్నాయ్. భార్యా పిల్లలు లేని ఆ కసాయివాడి మనస్సులో ప్రేమని చిలుకుతున్నాడు బాబు.
"రమణయ్య మా నాన్న!"
పక్కలో పిడుగు పడ్డట్టుగా అదిరి పడ్డాడు శ్రీనివాసులు. క్షణకాలం అతడి కనుబొమలు ముడిపడ్డాయి. చేతులు బిగుసుకున్నాయి. నరాల్లో రక్తం అతి వేగంగా పరుగులు తీసింది.
"మామా! ట్రాక్టర్ని నడుపుతావా! నేనూ వస్తా" అన్నాడు బాబు.
"నేనే నిన్ను పంపించాలనుకుంటున్నాన్లేరా! నీవూ వస్తానంటే నా పని యింకా సులభం కదా" కర్కశంగా విషపు నవ్వు నవ్వి ట్రాక్టర్ని కదిలించాడు శ్రీనివాసులు.
ట్రాక్టరు కదిలింది. ఆ వీధి దాటింది మెల్లి మెల్లిగా. మాలవాడ కూడా వెనుక బడింది. రోడ్డుమీదుగా పరిగెడుతోంది ట్రాక్టరు బోడీగా వుండి ఏ సామాను లేక ఒట్టి ఇంజన్ ఉండడంతో వేగంగా వెళుతోంది. శ్రీనివాసులుకి చాలా ఆనందంగా వుంది. అతని కోరిక తీరుతోంది ఏ శ్రమా పడకుండా, ఏ ఆలోచనా లేకుండా వేటగాడి చేతికందుబాటులోకి వచ్చింది.
జస్టు! ఒక్క నిమషం కళ్ళు మూసుకుంటే చాలు, రమణయ్య ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోతుంది. చంద్రయ్య పగ తీరుతుంది.
శ్రీనివాసులు కళ్ళల్లో విషం పొగలు కక్కుతోంది.
"మామా మెల్లిగా నడుపు" అన్న బాబు కేక ఆ ట్రాక్టరు హోరులో పైశాచికానందం అనుభవిస్తున్న శ్రీనివాసులకి వినిపించలేదు.
క్షణం తర్వాత అతను అటూ ఇటూ చూశాడు. సమీపంలో ఎవరూ లేకుండటం చూసి సడన్ బ్రేక్ వేశాడు. ట్రాక్టర్ యిచ్చిన జరుక్కి ఎగిరి పడ్డాడు బాబు, బ్రేక్ విడిచాడు శ్రీనివాసులు. బండి వెనక్కి నడిచింది. టయిర్ క్రింద పడిన బాబు చివరికేక "అమ్మా అన్న ఆర్తనాదం.
పని జరిగిపోయింది. అయితే శ్రీనివాసులు అటు చూళ్ళేక పోయాడు ఏక్సిడెంటుచూసి పరుగు పరుగున వస్తున్న మనుషుల కెదురుగా నడిచాడు.
* * *
"బాబూ!" సరోజ వేసిన కేకకు ప్రపంచమే దద్దరిల్లిపోయిందా అన్నట్లుగా వుంది. భర్తకు అన్నం యిచ్చి తిరిగి వస్తున సరోజతో చెప్పారెవరో "మీ బాబు ట్రాక్టరు క్రింద పడ్డాడని."
ఎక్కడ పడ్డాడు? ఎలా పడ్డాడు? ఎలా వున్నాడు అని ప్రశ్నించలేదు సరోజ ఉరుకులు పరుగులు పెట్టి వెళ్ళసాగింది, సరోజ మనస్సంతా శూన్యమైపోయింది, పిచ్చిపట్టిన దానిలా పరిగెత్త సాగింది సరోజ.
అల్లంత దూరంలో గుంపుగా గూడిన జనాన్ని చూసి బహుశా అక్కడే ఏక్సిడెంటు జరిగి ఉంటుందని అనుకుని మరీ వేగంగా పరిగెత్తసాగింది.
"సరోజ! సరోజ!" అన్నారెవరో గుంపులో.
"ఆమెని అక్కడే ఆపండి! చూసి భరించలేదు" అన్నాడు మునసబు.
"అయ్యా! మీ మాట నిజమే. కానీ కన్నతల్లిని ఆపటం సాధ్యమా?" అన్నాడు కరణం.
"గుండె చెదిరితే పెద్ద ప్రాణానికే మోసం" అన్నారు ఎవరో.
"ఏడీ నా బాబు! ఏడీ! ఎక్కడున్నాడు?" గుంపును చేరిన సరోజ ఆయాసంతో దుఃఖంతో అడిగింది.
"అమ్మా! నీ బాబు చనిపోయాడు. ప్రాణం పోయాక నీ బాబు అయితే నా బాబు అయితే ఏం! చూచి చేయగలిగిందేం వుంది? సంబాళించుకో" అన్నాడు మునసబు.
"బాబూ"
సరోజ కేకకి గుంపు అదిరిపోయింది. గుంపుగా వున్న మనుషుల్ని నెట్టుకుంటూ శవం వున్న చోటుకి వెళ్ళింది సరోజ.
ఏముంది అక్కడ?
రక్తం మడుగు ఆ మడుగులో అయిదేళ్ళు పాలుమీగడలతో ప్రేమని రంగరించి పెంచుకున్న కొడుకు శరీరం.
పక్క ఎముకల మీదుగా శిరస్సుపైన వెళ్ళింది చక్రం. ఓవైపు అంతా అలాగే భూమికి అతుక్కుపోయింది. చంప కనిపించటంలేదు, అస్తమిస్తున్న సూర్యుడిలా వుంది ఓ కన్నులేదు గుడ్డు వుండేచోట ఖాళీ ఉంది.
ధారగా కారిన రక్తం దాదాపుగా వందగజాలు పారింది.
"బాబు! బాబు!"
"బాబు! బాబు!
"సురేంద్రా! సురేంద్రా!"
"సురేంద్రా! సురేంద్రా!"
"అమ్మా! అమ్మా!"
"నా కొడుక చావలేదు. బ్రతికే వున్నాడు. అడుగో పిలుస్తున్నాడు. ఎక్కడికి వెళతాడు తనని విడిచి బాబూ! వస్తున్నాను ఆగు బాబూ!" అంటూ కేక వేసింది సరోజ.
సరోజ వేసిన కేకకి అంతా దిగ్భ్రాంతి చెందారు.
కొడుకు శవంపై పడిపోయిన సరోజని లేవదీయటానికి ప్రయత్నించిన మునసబుకి ఆమె శరీరం చల్లగా మంచుగడ్డలా కనిపించింది.
"అయ్యో! అన్నారంతా.
అప్పుడొచ్చాడు రమణయ్య.
కొడుకునీ భార్యనీ చూసిన రమణయ్యలో జీవం నశించింది ఆ క్షణంలోనే.
"జరుగవలసిన పని కానివ్వండి" అని నిర్లిప్తంగా కదిలాడు. ఏకైక పుత్రుడినీ గర్భవతియైన భార్యని పోగొట్టుకుని దిగాలుగా వెళుతున్న రమణయ్య వెంట నడిచాడు మునసబు."
* * *
మునసబుగారు యిచ్చిన టెలిగ్రాం చూసుకుని వచ్చేశారు గోపీ, రాధ. వాళ్ళకు అసలేం జరిగిందీ అర్ధం కాలేదు.
విషయమంతా విన్న గోపీ మునసబుగారి వద్దకు వెళ్ళి రిపోర్టు చేయమని చెప్పాడు.
"లాభం లేదోయ్ అల్లుడూ! మీ అన్న సుతరామూ అంగీకరించటం లేదు. వాడేం నా శత్రువా? పగబూని పసివాడిని చంపే అవసరం ఏముంది? ఒకవేళ అలాగే అనుకున్నా సరోజని ఎవరు చంపారు?
చంపేదెవరు? చచ్చేదెవరు? అంతా భగవంతుడి లీల. ఎవరికెంత ప్రాప్తమో! అంత. భార్య అన్నా, పిల్లలన్నా ఋణానుబంధాలు. అంతే ఎవరికెంత బాకీయో అంతా తీర్చుకుని వెళ్ళిపోతారు అన్నాడు.
ఉగ్రుడైన రామశేషు శ్రీనివాసులు మీదికి వెళతానంటే కూడా ఒప్పుకోలేదు. అసలు శ్రీనివాసులు ఊళ్ళోనే లేడనుకో. అది వేరేమాట, ఇప్పుడేం కేసు పెట్టినా ట్రాక్టరు వాళ్ళపైకి వెళుతుంది. బాడుగ కోసం వచ్చి బతుకుతున్న వాళ్ళని బాధపెట్టి లాభం ఏమిటి?" అన్నాడు మునసబు.
గోపీకి మరేమీ మాట్లాడటానికి అవకాశం చిక్కలేదు.
"ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో తల్లి, వంశం వంశమే తుడుచుకునిపోయింది" అన్న ఇరుగుపొరుగు అమ్మలక్కల మాటల్ని "ఛీ! ఛీ!" అని ఖండించాడు రమణయ్య.
"అనవసరంగా ఆమె నెందు కనుకోవాలి. మన రాత ఇలా ఉంది" అన్నాడతను.
పది పదిహేను రోజులుండి తిరిగి వెళ్ళిపోయారు గోపి, రాధ.
ఆ రోజునుంచి రమణయ్య జీవితమే మారిపోయింది. పగలల్లా పొలంలో గడుపుతాడు. రాత్రి ఆ మేడలో ఒంటరిగా సరోజ, బాబుల స్మృతులతో గడుపుతాడు.
ఉదయం ఒక్కసారే అన్నం వండుకుంటాడు. పగటికి అదే! రాత్రికి అదే! పచ్చడి మెతుకులతో ముగిస్తాడు.
రోజులు గిర్రున తిరుగుతున్నాయ్. వ్యవసాయం విషయాల్లో తప్ప రమణయ్య జోక్యం కలిపించుకోవటం లేదు.
తర్వాత తర్వాత బాబు ఏక్సిడెంటల్ గా ట్రాక్టరు క్రింద పడలేదనీ, చంద్రయ్య పగతో ఆ పని చేయించాడనీ ఊరంతా గుప్పుమని చెప్పుకున్నారు. చనిపోయిన అబ్బాయిని చూడటానికి వస్తున్న విశాలని చంద్రయ్య అడ్డగించాడనీ, తెగించి రాబోతే కఱ్ఱతో బాదేడని అనుకున్నారు.
యోగిలా అన్నీ విన్నాడు రమణయ్య. ఒక్కమాట కూడా అనలేదు.
రాధ, గోపీ ఎమ్మెస్సీ పూర్తి జేశారు.
ఆ సెలవులన్నీ ఊళ్ళోనే గడిపారు.
రిజల్ట్సు వచ్చాక ఇద్దరికీ గుంటూర్లో ఓ ప్రయివేట్ కాలేజీలో లెక్చరర్స్ గా పోస్టింగ్స్ వస్తే వెళ్ళారు.
గర్భవతి అయిన భార్యని కాన్పుకి అన్నగారి వద్దకు పంపేడు గోపీ. అనసూయమ్మ సంపూర్ణ ఉత్తరదేశ యాత్రలకి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడుందో తెలీదు.
* * *