.గతమంతా మనసులో మెదిలింది రమణయ్యకి.
బాబు, సరోజ స్మృతులు అతన్ని బాధపెట్టాయ్. కన్నీరు తుడుచుకొని పొలంలో అడుగు పెట్టేడు.
చివరి చేట తూర్పారపోసిన కూలీలు పనిముగిసే సరికి వచ్చిన రమణయ్యని చూసి ధాన్యం అంతా ఇళ్ళకి చేరుద్దాం అన్నారు. తలూపాడు రమణయ్య.
11
భార్య మంచం వద్దకూర్చుని "వీడిలో అన్నీ బాబు పోలికలు కనిపిస్తున్నాయి కదూ?" అని అడిగాడు గోపీ.
నవ్వింది రాధ.
"మీదంతా చిత్రం వీడికి నిండా నాలుగు రోజులు నిండలేదు. అప్పుడే పోలికలు చెబుతున్నారు" అంది.
"కాదు రాధా! మా వదినకి నేనన్నా నీవన్నా ఎంతో ప్రేమ, నాకు బాబు అంటే ఎంత ప్రేమో నీకు తెలుసు. వాడు చనిపోయాక నా మనస్సంతా శూన్యంగా ఉండిపోయింది. పైగా నీకు గుర్తుంది కదూ! వీడు నీ కడుపున పడ్డప్పటినుంచీ నీకు యీ ఊరు రావాలని ఒకే ధ్యాసగా ఉండేది. రాత్రిళ్ళు కలలో కనిపించి ఊరికి రా అని వదిన పిలిచేది అని చెప్పావు. అందుకేగా ఎన్నో అధునాతన సౌకర్యాలున్నా గుంటూరు వదలి కాన్పుకు ఈ వూరువచ్చావు. అన్నీ ఆలోచిస్తే బాబే మళ్ళీ పుట్టేడేమో అనిపిస్తుంది నాకు అన్నాడు గోపి.
"కోరికలు తీరక ఆశలు చావక అకస్మాత్తుగా చనిపోయినవాళ్ళు మళ్ళీ పుడతారట. మనం ఎన్నో కధలు చదివాం అలాంటి పునర్జన్మల్ని గురించి మీరు చెపుతూ ఉంటే నిజమేనేమో అనిపిస్తోంది" అంది రాధ.
"ఏం అనుభవించారు వాళ్ళు? నిండా అయిదేళ్ళు నిండని పసికూన వాడు. కానీ గోపీ వాడికి ఆ వయసుకే పొలం అంటే ఎంత ప్రేమ, ధాన్యాన్ని చూస్తే ఎంత సంబరపడేవాడు? పశువులన్నా వాడికంతే! అంతా బావగారి గుణాలు పుణికి పుచ్చుకుని పుట్టాడు వాడు."
నిట్టూర్చాడు గోపి.
అతని మనస్సులో కలిగిన బాధని తొలగించాలని మాటమార్చి అడిగింది రాధ. "గోపీ! ఫణిచక్రవర్తి రోజా వస్తానన్నారా ఫంక్షన్ కి?"
"ఫణి రానన్నాడు. రోజీ రానంది. ఇద్దరూ యీపల్లెటూరికి రామన్నారు. వెళ్లాక రిసెప్షన్ ఏర్పాటు చేస్తేసరి"
"పోనీలెండి. బావగారికి కూడా అట్టే ఖర్చు పెట్టడం ఇష్టంలేదు, ఎందుకింత దుబారా అంటారు."
"ఆయన చిన్నతనం నుంచీ అంతే రాధా! పైసకి పైన ముడి వేశాడు. చూసిచూసి ఖర్చు చేయాలంటే ఆయన మనస్సు ఒప్పుకోదు."
రాధ ఏదో అనబోయింది.
అంతలో వచ్చాడు రమణయ్య.
స్టూల్ ని మరదలి మంచం దగ్గరిగా లాక్కుని "గోపీ! వీడు చాలా అదృష్టవంతుడు. ఈ సంవత్సరం ఎంత పంట పండిందని. నేను వ్యవసాయం ప్రారంభించాక బాబు పుట్టిన సంవత్సరం తప్ప మళ్ళీ ఇంత పంట రాలేదు. చెరుకుగూడా బాగా వచ్చింది. బెల్లం ధర కూడా విపరీతంగా ఉంది. వీడివల్ల యీ సంవత్సరం మన ఇల్లంతా బంగారం" అన్నాడు.
రాధ ముఖం వెయ్యి కేండిల్ బల్బులా వెలిగింది.
"బాలసారె బాగా జరుపుదాం" అన్నాడు మళ్ళీ రమణయ్య.
"ఎందుకన్నయ్యా విపరీతమైన ఖర్చు. పైగా ఏమి సంతోషంగా ఉందనీ, ఒదిన లేదు, బాబు పోయాడు, నాకు పదే పదే వాళ్ళే గుర్తుకి వస్తున్నారు" అన్నాడు గోపీ.
పేలవంగా నవ్వేడు రమణయ్య.
"గోపీ! ఎక్కడికెక్కడని, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఉన్నవాళ్ళు అనుభవించి తీరాలి. పోయిందని జరిగిన దాన్ని తలచుకుని దుఃఖించటంలో అర్ధం లేదు. మనవంతు వస్తూన్న సుఖాన్ని స్వీకరిస్తూనే వుండాలి. దుఃఖాన్ని మరిచిపోతూనే వుండాలి. అదే మన కర్తవ్యం" అన్నాడు రమణయ్య.
కన్నీళ్లు తుడుచుకున్నాడు గోపీ.
"వీడు కారు చీకటిలో వెన్నెల రేఖరా గోపీ! ఈ వెలుగు వెంబడే నా జీవిత యాత్ర సాగాలి" అన్నాడు రమణయ్య.
బావగారికి వాడిపై వున్న అభిమానానికి సంతోషించింది రాధ.
బాలసారె నాటికల్లా బంగారు మొలతాడు, చేతికి కావూరు, మెడలోకి పులిగోరు చేయించాడు పిల్లవాడికి. తమ్ముడికి రవ్వల ఉంగరం, మరదలకి రవ్వల కమ్మలు తెచ్చాడు.
బాలసారె రోజున తన పొలాలలో పనిచేసే పనిమనుషుల్ని అందర్నీ పిలిచి భోజనాలు పెట్టేడు. టౌన్ నుంచి వంట వాళ్ళని పిలిపించి లడ్డు, జిలేబీలు పూతరేకులు చేయించి వచ్చిన వారందరికీ ఇక చాలు అనేట్టుగా పెట్టాడు.
రమణయ్య ఖర్చు చూసి అంతా ముక్కుమీద వేలు వేసుకున్నారు.
గత పంటల్లో వచ్చిన డబ్బంతా విచ్చలవిడిగా వెదజల్లి నట్లు ఖర్చు పెట్టేడు రమణయ్య.
పేరు పెట్టేప్పుడు రమణయ్యని పిలిచాడు గోపీ.
తొట్లో వేసిన పిల్లవాడిని చూసి మురిసిపోయాడు రమణయ్య.
"పేరు చెప్పన్నయ్య?"
"నీ యిష్టం గోపీ! ఏదయినా పెట్టు నీ యిష్టం. రాధని అడుగు అయినా ఏమంటుందో?" మరదలని చూసి అన్నాడు రమణయ్య.
"మీరు చెప్పండి బావా" అంది రాధ.
"నాకేం తెలుసమ్మా! నన్నడిగితే ఏ దేవుడి పేరో పెట్టమంటాను. ఫేషన్స్ తెలియవు నాకు. చదువుకున్నవాళ్లు మీకే తెలుసు బాగా" అన్నాడు రమణయ్య.
"బాబు పేరు పెడతానన్నయ్యా"
రాధ మనస్సు అదోలా అయింది.
"వద్దు! వద్దు! ఆ అల్పాయుష్కుడి పేరు నా బంగారు తండ్రికి వద్దు. అన్యాయం చేసిపోయాడు వాడు. వేగుచుక్కలాంటివాడు వీడు. వీడికి ఆ పేరు ఎందుకు మరే పేరయినా పెట్టండి" అన్నాడు రమణయ్య.
రాధ మనస్సు తేలికయింది. భర్తతో మెల్లిగా "ఆ పేరు వద్దు లెండి. పిలిచినపుడల్లా మీకూ బావగారికీ బాధగానే వుంటుంది, మాసిపోయిన గాయాన్ని కదిపి పుండులా చేసుకోకూడదు" అంది రాధ.
గోపీ క్షణకాలం ఆలోచించాడు. అన్నగారి వద్దకి వెళ్ళి "అన్నయ్యా! నా జీవితాన్ని తీర్చిదిద్దావు నీవు, నా పాలిట భగవంతుడివి, కృతజ్ఞతగా మరేమీ చేయలేదు. వీడికి నీ పేరు పెట్టనీ" అన్నాడు.
ఉలిక్కిపడ్డాడు రమణయ్య. "గోపీ! అన్నదమ్ముల అనుబంధంలో కృతజ్ఞతకి తావులేదు బాబూ. అసలు నా జీవితమూ, నీ జీవితమూ యిలా బాగుపడటానికి మూలకారణం అమ్మ. ఆమె పేరు వచ్చేలా చూడు" అన్నాడు.
"రాము!"
"రామా! రామా! ఎంత అందమైన పేరు పెట్టారయ్యా నీకు" చెక్కిళ్ళు నిమిరి, చేతితో ముద్దాడి ఆనందంగా అన్నాడు రమణయ్య.
ఆ పేరు రాధకి కూడా అంగీకారమయింది.
తర్వాత పినతల్లి ఫోటో వద్దకి వెళ్ళి "అమ్మా! నీ దీవెనలు నిండుగా కురిపించు ఈ బిడ్డమీద, ఈ వంశానికి ఆశాజ్యోతి వీడే!" అని ప్రార్ధించాడు రమణయ్య.
బాలసారె వేడుకలు ముగిశాక "యిక వెళతాం అన్నయ్య" అన్నాడు గోపి.
"అప్పుడేనా?" అన్న రమణయ్య ప్రశ్నకి "సెలవులు కూడా అయిపోయాయి. ఎల్లుండి కాలేజీలు తెరుస్తారు. రీ వోపెనింగ్ రోజునవెళ్ళి మళ్ళీ సెలవు పెడుతుంది రాధ" అన్నాడు గోపీ.
రమణయ్య అయిష్టంగానే అంగీకరించాడు.
* * *
"హలో గోపీ! ఎప్పుడొచ్చారు?"
రోజీ ప్రశ్నకి వ్రాస్తున్న కాగితాన్ని ప్రక్కనపెట్టి "నాలుగు రోజులైంది" అన్నాడు జవాబుగా గోపీ.
"మీ అబ్బాయి బావున్నాడా?"
"బావున్నాడు"
"ఎలా ఉంటాడు? మీ కలరా? మీ ఆవిడ కలరా?"
"మా ఆవిడ రంగే"
"ముక్కూ ముఖం?"
"మీ ఆడవాళ్ళతో చిక్కే ఇదీ. ఎంత చదువుకున్నా ఆడబుద్ధి పోనిచ్చుకోరు" అన్నాడు గోపీ.
"అక్కడికి మీ మగవాళ్ళ బుద్ధి మారేట్టు మీరు చదువుకున్నా, చదువుకోకపోయినా మగబుద్ధి వదలుతారా? మీ డామినేషన్స్, మీ సుపీరియారిటీ ఫీలింగ్స్ అన్నీ అలాగే వుంటాయి."
"బాబ్బాబూ! నాకు అర్జంటుగా వ్రాసుకునే పని వుంది. నన్ను వదిలెయ్యండి ప్రస్తుతానికి, తర్వాత తీరిగ్గా లెక్చరిద్దురుగానీ"
మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతానా? అయినా మీది ట్యూబ్ లైట్ లాంటి బుద్ధి. ఎంత సూక్ష్మంగా చెప్పినా అర్ధం చేసుకోలేరు కదా త్వరగా మీ అబ్బాయిని గురించి అన్ని ప్రశ్నలు వేశానే నా ఉద్దేశ్యమేమిటి?
"ఏవుంది? ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని. అంతేగా నుదురు కొట్టుకుంది ఆమె.