"దురదృష్టవంతురాలిని. దేనికీ నోచుకోలేదు" ప్రవాహంలా పారుతూన్న కన్నీళ్ళనాపలేకపోతోంది.
"డాక్టరు తాతయ్యా! అసలు నేను బర్త్ డేయే చేసుకోను.
"తప్పమ్మా అలా అనకూడదు" బుజ్జగించాడు జయరాంగారు.
"తాతయ్యతో మాట్లాడితే అమ్మేడుస్తుంది. మాట్లాడకపోతే తాతయ్యేడుస్తాడు. ఎలాగమరి? అందుకే నేనిద్దరితో కటాఫ్ చేసేస్తాను." ఆ ఫ్రాక్ విప్పేసి పాత గౌను తొడుక్కుంది శాంతి.
"శాంతీ! దామ్మా! అలా చెయ్యకు. ఏదీ నువ్వు కేకు కొయ్యవూ? లాలించింది రుక్మిణి.
"ఊహో. ఏమొద్దు. నాకు కేకు ఒడ్డు. గౌనొద్దు, ఏమొద్దు" ఏడుస్తుంది.
"నీకోసం అమ్మ బోలెడన్ని అప్పచ్చులు చేసింది. రా తల్లీ తిందువుగానీ" బతిమాలింది సుశీలమ్మ.
"నాకొద్దు. నేనెవరితో మాట్లాడను" మారాం చేసింది.
"శాంతీ! రామ్మా నా బంగారు తల్లివికదూ!" మాధవి శాంతినెత్తుకుంటూ అంది.
దిగిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఒద్దు మమ్మీ నాతో మాట్లాడకు. నేనంటే నీకు యిష్టంలేదుగా. నేను కేకు కొయ్యను ఏడుపులంకించుకుంది శాంతి.
ఆ పసిదానికి ఏం సమాధానం చెప్పాలో, ఏం చెయ్యాలో తెలీక తికమక పడుతూంటే, తలుపు చాటు నుంచి ఈ గొడవంతా చూస్తున్న రావుగారు తలుపులు తోసుకొని లోపలికొచ్చారు. అంతా అటుకేసి చూశారు. అమ్మా మాధవీ! నువ్వు బాధపడ్డా, నేను బాధపడ్డా ఈ పాపకోసమేనమ్మా. కానీ శాంతి మనిద్దరి కోసం బాధపడుతోంది. మనిద్దరిమధ్యా అది నలిగిపోతోంది. ఆ చిన్ని మనసులో ఇంత క్షోభ ఇమడలేదమ్మా. పాపకేమయినా అయితే ఎవరు బాధ్యులు? అన్నారు.
అతని చివరి మాటలు భయాందోళనలు రేపాయి ఆమెలో.
"మామగారూ! అంత మాటనకండి. పాపకేమయినా నేను భరించలేను" అంది ఆవేశంతో.
"చూడు మాధవీ! పాప మనసు గమనించి అయినా నన్ను క్షమించమ్మా" ప్రాధేయపడుతూ అన్నారు రావుగారు.
జయరాం, రుక్మిణి, సుశీలమ్మ అందరూ కూడా ఆత్రుతతో ఆమె జవాబు కోసం ఎదురుచూడసాగారు.
ఒక్కక్షణం ఆలోచించి ఏదో నిర్ణయానికొచ్చినదానిలాగా, "సరే మామగారూ! అందరం రాగాబంధితులమే! మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి" అంది.
"అమ్మా మధూ! ఇవాళ శాంతి పుట్టినరోజే కాదమ్మా, నేను పుట్టినరోజు కూడా. జీవచ్చవంలా పడివున్న నాకు పునర్జన్మనిచ్చారు. గుండెలో రాగులుతూన్న చితిమంటల్ని చల్లార్చావు. నీ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా" అన్నారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ.
"క్షమించండి మామయ్యా. పంతాలకు పోయి మనం సాధించేదేమీ లేదు. కలిసి కష్టాలు పంచుకోవడంలోనే కనీసం తృప్తయినా వుంది" అంది.
అందరి ముఖాలు సంతోషంతో విప్పారాయి. మాధవి జయరాంగారినీ, రుక్మిణీనీ, సుశీలమ్మనీ, రావుగారుకి పరిచయం చేసింది. కన్నీళ్ళతో, ఎన్నాళ్ళకో కలిసినవారు గతాన్ని చర్చించుకుంటూ బాధ సంతోషం రెండూ మిళితమైన ఏదో అనిర్వచనీయమైన ఆనందాన్ననుభవిస్తూ శాంతి పుట్టినరోజుని చాలా వైభవంగా జీవితాలలోనే శాంతి నింపింది బాబాయ్" అంది మాధవి జయరాంకేసి చూసి.
"ఇన్నాళ్ళకి నీ కష్టాలు కాస్తయినా గట్టెక్కినాయ్. అదే చాలా సంతోషంగా వుందమ్మ అంది రుక్మిణి. భోజనాలయ్యాక చాలాసేపు కబుర్లు చెప్పుకుని జయరాం దంపతులు వెళ్ళిపోయారు.
"అమ్మా మధూ! మనం మనింటికి వెళ్ళిపోదామమ్మా" అన్నారు రావుగారు.
"అలాగే మామయ్యా" అంది మాధవి.
"సామాన్లు రేపు గోపీ, గౌరీ వచ్చి తీసుకొస్తారులే. ఇప్పుడు మనం వెళదాం పద" అన్నారు రావుగారు.
ఆ ఇంటినీ, ఆ జ్ఞాపకాలనీ అక్కడే వొదిలి సుశీలమ్మ దగ్గిర సెలవు తీసుకుని తనింటికి ప్రయాణమయింది మాధవి. మాధవినీ, శాంతినీ చూసి గోపీ, గౌరీ, గోవిందమ్మ కూడా ఎంతో సంతోషించారు.
ఎంత పెద్ద యిల్లో. మంచిగార్డెనూ, గేటూ ఎంతో బాగుంది కదు మమ్మీ తాతయ్యిల్లు అంది శాంతి.
"తాతయ్యిల్లు కాదమ్మా నీ యిల్లు" అన్నారు రావుగారు.
మాధవీ, శాంతీ ఆ యింట్లో అడుగుపెట్టినప్పటినుంచీ రావుగారిలో ఏదో కొత్త ఉత్సాహం పుంజుకుంది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా శాంతిని ఒక్క క్షణం వదలరు. శాంతి బడికెళితే వెళ్ళింది మొదలు తిరిగి వచ్చేదాకా క్షణాలు లెక్కపెడుతూ కూర్చుంటారు. ఇంటిల్లిపాదికీ శాంతే కాలక్షేపం. శాంతే జీవితం. మాధవి ఉద్యోగం మానేసింది. యింటి బాధ్యతంతా అప్పగించింది గోవిందమ్మ. ఎవరికి ఏది కావాలో అమర్చిపెడుతోంది ఆమె. గౌరీ ఆమెని క్షణం విడవడం లేదు. "వదినా వదినా" అంటూ, గోపీ అయితే సరేసరి.
"అక్కా" అంటూ వదలకుండా తిరుగుతున్నాడు. అజయ్ లేని లోటు తప్ప - అనురాగ నిలయం ఆ యిల్లు. ఆమెకి మరే లోటూ లేదు. అభిమానానికి కొదవలేదు.
* * *
అజయ్ బ్రతికాడు. కేవలం కళ్ళుపోయాయి అంతే. అతి కష్టం మీద అతని ప్రాణాలను కాపాడగలిగారు నిపుణులైన వైద్యులు. అదృష్టవశాత్తూ మెదడుకి పెద్ద దెబ్బే తగిలినా జ్ఞాపకశక్తి పోలేదు. వెంటనే మిగిలినవారు తప్పిదాన్ని తెలుసుకున్నారు. వేరొకరి శవాన్ని అజయ్ గా అనుకున్నందుకు చింతిస్తూ అతని తండ్రికీ, నాగార్జునసాగర్ లో మాధవికి టెలిగ్రాంలు పంపించారు.
ఎవరి దగ్గరనుంచీ ఏ జవాబు రాలేదు. తోటి ఆఫీసరు సహాయంతో అజయ్ హైదరాబాదు చేరుకున్నాడు. తన యింట్లో తనవాళ్ళెవరూ లేరు. ఆ యిల్లు అమ్మేశారని తెలుసుకున్నాడు. ఎక్కడికి పోయారో, ఎందుకు పోయారో ఏమీ అర్థంకాని అజయ్ నాగార్జునసాగర్ కి బయలుదేరాడు.