Previous Page Next Page 
జీవితం! గెలుపు నీదే!! పేజి 22

    తల్లి జవాబు చెప్పలేకపోయేసరికి విసుగ్గా మీరెవరండీ అంది అతనికేసి చూస్తూ.
    నేనమ్మా తాతయ్యను. నా దగ్గరకు రామ్మా అన్నాడు అడుగు ముందుకు వేస్తూ.
    తాతయ్యా ఆశ్చర్యంగా అమ్మకేసి చూసింది.
    మాధవి మాట్లాడలేదు.
    శాంతి అతని చేతిల్లోకి వాలిపోయి ఇన్నాళ్ళూ నువ్వు ఎక్కడున్నావు తాతయ్యా అంటూ దగ్గరకెళుతుంది.
    రావుగారి కంట్లోంచి నీరు చెంపలమీదుగా కారుతుంది. కండువా తీసికళ్ళు తుడుచుకుంటాడు.
    రావుగారు గట్టిగా పాప చెంపలమీదా, నుదుటిమీదా ముద్దుల వర్షం కురిపించాడు పిచ్చివాడిలా.
    ఇకవెళతానమ్మా అన్నాడు పాపని చంకలోనించి దింపుతూ.
    తాతయ్యా... నువ్వెళ్ళకు. నాకున్న బొమ్మలన్నీ చూపించుతాను. చక్కగా ఆడుకోవచ్చు. అతనికాళ్ళని చుట్టేసింది.
    లేదమ్మా...మరోసారి వస్తాను పాపని ఒదిలించుకుంటూ మెల్లగా అంటాడు.
    మాధవికేసి, పాపకేసి ఒకసారి మనసారా చూసి వెళ్ళిపోయారు రావుగారు.
    ఆరోజు అజయ్ పుట్టినరోజు. వికల మనస్కుడై, రాని నిద్దర కోసం ఎదురుచూస్తూ కళ్ళు మూసుకున్నాడు గోపీ.
    గౌరీ కూడా ఆ రోజంతా అలాగే వుంది. ఉన్నట్లుండి పెద్ద ఉపాయం తట్టినదానిలాగా గౌరి గోపీని లేపింది.
    ఏమిటే గొడవ! అంటూ విసుగ్గా లేచాడు గోపీ.
    ఏమండీ! మీ అమ్మ జీవిత రహస్యం ఎక్కడుందో తెలుసా? అంది.
    ఏడిసినట్లుంది నీ ప్రశ్న. అదికాదండీ! ఇవాళెందుకో ఆవిడ పూజగదిలోకెళ్ళాక ఎంతకీ బయటికి రాకపోతే తలుపు సందులోంచి చూశాను. అయ్యో! ఎన్ని రూపాయలూ, నగలూ, ఏమిటేమిటో లెక్క చూసుకుంటోంది. అందుకే ఆ గదిలోకి ఎవర్నీ రానివ్వదు. ఒక్కసారి ఆ గది సోదా చేద్దామండీ అంది.
    ఠక్కున లేచి కూర్చున్నాడు గోపీ.
    "రండి చూద్దాం" చెయ్యిపట్టి లాగింది గౌరి.
    ఇద్దరూ చప్పుడు చెయ్యకుండా వెళ్ళి టార్చిలైటు వెలిగించి గదంతా సోదా చేస్తారు. దేముడి బల్లకింద రూపాయల మూటా, ఫోటోల వెనకాల నగలూ కనిపించాయి. అవి తియ్యడానికి అటూ ఇటూ చేతులు పెట్టడంలో విగ్రహాలు కిందపడ్డాయి. వాటికింద ఉత్తరాల కట్టలు కనిపించాయి. అజయ్ వ్రాత గుర్తుపట్టి గబగబా తీసి చదివాడు గోపీ. గుండెల అగ్నిపర్వతాలు బ్రద్దలయినట్లయింది. తల్లిలోని రాక్షసత్వానికి ఒళ్ళు మండిపోయింది. తిన్నయింటికే వాసాలు లెక్కబెట్టే ఆమె కడుపున జన్మించినందుకు సిగ్గుపడుతూ మామయ్యకి ఎలా మొహం చూపించాలో తెలీక కోపంతో వణికిపోయాడు గోపి.
    ఈ లోపల ఎప్పుడొచ్చిందో గోవిందమ్మ వాళ్ళు ఇదంతా పసికట్టేసినందుకు కోపం దహించేస్తూంటే...
    "ఓరి సన్నాసీ! ఇక్కడేం చేస్తున్నావురా? పో బయటికి" అంది.
    "అమ్మా రెట్టింపు కోపంతో అరిచాడు. వెంటనే స్వరం తగ్గించి అలా పిలవడానికే అసహ్యంగా వుంది. ఇన్ని పాపిష్టి పన్లు చెయ్యడానికి నీకు మనసెలా వొచ్చింది? అసలు నువ్వు మనిషివేనా? అసహ్యంతో తల పక్కకి తిప్పుకున్నాడు గోపీ.
    "మనసా? ఈమెకా? అదే వుంటే కట్టుకున్నవాడు కొంపనొదిలి కాలు బయటెందుకు పెడతాడు?" కసిగా అంది గౌరి.
    "ఏయ్! నువ్వెవతివే నన్నడగడానికి? నోరు మూసుకో" కళ్ళు ఎర్రచేసింది గోవిందమ్మ.
    నోరు మూసుకొనే అవసరం నాకు లేదు. నోరు మూయించడానికే వచ్చాను. నేనెవర్నో తెలుసా? విగ్గు తీసింది.
    "ఓసి నీ దుంప తెగ! ఎంత నాటకమాడేవే! తెలుగు రానట్లే కాసు పీసుమంటూ ఏదో వాగితే నిజమేనని మోసపోయానోయ్. నాచేత చచ్చేచాకిరీ చేయించుకున్నావే. నీ సిగతరగ. సిగ్గులేదే, శాపాలు మొదలెట్టింది.
    "అమ్మా! కట్టుకున్న మొగుణ్ణి మతిలేని వాడని చాటించి పిచ్చివాణ్ణి చేసి ఇంట్లోంచి తరిమేసినందుకు ఒక ఆడదానిగా నువ్వు సిగ్గుపడాలి. ఒక రక్తం పంచుకు పుట్టిన సొంత అన్నయ్య పంచనచేరి తిన్న యింటి వాసాలు లెక్కపెట్టి తండ్రి కొడుకులను వేరు చేసి అతనికి చివరకి కోడలూ మనవరాలూ కూడా లేకుండా విషయాలు రహస్యంగా దాచిఉంచినందుకు సోదరిగా నువ్వు సిగ్గుపడాలి.
    డబ్బు కోసం గడ్డి తినే పశువుగా తయారయి అనురాగం, ఆప్యాయతా అన్నీ మంటగలిపి ఇన్ని అనర్థాలకు కారకురాలవయినందుకు నువ్వు సిగ్గుపడాలి. మాకెందుకమ్మా సిగ్గు?" అసహ్యం, అవమానం, గుండె పిండేస్తుంటే నొక్కి నొక్కి అన్నాడు గోపి.  
                                  *    *    *
    "మమ్మీ...మమ్మీ...ఇవన్నీ ఆ తాతయ్య కొన్నాడు. నా బర్త్ డే అంటే తనని పిలవలేదని ఏడిచాడు.
    మమ్మీ ఈ ఫ్రాకు చూడు ఎంతబాగుందో అంటూ గబగబా విప్పి చూపించింది. చాలా ఖరీదైన ఫ్రాకు. మాధవి చూసి ఊరుకుంది.
    శాంతి ముస్తాబవుతూ, తాతయ్య యిచ్చిన గౌను వేసుకొని బాగుందా మమ్మీ అంది.
    బాగుందమ్మా. అచ్చు ఆ గొప్ప తాతయ్యకి మనవరాలిలాగానే వున్నావు. ఈ బీద అమ్మ తెచ్చిన గౌను నీకు నచ్చదు శాంతీ! కన్నీళ్ళు పమిటచెంగుతో తుడుచుకుంటూ అంది మాధవి.
    "మధూ! చిన్నపిల్లతో ఏమిటా మాటలు? తాతయ్యంటే ఆ పిల్లకి అభిమానం వుండడంలో తప్పేముంది? పరిస్థితులు బాగుంటే ఈ రోజున తాతా మనవరాళ్ళని చూసి నువ్వు మురిసిపోయేదానివి కదూ?" అన్నారు జయరాంగారు.

 Previous Page Next Page