Previous Page Next Page 
మధుపం పేజి 22


     "థాంక్స్ అవసరం లేదు. ఇల్లు చూసుకున్న దాన్ని, సామానూ చూసుకోగలను" అంది దర్పంగా. భార్య వంక అర్ధవంతంగా చూసాడాయన చిరునవ్వు దాచుకుంటూ.
    "అడ్వాన్స్ గా రెండు, మూడు నెలలు అద్దె అడుగుతారు. కావలిస్తే ఇస్తాను. అడుగు. ఫస్టులోగా చూసుకుంటే డబ్బు కట్టేయవచ్చు" ఉదారంగా అన్నాడు. తండ్రి మాటలు వింటుంటే అయన ఈ విషయం మర్చిపోలేదని , తను దాటేయడానికి లేదని అర్ధం అయి గుబులు అనిపించి వివర్ణమయిన మొహంతో విసవిస లోపలికి వెళ్ళిపోయింది.
    
                                    *    *    *    *
    "అపర్ణా..... నాకు చిన్న హెల్ప్ కావాలె! నన్ను కొన్నాళ్ళు నీ అపార్ట్ మెంట్ లో ఉండనిస్తావా ?" ఆఫీసులో తనతో పనిచేసే అపర్ణని అడిగింది భావన.
    అపర్ణ ఆశ్చర్యంగా "ఎందుకు? ఏమయింది..... నా అపార్ట్ మెంట్ లో వుండడం ఎందుకు?" అంది.
    "మొన్న జరిగిన సంఘటన తెల్సుగా. మా పేరెంట్స్ నీవు వేరే ఇంట్లో ఉండు, నీ ఇష్టం వచ్చినట్లుండు. మా యింట్లో వుండి ఈ పనులు, తిరగడాలు ఒప్పుకోం అని చెప్పేశారు. వేరే యిల్లు చూసుకోమన్నారు. తెలుసా, అంత ఖచ్చితంగా పొమ్మంటే నాకేం గతిలేదా, పోతాను . వేరే ఇల్లు. అదీ చూసుకునేలోగా నీ అపార్ట్ మెంట్ లో కొన్నాళ్ళు ఉంటాను" పౌరుషంగా అంది.
    "భావనా.... కాస్త కూల్ గా ఆలోచించు. ఏ పేరెంట్స్ అయినా అర్దారాత్రి అపరాత్రి తిరిగి వస్తుంటే ఊరుకుంటారా? ఇంకా మీవాళ్ళు ఒక్కర్తే కూతురువని సహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇల్లు వదిలి బయటికి రావడం అంటే తమాషా అనుకున్నావా? నీవు నా ఇంట్లో అసలుండగలవా. అన్ని సుఖాల మధ్య పెరిగిన దానివి. సర్దుకోవడం అన్నది నీకసలు తెలియదు. మీ ఇల్లు మీ పద్దతులు చూసినదాన్ని కాబట్టి చెబుతున్నాను. ఏదో ఒక గది, వంటగది, బాత్ రూం ఉన్న ఇల్లు మాది. నాతో ఎలా అడ్జస్ట్ అవుతావు. అయినా అమ్మా నాన్న మన మంచి కోరే చేపుతారన్నది నీవు తెలుసుకోవాలి.
    "అది కాదు , పొమ్మని ఖచ్చితంగా అన్నాక ఎలా ఉండాలి" కోపంగా అంది.
    "అంటారు మరి. నిన్ను ఎలా కంట్రోలు చెయ్యాలో తెలియక ఆ నిర్ణయానికి వచ్చి ఉంటారు. భావనా, అమ్మా నాన్న అండ వున్న నీకు వాళ్ళ విలువ అర్ధం కావడం లేదు. నాకు నాన్న లేరు. అమ్మ అన్నయ్య దగ్గర గతిలేక పడి వుంది. నాకు తెల్సు ఒంటరిగా ఉంటూ నేను ఎదుర్కొనే సమస్యలు . నీవెంత అదృష్టవంతురాలివో నీకు తెలియదు. అన్నీ అమర్చి పెట్టి అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు . మొన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి నిన్ను విడిపించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డారు. వాళ్ళే లేకపోతే నీ మొహం చూసి ఎవరు సాయం చేసేవారు? తల్లిదండ్రులుగా బాధ్యతలే కాదు, హక్కులూ, వుంటాయి వాళ్ళకి. వాళ్ళ హక్కులని నీవు అంగీకరించక పొతే నీపట్ల వాళ్ళెందుకు బాధ్యత తీసుకోవాలి? అందుకే నీతోవ నిన్ను చూసుకోమన్నారు. నీవెంత తప్పుగా ఆలోచిస్తున్నావో తెలుసుకుని నీ ప్రవర్తన మార్చుకో. వాళ్ళకి క్షమాపణ చెప్పి , యిక ముందు ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని...."
    "అంటే, నేనింక ఏ సరదాలు, స్నేహితులు లేకుండా ఇంట్లో పడి వుంటాను అని చెప్పాలా వాళ్ళకి. ఎంత తల్లిదండ్రులయినా ఒక వయసు వచ్చాక నన్నింకా కంట్రోలు చెయ్యాలని వాళ్ళు చూస్తుంటే నేను భరించి వాళ్ళ అదుపాజ్ఞలలో పడి వుండాలా?" తీవ్రంగా అడిగింది.
    "నీవు వాళ్ళని తప్పుగా అర్ధం చేసుకుంటున్నావు. నిన్ను ఆడపిల్లవని కట్టడి చేసి మూల కూర్చోపెట్టారా? చదివించారు. ఉద్యోగం చేసుకోమన్నారు. నీ సరదాలకి అడ్డు రాలేదు. కానీ ఆ సరదాలకి హద్దు వుండాలని పేరెంట్స్ కోరుకుంటారు. ఎందుకంటే రేపొద్దున్న దాని వల్ల ఏం నష్టం జరిగినా నీ భవిష్యత్తు పాదవుతుందని వాళ్ళకి భయం ఉండదా! మొన్న జరిగిన సంఘటన వల్ల రేపు నీ పెళ్ళికి ఆటంకం రావచ్చు. నీ పేరు పేపర్లో, టీవీల్లో వస్తే నీ మీద అందరికీ ఎంత చులకన భావం."
    "పబ్ లకి వెళితే చెడిపోయినట్టా" కోపంగా అడిగింది.
    "చూడు! నీవెంత సమర్ధించుకోవాలన్నా , మన దేశం ఇంకా పబ్ లలో ఆడపిల్లలు మగపిల్లలతో సమంగా తాగి అసభ్య నృత్యాలు చేస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉండే స్థాయికి చేరలేదు. అలాంటి అమ్మాయిల గురించి తప్పకుండా మాట్లాడుతారు" నచ్చచెపుతున్నట్లంది అపర్ణ.
    మొహం మాడ్చుకుంది భావన. వెంటనే జవాబు తట్టలేదు.
    "అయితే మీయింటికి రావద్దంటావా?" ఇంకేం అనాలో తెలియక అడిగింది.
    "నేనింత చెప్పాక కూడా యింకా నీ అభిప్రాయం మారకపోతే తప్పకుండా వుండొచ్చు. నీ స్టాండర్డ్ కి ఏవిధంగాను తగదు నా ఇల్లు.... వచ్చి చూసుకో."
    అపర్ణ యింటికి వెళ్ళి చూశాక సగం జావ కారింది భావన. చిన్నగది. ఓ మంచం, టేబిల్, అలమార నిండా పుస్తకాలు, బట్టలు వంటింట్లో కిరసనాయిల్ స్టవ్. కొన్ని గిన్నెలు, డబ్బాలు, చిన్న బాత్ రూమ్. బాత్ రూమ్ లోకి తొంగి స్=చూశాక తమ యింట్లో మిలమిల మెరిసే బాత్ రూము గోడలు, వాష్ బేసిన్, వంటింటి గట్టంతా చిందర వందరగా సామాను. ఈ ఇంట్లో తనుండగలదా, ఇంపాసిబుల్, భావన మొహం చూసి నవ్వింది అపర్ణ.
    "ఉంటావా ఇక్కడ" అంది.
    గుతకమింగి "ఇద్దరికీ సరిపోదులే. వేరే ఇల్లు చూసుకోవాలి" అంది నసుగుతూ.
    "భావనా , నీకన్నీ హైక్లాస్ అలవాట్లు. నీకొచ్చే పాతికవేలలో ఓ పదివేలు ఇంటి అద్దె పొతే మిగతా కొంత ట్రాన్స్ పోర్టు. ఆ మిగిలిందే నీ అవసరాలకి. నీ జీతం ఇన్నాళ్ళు మీ వాళ్ళిచ్చిన సుఖాలు ఇవ్వగలదా ఆలోచించుకో! తొందరపడకు. స్నేహితురాలిగా నా సలహా. తీరి కూర్చుని పంతానికి పోయి సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖ పెట్టుకోకు. నాకు చదువు చెప్పించడమే అమ్మకి గగనమైంది. నా సంపాదనలో కొంత అమ్మకి పంపాలి. చాడువుకయిన అప్పు కాస్త తీర్చాలి. నాలాంటి ఇబ్బందులు లేని సుఖమయ జీవితం నీది. నీ అదృష్టానికి సంతోషించి మీ అమ్మానాన్నలు నీ శ్రేయోభిలాషులని గుర్తించు" అపర్ణ స్నేహితురాలు భుజం తట్టి అంది.
    "థాంక్స్.... నీ ఉపదేశానికి సంతోషించాను. వస్తా" బయటకు వెళ్ళింది భావన. దారిపొడవునా , తనేం చెయ్యాలో అర్ధం కాక సతమతమైంది.

                                  *    *    *    *

    రాత్రి రమ కూతురి గదిలోకి వచ్చి "భావనా, రేపే ఒకటో తారీఖు. మీ నాన్న ఇల్లు ఏదన్నా చూసుకుందా అని పదే పదే అడుగుతున్నారు."
    "ఏమిటాయన ఉద్దేశం. అయన వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి నేనేం చవట దద్దమ్మని కాను. నన్ను కనమని నేనడిగానా , నా పర్మిషన్ తీసుకుని నన్ను కని పెంచారా! మీరుండమంటే వుండి, పొమ్మంటే పోవడానికి. నేనాయన కూతురిని. నాకీ ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. మీరే చెప్పారుగా కూతురి పెళ్ళి చేసి పంపే బాధ్యత ,మీదని. నా పెళ్ళయ్యేవరకూ ఈ ఇంట్లోంచి పొమ్మనే హక్కు మీకు లేదు. కన్నాక చేతులు దులుపుకునే హాక్కు మీకు లేదు" దబాయింపుగా అంటూ తల్లి వంక కోపంగా చూసింది. జవాబు చెప్పమన్నట్టు.
    "ఓహో! హక్కుల దాకా వెళ్ళావా, అవును చదువు కున్న అమ్మాయివి కదా!" రమ నవ్వింది.
    "అవును, నా హక్కు నాకు తెలుసు. ఆడపిల్ల ఇల్లు దాటేది పెళ్ళయ్యాకెగా! అప్పటి వరకు నే కదలను. ఇక్కడ నుండి " మొండిగా అంది.
    "అయితే త్వరగా పెళ్ళి చేసుకుని వెళ్ళు" రమా అంతకంటే మొండిగా పట్టువదలని దానిలా అంది.
    "కూతురి పెళ్ళి చెయ్యాల్సిన బాధ్యత మీది. చెయ్యండి పెళ్ళి, చేసి పంపండి. అప్పుడే ఇక్కడ నుంచి కదులుతా. ఇన్నాళ్ళు నే చేసుకుంటానన్నాను. ఇప్పుడా మాట వెనక్కి తీసుకుంటున్నాను. తీసుకురండి మంచి మొగుడ్ని. చెయ్యండి పెళ్ళి " అరుస్తున్నట్టే అంది.
    రమ కూతురి వంక కాస్త ఆశ్చర్యంగా చూస్తూ "మొగుడ్ని కొట్టి మొగసాల ఎక్కిందన్న సామెత అంటే ఇదే" అంది నవ్వి . భావన కోపంగా చూసింది.
    కూతురు ఆఖరికి దారికి వచ్చిందన్న సంతోషం తల్లిది. తనకి తాను నచ్చిన వాడిని చూసుకోవడం కుదరలేదు. అభాద్యత తల్లిదండ్రుల మీద వేసేస్తే , ప్రస్తుతానికి ఈ గొడవ తప్పించుకోవచ్చు. తల్లీ తండ్రి మంచివాడినే వెతుకుతారన్న నమ్మకం కూతురిది. ఎవరికి వారికి నిశ్చింతగా అన్పించింది ఆక్షణాన.

                                             *    *    *    *
    ప్రతి కధకి ఓ ముగింపు వుంటుంది. ఆ క్షణాన తల్లీ కూతుళ్ళకి నిశ్చింత అన్పించినా, కూతురు గతం భవిషత్తులో ఆమె పెళ్ళికి ఏమన్నా అడ్డు పడుతుందా అన్నది తల్లీకి తట్టలేదు. ఎంత నవీన భావాలు , హైక్లాస్ సొసైటీలో తిరిగినా మగవాడూ పెళ్ళి దాకా వచ్చేసరికి సాంప్రదాయాలు పట్టుకు వేళ్ళాడతారన్నది కూతురికి అసలే తట్టలేదు. అంచేత భవిష్యత్తు ప్రశ్నార్ధకం? జవాబుకి ఆగాల్సిందే! అప్పటి వరకు ఈ కధ 'సశేషమే'!
    
                                              ***

 Previous Page Next Page