"ఊ... మరి ఎలాంటి వాడి ననుకున్నావు". అన్నాడు వికటంగా నవ్వి.
విజయ ఊపిరి అంధక గిలగిలలాడి మొహంతిప్పుకుంటూ, కొగిలిలోంచి వదిలించుకోడానికి పెనుగులాడింది. భయంతో అవమానంతో, ఆవేశంతో, అసహ్యంతో ఆమె గుండెలు ఎగిసి పడుతున్నాయి. గట్టిగా రెండుచేతులతో ప్రకాష్ ని ఒక్క విదిలింపుతో విదిలించి తీక్షణంగా చూస్తూ "ఏమిటిది మీరు... స్పృహలో వున్నారా అసలు. ఛీ... తాగివచ్చి నాతో మొదటి రాత్రి భార్యతో ప్రవర్తించవలసిన తీరు యిదా. చదువుకున్నవారు, ఓ తాగుబోతులా" విజయకి ఆవేశంలో మాట తడబడింది.
"తాగుబోతులా ఏమిటి తాగుబోతునే. మీ ఆడవాళ్ళతో ఇంత కంటే సున్నితంగా ప్రవర్తిస్తే లొంగుతారా నాకిలాగే అలవాటు." విజయ కోపానికి బెదరనట్టు నవ్వి మళ్ళీ దగ్గిరకు లాక్కోబోయాడు.
విజయ దిగ్భ్రాంతితో చూస్తూ. "అంటే....మీకిలా అలవాటంటే అర్ధం..." తడబడ్తూ అడిగింది.
"అర్ధం వెరీ సింపుల్ మైడియర్. నీకు కొత్తేమోగాని నాకీ అనుభవం కొత్తకాదు."
జంకు గొంకు లేకుండా తెగేసి చెప్తున్న ప్రకాష్ ని నమ్మలేనట్టుగా చూసింది. అతను అబద్దం ఆడడం లేదన్నది గ్రహించింది విజయ. ఆమెకా క్షణంలో ఏం చెయ్యాలో కూడా తోచనంత దిగ్భ్రాంతికల్గింది. ఎన్ని రకాల సంబంధాలు, ఎంచి ఎంచి ఆఖరికి ఓ తాగుబోతు, వ్యభిచారినా తను వివాహం ఆడింది? పై రూపంచూసి ఎంతలా మోసపోయారు తామందరూ? విజయ తనని తాను మరిచి పోయింది. "ఎంత మోసం, ఎంత దగా? మీరిలాంటివారని తెలియకుండా దాచి మమ్మల్నింత మోసం చేస్తారా?" కోపంతో జేవురించిన మొహంతో పిచ్చిగా అరచింది విజయ.
"మోసం! దగా! మీరు ముందుగా నీవు తాగుబోతువా, వ్యభిచారివా అని అడిగారా? నీ చదువెంత, నీ జీతమెంత అని ఆరా తీశారు. వాటికీ జవాబులు వచ్చాయిగా!"హేళనగా అన్నాడు ప్రకాష్.
"అయినా డియర్! అమూల్య మైన కాలాన్ని యిలాంటి వృధా సంభాషణతో గడిపేస్తావా! కమాన్ డార్లింగ్" విజయ చేయి పట్టుకుని నడుంచుట్టూ చేయివేసి మంచంవైపు లాగాడు.
విజయ తీక్షణంగా చూసి చేయి లాక్కుంది విసురుగా. "నన్ను వదలండి- నన్ను ముట్టుకోవద్దు, నా జోలికి రావద్దు." అంది కఠినంగా.
"బలే, మొదటి రాత్రి పెళ్ళాం వద్దంటే మానేసేటంత చవటనా? కమాన్ బేబీ....అనవసరంగా గొడవ చెయ్యకు." మొరటుగా విజయని ఎత్తుకెళ్ళి మంచంమీద పడేశాడు.
విజయ దెబ్బతిన్న బెబ్బులిలా లేచింది. తిరస్కారంగా చూసింది.
అతని ముఖం మరింత కఠినంగా మారింది.
"చూడు... ఇందాకటినుంచి పోనీగదా అని యింత వరకూ ఊరుకున్నాను. ఒకసారికంటే పిలవడం నా కలవాటు లేదు. ఊఁ....రా" కటువుగా అన్నాడు ప్రకాష్.
విజయ బిత్తరపోతూ చూసింది ఆ కోపాన్ని.
"నీవు మాటలతో లొంగేదానివి కాదన్నమాట. సరే." ప్రకాష్ ఒక్కొక్క అడుగువేస్తూ ముందుకు వస్తుంటే పిల్లి చేత చిక్కబోయే గోరింకలా వణికింది.
ఆలోచనకు వ్యవధిలేదు. శక్తికొద్దీ ప్రతిఘటించింది. కాని అతని పశుబలంముందు, అందులో తాగిన బలంముందు యెంతోసేపు ప్రతిఘటించలేకపోయింది.
* * *
"శారదా... ఆ రోజు అనుభవం ఏ ఆడదానికీ వద్దు శారదా-" కళ్ళు మూసుకొని పెదా లదురుతూండగా అంది. ఆసంఘటన ఇన్నాళ్ళతరువాత తలచుకున్నా విజయ వళ్ళంతా చెమటపట్టింది.
"శారదా... అది మొదటి రాత్రి కాదు. నా పాలిట కాళరాత్రి. అంత అమానుషంగా, పశువులా ఏ భర్తా ప్రవర్తించి వుండడు స్త్రీ పురుష సంబంధం మీదే విరక్తి, ఏహ్యత కలిగిస్తుంది ఆ అనుభవం. అప్పటి నా నిస్సహాయత, మనస్థితి ఊహించు. ఏడవడానికి కూడా మనసు మొద్దుబారిపోయింది. నిస్సహాయంగా, నిస్సత్తువగా తోటకూర కాడలా అలా వేళ్ళాడి వుండిపోయాను. నేను ప్రతిఘటించినకొద్దీ ఆయన పశుత్వం మరింత పెరిగింది. గిల్లాను, రక్కాను, కొరికాను. జుట్టు పీకాను. నా ప్రతి చర్య అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఆయన పశుత్వాన్ని వృద్ధి చేసింది. ఆఖరికి ఏమయితే నేం ఆయన ముందు ఓడిపోయాను. నా సర్వస్వం దోచుకున్నారు..." విజయ కంఠం వణికింది.
శారద కళ్ళ రెప్పలు ఆర్చడం మరిచి వింటూంది ఆశ్చర్యంగా. "అదేమిటి. ఆయనసలు అలాంటివా రెందుకయారు? ఏమయినా కారణం వుందా...మంచి కుటుంబం అంటున్నారు, ఆస్థిపరులు, చదివినవారు అన్నారు. అలాంటి వ్యక్తి ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ఏదన్నా కారణం ఉండివుంటుందని నా ఉద్దేశం."
"కారణం వుంది. ఏ కారణం అయితేనేం నా బతుకు బండలు అయింది. ఎవరితో చెప్పుకోను? ఏమని చెప్పుకోను? తమ ముద్దుల కూతురి బ్రతుకు ఇలా వక్రించిందని అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళనీ బాధించనా - ఏం చెయ్యాలి? ఒకసారి తాళి కట్టాక ఆ భర్తని తప్పించుకోడం అంత సులువా? అసలు ఆయనెందు కింత అమానుషంగా ప్రవర్తించారు ? ఇష్టం లేని పెళ్ళా? నాకేం తక్కువ? అందం, చదువు, ఆస్థి అన్నీ వున్న నాకేం లోటని ఆయనకీ పెళ్ళి ఇష్టం వుండదు? ఇంకెవరినన్నా ప్రేమించారా? పెద్దలు ఒప్పుకోకపోతే బలవంతాన చేసుకొని ఆ కక్ష నా మీద చూపారా? ఆయన కిన్ని వ్యసనాలు ఎందుకు అలవాటయ్యాయి? ఆ మిగిలిన రాత్రంతా నా ఆలోచన లివి. ఆయన వంటిమీద తెలివి లేనట్టు పడుకుంటే ఆయనని అంటుకుంటూ పడుకోడంకూడా అసహ్యం అనిపించి సోఫాలో వాలిపోయి తెల్లవార్లూ జాగారం చేశాను.