సుబ్రహ్మణ్యం వినయాన్ని ఫోన్లోనే గమనించిన గుర్రం పెద్దబ్బాయి మనసులోనే నవ్వుకున్నాడు.
"చెప్పు" ఠీవిగా అన్నాడు గుర్రం పెద్దబ్బాయి.
ఆదిత్యతో తన జరిపిన చర్చల సారాంశాన్నంతా చెప్పి-
ఆదిత్య మిమ్మల్నికలిసి మీతోనే చెప్తాట్ట సార్" తన ప్లాన్ ని చెప్పుకొచ్చాడు జె.ఎస్. సుబ్రహ్మణ్యం.
"వెనకాతల పోలీస్ ఎస్కార్ట్, ముందు నా జీపు వుంటుంది సార్! మధ్యలో ప్రిజనర్స్ వాన్ వుంటుంది సార్! హైద్రాబాద్ కి బొంబాయి కెళ్ళే దారిలో, మెదక్ క్రాస్ రోడ్డు దగ్గర స్పాట్ సార్."
"ఆ రూట్లూ, ఆ గొడవలూ నువ్వు చూసుకోవయ్యా బాబూ! నేనేం చెయ్యాలో చెప్పు."
"ఓ డ్రైవరూ, ఓ లారీ మంది కాదనుకుంటే చాలు సార్..." నవ్వాడు సుబ్రహ్మణ్యం.
"ఓరి నీ పాసుగాల! రోజు రోజుకీ నీ బుర్ర షార్ప్ అవుతోందోయ్, సుబ్రహ్మణ్యం! ఆదిత్యను నా దగ్గరకు చేర్చేపూచీ నీది. అవునూ! డబ్బు పంపించాను అందిందిగదా?"
"అందింది అని అడగాలా సర్..." వినయంగా నవ్వాడు సుబ్రహ్మణ్యం.
"ఏ విషయమూ, ఎక్కడా లీక్ కావడానికి వీల్లేదు. అంతా పకడ్బందీగా, సిస్టమేటిగ్గా జరిగిపోవాలి. గుర్తుంచుకో..." హెచ్చరించాడు గుర్రం పెద్దబ్బాయి.
"నాకు చెప్పాలా సర్!"
గుర్రం పెద్దబ్బాయి ఫోన్ పెట్టేశాక, తనూ ఫోన్ పెట్టేసి చుట్టూ చూశాడు సుబ్రహ్మణ్యం.
సంతృప్తిగా నవ్వుకుని సిగరెట్ వెలిగించాడతను. మరో అరగంట తరువాత యింటి నుంచి జైలుకి బయలుదేరాడు.
* * * * *
శనివారం సాయంత్రం అయిదు గంటలు....
వరండా స్తంభానికానుకుని కూర్చున్నాడు ఆదిత్య. ధరణికుమార్ కనబడతాడేమోనని ఎదురుచూస్తున్నాడు.
ఆదిత్యకు కొంచెం దూరంలో ఇద్దరు వార్డర్లు నిలబడి మాట్లాడుకుంటున్నారు.
ఎందుకయినా మంచిదని ఆదిత్య మీద నిఘా పెట్టాడు జైలు సూపరింటెండెంట్.
"ఏమిటి ఒక్కడివే కూర్చున్నావ్? రేపటి విషయం ఆలోచిస్తున్నావా?"
వెనకనుంచి మాట వినబడేసరికి తల తిప్పి చూశాడు ఆదిత్య.
ఎదురుగా ధరణి!
"నిన్ను చూస్తుంటే శిక్ష అనుభవిస్తున్నవాడిలా లేవు. జైలుని చూడటానికి వచ్చినవాడిలా వున్నావ్." ఇసుకలో కూర్చుంటూ అన్నాడు ధరణి కుమార్.
"జరిగినదానికి బాధపడటం, బెంగపడటం, నా మనస్తత్వం కాదు సార్! నేనెప్పుడూ జరగాల్సినదాని గురించే ఆలోచిస్తాను..." నెమ్మదిగా అన్నాడు ఆదిత్య.
"అదృష్టవంతుడవి! నేను జరిగిందాన్ని తల్చుకుని బాధపడతాను. మనసులోనే కుంచించుకుపోతాను దట్స్ మై మెంటాలిటీ..." అన్నాడు ధరణి.
వార్డర్లు మాట్లాడుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం చూసి-
"రేపు నువ్వు తప్పించుకుంటావా..." తగ్గు స్వరంతో అడిగాడు ధరణి.
"అవును. నేను బయటపడాలి. బయటపడితేనే అటో ఇటో తేలిపోతుంది" స్థిరంగా అన్నాడు ఆదిత్య.
"బయటపడితే నువ్వు సుఖంగా వుంటావనుకున్నావా? అటు పోలీసులు, ఇటు నీ శత్రువులూ నిన్ను వెంటాడతారు. వాళ్ళనుంచి నువ్వు తప్పించుకోలేవు."
"అప్పుడే కదా తాడో, పేడో తేలేది..." నవ్వుతూ అన్నాడు ఆదిత్య.
రెండు క్షణాలు మౌనం.
"ఆదిత్యా! నీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలయ్యా..." నెమ్మదిగా అన్నాడు ధరణి.
"చెప్పండి."
"నీతోపాటు నేనూ తప్పించుకోవాలనుకుంటున్నాను"
అతను చెప్పిన మాటకు విస్తుపోయాడు ఆదిత్య.
"మరో వారం రోజుల్లో రిలీజవుతున్న మీరు...?!"
"లేదు ఆదిత్యా! నేను నా కోసం జైల్లోకి రాలేదు. నేను రిలీజ్ కావడము కూడా నా కోసం కాదు. ఇట్స్ పార్ట్ ఇన్ ద పొలిటికల్ గేమ్... నేనా గేమ్స్ లో యిరుక్కున్నానని చెప్పాను. జ్ఞాపకం వుండే వుంటుంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నేను ఆ గేమ్ లో పార్ట్ నర్ ని కాకుండా వుండాలంటే నేను తప్పించుకోవాలి. ఐ వాంట్ టు ఎస్కేప్. దట్స్ ది ఓన్లీ వే..."
"తప్పించుకొని?"
"నా భార్యా పిల్లల్ని చేరుకుంటాను. వాళ్ళను తీసుకొని ఈ వాతావరణానికి దూరంగా... సుదూరంగా... అమెరికా వెళ్ళిపోతాను. అందుకు నీ హెల్ప్ కావాలి."
"ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే?"
"ఒక్కసారి నేనిక్కడ్నించి బయటపడ్డాక నేనెవరికీ దొరకనన్న నమ్మకం నాకుంది" కాన్ఫిడెంట్ గా అన్నాడతను.
ధరణి ఓ క్లిష్టమైన మనోభావాలున్న విలక్షణ వ్యక్తి.
ఇంత మంచివాడిని కూడా పావుని చేశారంటే, చాలా అన్యాయమనే అనుకోవాలి. దయ, జాలి కరుణకు ప్రతిరూపంగా కనిపించే ధరణికి తను సహాయపడాలి. ఒక మంచి పని చేసిన సంతృప్తిని స్వంతం చేసుకోవాలి.
ఒక నిర్ణయానికొచ్చాడు ఆదిత్య.
"చెప్పు... నువ్వు నాకు హెల్ప్ చేస్తావా?"
ఆదిత్య మనసులోనే నవ్వుకున్నాడు.
"నాతోపాటు... మీరూనూ" ఆ మాటకు సంతోషపడ్డాడు ధరణి.
ఆదిత్యకు అంతా విచిత్రంగా వుంది. అహోబలపతి ధరణిని చంపించడానికి తనని నియోగించాడు... తను ధరణిని తప్పించుకోడానికి హెల్ప్ చేస్తున్నాడు.
ఈ మలుపు ఏ పరిణామానికి నాంది పలుకుతుంది?!
"అసలు మీరు తప్పించుకోవాల్సిన అవసరం ఏమిటి? రాజాలా విడుదలై, రాజాలా బ్రతక్క."
ఆదిత్య మనసులోని సందేహాన్ని అడిగాడు.
"రాజాలా నేను విడుదలవుతాను. నిజమే! కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవదు ఆదిత్యా! మా నాన్న శత్రువులు నన్ను బ్రతకనివ్వరు... చంపేస్తారు. మా నాన్న శత్రువులు నన్ను చంపకపోతే... నన్ను మా నాన్న గుర్రం పెద్దబ్బాయే చంపేస్తాడు... జరిగేదదే... ఆ విషయం నాకు స్పష్టంగా తెలుసు."
షాక్ తిన్నాడు ఆదిత్య ఆ మాటకు.
"మీ నాన్న మిమ్మల్ని చంపేస్తాడా? అంతటి భయంకరమైన పరిస్థితిలో వున్నారా మీరు? అసలేమైంది...? అభ్యంతరం లేకపోతే నాతో చెప్పండి."