Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 22


    "మీరొస్తారా?" మళ్ళీ అడిగాడు ఆదిత్య.

 

    "బాగానే వుంది. ఇక్కడ నా యిష్టాయిష్టాలతో ప్రమేయం ఏముంది? ఇక్కడ నేను కూడా నీలాంటి ప్రిజనర్ని" నవ్వాడతను.

 

    "అది కాదు... పదిరోజుల్లో రిలీజయ్యే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారా అని..."

 

    "తీసికెళ్ళకపోవచ్చు."

 

    "అంటే... మనం మరో పన్నెండు గంటలు మాత్రమే కలిసుంటాం అన్నమాట..."

 

    ఆ మాటకు కంగారుపడ్డాడు ధరణి.

 

    "ఏం?"

 

    "మీరెవరితో చెప్పరని నాకు తెలుసు" అని ఆదిత్య చెప్పడం ప్రారంభిస్తుండగానే-

 

    "నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావ్ కదూ..." అడిగాడు ధరణి.

 

    "ఎస్... ఎగ్జాట్లీ... ఎరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి."

 

    ధరణి కళ్ళ వెనక ఏదో అవ్యక్తం కాని భావన.

 

    "ఎప్పుడైనా... మీ దగ్గరకొస్తే షెల్టరిస్తారా?"

 

    ఆదిత్య మాటకు నవ్వాడు ధరణి.

 

    "ఏం... అలా నవ్వుతున్నారు?"

 

    "సముద్రంలో మునిగిపోతున్న వాడిని పట్టుకుని రేవుకి దారి అడిగాడట ఒకడు..."

 

    "అంటే...."

 

    "ఎప్పుడో ఒకప్పుడు నీకు అర్ధమౌతుందిలే."

 

    అంతలో జైల్ సూపరింటెండెంట్ అటువైపు వచ్చాడు. ఆదిత్య వైపు చూసి నవ్వాడు.

 

    ఆదిత్య నవ్వలేదు. తల తిప్పేసుకున్నాడు.


                            *    *    *    *    *


    సగం కాలిన త్రిబుల్ ఫైన్ సిగరెట్ ను విసురుగా ఓ మూలకు విసిరి కొట్టాడు చీఫ్ మినిస్టర్ అహోబలపతి. కొరకొరా చూశాడు హోం మినిస్టర్ చిదంబరరావు వైపు.

 

    "ఏందయ్యా... నువ్వు హోంమినిస్టరవంటే నాకు సిగ్గుచేటయ్యా! శాంతి భద్రతలు, రక్షణ శాఖ అంటే నీ శాంతి భద్రతలు, నీ రక్షణ చూసుకుంటే ఎలాగయ్యా? ఆదిత్య పని నీకప్పగించానా? ఏం చేశావ్... ఆ ఆదిత్యను జనమైనా మర్చిపోవాలి... మనమైనా మర్చిపోవాలి... మన సమస్యల్తో మనం చస్తుంటే యిదెక్కడి గోలయ్యా... ఆ ఆదిత్య మన మాట విననప్పుడు ఆడు జైల్లో ఎందుకు అనవసరంగా..."  

 

    "అదేనండీ నేనూ ఆలోచిస్తున్నాను. ధరణి యిప్పటికీ జైల్లో క్షేమంగానే వున్నాడు. అంటే... ఆదిత్య మనం చెప్పిన పనేం చెయ్యలేదని అర్ధమౌతోంది. ఆదిత్య మనమీద కక్ష కట్టాడేమోనని అనుమానంగా వుంది సర్."

 

    "కక్ష కట్టాడా? అదేమైనా హ్యూమన్ బాంబా... మనం భయపడడానికి? వాడి సమస్యను ఏదో రకంగా పరిష్కారం చేసెయ్..."

 

    "గుర్రం పెద్దబ్బాయి వాడితో డీల్ చేస్తున్నట్టు ఏదో అనుమానంగా వుంది..."

 

    హోం మినిస్టర్ మాటకు చీఫ్ మినిస్టర్ బిత్తరపోయాడు.

 

    "మీడియేటర్ గా ఎవడు వర్క్ చేస్తున్నాడు?" ఠక్కున అడిగాడు సి.ఎం.

 

    "జైల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం...."

 

    "సుబ్రహ్మణ్యం.. గుర్రం పెద్దబ్బాయి మనిషా?" ఉలిక్కిపడ్డాడు సి.ఎం.

 

    "అదే అనుమానంగా వుంది."

 

    "పెద్దబ్బాయి చేతికి ఆదిత్య దొరకడానికి వీల్లేదు. ఆదిత్య అవసరం తీరిపోయింది మనకు... వాడు మన పని చెయ్యకపోతే మన మనిషికాడు. మన మనిషి కానివాడు భూమ్మీద వుండడానికి వీల్లేదు. జైల్లోనే వాడు ఉరేసుకోవాలి. అర్ధమైందా? ఈ సుబ్రహ్మణ్యాన్ని నేను రమ్మన్నానని చెప్పు."

 

    "సుబ్రహ్మణ్యం ఎందుకు సార్? మనం చెప్పినట్టుగా వినేవాడు జైలర్ వీరారెడ్డి వున్నాడుగా? జైల్లో బాంబులు తయారుచెయ్యమంటే... ఫ్యాక్టరీయే పెట్టించే రకం."  

 

    "అయితే ఆదిత్య విషయం స్పష్టంగా కనుక్కోమను. తిరకాసుగా వుందంటే లేపెయ్ మను. వాడు నోరు తెరవకూడదు. అర్థమైందా?"

 

    "వీరారెడ్డిని పిలిపిస్తాను. ఒక్కసారి మీరు మాట్లాడండి. జీవితాంతం మన దగ్గర వాచ్ డాగ్ లా పడుండే మనిషి."

 

    "రమ్మనైతే...."

 

    సి.ఎం అహోబలపతి పర్సనల్ రూమ్ లోంచి హోంమినిస్టర్ చిదంబరం హాల్లోకెళ్ళాడు.

 

    ఆ వెంటనే హోంమినిస్టర్ వెనక వీరారెడ్డి వినయంగా లోనికొచ్చి గౌరవంగా నమస్కరించాడు.

 

    "ఆ ఆదిత్య విషయం..." సి.ఎం. మాటింకా పూర్తికాలేదు.

 

    వీరారెడ్డి చెప్పటం ప్రారంభించాడు.

 

    "జైల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, గుర్రం పెద్దబ్బాయి మనిషండీ! ఒకరోజు రాత్రి ఆదిత్యను సూపరింటెండెంట్ ఆర్డర్ మేరకు టార్చర్ రూమ్ లోకి తీసుకెళ్ళామండీ! గుర్రం పెద్దబ్బాయి పిస్టల్ నీ చేతికి ఎలా వచ్చిందని జైలు సూపరింటెండెంట్ ఆదిత్యను అడిగాడండి. ఆదిత్య చెప్పలేదండీ. గుర్రం పెద్దబ్బాయితోనే నేను స్వయంగా మాట్లాడతానని, అందుకు ఎరేంజ్ చేయమని ఆదిత్య అడిగాడండీ. జైలు సూపరింటెండెంట్ ఒప్పుకున్నాడండీ. రేపు ఖైదీలందరినీ రాళ్ళు కొట్టించటానికి తీసుకెళ్తున్నామండీ..."  

 

    "అంటే ఆదిత్యను తప్పించడానికి ప్లాన్ వేశారన్నమాట?" అని నెమ్మదిగా అని-

 

    "సి.ఎం. నేనా? ఆడా? ఈ రాష్ట్రం నాదా? ఆడిదా? ఆ ఆదిత్య, ఆ ధరణి కుమార్ బ్రతకటానికి వీల్లేదు. చిదంబరం! నువ్వేం చెప్తావో నాకు అనవసరం" అసహనంగా అరిచాడు అహోబలపతి.

 

    వీరారెడ్డి ఆ కోపానికి భయపడ్డాడు.

 

    "నేను మళ్ళీ వస్తాను" లేచి నిలబడ్డాడు చిదంబరరావు.

 

    "వాళ్ళిద్దరి శవాల్నీ నాకు చూపించు. అంతే! లేకపోతే... నీ పోర్టిపోలియో వుండదు గుర్తుంచుకో" చిరాగ్గా అన్నాడు సి.ఎం.

 

    వీరారెడ్డి ఎదుటే సి.ఎం. అలా అనటం నచ్చలేదు హోంమినిస్టర్ వచ్చిన కోపాన్ని దిగమింగుకొని ఆ రూమ్ లోంచి బయటపడ్డాడు చిదంబరరావు.

 

    అతన్ని అనుసరించాడు వీరారెడ్డి.


                            *    *    *    *    *


    జె.ఎస్. సుబ్రహ్మణ్యాన్ని సార్! నమస్కారం సార్.

 Previous Page Next Page