Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 24


    "లేదు ఆదిత్యా! మనం తప్పించుకున్నాక తీరుబడిగా ఆ కథ చెబుతాను. ముందు నేను, నా భార్య సుమబాలను, నా నాలుగేళ్ళ ప్రెటీని రక్షించుకోవాలి. వాళ్ళకేం కాకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాను. కానీ ఏదో భయం..."

 

    ధరణి కళ్ళముందు భార్య సుమబాల, కూతురు ప్రెటీలరూపాలు కదలాడాయి ఒకింతసేపు.

 

    అతనేం మాట్లాడలేకపోయాడు.

 

    ధరణి మనిషి, మనసు, జీవితం, మాటలూ అంతా ఓ మిస్టరీలా వుంది ఆదిత్యకు.

 

    "మనమెలా తప్పించుకుందాం?" అడిగాడు ధరణి.

 

    "ఆ విషయం నాకొదిలేయండి. మూడో కంటివాడికి తెలీకుండా మనం తప్పించుకుంటాం అంతే..."

 

    వార్డర్లు తమవేపే రావడంతో కామ్ అయిపోయారిద్దరూ.

 

    "ఆదిత్యా! నీకోసం విజిటర్స్ వచ్చారు. జైల్ సూపరింటెండెంట్ రమ్మంటున్నారు."

 

    "నా కోసం విజిటరా? ఇప్పుడా?"

 

    మళ్ళీ హోంమినిస్టర్ వచ్చాడా? వార్డర్ వెనక వెళ్ళాడు ఆదిత్య.

 

    మెయిన్ ఎంట్రన్స్ కి కుడిపక్కన-

 

    గ్రిల్స్ వెనక తండ్రి సత్తెయ్య కనబడగానే అప్రయత్నంగా అతని కళ్ళల్లో కన్నీళ్ళు పొంగాయి.

 

    "నాన్నా..." అంటూ గబగబా ఇనప చువ్వల దగ్గరకు నడిచాడు ఆదిత్య.

 

    "బాబూ..." కొడుకుని ఆ స్థితిలో చూసిన తండ్రి సత్తెయ్య మనసు విలవిల్లాడింది.

 

    రెండు నిమిషాలసేపు ఆదిత్య ఏం మాట్లాడలేకపోయాడు.

 

    "అమ్మా, చెల్లీ ఎలా వున్నారు నాన్నా?"

 

    "నీ దయవల్ల అందరం బాగానే వున్నాంరా! చెల్లి పెళ్లైపోయింది. బావతో అత్తారింటికి వెళ్ళిపోయింది."

 

    "పోనీలే నాన్నా! చెల్లి సుఖంగా వుంది కదా...."

 

    "అప్పుడప్పుడు హోంమినిస్టర్ చిదంబరరావుగారి మనుషులొచ్చి మంచి చెడ్డలు కనుక్కుని వెళుతున్నారు బాబూ! త్వరలో నిన్ను విడుదల చేస్తారట గదా?    అడపా, దడపా చేతి ఖర్చుక్కూడా వాళ్ళే డబ్బులిస్తున్నారు బాబూ! నువ్వే యివ్వమన్నావటగదా? ఏమిటిదంతా? మాకంతా భయంగా వుంది."

 

    తండ్రి చెప్పింది వింటున్నాడు ఆదిత్య.

 

    "బాబూ! నిన్న హోంమినిస్టర్ చిదంబరరావు స్వయంగా మనింటికొచ్చాడు బాబూ! ఆయనే నన్ను నీ దగ్గరకు పంపాడు."

 

    "దేనికి?"

 

    "నీకేదో పని అప్పగించార్ట కదా? ఆ పని త్వరగా పూర్తిచెయ్యమని చెప్పారు బాబూ! నువ్వు నమ్మకంగా వాళ్ళ మనిషిగా వుంటే, చెప్పిన పనిచేస్తే మీ అందరూ క్షేమంగా వుంటారని చెప్పాడు. ఆ విషయం నీతో చెప్పమన్నారు..." నెమ్మదిగా చెప్పాడు తండ్రి సత్తెయ్య.

 

    అంటే... అహోబలపతి తన తండ్రి ద్వారా నరుక్కొస్తున్నాడన్న మాట!

 

    "అమ్మను తీసుకొస్తే బాగుండేది నాన్నా..." మాట మారుస్తూ అన్నాడు ఆదిత్య.

 

    "ఆగష్టు పదిహేనునాడు నిన్నెలాగూ విడుదల చేస్తామంటున్నారు. వాళ్ళు చెప్పిన పని చేసెయ్ బాబూ! మన దరిద్రం వదిలిపోతుంది."

 

    ఆ మాటకు ఆదిత్యకు కోపం వచ్చింది.

 

    "కొడుకెలా ఉన్నాడో, ఏమిటో నీకా విషయం అఖ్కర్లేదన్నమాట! ఇది చెప్పటానికే వచ్చావన్నమాట?"

 

    తండ్రి నీళ్ళు నమిలాడు ఆ మాటకు.

 

    "డబ్బు గురించి కాదురా ఆదిత్యా! పవర్ లో వున్న మనుషులు. పోలీస్ పవర్ వాళ్ల చేతుల్లో వుంది. న్యాయవ్యవస్థ వాళ్ళ చేతుల్లో వుంది. నీకేమైనా అయితే... నేనూ, మీ అమ్మా ఉరి వేసుకోవాలి."

 

    ఏదో చెప్పబోయాడు ఆదిత్య.

 

    జైలర్ వీరారెడ్డి రావడంతో ఆదిత్య మరి మాట్లాడలేదు.

 

    "టైమీజ్ ఓవర్...."

 

    "అమ్మ జాగ్రత్త నాన్నా!"

 

    తండ్రి సత్తెయ్య కళ్ళలో తడి నిస్సహాయతలోంచి ఉద్భవించిన తడి...

 

    వెళ్ళిపోతున్న తండ్రివేపు అలా చూస్తూ నిల్చుండిపోయాడు ఆదిత్య.


                                                *    *    *    *    *


    "ఎవరా విజిటర్?" అడిగాడు ధరణి.

 

    "మా నాన్న" చెప్పాడు ఆదిత్య.

 

    తండ్రి వచ్చి వెళ్ళిన దగ్గర్నించి అహోబలపతి మీద కోపం, అసహ్యమూ, కక్ష రెట్టింపవుతోంది.

 

    జైలు గోడలు అడ్డు లేకపోతే, తండ్రిని తన మీదకు ఆయుధంలా వాడిన చిదంబరరావు, అహోబలపతిల అంతు చూసేవాడు ఆదిత్య. ఏ పరిస్థితుల్లో తండ్రి అక్కడకు వచ్చుంటాడో అర్ధంచేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య.

 

    తను రేపు తప్పించుకున్నాక తండ్రి తన కుటుంబ పరిస్థితిని వూహిస్తున్నాడు.

 

    తను తప్పించుకున్నానని తెలిసి, అహోబలపతి మనుషులు తన కుటుంబాన్ని ఏమైనా చేస్తే?

 

    రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ఆదిత్య.

 

    "మనం వీళ్ళను బోల్తా కొట్టించి తప్పించుకోగలమా?" చాలాసేపయ్యాక అన్నాడు ధరణి.

 

    ఆ మాటలతో అతని ఊగిసలాట, మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు ఆదిత్య.

 

    "ఎందుకు తప్పించుకోలేం? తప్పించుకోగలం. చావుదెబ్బ తియ్యగలం. నాకా నమ్మకం వుంది. ఈ విషయంలో నాకు అడోల్ఫ్ 'ఐచ్ మన్' ఆదర్శం! అడోల్ఫ్ ఐచ్ మన్ పేరు విన్నారా మీరు? ఇప్పటికీ మనం మర్చిపోలేని, ప్రపంచం మొత్తమ్మీద ఎక్కువ మానవ హత్యలు చేసిన భయంకర హంతకుడు ఐచ్ మన్!తను తప్పించుకొని, శత్రువుల్ని ముప్పతిప్పలు పెట్టినవాడు..." అన్నాడు ఆదిత్య.

 

    "ఐచ్ మన్ హిట్లర్ నమ్మిన బంటుల్లో ఒక ఆఫీసర్ కదూ?"

 

    అతని మాటకు అవునన్నట్టు తలూపాడు ఆదిత్య.

 

    "గొప్ప క్రూయల్ అండ్ ఇంటెలిజెంట్ ఆఫీసర్! మొత్తం అతను ఎంతమందిని చంపాడో తెలుసా...? అరవై లక్షలమంది యూదుల్ని చంపాడు"

 

    "నువ్వు క్రైమ్ స్టోరీస్ స్పెషలిస్ట్ వని నాకు తెలుసుగానీ, ఇన్నాళ్ళుగా ఒక్క కథ కూడా ఎందుకు చెప్పలేదని అనుకునేవాడిని, చెప్పు వింటాను. ఆ కథ వింటేనన్నా తప్పించుకునే ధైర్యం వస్తుందేమో! భోజనాలకి యింకా చాలా టైముందిగదా..." అన్నాడు ధరణి.

 

    "రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గ్రేటెస్ట్ కిల్లర్ ఐచ్ మన్ మొత్తం అరవై లక్షలమంది యూదుల్ని ఊచకోత కోసినవాడు. యుద్ధం ముగిశాక దొరికిపోయిన నాజీ జనరల్స్ అందరికీ ఉరిశిక్షే దిక్కయింది. కానీ వాళ్ళలో తప్పించుకున్నవాడు ఒక్క ఐచ్ మన్ మాత్రమే! ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. ఎక్కడకు పారిపోయాడో తెలీదు.

 Previous Page Next Page