10
"అవ్ మల్ల! నాలుగు యాటలన్న తెగాల్నె. బాలయ్యన్న గూడెంల ఆఁమల్ల పండుగంటె ఏంది? పరమయ్యన్న ఇస్తడ్లే ఒక్క యాటకు పైకం కొలువులున్నడు కమాయిస్తాన్నడు ఏం చస్తడా?"అన్నాడు పిచ్చయ్య.
తెల్లవారి జరుగనున్న మహాకాళీ ఉత్సవానికి ఏర్పాట్లు చేయడానికి బాలయ్య ఇంటిముందు కూడారు గూడెపు జనం.
పిచ్చయ్య ప్రతిపాదనను మిగతావారు బలపరచారు. బాలయ్య మాత్రం మాట్లాడలేదు.
గుండెలో రాయి పడింది. పరమయ్యకు "ఏయ్ కమాయిస్తున్ననే, ఏమన్న జమ చేస్తాన్నవా? మండిపోతున్నాయి. కీమతులు నిన్న రెండు రూపాయలుండె పల్లినూనె ఇయ్యాల అయిదు రూపాయలాయె. దంచిందానికి బుక్కిందె మిగిలె నాతా నేమున్నదే? అందరెంతిస్తే నేనంతిస్త" తప్పుకోవడానికి మండిపోతున్న ధరలను ఆశ్రయించాడు పరమయ్య.
"ఒరే పరమిగా! ఇంక కంజూసులై ఏం కట్కపోతువుర? పండుగ పసందుగ చేయాలె బే పై నున్నోరంత గిట్లనే ఏడుస్తర్ర తియ్ ముండకొడక, ఒక్క యాటకిస్తె చస్తావుర!" పిచ్చయ్య మళ్ళీ అన్నాడు, పరమయ్యకు రోషం తెప్పించాలని.
"నలుగురితోడి నారాయణ అందరెంతిస్తె నేనంతిస్త" అని లేచి నుంచున్నాడు పరమయ్య.
"ఎహ్! పైకమియ్యకుంటె మాయనే పోతవేడికే" అని లాగి కూర్చోపెట్టి, "బాలయ్యన్న, తీసుకో ఒక యాటపైకం నేనిస్తాన్న" అని నోట్లు బాలయ్య ముందు విసిరాడు పిచ్చయ్య.
రోషం వచ్చేసింది పరంయ్యకు. తానూ అలాగే పారేతామనుకున్నాడు కాని, మైసమ్మను తల్చుకుంటే గుండె జల్లుమన్నది.
"ధూ నీ పుటక పిచ్చయ్యన్నిస్తె కిక్కుమనకుండ కూకుంటడేమె ఇద్గా నా పైకం" అని ఇచ్చాడింకొకడు.
డబ్బు ఎంత వచ్చిందీ లెక్కించి తెల్లవారి చేయవలసిన కార్యక్రమాన్ని గురించి చర్చిస్తుండగా పుల్లయ్య వచ్చాడు. అతడు సుమారు యాభై ఏండ్లవాడు లొట్టలు పడిన చెంపలు, ముడతలు పడిన నల్లటి శారేరం, తలగుడ్డ చుట్టుకున్నాడు. చిరిగిన బనీను వేసుకున్నాడు. పంచె మోకాళ్ళవరకుంది.
"మంచిగొచ్చినవే పుల్లయ్యన్న నేను పూర యాదిమరచిన్ననుకో రా కూకో" అన్నాడు బాలయ్య పుల్లయ్యను చూచి.
పుల్లయ్య ఒక పక్కన కూర్చున్నాడు.
"యాదిమరిచిన్నే పిచ్చియ్యన్న పుల్లయ్యన్న రెండు మలకలొచ్చిండు పోచిగాని గుడిసున్నది గద, గండ్ల ఉంటనంటాడు"
"పుల్లయ్యన్నది చెన్నూరే గింత జమీనుండె దానిమీదనే బత్కుతొండె ఒక సన్నాసాయన వచ్చిండట ఆడికి. ఆయన నడ్చుకుంటనే తిర్గుతడంట ఎంటనెమో జీవులుంటయట! బండ్లుంటయట, ఉన్నోండ్లను బిచ్చమడిగి లేనోండ్ల కిస్తడట్నె. జమీన్లు వచ్చిన సన్నాసాయన దొరింట్ల దిగిండట. దొర జమీన్ ఇచ్చి ఆయనెల్లిపోయిండట. దొర రాసిచ్చిన జమీన్ల పుల్లయ్యన్నది సుత ఉన్నదట అన్నను బేదఖల్ చేసిన్రట. సర్కారోరు దొరేమో చావకొట్టించిండట. ఊరిడించిండు పట్నమ్ల పడ్డడు గూడైతే కావాలెగదనే ఈడికొచ్చిండు, మన నడిగెతంద్కు"
"యాటకు పైకమియ్యమను, గుడిసె లుండమను" అన్నాడు చప్పున పరమయ్య-తన భారం వచ్చినవానిమీద వేస్తూ.
ఆ ప్రతిపాదన చాలామందికి వచ్చింది. "ఎట్లనన్న పరమయ్యన్న జర సమజున్నోడు" అన్నారు కొందరు. ఆ మాట నచ్చలేదు పిచ్చయ్యకు.
"గీ పరమిగా డున్నడు చూసిన్రా! మడిసి చస్తాంటే జేబుల పైకం చూస్తడు. మీరు సుత గట్లనే అంటాన్రేమే. చచ్చేటోని కంట్ల ఏలుపెట్టి చూస్తారు పరమయ్యన్న ఇయ్యనంటేనేమో నోరు మూసుకుంటిరి. ఈడేమిస్తడే గంజికి లేనోడు అందుకే అంటరు శరంలేదని అలికీ మందికి ఏమొద్దె బాలయ్యన్న! ఉండమను పోచిగాని గుడిసెల ఏమన్న కట్కపోతమ పోయేటప్పుడు!"
పిచ్చయ్య ప్రతిపాదన చాలామందికి నచ్చలేదు. గుసగుసలు బయల్దేరాయి. చర్చలు జరిగాయి.
"ఇన్ని కల్నిలన్న కోయించకుంటె గుడిసెట్టిస్తం" అన్నాడొకడు "యాటకు పైకమియ్యటం నాయమేనే" అన్నాడొకడు. "అసలు పోచయ్య యాడికి పోయిండో? అప్పుడొస్తడో? ఆడొస్తెట్ల" అన్నాడింకొకడు. బాలయ్య అందుకున్నాడు.
"ఇగొ చూడుండ్రి! గీ గుడిసెలు మనమే ఏసుకున్నమనుకోరి ఇరువై ఏండ్ల కాణ్ణుంచి ఉంటాన్న మనుకోరి గిప్పుడేమొ గుడిసెలు ఉస్మాన్ సాబు యైనయి నెలకు అయిదు రుపైలుకట్టి కిరాయకుంటన్నట్లాయె. మన బతుకు మొన్న పికం కట్టెటందుకు పోయిన్నా అడిగిండు ఒక్క గుడిసె పైకమొస్తలేదని పోచయ్యన్న ఎల్లిపోయిండని చెప్పిన గా గుడిసెల ఎవలు దిగినగని తొల్త నూర్రూపాయలు కట్టాల్నన్నడు. ఆ సంగతి సుత చూడుండ్రి"
పిచ్చయ్య మండిపడ్డాడు. ఉద్రేకంతో వణికిపోయాడు. లేచి నుంచొని ఉపన్యాసం ఇచ్చినట్లు అన్నాడు.
"దొంగముండ కొడుకులు లేకుంటె పొట్టలు కొట్టి బంగ్లలు కడ్తాన్రు గప్పుడు తురుకోల్లే రాజ్జమేలిరి. గిప్పుడు వాల్లె ఎల్తాండ్రి వాడేమన్న మన అయ్యలకు పుట్టినాడు భాడ్ ఖావ్ గాడు గీ జాగేమన్న ఆనిదా? గుడిసె లేయించిచ్చిండా? సంగాలు పెట్టనేర్చిన్రు సంగాలు ఎందుకియాల్నె ఆ నా కొడుక్కు పైకం? పైసిచ్చేడ్ది లేదు. అయిదు బంద్, పుల్లన్న గుడిసెల్నె ఉంటడు"
జనం అంతా ముక్తకంఠంగా అనేశారు. "అయిదు బంద్, పుల్లన్న గుడిసెల్నె ఉంటడు"
పిచ్చయ్య పిడికిలి బిగించి "పాంచ్ రూప్యా" అన్నాడు జనమంతా "బంద్" అన్నారు. "పుల్లన్నకో జోఁప్డీ" అంటే, జనం "దేకే రహేఁగే" అన్నారు.
ఇండ్లకు వెళ్ళడానికి అంతా లేచారు. ఈ నిర్ణయం నచ్చని పరమయ్యా, "బాలయ్యన్న! నువ్వేమన్నను ఆడు పైనున్నోడే ఆనితో లడాయెందుకే? ఉన్నట్లె ఉండనియ్యె కొత్త బిగ్డమెందుకు తెస్తరు!" అన్నాడు.
"పరమయ్య! ఏందే గట్లంటవు. అసలు దున్య నడిపెడ్ది గరీబోల్లెనే గరీబోల్లు మర్ల పడ్డరంటే నీ తల్లి యాడ పోతడే గా ఉస్మాన్ గాడు నీ అక్క. వాని హడ్డీ నరమ్ చేస్తే పాకిస్తాన్ల పడాలె" అన్నాడొకడు.
అందరూ నవ్వారు ఎవరి దోవన వారు వెళ్ళిపోయారు.
దూరంగా రెండు నీడలు కలిసి కనిపించాయి బాలయ్యకు. కొంతసేపటికి విడిపోయాయి. ఒకటి గుడిసెల వెళ్ళిపోయింది. పరీక్షగా చూశాడు పరమయ్య కూతురు శారద. మళ్ళీ మరొక నీడ కోసం దృష్టి నిగిడ్చాడు. అది నిశ్చలంగా నిలిచింది. కొంతసేపు తర్వాత కదిలింది, కొంత వెనక్కు పోయింది. పొడుగు కాసాగింది. మనిషి బయటపడ్డాడు. తన ఇంటివైపే వస్తున్నాడు, చూచాడు, పరీక్షగా చూచాడు రామారావు - తన కొడుకు! ఒళ్ళు జల్లుమన్నది. వెంటనే కోపం పెల్లుబికింది. వెంటనే దిగిపోయింది. వయసు వచ్చింది. పెళ్ళి చేయకపోవడం తనదే తప్పనుకున్నాడు. కార్తీకమాసం నిండువెన్నెల, గడ్డివాము వెనుక ప్రాంతం తాను వేచి ఉన్నాడు. బంతిపూలు తురుముకొని వచ్చింది వెంకమ్మ - వెంకమ్మను చూచాడు. తాను పొంగిపోయాడు. నున్నని చెంపలు పొంగిపొరలే వయసు వెంకమ్మ అప్సర్సలా తోచింది. అమాంతంగా కౌగలించుకున్నాడు. పూలు నలిగిపోయాయి.
వయసు మరలి వచ్చినట్లయింది. తనను చూచుకున్నాడు. శరీరం ముడతలు పడింది. వెంకమ్మ చనిపోయింది. తనకు సంతానం కలిగింది. ఆ వస్తున్నది తన కొడుకు నాటి తన వయసులో ఉన్నాడు. తనంతవాడు అయినాడు. మైసమ్మ అతని మనసులో మెరిసింది. ఆమె పరమయ్య భార్య చండి ఆమె అంటే గూడెం అంతటికీ దడ.
రామారావు దగ్గరికి వచ్చాడు.
"యాడికి పోయినావురా?" అడిగాడు బాలయ్య.
"సినిమాకెళ్ళా"
"ఈ కాలపు పోరలంత అంతే సీన్మాల దయ్యం పట్టింది"
రామారావు మాట్లాడలేదు. వంగి గుడిసెలో ప్రవేశించాడు. గుడ్డి దీపం వెలుగుతూంది. కూర్చున్నాడు. బాలయ్య కూడా గుడిసెలోకి వచ్చాడు. తడకపెట్టి కొడుకు ముందు కూర్చున్నాడు. ఇద్దరిమధ్యా పొగ చిమ్ముతూ బెడ్ లైట్ వేలుగుతూంది.
ఇద్దరూ ఒకరిముందు ఒకరు కూర్చున్నారు. ఇద్దరూ ఆలోచనల్లో మునిగి ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేదు. కొడుకుకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు బాలయ్య. తండ్రి తన రహస్యం కనిపెట్టాడా ఏం అని ఆలోచిస్తున్నాడు రామారావు.
"రాముడూ" అన్నాడు బాలయ్య. రామారావు గుండె జల్లుమన్నది.
"ఇన్నావుర " పదాలు తడబడ్డాయి "మైసమ్మంటే గూడెమంతటికీ బుగులు. నువ్వేమో గాపోరి ఎంటబడినవు. గూడెమ్ల బతకనిస్తవా? గూడె మిడిచి పొమ్మంటవా?"