Previous Page Next Page 
శరతల్పం పేజి 22

 

    "ఎందుకంత బుగులు!"
    "బుగులా? నీకో అత్తుంటే తెలుస్తది."
    "బుచ్చమ్మ చచ్చినా దయ్యమై పట్టేటట్లున్నది."
    "బావా!' పిలుపులో గారాబం ఉంది కాని వెనుక ఏదో భయం వ్యక్తం అవుతుంది.
    "ఏంది మరదలా!" ఆమెను దగ్గరకు తీసుకొని కూర్చున్నాడు గురువయ్య.
    పిచ్చమ్మ గురువయ్య ముందు కూర్చుంది. - తల వంచుకుంది - వేలుతో నేలమీద బొమ్మలు గీస్తుంది.
    "నాకు బుగులు గున్నది."
    "నే నుండగనా!"
    "నేం చచ్చిపోతే" గొంతు జీరబోయింది.
    "పిచ్చీ ! " అని రెండు చేతుల్తో వంచి వున్న ఆమె తల ఎత్తాడు. చెంపల మీంచి కన్నీరు జాలువారుతుంది.
    కన్నీరు చూచి గురువయ్య గుండె పగిలింది. "పిచ్చీ! నేకేమన్న పిచ్చా! ఎందుకేడుస్తవు?" అని ఆమె తల తన భుజం మీద పెట్టుకొని ఓదార్చాడు.
    "నేనిగ ఇంటికి పోను . ఎటన్న పోదాం" పిచ్చమ్మ దీనంగా అన్నది - అందులో ఏదో అర్దింపు ఉన్నది.
    గురువయ్య అంతవరకు అందును గురించి ఆలోచించలేదు. ఆతడు అనుభూతిని తప్ప బాధ్యతను ఊహించలేదు. ఆకాశంలో హాయిగా విహరిస్తున్న పక్షికి తుపాకి గుండు తగిలినట్లయింది అతని స్థితి. కాసేపు ఉక్కిరి బిక్కిరి అయినాడు.
    "ఎటు పోదాం?" ప్రశ్న విసిరాడు.
    "చచ్చిపోదాం - కలిసి."
    "పిచ్చీ!" అని కావలించుకున్నాడు గురువయ్య. ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది - ఎవరైనా లాక్కుపోతారేమో అన్నట్లు - కరచిపట్టుకుంది.
    ఆమె గురువయ్యను విడువలేదు.
    గురువయ్య ఆమెను వదలలేదు.
    కాలం కర్పూరం లాంటిదని వారు గమనించలేదు.
    వారు గమనించకున్నా కరిగిపోసాగింది కాలం - సూర్యుడు కుంగాడు - చుక్కలు వచ్చాయి. జాము రాత్రి అయింది.
    గురువయ్య మీద లాఠీ దెబ్బ పడేదాకా తెలియలేదు.
    ఒక్కదేబ్బకే పడిపోయాడు గురువయ్య.
    దెబ్బ బలంగా తాకింది -- చాటు నుంచి పడ్డది - ఎరగకుండా తగిలింది . భీముని వంటి గురువయ్య పడిపోయాడు. గురువయ్యను చుట్టుకొని ఏడుస్తోన్న పిచ్చమ్మను , బుచ్చమ్మ తెచ్చిన మనుషులు లాగారు. పిచ్చమ్మ మొగుడు ఆమెను గోర గోర లాక్కోపోయాడు.
    ఆమె ఏడ్పు వినలేకపోయాడు గురువయ్య.
    అయినా బడితెలతో బాదారు గురువయ్యను.
    ఆ చీకట్లో తాటివనంలో ఆ స్థితిలో వదిలి వెళ్ళిపోయారు వచ్చినవారు - గురువయ్యను.
    ఆ రాత్రి పిచ్చమ్మను దెబ్బలు కొట్టాడు మొగుడు. బుచ్చమ్మ కూడా బాదింది. ----నానా తిట్లు తిట్టింది. పిచ్చమ్మ మాట్లాడలేదు. ---కనీసం మూలగలేదు. స్తంభానికి అనుకోని మోకాళ్ళ మీద తల పెట్టుకొని కూర్చుంది. ఆమెకు ఏడుపు రాలేదు ---కళ్ళు ఎండిపోయాయి.
    బాదుడు - తిట్లు అయిపోయిం తరువాత ఒక మూల కూర్చొని బుచ్చమ్మ కూడా ఏడ్చింది. ఏడ్చి కొంగుతో కళ్ళు తుడుచుకుంది. కోడల్ను అన్నానికి పిలిచింది.
    పిచ్చమ్మ ఉలకలేదు -- పలుకలేదు.
    రాతిబోమ్మలా కూర్చుంది.
    మొగునికి కోపం వచ్చింది. -- తల్లి పిలుస్తే పెండ్లాం లేవనందుకు. "లే , పో" అని గట్టిగా అరచాడు. ఆమె కదల్లేదు. దగ్గరికి వచ్చి మళ్ళీ అరచాడు. పిచ్చమ్మ లేచింది. యంత్రంలా వంటింట్లోకి పోయింది. కంచంలో అన్నం కెలికి చేతి మీద చెంబుడు నీళ్ళు పోసుకొని వచ్చి పడుకుంది.
    పిచ్చమ్మ దర్వాజా లన్నింటికి గట్టిగా తాళం వేసింది.
    ఆ ఇంట్లో ఎవరూ నిద్ర పోలేదు --- "మన  ఇంట లేదు, వంట లేదు " అటు ఏడు తరాలు - ఇటు ఏడు తరాలు గురించి చెప్పింది కొడుక్కు బుచ్చమ్మ. కొడుకు వింటూ కూర్చున్నాడు - కోడలు మంచంలో పడుకుంది. ఆమె ఏమీ వినడం లేదు. --- గురువయ్యకు ఎలా ఉందా అని ఆలోచిస్తుంది -- కళ్ళు తెరిచే పడుకుంది.
    కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది -- ఈ గుట్టును రట్టు చేసి లాభం లేదనుకున్నారు తల్లీ కొడుకులు. అంతటిరో నిద్రపోయారు.
    తెల్లారి పిచ్చమ్మకు జ్వరం వచ్చింది. మూసిన కన్ను మూడు రోజులకు గాని తెరవలేదు. ఆనాడే కాస్త ఎంగిలి పడింది. ఇంట్లో పిచ్చమ్మ నుంచి తాళాలు వేసి పనికి వెళ్ళిపోతున్నారు తల్లీ కొడుకులు.
    పిచ్చమ్మకి పని లేదు - మంచంలో పడి వుంటున్నది.
    పనిలేని మనసుకు పలురకాల ఆలోచనలు . లేనిపోని వన్నీ ఆలోచించింది. గురువయ్య కళ్ళల్లో మసలసాగాడు. ఎన్నో సాహస కృత్యాలు గురించి ఆలోచించింది. తనను చూచుకుంది - బలహీనంగా ఉంది. బయట  చూచింది - ఎండ ! వెలుగు! ఈ వెలుగులో తాను ఎక్కడికి పోగలదు! మరి చీకటి ఎప్పుడు రాను!
    రానే వచ్చింది రాత్రి. అన్నం తిని మాములుగా పడుకున్నది. అర్ధరాత్రి లేచింది. నడికట్టు వేసుకుంది. అత్తనూ, మొగుణ్ని చూచింది. ఇద్దరూ నిద్రపోతున్నారు. బయటికి నడిచింది. వాకిట తలుపుకు పెద్ద తాళం ఉంది. పక్క కు చూచింది. రోటి మీదికి ఎక్కింది. దాని మీంచి గోడమీదికి ఎక్కింది. ఎక్కి కూచుంది. వెన్నెల పిండారబోసినట్లుంది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చీమ చిటుక్కుమంటే వినిపించేట్లుంది.
    పిచ్చమ్మ కిందికి చూచింది. గోడ ఎట్టుగానే ఉంది. దిగడం ఎలా అని ఆలోచించింది. దూకుతే చప్పుడవుతుంది - ప్రమాదం కూడా. మార్గాంతరం కనిపించలేదు.
    ఒక గబ్బిలం తలమీంచే ఎగిరిపోయింది.
    ఒక కుక్క దూరం నుంచి ఉరికి వస్తుంది.
    కుక్కను చూచింది పిచ్చమ్మ - అది మొరుగునెమో అని భయపడింది.
    కుక్క తల పైకి ఎత్తకుండా సాగిపోయింది.
    పిచ్చమ్మ కాలు కింది గూట్లో పెట్టింది -- దిగింది- -గోడల నీడ కున్న చీకట్లో గూడెం బయలుదేరింది - గురువయ్య ఇంటికి.
    గురువయ్య --- ఒక్కడే బయట పడుకొని ఉన్నాడు. పిచ్చమ్మ వెళ్ళి లేపింది . దిగ్గున లేచి కూర్చున్నాడు. చూచాడు - కళ్ళను నమ్మలేకపోయాడు.
    "పిచ్చీ! " అన్నాడు.
    "వచ్చిన బావా.....వచ్చిన . ఇగేక్కడికి పోను" అని గురువయ్య కాళ్ళు గట్టిగా పట్టుకుంది.
    గురువయ్య చూస్తూ కూచున్నాడు - పలకలేదు.
    పిచ్చమ్మ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది - ఆ ఏడుపు తప్ప వేరే ధ్వని ఎక్కడా ఏమీ లేదు.
    "ఎవరు?" మూలిగింది లచ్చమ్మ లోపల్నుంచి.
    "లచ్చి -- నీలాడింది -- పోరడు పోయిండు - రోగం నవుస్తున్నది " వేదన కనిపించింది గురువయ్య మాటలో.
    పిచ్చమ్మ ఆశాసౌధాలు కూలి కుప్ప అయినాయి - గురువయ్యతో లేచి పోదామనుకుంది.
    "మాట్లాడరు .....ఎవరు!" లోపల్నుంచి మళ్ళీ ఒక మూలుగు.
    ఇద్దరూ తలుపు వైపు చూచాడు - ఎవ్వరూ మాట్లాడలేదు. పిచ్చమ్మ లేచింది. నిశ్శబ్దంగా కదిలింది, తలుపు తీసుకొని లోన ప్రవేశించింది.
    దీపం బుడ్డి వెలుగుతుంది.

 Previous Page Next Page