Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 22


    ఒక స్టేజికి వచ్చాక నర్సింగ్ తనను పిలిపించాడు.


    వినయంగా దణ్ణం పెట్టి నిల్చున్న తనతో అన్నాడు -


    "దేఖోరే ఛోక్రా! నువ్వు కూడా ఇకనుంచి బిగ్ లీగ్ లోకి వచ్చెయ్యొచ్చు! నువ్వు గేమ్స్ ఆడుతున్న ఏరియాకి యికనుంచి నువ్వే ఇన్ ఛార్జ్ వి! సరేనా? ఇలాగే హుషారీ చూపించు. ఏడాది తిరక్కుండా మళ్ళీ ప్రమోషనిస్తా నీకు" అన్నాడు.


    ఏడాది పూర్తయిపోయింది.


    ఇవాళో రేపో తనకు మళ్ళీ ఇంకో 'ప్రమోషన్' రావాలి.


    తన మీద తనకి బాగా నమ్మకం ఉంది.


    ఇలా అంచెలంచెలుగా పైకి వచ్చేసి, ఏదో ఒకరోజున తను కూడా నర్సింగ్ అంతటి వాడయిపోతాడు.


    నర్సింగ్ కి రైట్ హాండ్ అయిపోతాడు.


    అలా రాకెట్ లా దూసుకుపోతున్న ప్లేయర్ ని పట్టుకొచ్చి ఈ మేస్టారి దగ్గర పడేశాడు కృష్ణాజీ.


    గురువంటే నర్సింగే గురువు.


    అతని దగ్గర నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.


    ఈ టీచరయ్య తనకు చెప్పేది ఏముంది? ఈయన దగ్గర తను నేర్చుకునేది ఏముంది?


    ఈయన చెప్పింది నేర్చుకుంటే, మహా అయితే తను పెద్దయ్యాక ఒక గుమాస్తా అవుతాడేమో!


    నర్సింగ్ నేర్పించేది నేర్చుకుంటే, తనే పదిమంది గుమాస్తాలను పెట్టుకునే లెవెలుకి వచ్చేస్తాడు.


    అవును మరి!


    పెద్దయ్యాక తను బార్ లు పెట్టాలి. లక్కీ గేమ్స్ నడపాలి, వడ్డీకి డబ్బులు తిప్పాలి. తినిపించవలసిన వాళ్ళకి తినిపించాలి. హవాలా రాకెట్ లో డాలర్ల బ్లాక్ మార్కెటింగ్ లో గంట గంటకీ మారే రేట్లు గమనిస్తూ వుండాలి.


    వీటన్నిటికీ తనకి అవసరం అవుతారు గుమాస్తాలు.


    ఈ టీచరుగారు తయారుచేసే రకం గుమాస్తాలు.


    అరె! అట్లాంటి లెవెలుకి వెళ్ళే తనను పట్టుకుని తననే ఒక గుమాస్తాగా మార్చెయ్యాలని చూస్తారా?


    పిచ్చోళ్ళు వీళ్ళు!


    వీళ్ళు పిచ్చోళ్ళే!


    కానీ తను పిచ్చోడు కాడు.


    ఇప్పుడు తను అర్జెంటుగా నర్సింగ్ ని కాంటాక్టు చెయ్యాలి.


    బహుశా ఇప్పటికే నర్సింగ్ కి తెలిసిపోయి ఉంటుంది జరిగింది అంతా!


    ఇంద్రుడికి వళ్ళంతా కళ్ళే అంటారు.


    నర్సింగ్ కి ఊరంతా కళ్ళే!


    ఊరంతా చెవులే!


    ఎక్కడ ఏం జరిగినా, అది క్షణాల్లో తెలిసిపోతుంది నర్సింగ్ కి.


    తెలుస్తుంది నిజమే!


    కానీ తెలియడం రెండు రకాలు!


    ఒకటి! జరిగింది జరిగినట్లుగా తెలియడం.


    రెండు! జరిగింది రంగూ, రుచీ మారి వేరే రకంగా తెలియడం.


    నర్సింగ్ కి జరిగింది జరిగినట్లే తెలియాలి. జరిగినదాన్లో తన తప్పేంలేదనీ, తను పోలీసు కుక్కలా మారిపోలేదనీ నర్సింగ్ కి తెలియాలి.


    లేకపోతే డేంజరు.


    ఈ టైగర్ కృష్ణాజీ ఈ ఊళ్ళో ఇవాళ ఉంటాడు.


    రేపు పోతాడు.


    కానీ చచ్చేదాకా ఈ ఊరిని వదలంది నర్సింగే!


    తను నర్సింగ్ మనిషి!


    పోలీసు తొత్తుకాడు!


    సాధ్యమైనంత త్వరలో ఈ డెవలప్ మెంట్స్ అన్నీ నర్సింగ్ కి చెప్పాలి. అర్జెంటు!


    అలా ఒక నిర్ణయానికి వచ్చాక మంచం మీదనుంచి లేచాడు రాజా. రెండు దిండ్లు తీసి, మనిషి పడుకున్న ఆకారంలో పేర్చాడు. వాటి మీద దుప్పటి కప్పాడు.


    "పడుకోరా నాయనా పడుకో!" అని ఆ దిండ్లకి చొచ్చికొట్టి, తర్వాత తను మంచం కింద దూరి పడుకున్నాడు.


    ఆత్మరక్షణ కోసం నజీర్ నేర్పించిన శతకోటి ఉపాయాల్లో యిదొకటి!


    కొత్త ప్లేస్ లో పడుకున్నప్పుడు ఇంకోడు నిన్ను సర్ ప్రయిజ్ చేసే ఛాన్స్ యివ్వకు.


    నువ్వే ఇంకోడిని సర్ ప్రయిజ్ చేసే పొజిషన్లో పడుకో.


    మంచం కింద పడుకున్న రాజాకి మాగన్నుగా నిద్ర పడుతుండగా -


    మాస్టారు అక్కడికి వచ్చాడు.


    దుప్పటి తీసి రాజా వంటిని స్పృశించబోతుండగా -


    చేతికి మెత్తగా తగిలాయి దిళ్లు!


    షాకయిపోయాడు ఆయన!


    ఏడీ వీడు. మనిషి పత్తాలేడు. దిళ్ళు పెట్టి, దుప్పటి కప్పి పారిపోయాడా?


    ఇంతలో ఆయన కాళ్ళను మొసలి పట్టుకున్నట్లు పట్టేసుకున్నారు ఎవరో. తర్వాత బలంగా గుంజారు.


    పట్టుతప్పి దభేలుమని కింద చతికిలపడ్డాడు ఆనందరావు.

 Previous Page Next Page