"ఉపవాసం అంటే గంటకోసారి టీలు, కాఫీలు తాగడం కాదు. రోజంతా ఉపవాసం, సాయంత్రం కేవలం పళ్ళు మాత్రం తినాలి. శనివారం ఉపవాసంలో దిబ్బరొట్టి, వుప్పుడు పిండి వుండవు" రాజేశ్వరి వేళాకోళం చేసింది.
ఆయనకు దిబ్బరొట్టి, ఉప్పుడు పిండి చాలా ఇష్టం. అందరితోపాటు సరదాగా మొదలుపెట్టిన ఆయన సాయంత్రం అయ్యేసరికి నీరసంగా వాలిపోయారు.
"బాబోయ్ నాకొద్దు. యింత నిమ్మకాయ పిండి మంచి ఉప్మా చేసి పట్టుకురా. లేదంటే రెండు రవ్వ దోసెలు వెయ్యి" అంటూ ఆరంభించారు.
"ఛా - తప్పు. ఉపవాసం అంటూ మొదలుపెట్టి మధ్యలో మానకూడదు. ఒక్కపూట ఈ పళ్ళు తినండి. మరేం కొంప మునగదు."
ఆయన రెండు పళ్ళు తిని "అబ్బ ఒక్కపూటకే ఆవకాయ అన్నం తినాలనిపిస్తుంది. ఈ పళ్ళు ఏమిటలా వున్నాయి" అంటూ ఒకటే సణుగుడు మొదలుపెట్టారు.
"యిలా చేస్తే పుణ్యం మాట దేముడెరుగు. పాపం వస్తుంది" అంటూ రాజేశ్వరి కసిరింది. కేశవరావు మాట్లాడకుండా నీరసంగా వెళ్ళి పడుకుండిపోయారు.
"ఈయనకి ఉపవాసం ఏమిటి. బుద్ధిలేక నిజం అని నమ్మాను" అంది. అంతా నవ్వారు.
* * *
"రంగా చూడు. మనం ఏఏ పనులు ఎప్పుడు మొదలుపెడ్తామన్నది ఓ లిస్టు తయారుచేశాను. ముందు నా ఉద్దేశ్యంలో మనం రోడ్ల పని చూడాలి. ఎక్కడకెళ్ళాలన్నా ఈ మట్టి గతుకుల రోడ్డులో ప్రయాణం కష్టంగా వుంది. రోడ్లు బాగుపడితే ట్రాన్స్ పోర్టు సులువై పని తొందరగా అవుతుంది. ఒక్క రోడ్డు బిల్డింగుల సూపర్ వైజర్ ని పంపమని అడుగుతాను. రోడ్డు రోలర్ అవి వాళ్ళే పంపుతాం అన్నారు.
మెటీరియల్ ఆర్డర్ చేసి రాగానే పని ఆరంభించేద్దాం. ఆ రంగా ఈ పనికి జన్మభూమి కింద గవర్నమెంటు సగం యిస్తుంది. మిగతా సగం మనం కూడగట్టాలి. ఈ ఊరిలో జనం అడిగితే యిస్తారా. ఎవరికి ఎంత తోస్తే వారి వారి తాహతుబట్టి యిమ్మందామా. ఫండ్స్ ఎలా కలక్ట్ చేద్దాం. ఊరిలో అందరినీ సమావేశపరచి అడుగుదామా. ప్రెసిడెంట్ తో మాట్లాడుదాం. ముందు అంతా తలో కాస్త కంట్రీబ్యూట్ చెయ్యాలి అని చెపుదాం."
"చెపుతాం... ఎంతమంది యిస్తారన్నది నాకు సందేహమే మామయ్యా" సదిగ్ధంగా అన్నాడు.
"అడగందే అమ్మైనా పెట్టదు. మన వూరు పని మన రోడ్లు బాగుపడాలి అని నచ్చచెపుదాం."
"సరే! రేపు అందర్నీ సమావేశపరుద్దాం పంచాయితీ ఆఫీసులో."
"రోడ్లు అయ్యాక... ఈలోగా స్కూలుకి ఎండాకాలం శలవులు యిచ్చినప్పుడు స్కూలు అంతా బాగు చేయించాలి. ఈలోగా బెంచీలు, బల్లలు అవి ఆర్డరు యిద్దాం. శలవుల్లో స్కూలు పని పూర్తయిపోవాలి. ఆ తర్వాత యీ దాళవాయి పంటలు అయ్యి కరీఫ్ పంట వేసేలోగా రైతులు పొలాలు లెక్కలు తేల్చి ఎవరెవరు ఏ ఏ పొలాలలో పనిచెయ్యాలి అని అంతా ప్లాన్ చెయ్యాలి.
ట్రాక్టరు చౌదరిగారిది ఒకటుంది. మరోటికొందామా...అలాగే హారె స్టే మిషను రెండూ ఒకేసారి ఆర్డరు ఇచ్చేద్దాం. ముఖ్యమంత్రి గ్రామీణ సహకార బ్యాంక్ వారిని మాట్లాడడానికి పంపి బ్యాంకు తెరిచే ఏర్పాటు చూస్తామన్నారు. అది గుర్తు చెయ్యాలి. మనం ఒక్కొక్క పని ప్లాను ప్రకారం పూర్తిచేసి మళ్ళీ కొత్త సంవత్సరం నాటికి ఏడాదిలో ఏం సాధించామో అందరికీ చూపగలగాలి...!" ఉద్వేగంగా చెప్పుకుపోతున్నారు కేశవరావుగారు.
"రంగా ఆస్పత్రికి పక్క బిల్డింగు కట్టేవరకు టెంపరరీగా ఆస్పత్రిగా వాడడానికి ఏదన్నా యిల్లు దొరుకుతుందా ఈ వూరిలో. లేకపోతే ఓ టెంటన్నా వేసుకోవాలి. వర్షాకాలం వరకు పర్వాలేదు!"
రంగా కాసేపు ఆలోచించి "మామయ్యా! ఈ వూరిలో అందరికంటే ముందు మేడ కట్టింది రామచంద్రరావుగారని గొప్ప భూస్వామి. వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయి పెద్ద చదువులు చదివి ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్ళిపోయారు. కొడుకులు, మనవలు అంతా పెద్ద ఉద్యోగాలలో మద్రాసు, ఢిల్లీలలో ఉన్నారని విన్నాను. వాళ్ళ మేడ అంతా తాళం పెట్టి వుంది గత నలభై ఏళ్ళుగా. నాకు తెల్సిన దగ్గరనుంచి అది కాళీగానే వుంది. వాళ్ళెవరన్నా ఎక్కడున్నారో తెల్సుకుని అడిగితే కింద భాగం వాడుకోడానికి యిస్తారేమో. ఓ మంచి పని అంటే యిస్తారనిపిస్తుంది. నిన్న వెడుతుంటే పచ్చమేడ చూసాను కమ్మవారి వీధిలో అది.
"వాళ్ళ అడ్రసు ఎవరికి తెలుసు?"
"ఏమో నాకు సరిగా తెలియదు! ప్రెసిడెంటు, మునసబ్బు వగైరా లెవరికన్నా తెలుసేమో, అందరికంటే పెద్దాయన ఊరిలో చాలారోజులు నుంచి ఉన్న మన గౌరీనాథ శాస్త్రిగారికి ఏమన్నా వివరాలు తెలుసునేమో అడుగుతాను."
"అడ్రసు దొరికి, వాళ్ళు పర్మిషన్ ఇస్తే సగం ప్రాబ్లమ్ తీరుతుంది. కట్టడం అంటే వెంటనే జరిగేపని కాదు. రేపు ఎలాగో అందరం కలుస్తాం. అక్కడ ఊరిలో ఎవరికన్నా తెలుసేమో అడుగుదాం."
మాటల్లో రాజేశ్వరి, సుగుణ స్కూలు నుంచి వచ్చారు. "వెల్, టీచరమ్మలు వచ్చేశారు. ఎలా వుంది మీ స్కూలు. ఫస్ట్ డే ఎక్స్ పీరియన్స్ నవ్వుతూ పలకరించాడు.
రాజేశ్వరి ఫ్రిజ్ లో మంచినీళ్ళు తీసుకు తాగి సుగుణకి ఓ గ్లాసు యిచ్చి "ప్చ్! అమెరికాలో పిల్లల స్కూల్ చూశాక ఇక్కడ స్కూల్ చూస్తే ఈ పిల్లల మీద ఎంత జాలివేసిందో...పెచ్చులూడిన నేలమీద చాపలన్నా లేకుండా మట్టిగొట్టుకుపోతూ పిల్లలు... అక్కడ! ఎన్నిరకాల బొమ్మలు, ఆట సామాన్లు, రంగు రంగుల చిన్న చిన్న కుర్చీలు, బల్లలు అశుభ్రత... పిల్లల పట్ల వారు తీసుకునే శ్రద్ధ, ఆరోగ్యంగా మిసమిసలాగే ఆ పిల్లలు, ఆ నవ్వులు చూశాక మనం ఎప్పటికి అలా తయారవ్వగలం అన్పించింది!"
"చేద్దాం... చేద్దాం. బడులు మూసాక ఎండాకాలం శలవుల్లో స్కూలు రూపురేఖలు మార్చేద్దాం. ఓ రెండు నెలలు ఓపికపట్టు" కేశవరావు హామీ ఇచ్చాడు.
"పిల్లలంతా నన్ను చూసి ఎంత సంబరపడిపోయారో నన్ను వింత మనిషిలా, ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతా అన్నట్టు వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడాలి. క్లాసంతా నిశ్శబ్దం అయిపోయారు."
"ఇంత అందమైన, ఖరీదయిన టీచరమ్మని పాపం వాళ్ళు చూసి వుండరు మరి" కేశవరావు తమాషాగా అన్నారు.
"వెర్రివాళ్ళు, ఇంగ్లీషు పద్యాలు చెపితే, ఇంగ్లీషు నేర్పుతా అంటే ఎంత సంబరపడ్డారో. ట్వింకిల్ ట్వింకిల్ నేను యాక్షన్ చేసి చూపిస్తుంటే నోరు తెరిచి, సిగ్గుపడుతూ చూశారు. వాళ్ళకివాళ ఆ పద్యం నేర్పించాను. ఎంత సంతోషపడిపోయారో. రేపటినుంచి ఇంగ్లీషులోనే మీరు మాట్లాడడం నేర్పిస్తానంటే చప్పట్లు కొట్టారు."
"రంగా! వీళ్ళు పాపం మరీ లేనివాళ్ళ పిల్లల్లా వున్నారు. వీళ్ళకి స్కూల్ యూనిఫాం కొనాలి. ఓరోజు విజయవాడ వెళ్ళిరావాలి మనం పుస్తకాలు, కొన్ని ఆట సామాన్లు అవి తెద్దాం."
"అబ్బో ఒక్కరోజుకే స్కూలులో అంత అటాచ్ మెంటా?"
"ఖర్చు పెట్టడం మీకేకాదు నాకూ వచ్చని చూపిస్తా. ఏమిటో అమెరికాలో ఆ పిల్లలకున్న సౌకర్యాలు చూశాక నాకేమిటో వీళ్ళని చూసి జాలి అనిపిస్తుంది. రంగా నీకు పుణ్యం వుంటుంది ముందు ఒక రెండు ఫ్యాన్లు పెట్టించు మీ స్కూలులో. యివాళ ఆ ఉక్కలో కూర్చోలేకపోయాను. పిల్లలూ చెమటలు కక్కుతున్నారు. ఫిబ్రవరి నెలకే ఎండలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి."