తెల్లటి బట్టల్లో హుందాగా వస్తున్న నరేష్ ను చూస్తూనే ఆ ప్రేమికుడు అతనేనని సులభంగా వూహించాడు వేలు.
ఎడమచేతిలో ఫైల్స్, కుడిచేతిలో నీలం పావురాయిలాగా ఇన్ లాండ్ కవరును పట్టుకున్న నరేష్ పోస్టాఫీసును సమీపించాడు.
అక్కడున్న వేలు, అప్పారావు, శర్మ అంతా రైటింగ్ టేబుల్ వైపుకు నడిచి, ముఖాలు తిప్పుకున్నారు.
ఓరకంటతో అతడ్ని గమనిస్తున్నారు.
అతను పోస్టుడబ్బా దగ్గిరకు వచ్చి, లెటర్ వేయడానికి చేయి ఎత్తుతున్నప్పుడు నలుగురూ ఒక్క ఉదుటున అక్కడికి వచ్చారు.
సినిమాల్లో రౌడీల్లా తనను చుట్టిముట్టినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి చేతిని వెనక్కు లాక్కున్నాడు నరేష్.
రోజ్ కలర్ పెన్ తో అందంగా రాసిన అక్షరాలు గులాబీపూలలా వున్నాయి.
తననే వాళ్ళు సీరియస్ గా చూస్తున్నట్టనిపించి "ఎవరు మీరు?" అని అడిగాడతను.
"నీ కోసమే వున్నాం" ఏకవచనంతో సంబోధిస్తూండడం వల్ల తను వీళ్ళకు ఏదో తీరని అపకారం చేసినట్టనిపించింది నరేష్ కి.
"ఏం కావాలి?" కర్చీఫ్ కోసం జేబులు తడుముకుంటూ అడిగాడతను.
"నువ్వే" వేలు కసిగా చెప్పాడు.
"నేనా?"
"అవును! ముందు నేనొకటి అడుగుతాను, చెబుతావా?" వేలు సీరియస్ గా అతడి కళ్ళల్లోకి చూశాడతను.
"పోస్ట్ మాన్ అంటే నువ్వేమనుకుంటున్నావ్?" శర్మ చిట్టిబాబుని పక్కకు తోసి అడిగాడు.
"పోస్టుమాన్ అంటే నా దృష్టిలో భగవంతుని దూత. సువార్తను మోసుకొచ్చే సాక్షాత్తూ ఆ ప్రభువే పోస్టుమ్యానంటే" చెప్పాడతను రెండు చేతులతోనూ నమస్కరిస్తూ.
"అబద్ధం" అరిచాడు.
"నీ దృష్టిలో పోస్టుమానంటే లవ్ లెటర్స్ మోసే మధ్యవర్తి!"
"మరీ పచ్చిగా చెప్పాలంటే డాఫర్!"
"తెలుగులో చెప్పాలంటే తార్పుడుగాడు."
"ఇంగ్లీషులో అయితే పింప్!"
నలుగురూ మీదకు వస్తూన్నట్లు మరీ దగ్గిరకు వచ్చి తలోమాట అనడంతో తనను ఎందుకు తిడుతున్నారో, వీళ్లంతా ఎవరో బోధపడలేదు నరేష్ కి.
"అపచారం... అపచారం" చెంపలు వేసుకున్నాడతను.
"లేకపోతే నీ చేతిలో ఆ ఉత్తరం ఏమిటి?" వేలు అడిగాడు.
"మిత్రురాలికి రాశాను."
కొంతకొంత అర్థమవుతూ వుంది నరేష్ కి.
రోజూ వుత్తరం రాస్తే పోస్టుమాన్ లంతా యిలా కట్టగట్టుకుని వచ్చి కరుస్తారనుకోలేదు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తోచలేదు అతనికి.
"మిత్రురాలని బుకాయించకు. లవ్వర్ కు రాశావు. అయినా రోజూ రాసేందుకు ఏముంటాయ్? ఏదో ఏభై పైసలు పెడితే కవరు వస్తూందని రాయడమే గానీ నువ్వు వ్రాసిన ఉత్తరం ఆమెకు చేరాలంటే మధ్యలో ఎంతమంది ఎలా కష్టపడతారో తెలుసా? నీకు తెలియదు. అందుకే ఈ రోజు నీకు ఆ కష్టం తెలియజేస్తాం. ఈ రోజంతా నువ్వు ఉత్తరాలు బట్వాటా చెయ్యాలి. నా ఏరియాలోనే కాదు. మొత్తం నాలుగు ఏరియాల్లోనూ" ఆయాసంతో ఆగాడు వేలు.
నరేష్ నిలువుగుడ్లు వేశాడు. "ఉత్తరాల బట్వాడా నేను చేయాలా?" తనలో తనే అనుకుంటున్నట్టు మెల్లగా అడిగాడు.
"అవును నువ్వే చేయాలి" నలుగురూ ఒకేసారి అరిచారు.
"చేయకపోతే?" కోపం నటిస్తూ అడిగాడు.
"ఆ అమ్మాయి తండ్రెవరో తెలుసుకుని మొత్తం విషయమంతా చెప్పేస్తాం" చిట్టిబాబు బెదిరించాడు.
వాళ్ళు ఇదంతా ముందే నిర్ణయించుకుని వచ్చారని అర్థమైందతనికి. బెదిరించి లాభం లేదనుకుని అర్థించడం మొదలుపెట్టాడు.
"బాబ్బాబూ! బుద్ధి గడ్డి తిని రోజూ ఉత్తరాలు రాశాను. ఈసారికి నన్ను క్షమించండి. జీవితంలో యింకెప్పుడూ ఎవరికీ లెటర్ రాయను."
"ఆ అర్థింపులూ, కాళ్ళబేరాలూ మా దగ్గిర సాగవు. ఇన్నిరోజులు నన్ను నాలుగు కిలోమీటర్ల చొప్పున నడిపించినందుకు నీకు ఈ శిక్ష తప్పదు. ఈ రోజు నువ్వు బట్వాటా చేయాల్సిందే" వేలు ఖచ్చితంగా చెప్పాడు.
"ప్లీజ్! నా మాట వినండి. లేక లేక పదిరోజుల క్రితమే ఈ ఉద్యోగం వచ్చింది. ఆఫీసుకు పోకపోతే నా ఉద్యోగం పోతుంది" బ్రతిమాలాడాడు నరేష్.
"నీ ఉద్యోగం పోకుండా నేను హామీ. మీ ఆఫీసు అడ్రస్ చెప్పు. క్షణంలో ఫోన్ చేసి నీకు జ్వరమని చెప్పేస్తాను. సిక్ అయితే తప్పకుండా లీవ్ ఇవ్వాల్సిందే" వేలు తొందర చేశాడు.
నరేష్ కి కోపమూ, బాధా. దుఃఖమూ అన్నీ కాక్ టెయిల్ లా తలకెక్కాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
రోజుకొక ఉత్తరం రాయాలన్న తన ఐడియాను తిట్టుకున్నాడు. వాళ్ళను వదిలి పారిపోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు రజనీ తండ్రికి విషయం చెప్పేస్తారేమోనన్న భయంతో ఆగిపోయాడు.
"ఇంకా చూస్తావేం శర్మాజీ! లోపలకెళ్ళి నీ ఉత్తరాల సంచి తెచ్చివ్వు" వేలు అనడంతో శర్మ లోపలికెళ్ళి తను బట్వాడా చేయాల్సిన ఉత్తరాల సంచి తీసుకొచ్చాడు.
అయిదుగురూ పోస్టాఫీసు నుంచి బయటపడ్డారు.
కొంతదూరం నడిచారో లేదో శర్మ తన భుజానికున్న సంచిని అతని భుజానికి తగిలించాడు.
ఇక తప్పేట్టులేదని అతను వాళ్ళకు పూర్తిగా లొంగిపోయాడు.
"వేలుగారూ! ఓ సహాయం చేస్తారా?" అడిగాడు నమ్రత వుట్టిపడేట్టు. ఏమిటన్నట్టు చూశాడు వేలూ!
ఏమిటన్నట్టు చూశాడు వేలూ!
"మా ఆఫీసుకు ఫోన్ చేసి నాకు జ్వరమని, ఆఫీసుకు రాలేనని చెబుతారా?"
"నెంబర్ ఎంత?"
నరేష్ చెప్పాడు.
వేలు ఎదురుగ్గా కనిపిస్తున్న కిరాణ కొట్టులో కెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు.
"ఇక పద" అన్నాడు వస్తూనే.