రఘు బిత్తరపోయాడు. కుర్చీలోంచి లేచాడు. నాగేశ్ భుజం మీద చేయివేసి, చిరునవ్వు నవ్వి ఏదో చెప్పబోయాడు.
రఘు చేతిని లాగేశాడు నాగేశ్. "నాకు నీతులు, చీకట్లూ, గుడ్లగూబలు వద్దు. కత్తి కావాలె కత్తి, నెత్తురు కండ్లచూడాలె."
రఘు చకితుడైనాడు అతనిలోనూ ఉద్రేకం పొంగింది. కాని అణచుకున్నాడు. "నాగేశ్! ఉద్రేకంలో ఉరుకులు పెట్టటం, రెచ్చకొట్టటం అందరికి చాతనైతుంది. నాయకుడైనవాడు వాటిని అణచుకోవాలె. ప్రజలను సరియైన త్రోవలో పెట్టాలె. నువ్వు నాయకుడివి. ఉద్రేకం తగ్గించుకొని ఆలోచించు. పీరయ్య చచ్చిండు. అందువల్ల నీకెంత ఉద్రేకం కలిగిందో నాకంత బాధ కలిగింది. కర్తవ్యాన్ని గురించి ఆలోచించాలె. లావో మేరీ ఛురీ"
"నువ్వు సిద్ధంగా ఉన్నవు కాబట్టి అందరూ సిద్ధంగున్నరనుకోవటం పొరపాటు. ఒక్క వడ్డెర్లు ఏం చేయగలరు? ఆ ఉద్వేగం అందరిలో రావాలె. తేవాలె."
"అంతకాలం నిలువలేను. తే నా కత్తి చంపుత చస్త. ఇస్తవా లేదా" అని రఘు మీదకు ఉరికాడు.
తల వింయబోసుకొని, కళ్ళతో నిప్పులు కక్కుతూ చేత కత్తి పట్టుకుని చండికలా దూకింది జానకి. నాగేశ్ ను లాగేసింది. కత్తి అతని చేతి కిచ్చింది. పైట తీసి అతని ముందు నిలచి ఉరిమింది.
"ఊఁ కానియ్, పొడువు, చంపు నీకు కావలసింది నెత్తురు. నెత్తురు చూస్త. ఎంత మొనగాడివో కుచ్చు. ఈ గుండెలో కుచ్చు. నీ విప్లవం ఈ ఇంటినించే మొదలు కానియ్యి. నన్ను చంపు. రఘును చంపు. మా రక్తంలో విప్లవం సాగనియ్యి. నీకు చంపటం కావాలె నన్నే చంపు ఊఁ."
నాగేశ్ మీద చలిపిడుగు కూలింది. చమటలు పట్టాయి. అంత దగ్గరగా ఆడదాన్ని అతడు ఎన్నడూ చూడలేదు. అది తొలిసారి.
ఏదో వెర్రెత్తినట్లయింది. రఘు కనిపించాడు. తన ఉద్రేకాలన్నీ ఇంతేనా అనుకున్నాడు. చతికిల పడ్డాడు. చమటలు పట్టాయి.
అప్పుడు గానీ అర్థంకాలేదు జానకికి. తాను ఏం చేసిందీ, చేస్తున్నదీను. సిగ్గు ముంచుకొని వచ్చింది. పైట బుజాలనిండా కప్పుకొని తుర్రుమన్నది. మంచం మీద పడిపోయింది. ఆమెలో సముద్రాలు పొంగాయి.
రఘు ఏదో ఆలోచిస్తున్నాడు. ఏం చెయ్యాలి? అదీ అతని ఆలోచన. ఏమీ తోచడం లేదు.
నాగేశ్ తలవంచుకొని కూర్చున్నాడు. కన్నీరు దారలు కడ్తూంది.
గదిలో భయంకరం అయిన మౌనం రాజ్యం చేసింది.
రఘు అగ్గిపుల్ల గీశాడు. అది ఖర్ మంటే నాగేశ్ ఈ లోకంలోకి వచ్చాడు.
"అన్నా! నిజంగ నేను గొడ్డును. ఉద్రేకంలో మనిషిని కాను. నీ మీదకే వచ్చిన, క్షమించు. జానకమ్మ మంచి పాఠం చెప్పింది. ఇక చెప్పు ఏం చెయ్యమంటవో? వడ్డెరోండ్లు మసిలిపోతున్నరు."
"తమ్ముడూ నాగేశ్! ఇన్ని శతాబ్దాల తరువాత ఒక ప్రాణిని గురించి తపించేవారు ఈ రోజు వెలసినారు. ఇది తక్కువా? ఈ ఆవేదన అందరిలో వస్తే నువ్వనుకున్న విప్లవం దానంతట అదే వస్తుంది. ఏం చెయ్యాలె? ఇదే నేను ఆలోచిస్తున్న."
"బాగా ఆలోచించు, మంచి నిర్ణయానికిరా"
"అందుకోసమే ఇంత తపన. తమ్ముడూ కాస్త ఓపిక పట్టు"మళ్ళీ మౌనం వెలిసింది. కాని అందులో భయంలేదు. ఆవేదన ఉంది. తపన ఉంది. తపస్సు జరుగుతున్నది!
అమాంతంగా ఆలోచన వచ్చేసింది రఘుకు. నాగేశ్ భుజాలు పట్టుకొని వూపుతూ అన్నాడు.
"నాగేశ్! ఈ రోజు గుడ్ ఫ్రైడే. క్రీస్తు శిలువ కెక్కిన రోజు. అమరుడైన రోజు."
నాగేశ్ వెర్రిగా చూశాడు. అతనికేమి అర్థం కాలేదు.
"జానకిని పిలువు చెప్పుత."
నాగేశ్ అడుగుల్లో మణుగుల బరువు చేరింది. మనస్సు మూల్గింది. సిగ్గుతో చచ్చిపోయాడు. లేవలేక పోయాడు. తలవంచుకున్నాడు.
రఘుకు ఏమీ అర్థం కాలేదు. ఒక్క గంతులో జానకి గదిలోకి దూకి ఆమెను లాక్కొచ్చాడు. జానకీ నాగేశ్ బెరుకుగా చూచుకొన్నరు. అది గమనించనే లేదు రఘు అందుకున్నాడు.
"జీసెస్ క్రైస్త్ పేదలకోసం పేదల్లో పుట్టిండు బలి అయ్యిండు. అతడు శిలువ కెక్కింది యీ రోజే. శిలువ క్రైస్తవులకు పవిత్ర చిహ్నం. దాన్ని చూచి అతడు పడిన యాతనలు గుర్తుకు తెచ్చుకుంటరు. పీరయ్య మనకు జీసస్, కట్టుగొయ్య మనకు శిలువ!"
"వహ్వా! మంచి ఆలోచన. అయితే ఏం చేద్దమంటవ్?"
"పీరయ్య సమాధి నిర్మించాలె. దానిమీద కట్టగొయ్ల పాతాలి. దాన్ని చూచి ప్రజలు తమ బాధ్యతలు గుర్తించాలి. అది దౌర్జన్యానికి చిహ్నం కావాలె. రాక్షసత్వానికి సమాధి కావాలె, ఏమంటరు."
"ఇన్కిలాబ్ జిందాబాద్" అన్నాడు నాగేశ్ పిడికిలి బిగించి.
"ఛలో వడ్డెర గూడెంకో" అన్నాడు రఘు జానకి వైపు చూచి.
ముగ్గురూ వడ్డెరగూడెం చేరారు. కాస్త వెనకా ముందు వీరయ్యగారు అందుకున్నారు. పిల్లా మేకా అంతా పీరయ్య ఇంటిముందే చేరారు. అందరి గుండెల్లో శోకం గూడుకట్టుకుంది. అందరి కళ్ళలో దుఃఖం నిండుకుంది. వడ్డెరగూడెం శోకమూర్తి అయింది. దుఃఖానలం భీముణ్ణి కాల్చసాగింది. అతని ఏడ్పుకు అంతులేదు. శవాలను పట్టుకొని 'హో' అని ఏడుస్తున్నాడు, అతడు రెక్కలు తెగినవాడైనాడు. దిక్కులేనివాడైనాడు. ఆ ఏడ్పు భరించలేకపోయింది జానకి. వీరయ్యగార్లు భీముణ్ణి ఓదార్చారు. వేదాంతం ఆ ఏడ్పు భరించలేకపోయింది జానకి. వీరయ్యగార్లు భీముణ్ణి ఓదార్చారు. వేదాంతం చెప్పారు. అది పనికివచ్చేది ఇక్కడే. భీముణ్ణి దూరం తీసికెళ్ళారు. రఘు, నాగేశ్ ఏర్పాట్లలో మునిగిపోయారు. శవాలకు స్నానాలు చేయించారు. పూలమాలలు వేశారు. శవయాత్ర సాగింది. శోకయాత్ర సాగింది. మూకయాత్ర సాగింది. ఆ రోజు ఒక్కడూ పీరీల కొట్టంవైపు తొక్కలేదు. ఇక్కడే ఉన్నాయి వారి పీరీలు-పీరయ్య, పీరమ్మ ఇద్దరినీ పూడ్చారు. రెండు సమాధులు లేచాయి. రెండింటిమీదా కట్టుగొయ్యలు వెలిశాయి.
"పీరయ్యకి" నాగేశ్ నినాదం
"జై" అన్నారు జనం.
"పీరయ్యా" రఘు నినాదం
"అమర్ హో" నాగేశ్ జవాబు
అదే ప్రజల ప్రతి నినాదం.
రఘు అక్కడే చిన్న ఉపన్యాసమిచ్చాడు. అతడు కాస్త ఉద్రేకంగానే మాట్లాడాడు. దాన్ని అందరి గుండెల్లో ప్రవేశపెట్టాడు. దాన్ని వేదనగా మార్చాడు. తరవాత కర్తవ్యాన్ని గురించిన ప్రశ్న అందరి మనసుల్లో మెదిలింది.
భీముడు ఇంటికి వచ్చి కుప్పకూలి పోయాడు. ఇప్పుడు భీముడు పీరయ్య కొడుకు కాదు-గూడెం కొడుకు. గూడెమే అతని బాధ్యత వహించింది.
* * * *
అది మొహర్రం పదవరోజు. హసన్ అసువులు బాసిన రోజు. తాసిల్దారు ఇంటిముందు దానధర్మాలు జోరుగా జరుగుతున్నాయి. అడ్డెకు వచ్చిన జనం రొమ్ములు బాదుకొని ఏడుస్తున్నారు. ఆడా, మగా అంతా నల్లని దుస్తులవారే! కొందరి రొమ్ములు చిట్లి రక్తం కారుతూంది. ఎంత ఎక్కువ ఏడిస్తే అంత పుణ్యం. ఎంత ఎక్కువ మందిని ఏడిపిస్తే అంత పుణ్యం.
సాయంకాలం అయింది. చీకట్లు కమ్ముకున్నాయి. పీరీల కొట్టం నుంచి పీరీలు లేచాయి. బాజాలు మ్రోగాయి. పీరీలను పట్టుకొని జనం బయలుదేరారు. "ఆస్పోయ్ దూలా" అని కేకలు పెడ్తూ ఎగురుతున్నారు. సాంబ్రాణి పొగతో ఊరంతా నిండిపోయింది. ఊరేగింపు సాగుతున్నది. జనం తొక్కుకుంటున్నారు. తోసుకుంటున్నారు. కొందరికి శివాలు వస్తున్నాయి. వారికి ఊదు పొగ వేస్తున్నారు. నెమలి ఈకల కట్టలతో కొడ్తున్నారు. పీరీలకు బెల్లం చదివిస్తున్నారు జనం. ఆ బెల్లానికై కొట్టుకుంటున్నారు పిల్లలు. పూలదండలు వేస్తున్నారు పీరీలకు.
వీధులనిండా దుకాణాలు, బత్తీసాలు, చిలకలు, మిఠాయిలు విరివిగా అమ్ముతున్నారు. దుకాణాల నిండా జనం కిటకిట లాడుతున్నారు. ఊరేగింపు అక్కడికి చేరింది. జనం ఊరేగింపును అనుసరించింది. ఊరేగింపు సాగుతూంది. జనం సాగుతూంది. పీరీలు ఎగురుతున్నాయి. అర్థరాత్రికి ఏటి దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ దింపారు పీరీలను. కట్టలు కట్టుకున్నారు. భుజాలమీద వేసుకున్నారు. "ఆల్బిదా" పాడుకుంటూ ఇండ్లముఖం పట్టారు.
తిరిగి వచ్చేటప్పుడు జనం ముచ్చటించుకున్నది పీరయ్య చావును గురించే. అతడు పీరే అయినాడు. అతనికీ పండుగ చేయాలి అనుకున్నారు జనం.